భరతనాట్య  ప్రతిభా సౌజ‌న్యం

శాస్త్రీయ నాట్యకళల్ని వంటబట్టించుకోవడం అంత సులభమైన విషయం కాదు. అందుకు చాలానే కృషి జరగాలి. ఏళ్ళ తరబడి సాధనలో మునిగితేలితేగానీ జీవితంలో నాలుగు పదనర్తనలు అబ్బవు. ఎందుకంటే భారతీయ నాట్యకళలకున్న బిగువు అలాంటిది. దక్షిణాదిన ప్రాచుర్యంగల భరతనాట్యం, కూచిపూడి నాట్యకళలూ అలాంటివే. అభిరుచికో, గుర్తింపుకోసమో.. కొంతకాలంపాటు ఏదైనా నాట్యకళను నేర్చుకోవాలనుకుంటే.. అందులో పెద్దగా పరిణత దక్కదు. మనసునిండా ఆ కళను ఆహ్వానించుకుంటూ.. అందుకుతగ్గ సాధన చేస్తేనే.. అంతో ఇంతో రాణించగలం. అలాంటి పట్టుదలతో, నియమ, నిబద్ధతగల సాధనతో, ఉద్ధండ గురువు పర్యవేక్షణలో భరతనాట్య కళలో రాణిస్తున్నారు నర్తకి సౌజన్య శ్రీనివాస్‌. ఇటీవల విజయవాడ, తుమ్మలపల్లి కళాక్షేత్రంలో హైదరాబాద్‌ ‘సంగమం’ ఫౌండేషన్‌ నిర్వహించిన సౌజన్య నృత్యవిభావరి ఆసాంతం కళాప్రియుల మెప్పు పొందింది. ఆ నాట్యకళా విశేషాలు..

క్రమేణా.. సంప్రదాయ నాట్యకళా ప్రదర్శనలు అరుదవుతున్నాయి. ఇందుకు కారణాలు చాలానే ఉన్నాయి. ఆధిపత్య మీడియాల ప్రాబల్యంతో శాస్త్రీయ కళలకు ఆదరణ, పోషణ తగ్గడంతోపాటు, సంప్రదాయ కళపట్ల ఆసక్తి, అనురక్తి కలిగి ఆయా కళల్లో విద్య నేర్వాలి అనుకునే తరమూ అరుదవుతుంది. ఈ క్రమంలో సంప్రదాయ కళాప్రదర్శనల సందర్భాలూ పరిమితంగానే కనిపిస్తున్నాయి. అక్కడక్కడ ఒకటీ అరా జరుగుతున్నా.. అరకొర సౌకర్యాలతోనే అంటే, తెర వెనుక నేపథ్యం సంగీతానికి అనుగుణంగా (ఆడియో ట్రాక్స్‌ ఆధారంగా) మాత్రమే ఆయా నాట్య ప్రదర్శనలు ఆడే పరిస్థితి ఏర్పడుతుంది. కానీ సౌజన్య నృత్యవిభావరి మాత్రం.. పరిపూర్ణమైన రంగాలంకరణ, ప్రత్యక్ష సంగీతాన్ని మేళవించుకుని రసరమ్యంగా సాగింది. కావ్యేషు నాటకం రమ్యం అనే స్థానే ‘కావ్యేషు నాట్యం రమ్యం’ అన్నట్టుగా సౌజన్య నృత్యవిభావరి రసజ్ఞుల్ని ఆకట్టుకుంది.

పట్టు.. బిగువుగల నర్తనం
ముందే అనుకున్నట్టు.. ఏ నాట్యమైనా కళాకారుల సాధనబట్టే..వారి కళా ప్రదర్శన ఆధారపడి ఉంటుంది. నర్తకుల నాట్యప్రతిభేమిటో తెలుసుకోవాలంటే పదినిముషాల పాటు వారి నాట్యం చూసి చెప్పేయొచ్చంటారు కళావిమర్శకులు. ఇది అక్షర సత్యం. ఏకబిగువున.. సుమారు రెండు గంటలపాటు నృత్యవిభావరిలో ఏకవ్యక్తీ ప్రదర్శనగా నర్తించడం అంటే మాటలు కాదు. ఎంతో సాధన, కృషి అవసరం. నర్తకి సౌజన్య నృత్య ప్రదర్శన తీరులో ఆద్యంతం అలాంటి నాట్య ప్రమాణాలు కనిపించాయి. విభావరిలోని అంశాలకు అనుగుణంగా, సంగీత, సాహిత్యానికి తగ్గట్టుగా అభినయాన్ని సమపాళ్లలో పండిస్తూ, బిగువైన, చురుకైన పాదముద్రలు, నాట్యగణాంకాలకు తగ్గట్టుగా శరీరాభినయ పదపుష్టితో నర్తకి సౌజన్య చేసిన ప్రదర్శనకు కళావిమర్శకులు సైతం జేజేలు పలికారు.

గురు, దైవ నివేదనాంశాలతో సంప్రదాయబద్ధంగా ప్రారంభమైన నృత్యవిభావరి రామాయణం, భాగవత అంశాల్లోని ముఖ్యఘట్టాలను స్పృశిస్తూ, ఆఖరిగా భగవద్గీత సారాన్ని ఆవిష్కరిస్తూ ముగిసింది. నర్తకి సౌజన్యకు నాట్యశిక్షణ ఇస్తున్న, సుప్రసిద్ధ నాట్యగురువు పసుమర్తి రామలింగశాస్త్రి స్వయంగా నట్టవాంగం నిర్వహించగా.. గాత్రం డిఎస్‌వి శాస్త్రి, పసుమర్తి పద్మ. ఆర్‌.శాస్త్రి, మృదంగం రాజగోపాలాచారి, వయోలిన్‌ దినకర్‌, ఘటం చంద్రకాంత్‌, వేణువు విబిఎస్‌ మురళి సంగీత సహకారం అందించారు. రంగాలంకరణ రవీందర్‌రెడ్డి, ఆహార్యం సురేష్‌, కాస్ట్యూమ్స్‌ కృష్ణ, విద్యుతలంకరణ సురభి కిషోర్‌ సమకూర్చారు. కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌, సినీనటులు సునీల్‌ అతిథులుగా హాజరై, నర్తకి నాట్య ప్రదర్శనలోగల పరిణితని కొనియాడారు. ‘సంగమం’ ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు సంజరుకిషోర్‌ కార్యక్రమాన్ని పర్యవేక్షించగా, సుమధుర కళానికేతన్‌ వ్యవస్థాపక కార్యదర్శి భాస్కరశర్మ స్థానిక నిర్వహణ సహకారం అందించారు.

గృహిణిగా.. నర్తకిగా
నర్తకి సౌజన్య ఎవరోకాదు, ప్రముఖ సినిమా దర్శకుడు, కథామాటల రచయిత త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ సతీమణే. అలాగే గేయరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రికి కూతురు వరుస. సౌజన్యకు చిన్నతనంలో నాట్య, సంగీత కళలపై అభిరుచి ఉన్నాగానీ అభ్యసించడం వీలుకాలేదు. వివాహానంతరం, ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యాక.. తిరిగి తనకు ఎంతో ఇష్టమైన నాట్యకళను (భరతనాట్యం) అభ్యసించడం మొదలెట్టారు. అలా పట్టుదలతో, క్రమం తప్పని సాధనతో కళను అభ్యసించి.. తక్కువ కాలంలోనే గురువు, కుటుంబ ప్రోత్సాహంతో పూర్తిస్థాయి ప్రదర్శనలిచ్చే స్థాయికి ఎదిగారు. నాట్యంతోపాటు ప్రస్తుతం శాస్త్రీయ సంగీతంలోనూ తర్ఫీదు పొందుతున్నారు సౌజన్య. పరిణిత చెందిన నాట్యప్రతిభ, ప్రమాణాలతో భరతనాట్యకళలో ప్రత్యేకతను చాటుకుంటున్న నర్తకి సౌజన్యాశ్రీనివాస్‌ భవిష్యత్తులోనూ ఇదే నాట్యచైతన్యాన్ని కొనసాగిస్తూ అగ్రేసర కళాకారిణిగా రాణించాలని ఆశిద్దాం!!

– గంగాధర్‌ వీర్ల 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap