నేను ఒక మంచి  పాఠకుణ్ణి  – రావెళ్ల

“రావెళ్ల” పేరుతో గత 15 సంవత్సరాలుగా కార్టూన్లు గీస్తున్న డాక్టర్ రావెళ్ల శ్రీనివాస రావు కార్టూన్లు, బాల సాహిత్యం, కథా రచన, కవిత్వం మొదలైన రచనా ప్రక్రియల్లో రాణిస్తున్నారు. మన కార్టూనిస్టులు శీర్షికన ఈ నెల వారి పరిచయం వారి మాటల్లోనే  చదవండి.

రావెళ్ల పేరుతో కార్టూన్లు గీస్తున్న నా పేరు రావెళ్ల శ్రీనివాసరావు 6-10-1968 న గుంటూరు జిల్లా బలిజేపల్లి గ్రామంలో పుట్టాను. అమ్మ నారాయణమ్మ, నాన్న రాధాకృష్ణ మూర్తి. మాది వ్యవసాయ కుటుంబం. 5వ తరగతి దాకా సొంత ఊరిలోనూ, ఆరవ తరగతి నుండి ఇంటర్ దాకా వేమూరు గవర్నమెంట్ జూనియర్ కళాశాలలోనూ చదివాను.

అనంతరం తెనాలి వి.ఎస్. ఆర్ కళాశాలలో బి.యస్.సి. చదివి, 1987 లో గుంటూరు గవర్నమెంట్ టీచర్స్ ట్రైనింగ్ కాలేజ్ లో సీటు రావడం తో జాయిన్ అయి, 1989 నుండి టీచర్ గా ఉద్యోగం చేస్తున్నాను.

కొల్లూరు, వేమూరు, వడ్డేస్వరం, ఓర్వకల్లు, పెదపులివర్రు, తుళ్లూరు లలో పనిచేశాను. ప్రస్తుతం రాజధాని లోని పెనుమాక జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో గ్రేడ్ 1 తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. 2000 సంవత్సరం నుండి విజయవాడ లో వుంటున్నాము.

ఇంటర్ చదివేటప్పుడే  ‘కనువిప్పు’ కథ ఆంధ్ర సచిత్ర వార పత్రికలో ప్రచురించబడింది. యువ, స్వాతి, జ్యోతి లలో కధలు, కార్టూన్స్ బాగా చదివే వాడిని. జయదేవ్, రాగతి పండరీ, మల్లిక్  కార్టూన్స్ బాగపరిశీలిస్తూ  వుండే వాడిని. రేడియో వింటూ ఎక్కువ సేపుగడిపే వాడిని. తరగతి పుస్తకాలు పరీక్షలకు నెల ముందు మాత్రమే తీసి చదివే వాడిని. క్విజ్, వక్తృత్వ, వ్యాసరచన, డ్రాయింగ్ పోటీలు ఎక్కడ జరిగినా వెళ్లి బహుమతులు గెలుచుకునే వాళ్ళం. టీంలో యమ్. ఆర్.ఆర్.వి.యన్. కుమార్ (అసోసియేట్ ప్రొఫెసర్) అమిర్నేని హరికృష్ణ (ఈ. టీ.వీ 2, అన్నదాత సంపాదకులు) మేము ముగ్గురం 6 నుండి డిగ్రీ దాకా ఒక టీం గా ఉండేవాళ్ళం.

రెండు సంవత్సరాలు ఈనాడు కల్చరల్ కంట్రిబ్యూటర్ గా పని చేసాను. ఉద్యోగం వచ్చినా చదువు ఎక్కడా ఆగలేదు. డిగ్రీ తరువాత పి.జీ పొలిటికల్ సైన్సు, తదుపరి పి.జి. తెలుగు చేసాను. ఇంకా చదవాలనే జిజ్ఞాసతో యమ్.ఈ.డి. కూడా చదివాను. 2007లో శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో పి.హెచ్ డి.లో జాయిన్ అయి 2010లో డాక్టరేట్ డిగ్రీ అందుకున్నాను తదుపరి ఏపీ సెట్ లో ఉత్తీర్ణత సాధించాను. నా మొదటి కార్టూన్ 2002లో ఆంధ్ర భూమి వీక్లీ లో ప్రచురించారు. ఆ తర్వాత ప్రియ దత్త , స్వాతి, ప్రభ  ఇలా అన్ని పత్రికలలోనూ నా కార్టూన్లు వచ్చాయి. ఈనాడు, ప్రజాశక్తి వారి ప్రోత్సాహం మరువలేనిది. దాదాపు గీసి పంపిన వాటిలో ఎక్కువ కార్టూన్లు అచ్చుకు నోచుకున్నాయి. బొమ్మలు  బాగా కుదిరేవి కాదు. అయినా ప్రాక్టీసు ( ఇప్పటికీ ) చేస్తూ బాగా గీయడానికి ప్రయత్నం చేస్తున్నాను. కళాసాగర్ గారు 2002 లో నిర్వహించిన కార్టూన్ మేళాలో నా కార్టూన్లు కూడా ప్రదర్శించారు. అప్పటి ఆ ఆనందం చెప్పలేనిది. తరువాత కలిమి శ్రీ గారితో పరిచయం అయింది . వారు కార్టూన్ వేయడంలో కొన్ని మెలకువలు చెప్పారు. హాస్యానందం రాము గారు నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. ఎన్నో కార్టూన్లు తమ పత్రికలో ప్రచురించారు. అవార్డులోయ్ అవార్డులు శీర్షికన 25 కథలను నాతో వ్రాయించి ప్రచురించారు. తలిశెట్టి రామారావు, శేఖర్ అవార్డులు రావడంతో పాటు 12 రాష్ట్రస్థాయి బహుమతులు అందుకున్నాను.

 2017 లో  తానా వారు నిర్వహించిన పిల్లల నవలల పోటీలో నా “కిట్టు సాహసం” నవల పదివేల రూపాయల బహుమతిని గెలుచుకుంది. స్వాతి వీక్లీలో రెండు హాస్య కథలు రావడంతో హాస్య కధలు కూడా రాయగలననే నమ్మకం కుదిరింది. ఈ మధ్య ప్రజాశక్తి సండే బుక్ లో వచ్చిన ‘ఆదెమ్మ’ కథ కు మంచి గుర్తింపు ఒచ్చింది.

ప్రజాశక్తి లో 2004 నుండి 2007 వరకు బాలల కోసం సూక్తి సుధ, మామయ్య మాట, చూసొద్దాం, మహనీయులు , మాటల కోట , అల్లరి లిల్లీ, శీర్షికలు నిర్వహించాను.  ప్రజాశక్తి ఆదివారం అనుబంధం లో 145 వారాల నుండి పదవికాసం అందిస్తున్నాను. బాలలగేయాలు ప్రచురింపబడ్డాయి. మా స్కూల్ పిల్లలతో కధలు గేయాలు వ్రాయించడం, బొమ్మలు గీయించడం చేస్తున్నాను. 2014లో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నాను . రేడియో కి పలు రచనలు చేసాను. దూరదర్శన్ లో 1994 లో  తెర తొలగింది అనే సింగిల్ ఎపిసోడ్ కు  కధ,మాటలు అందించాను. 2006లో చైనా లోని ఇంటర్నేషనల్ వారి ఎక్సలెన్స్ బహుమతి పొందాను. మల్లెతీగ , నడుస్తున్న చరిత్ర, హస్యానందం, చినుకు పత్రికలు నన్ను బాగా ప్రోత్సహించాయి.  లేపాక్షి , సరసి, బాచి గారి కార్టూన్లు చాలా ఉన్నతంగా ఉంటాయి. మా గురుదేవులు జయదేవ్ గారు ఇప్పటికీ పదును తగ్గని కార్టూన్స్ గీస్తూ ఆశ్చర్య పరుస్తూ యంతో మంది కార్టూనిస్టులలో స్ఫూర్తిని నింపుతున్నారు. ఏవీయం గారు కూడా అంతే .

జయదేవ్ గారికి నాకు మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు ప్రచురిస్తే ఒక బుక్ అవుతుంది. నేను సేకరించినన్ని కార్టూన్లు ఎవరూ సేకరించి ఉండరని అనుకుంటున్నాను. నేను ఒక మంచి  పాఠకుణ్ణి. వారంలో రెండు పుస్తకాలను చదవందే నిద్రపోను. స్పందించి రాస్తాను. రాయాలని రాయలేను. నాకు పరిచయమైన  వాళ్లంతా నా మిత్రులే. మంచి కార్టూనిస్ట్ గా, బాలసాహితీ వేత్తగా, కధకునిగా పేరు తెచ్చు కోవాలన్నదే నా ఆశయం. నన్ను 64 కళలు లో పరిచయం చేస్తున్నందుకు  కళాసాగర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు.

మరచిపోలేని విషయాలు

  1. సత్యమూర్తి గారు ఫోన్ చేసి నా కార్టూన్ బాగున్నది మెచ్చుకున్నప్పుడు.
  2. జయదేవ్ గారి గ్లాచు మీచ్యు బుక్ కి పట్టుబట్టి మరీ ముందు మాట వ్రాయించుకోవడం
  3. రేడియో లో “భారీశత్రువు” రూపకానికి వచ్చిన స్పందన.

3 thoughts on “నేను ఒక మంచి  పాఠకుణ్ణి  – రావెళ్ల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap