ఫొటోగ్రఫీ … ఓ అందమైన కళ !

ఆగస్ట్ 19 ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా……

ఫోటోగ్రాఫర్

స్మైల్ ప్లీజ్ …….
కాస్త నవ్వండి ………
అంటూ
తమ ఏకాగ్రతను
మన ముఖాల మీద నిలిపి
మనల్ని అందంగా చూపించడానికి
వాళ్ళు అపసోపాలు పడుతుంటారు !

ఫోటోలు తీయడమన్నా ….
దృశ్యాలు చిత్రీకరించడమన్నా
అంత సులువేమీ కాదు!

ఫొటోగ్రఫీ … ఓ అందమైన కళ !

నాలుగ్గోడల మధ్య చిత్రీకరించినా
ఆరు బయట అందరి మధ్య చిత్రీకరించినా…..
అర్జునుడి గురి చిలుక కన్నుపై పెట్టినట్లు
తమ దృష్టంతా ఆబ్జెక్టుపైనే అతికిస్తారు !

శుభాశుభకార్యాల్లో చిత్రీకరణకు
సరాసరి సర్కస్ విన్యాసాలే చేస్తారు
కార్యక్రమం ప్రారంభం నుండి పూర్తయినంతవరకు
బాధ్యతను మెడలో వేలాడదీసి
భుజం మీద బరువుగా మోసి
వేదిక చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూనే వుంటారు !

ప్రమాదాలను చిత్రీకరించి నప్పుడు
నిర్జీవ భౌతిక కాయాలను చిత్రీకరించినప్పుడు
కన్నీటి సుడులు మధ్య
వారి మనసంతా ద్రవీభవిస్తుంది !

ఉద్యమాలను, ఆందోళనలను చిత్రీకరించినప్పుడు
లాఠీల మధ్య, తూటాల మధ్య
ప్రాణాలను పణంగా పెడతారు !
సామాజిక బతుకు చిత్రాలను చిత్రీకరించి
మానవతా వాదులుగా
మరో అవతారం ఎత్తుతారు !

జాతరలు, తీర్ధయాత్రలు
మోహాలు , సమ్మోహాలు
సభలు, సమావేశాలు
ఆటలు, పాటలు
ఉత్సవాలు, వేడుకలు అన్నీ
వారి కెమెరా నేత్రంలో నిక్షిప్తమై
ఛాయా చిత్రాలుగా ప్రత్యక్షమౌతాయి
కదిలే చిత్రాలుగా కనువిందు చేస్తాయి !

వర్తమానంలో వారు తీసిన చిత్రాలు
చరిత్ర పుటల్లోకి జారిపోయి
భావితరాలవారికి సాక్ష్యాలౌతాయి !

వ్యక్తిగతంగా వారు తీసిన చిత్రాలు
మధుర జ్ఞాపకాలుగా మిగిలిపోయి
వారసత్వానికి ప్రతినిధులుగా
ముచ్చటగొల్పుతాయి !

చిత్రాలు, దృశ్యాలతో మనల్ని అలరించే
ఈ అపురూప కళాకారులు
అదృశ్య రూపాలుగా
తెరవెనుకే మిగిలిపోయినా,,,,
చెక్కు చెదరని రూపాలుగా
మన మనస్సులో మెదులుతూనే ఉంటారు !

జై ఫోటోగ్రాఫర్ !

పి. లక్ష్మణ్ రావ్
విజయనగరం (9441215989)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap