బందరు గడియారం మేడకు 113 ఏళ్ళు 

అందరికి చేతి గడియారం లేని రోజులు అవి…బందరులో నాడు ఫిరంగి గుండు రోజుకు రెండుమార్లు దిక్కులు పిక్కటిల్లేలా మోగితే గాని ఇంత సమయం అయ్యిందని బందరులో ప్రజలు అంచనా వేసేవారు..కాలం విలువ గమనించు అని చెప్పేది గడియారం…మొబైల్ లో సమయం చూసుకొనే తరానికి..ఎండని బట్టి కాలం అంచనా వేసే తరం వ్యయ ప్రయాసలు ఎంత మాత్రం అర్ధం కావు..  బందరు కోనేరు సెంటర్ నుంచి నాగపోతరావు కూడలికి వెళ్లే దారిలో కుడివైపున బృందావన థియేటర్ ఎదురుగా ఈ గడియారం మేడ కనబడుతుంది. పై అంతస్తుపై అమర్చబడి ఉండే గడియారం  బంధరీయులకు దాదాపుగా పరిచయమే..

1906 నిర్మించబడిన ఈ భవనంకు ఆనాడు ఎంతో ప్రాధాన్యత ఉండేది. వానపాముల సుందర రామయ్య నిర్మించారు. ఆయన అప్పట్లో పేరొందిన కంసాలిగా గణతికెక్కారు. బంగారు వెండి నగలను అత్యంత అద్భుతంగా రూపొందించేవారు.. సుందర రామయ్య తయారుచేసిన ఆభరణాలు విదేశాలలో సైతం విపరీతమైన డిమాండ్ ఉండేది. ఆరోజులలో గడియారం మేడ వద్ద నగలను అత్యంత కళాత్మకంగా రూపందించేందుకు ఒక పెద్ద వర్క్ షాప్ ఉండేది. అక్కడ సిద్దమైన చెవి రింగులు….గొలుసులు ..ఉంగరాలు ..నెక్లెస్లు తదితర ఆభరణాలు ఓడలలో విదేశాలకు ఎగుమతి కాబడేవి. రంగూన్ , సింగపూర్ , మలేషియా తదితర దేశాలలో మన బందరు నగలు పెద్ద ఎత్తున అమ్ముడయ్యేవి.

500 గజాల స్థలంలో నిర్మితమై మూడు అంతస్తులుగా ఉండే ఈ గడియారం మేడ యజమాని  వానపాముల సుందర రామయ్య సమయపాలనకు ఎంతో విలువ ఇచ్చేవారు. తనవద్ద పనిచేసే కార్మికులే కాక స్థానికులు సైతం కాలం విలువ గ్రహించాలని జపాన్ దేశానికి చెందిన ” షికోషా ” కంపెనీకి చెందిన పెద్ద గడియారంను కొనుగోలు చేసి ఓడలో బందరు తీసుకొచ్చారు. గుండ్రంగా వర్తులాకారంలో రెండు అడుగుల కైవారంలో ఉన్న ఈ గడియారంను తన  మేడ  మూడవ అంతస్తు పిట్టగోడ  పైభాగాన అమర్చారు..1977 నవంబర్ 19 వ తేదీన సంభవించిన తుపానులో బందరులో నాటి గడియారం మేడ చిగురుటాకు మాదిరిగా వణికిపోయింది. నాటి బలమైన పెనుగాలులకు మూడవ అంతస్తు పిట్టగోడ గడియారంతో సహా కుప్పకూలింది. ఉప్పునీటి కారణంగా  మరమ్మత్తులకు సైతం ఆ జపాను గడియారం పాడైంది. కొన్నాళ్ళకు కలకత్తాలో తయారుకాబడిన మరో గడియారం అదే స్థానంలో అమర్చారు..ఇప్పటికీ ఆ గడియారం టిక్కు టిక్కు మంటూ నిజాయితీగా పని చేస్తూ తన వైపు చూసినవారికి సమయం తెలియచేస్తుంది.

-ఎన్.జాన్సన్ జాకబ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap