ప్రైవేట్‌స్కూళ్ళను రద్దుచేయటమే పరిష్కారం!

నాణ్యమైన విద్య అందాలంటే దేశంలో ప్రైవేట్‌ పాఠశాలలను పూర్తిగా రద్దు చేయడం ఒక్కటే పరిష్కార మార్గంగా కనపడుతుంది. అప్పుడు ముఖ్యమంత్రుల పిల్లలు, మనుమలూ మనుమరాళ్ళు, అధికారుల పిల్లలు, ధనవంతుల పిల్లలు, పేద వారి పిల్లలు అందరినీ ప్రభుత్వ బడిలో మాత్రమే చదివించాల్సి వుంటుంది. దాంతో బడుల పని విధానం, సౌకర్యాలు, విద్య నాణ్యత అన్నీ మెరుగవుతాయి. మండలానికి ఆరు నుండి పది పాఠశాలలు పెట్టి మిగతా చిన్న గ్రామాలకు రవాణా వ్యవస్థ ఏర్పాటు చేయడం ద్వారా పాఠశాలల సంఖ్య తక్కువై, సౌకర్యాలు మెరుగై విద్యాప్రమాణాలను పెంపొందుతాయి.

భారత రాజ్యాంగంలో పేర్కొన్నట్టు ప్రభుత్వమే అందరికీ నాణ్యమైన విద్యను అందించాలి. ఏ దేశంలో అయినా పేదరికం పోయిందంటే, బాగా అభివృద్ధి జరిగిందంటే దానికి పునాది పాఠశాల విద్య, కాలేజి విద్య, విశ్వవిద్యాలయ విద్య అనేది చారిత్రక సత్యం. కానీ మన దేశంలో ప్రభుత్వ పెద్దలు, రాజకీయ నాయకులు, కాంట్రాక్టులకిచ్చే ప్రాజెక్టు పనుల మీద ఉన్నంత శ్రద్ధ పిల్లలకు నాణ్యత కల్గిన చదువు చెప్పించడం మీద పెట్టలేకపోతున్నారు. సివిల్ ఇంజనీరింగ్‌ ప్రాజెక్టులు, రియల్ ఎస్టేట్‌ లావాదేవీలు ఎన్నికలకు అవసరమైన డబ్బు సమకూరుస్తాయి. సర్కారు బడుల మీద పెట్టే పెట్టుబడులు డబ్బులు రాల్చవు కదా! అందుకే రాజకీయ నాయకులకు విద్య మీద సమయం వెచ్చించడం శుద్ధ దండగ అనిపిస్తుంది. అయితే, రాజకీయ చిత్తశుద్ధి ఉంటే అందరికీ నాణ్యమైన విద్య అందించడం మనకు అసాధ్యమేమీ కాదు. ఎలానో చూద్దాం. నేను కలెక్టర్‌గా పని చేసిన ఒక జిల్లాలో ప్రైవేట్‌ విద్య, ప్రభుత్వ విద్య ఎలా ఉందో విశ్లేషించి చెబుతాను. జిల్లాలో వున్న ఒక ప్రైవేట్‌ బడిలో ప్రతి 38 మంది విద్యార్థులకు ఒక టీచరు వుంటే, ఆ జిల్లాలో ప్రభుత్వ బడులలో ప్రతి 17 మంది విద్యార్థులకు ఒక టీచర్‌ వున్నారు. ప్రైవేట్‌ యాజమాన్యం ప్రతీ విద్యార్థి మీద సగటున ప్రతి సంవత్సరం రూ.6,200 ఖర్చు పెట్టి (ప్రైవేట్‌ యాజమాన్యం తల్లిదండ్రుల నుండి ఎంత మొత్తం రాబడుతున్నది అనేది వేరే విషయం) 86 శాతం విద్యార్థులకు నాణ్యతలో ‘ఏ’ గ్రేడ్‌లో తీర్చి దిద్దగలిగితే, మన సర్కారు బడులలో ప్రభుత్వం సగటున విద్యార్థికి ప్రతీ సంవత్సరం రూ.35,000- ఖర్చు పెట్టినా 67శాతం విద్యార్థులు ‘సీ’ గ్రేడు కంటే దాటలేకపోతున్నారు. ప్రైవేట్‌ యాజమాన్యం ఒక టీచరుకు నెలకు రూ.5,000 -నుండి రూ.20,000 వరకు (సబ్జెక్టును బట్టి) చెల్లిస్తుంటే ప్రభుత్వం నెలకు ఒక టీచరుకు రూ.35000 నుండి రూ.1,20,000వరకు చెల్లిస్తుంది. మరి, లోపం ఎక్కడ వుంది? ప్రభుత్వ పరిపాలనలోనే అని చెప్పక తప్పదు.

ఇదే జిల్లాలలో (వెనకబడిన జిల్లా) ఒక మండలంలో పరిస్థితి విశ్లేషిస్తే నాలుగు పెద్ద గ్రామాలలో వున్న ప్రైవేట్‌ బడులలో 4500 మంది విద్యార్థులు చదువుతూ ఉంటే అదే మండలంలో 36 గ్రామాలలో వున్న ప్రభుత్వ బడులలో 1400 మంది చదువుతున్నారు. ఆ మండలంలో పేద, మధ్య తరగతి తల్లిదండ్రులు అప్పులు చేసి సంవత్సరానికి ఒక్కొక్క విద్యార్థికి రూ.15,000 నుండి రూ. 30,000 వరకు ఫీజులు కడుతున్నారు. మిగతా మధ్యతరగతి కుటుంబాలు, ఒక మోతాదులో వున్న పెద్ద రైతులు వారి కుటుంబాలను పెద్ద పట్టణాలలో పెట్టి, పిల్లలను ప్రైవేట్‌ కాన్వెంట్ స్కూళ్లలో చదివించుకుంటున్నారు. ‘ప్రభుత్వ బడులలో చదివించాలంటే నామోషీగా అనిపిస్తుంది’ అని ఒక గ్రామంలో తల్లిదండ్రులు నాతో అన్నారు. పక్క ఇంటి వాళ్ల పిల్లలు టిప్‌ టాప్‌గా తయారై టై, బూట్లు వేసుకొని మండల కేంద్రంలోని ప్రైవేట్‌ బడికి వ్యాన్‌లో పోతుంటే మా పిల్లలను దీనావస్థలోవున్న ఊళ్లోని ప్రభుత్వ బడికి ఎలా పంపించాలని వారు వాపోయారు. ఇటీవలి కాలంలో వాట్సాప్‌లో ఒక ‘బొమ్మ’ విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. ప్రైవేట్‌ బడి భవనం బ్రహ్మాండంగా వుంటుంది కాని ప్రైవేట్‌ టీచరు ఒక పెంకుటింటిలో నివసిస్తుంటారు. అదే ప్రభుత్వ బడి విషయానికి వస్తే ప్రభుత్వ బడి భవనం అధ్వాన్న స్థితిలో వుంటుంది. కాని ప్రభుత్వ టీచరు ఇల్లు జిల్లా ముఖ్య పట్టణంలో బ్రహ్మాండంగా వుంటుంది.
పరిస్థితిని అర్థం చేసుకోవడానికి చాలా చక్కని ఉదాహరణ అది. మరో సంఘటన– నేను 16 సంవత్సరాల క్రితం చైనాకు వెళ్ళినప్పుడు గ్రామాలలో నాకు కనిపించిన దృశ్యాన్ని ఇక్కడ ప్రస్తావించుకోవాలి. అక్కడ గ్రామంలో ఆధునికమైన భవనంలో ప్రభుత్వ బడులు, ప్రభుత్వం కట్టించిన భవనాలలో టీచర్లు నివాసం వుంటారు. అక్కడి ప్రభుత్వం 1950లలో ప్రాథమిక విద్య మీద పెట్టిన పెట్టుబడి, శ్రద్ధ వల్లనే ఈ రోజు చైనా ప్రపంచంలోనే ఒక అగ్రగామి దేశంగా భాసిల్లుతోంది. ‘మీరు ప్రభుత్వ బడులకు మీ పిల్లలను ఎందుకు పంపించరు?’ అని నేను చాలా గ్రామాలలో తల్లిదండ్రులను అడిగితే వారు నాకు ఈ విషయాలను చెబుతుండేవారు: ఇంగ్లీషు మీడియం లేదు; మరుగు దొడ్లు, శుభ్రమైన తాగు నీరు, తరగతి గదిలో ఫర్నీచర్ వంటి కనీస సౌకర్యాలు ఉండవు; బోధనలో నాణ్యత వుండదు అన్నారు. అంతేకాదు, ఎల్‌కేజీ, యూకేజీలు లేకపోవడాన్నీ వారు ఎత్తి చూపారు. ఒక ప్రైవేట్‌ బడి యజమాని ఎవరు అంటే కృష్ణా రెడ్డి అనో, శ్రీనివాస్ రావు అనో (ఉదాహరణకు) ఒక పేరు చెబుతారు. అదే మీ వూరిలో వున్న సర్కార్‌ బడి యజమాని ఎవరు అంటే ప్రభుత్వం అని చెబుతారు.

ఇక్కడ సమస్యల్లా ఏమిటయ్యా అంటే? అదే కృష్ణా రెడ్డి, శ్రీనివాస్ రావు బడులలో విద్యా నాణ్యతకు సంబంధించి, బడిలోని సౌకర్యాలకు సంబంధించి తీసుకునే చర్యలు మనకు ప్రభుత్వ బడులలో కానరావు. అక్కడ ఉపాధ్యాయులు స్కూలు యజమానులకు జవాబుదారీగా వుంటారు. మరి ప్రభుత్వ బడుల ఉపాధ్యాయులు ఎవరికి జవాబుదారీగా వుంటారు అనేదే పెద్ద ప్రశ్న. కొంత మంది అనొచ్చు వారు ప్రభుత్వానికి జవాబుదారీతనం వహించాలి అని, కానీ ఇక్కడ రెండు ప్రశ్నలు ఉద్భవిస్తాయి. ఒకటి, విద్యకు సంబంధించినంత వరకు ప్రభుత్వం కనపడని ఒక విచిత్ర వ్యవస్థ. రెండు, ప్రభుత్వానికి ఉపాధ్యాయులు భయపడుతున్నారా? లేక, ఉపాధ్యాయులకు ప్రభుత్వాలు భయపడుతున్నాయా? అన్నది. దీనికి పరిష్కార మార్గంగా తల్లిదండ్రులను సమీకరించి కమిటీగా ఏర్పరచి ఆ కమిటీలను పటిష్ఠ పరిచి వారికి బడి పరిపాలనలో భాగస్వామ్యం కల్పించి ప్రతి తల్లి/ తండ్రి ప్రతి విద్యార్థికి సంవత్సరానికి వెయ్యి రూపాయలు (రెండు విడతలలో) స్కూల్ కార్పస్ ఫండ్ కింద కట్టించగల్గితే తల్లిదండ్రులకు ఉపాధ్యాయులను ప్రశ్నించే అధికారం వస్తుంది. విద్య నాణ్యతను సమీక్ష చేసుకునే సామర్థ్యం సహజంగా వస్తుంది. ప్రజల భాగస్వామ్యం లేకపోతే ప్రభుత్వం ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ప్రభుత్వ బడులు బాగుపడవు. ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతీ రూపాయి తల్లిదండ్రుల కమిటీ ద్వారానే ఖర్చు పెట్టించగలిగితే పనుల నాణ్యత, వేగం పెరుగుతుంది. పాత తరంలో ప్రైవేట్‌ బడులు లేని కాలంలో గ్రామీణ ప్రాంతాలలో ప్రభుత్వ బడులలో నాణ్యత, ఉపాధ్యాయులలో దృఢ సంకల్పం బాగా కనపడేవి. అప్పుడు గ్రామంలోని మోతుబరులు, అక్కడే నివసించే ప్రభుత్వ ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు వారి పిల్లలను ప్రభుత్వ బడులలోనే చదివించే వాళ్ళు. వారు శ్రద్ధగా బడిలో జరిగే కార్యక్రమాల నాణ్యతను పరిశీలించేవారు. ఉపాధ్యాయులు జవాబుదారీగా ఉండేవారు. ఇప్పుడు ఏ ప్రభుత్వ ఉద్యోగి (గ్రామ పంచాయితీ కార్యదర్శితో సహా) గ్రామంలో నివసించడం లేదు (అంగన్‌వాడి టీచరు తప్ప). చాలా గ్రామాల్లో ప్రజా ప్రతినిధులు కూడా నివసించడం లేదు. పెద్ద రైతులు, ప్రజా ప్రతినిధులు వారి కుటుంబాలను పట్టణాలలో పెడుతున్నారు. పేద కుటుంబాలు మాత్రమే వారి పిల్లలను ప్రభుత్వ బడులలో చదివిస్తున్నాయి. వారికి ఉపాధ్యాయులను ప్రశ్నించే సామర్థ్యం గాని, వారి పిల్లలకు సంబంధించి చదువును పరిశీలించే జ్ఞానంగాని లేవు.

అమెరికాలోనూ, యూరప్ దేశాలలోనూ ‘స్కూల్‌ డిస్ట్రిక్ట్’ అనే విధానం వుంటుంది. అంటే ఆవాసంలోని పిల్లలందరూ ప్రభుత్వ బడులలో విధిగా చదివించాలి. అక్కడ రెసిడెన్షియల్ స్కూళ్లు చాలా తక్కువగా వుంటాయి. మన ఊరికి దగ్గరలోనే మంచి స్కూల్‌ ఉన్నట్లయితే దూరంగా వున్న గురుకుల పాఠశాలలకు (ప్రైవేట్‌ కార్పొరేట్, ప్రభుత్వం.. ఏదైనా కావొచ్చు) పిల్లలను పంపాల్సిన అవసరం వుండదు కదా! నాణ్యమైన విద్యకు ఖరీదైన గురుకుల పాఠశాలలు పరిష్కారమే కాదు. గురుకుల పాఠశాలలో చదివే పిల్లలు వారి బాల్య హక్కులను, తల్లిదండ్రులు పిల్లలతో గడపాల్సిన సంతోష కాలాన్ని కోల్పోతున్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో అన్ని తరగతులకు ఇంగ్లీషు మీడియంను తక్షణమే (10వ తరగతి తెలుగు మీడియం తప్ప) ప్రవేశ పెట్టవలసిన అవసరం ఎంతైనా వుంది. ఇక్కడ చర్చించిన విషయాలను, మన సమాజ పరిస్థితులను, రాజకీయ వ్యవస్థను, కుల వ్యవస్థను పరిశీలిస్తే నాణ్యమైన విద్య అందాలంటే దేశంలో ప్రైవేట్‌ పాఠశాలలను పూర్తిగా రద్దు చేయడం ఒక్కటే పరిష్కార మార్గంగా కనపడుతుంది.

అప్పుడు ముఖ్యమంత్రుల పిల్లలు, మనుమలు/ మనుమరాళ్ళు మంత్రుల పిల్లలు, అధికారుల పిల్లలు, ధనవంతుల పిల్లలు, పేద వారి పిల్లలు అందరినీ ప్రభుత్వ బడిలో మాత్రమే చదివించాల్సి వుంటుంది. దాంతో బడుల పని విధానం, సౌకర్యాలు, విద్య నాణ్యత అన్నీ మెరుగవుతాయి. మండలానికి ఆరు నుండి పది పాఠశాలలుపెట్టి మిగతా చిన్న గ్రామాలకు రవాణా వ్యవస్థ ఏర్పాటు చేయడం ద్వారా పాఠశాలల సంఖ్య తక్కువై మంచి సౌకర్యాలు, మెరుగైన సమీక్షల ద్వారా విద్య ప్రమాణాలను పెంపొందించుకోవచ్చు. అన్ని కులాల విద్యార్థులు ఒకటే బడికి పోవడం ద్వారా విద్యార్థుల మధ్య సౌభ్రాతృత్వం, సుహృద్భావం ఏర్పడుతుంది. కుల వ్యవస్థ కూడా బలహీన పడటానికి అవకాశం ఏర్పడుతుంది. నాణ్యమైన విద్య అందించే మానవ వనరులు, సాంకేతికత, ఆర్థిక వనరులు మన దగ్గర ముఖ్యంగా మన రాష్ట్రానికి పుష్కలంగా ఉన్నాయి. కావాల్సిందల్లా.. అన్ని వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను ప్రాథమిక హక్కుగా అందించాలి అనే నిబద్ధత ప్రభుత్వాలకు ఉండడమే! ఈ విషయంలో సర్కారు చిత్తశుద్ధి చూపితే రాష్ట్రంలో, దేశంలో పేదరికం లేకుండా చేయొచ్చు. ఒక లౌకిక సమాజాన్ని, బంగారు భారతాన్ని నిర్మించవచ్చు.
-ఆకునూరి మురళి, ఐ.ఎ.ఎస్
(ఒక పౌరుడిగా)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap