బడుల్లో మాతృభాషలోనే బోధన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1 నుండి 10 వ తరగతి వరకు అన్నిరకాల పాఠశాలలు 62,064 ఉన్నాయి. అందులో ప్రైవేట్ పాఠశాలలు 17,021 ఉన్నాయి. దాదాపు ఆ ప్రైవేటు పాఠశాలలన్నీ ఇంగ్లీషు మీడియంలో నడుస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలలు మొత్తం 45,048 లలో 5,337 హైస్కూల్ పాఠశాలలు ఉన్నాయి. ఈ హైస్కూల్ పాఠశాలలో 2009 లో సక్సెస్ పథకం కింద ఇంగ్లీషు మీడియంను ప్రవేశపెట్టగా, ప్రస్తుతం వేయి పాఠశాలల దాకా ఇంగ్లీషు మీడియం లో నడుస్తున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠ శాలలు 39,706 ఉన్నాయి. వీటిలో 1,529 పాఠశాలలో గత సంవత్సరం ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు.
ప్రస్తుతం ఈ విద్యాసంవత్సరం 82,177 పాఠశా లలో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెడుతూ ఉత్తర్వులు జారీ చేసారు. అంటే రాష్ట్రంలో ఉండే అన్ని ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక (1 నుండి 5), ప్రాథమికోన్నత (6 నుండి7) పాఠశాలలో ఇంగ్లీషు మీడియం అయ్యాయి. విద్యార్థులు ఇంగ్లీషు మీడియంలో చదువుకొనే అవకాశం కల్పించారు. ఎవరైనా తెలుగు మీడియం చదువుకోవాలని అడిగితే వారు అక్కడే కొనసాగవచ్చు. కానీ ఈ సంవత్సరం పాఠశాలలో విద్యార్థుల ప్రవేశాలు పరిశీలిస్తే దాదాపు అంతా ఒకటవ తరగతిలో ఇంగ్లీషు మీడియంలో చేరుతున్నారని తెలుస్తుంది. సమీప కాలంలో రాష్ట్రంలోని అన్ని పాఠశాలలో ఇంగ్లీషు మీడియంలోనే విద్యార్థులు ఉంటారు. తెలుగు ఒక సబ్జెక్టుగా మాత్రమే కొనసాగబోతోంది.
ఐక్యరాజ్యసమితి సంస్థ యునెస్కో వారి నివేదిక ప్రకారం పరాయి భాషలలో ముప్పై శాతం మించి విద్యార్థులు చదువుతున్నారంటే అంతరిస్తున్న భాషల సరసన వారి మాతృభాష చేరుతున్నట్టుగా ప్రకటించింది. ఈ లెక్కన తెలుగు భాష అంతరిస్తున్న జాబితాలో చేరినట్లే అవుతుంది. యునెస్కో వారే కాదు అనేక విద్యా సంఘాలు, నివేదికలు, మానసిక, భాషాశాస్త్రవేత్తల అధ్యయనాల ప్రకారం కనీసం ప్రాథమిక స్థాయి విద్య (1 నుండి 5) వరకు వారి మాతృభాషా మాధ్యమంలోనే కొనసాగాలని సూచించాం. మహాత్మ గాంధీ మొదలుకొని పుచ్చలపల్లి సుందరయ్య దాకా మాతృభాషలో విద్య సాగాలని ప్రతిపాదించారు. పిల్లలు ఇంట్లో వినియోగించే భాషనే పాఠశాల భాషగా ఉంటే ప్రాథమిక స్థాయిలో భావనలు, పరిసరాలను పూర్తిగా అవగాహన చేసుకోగలుగుతారు. ఇది శాస్త్రీయమైన అంశం. ఈ ప్రాథమిక నియమాన్ని ఉల్లంఘించి ఎటూ చెంద కుండా పోయిన విద్యార్థులను చూసిన ప్రపంచం లోని అనేక దేశాలు తిరిగి మాతృభాషలలోనే ప్రాథమిక విద్యకు శ్రీకారం చుట్టాయి. విషయాన్ని ధీర్ఘకాలికంగా చూడకుండా తాత్కాలిక ఆక ర్షణలకు లోనైతే తర్వాత జరిగే నష్టం పూడ్చలేనిదే అవుతుంది. విద్య అనేది కేవలం ఉపాధ, ఆదాయాలకు సంబంధించిన అంశం కాదు. మనిషి సమగ్రాభివృద్ధికి సంబందించినది. ప్రపంచీకరణ ప్రభావం తో లోకమంతా ఒకే రకంగా ఉండాలనుకోవడం మానవ పరిణామక్రమానికే విరుద్ధం. ప్రపంచం వైవిధ్యంగా ఉండటంతోనే వికాసం చెందుతుంది. ఒకే మూసలో సాగితే కృత్రిమ యంత్రాలుగా మారిపోయే పరిస్థితి దాపురిస్తుంది. ఇప్పటికే అన్నిరంగాలలో మనిషి ప్రపంచీకరణలో భాగమైపోయాడు. ఇప్పుడు మన ప్రాథమిక విద్యా రంగం కూడా అందులో చేరిపోవడం విషాదం. ప్రపంచంలో నోబెల్ బహుమతి పొందిన వారిని, ఇంకా వివిధ రంగాలలో ప్రముఖుల జీవితాలను అధ్యయనం చేస్తే మాతృభాషలలో విద్యను అభ్యసించిన వారే చాలామంది ఉన్నారు. ప్రపంచ ప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ గారు ఆంగ్లంలో ఉత్తీర్ణత సాధించలేకపోయారు. కానీ రకంగా చూసినా జ్ఞానం, సృజనాత్మకత, నూతన ఆవిష్కరణలు మాతృభాష విద్యా అధ్యయనంతోనే మరింత వికాసయుతంగా సాగుతారు. తెలుగు భాషాభిమానులు, విద్యారంగానికి సంబంధించిన అందరి పక్షాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.యస్ జగన్ మోహనరెడ్డి గారిని ప్రాథమిక విద్య ఇంగ్లీషు మీడియం సాగించాలనే నిర్ణయంపై పునరాలోచించాలని కోరుతున్నాం..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో తెలుగు మీడియంలో కొనసాగించాలని కోరుతున్నాం. ఇంగ్లీషును ఒక సబ్జెక్ట్గా కొసాగించాలి. గణితం, విజ్ఞాన, సాంఘిక శాస్త్రాల పాఠ్యపుస్తకాలను తెలుగు మీడియంలో కొనసాగిస్తూ, అందులోని ముఖ్య పదజాలన్ని పాఠ్యపుస్తకాలలో అనుబంధంగా ఆంగ్లంలో కూడా ఇవ్వవచ్చు. ఆరవ తరగతి నుండి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆలోచన మేరకు తెలుగు, ఇంగ్లీషు మీడియంలను ఎంపిక చేసుకొనే స్వేచ్ఛను ఇవ్వాలి. రెండు మీడియంలకు పాఠశాలలో చదివే అవకాశం ఉండాలి. ఇంటర్, డిగ్రీ, ఇతర వృత్తి విద్యలలోను ఒక సబ్జెక్టుగా తెలుగు ఉండాలని మనవి చేస్తున్నాం.
“అమ్మపాల రుచులు అక్షరాలుగా మారి, పసిపెదాల మాతృభాషయయ్యె,
మాతృభాషలోని మమతను మరిచిన,
జాతిలేదు ప్రగతిరీతిలేదు”.

-డా.అప్పిరెడ్డి హరినాథరెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap