మన దేశ జెండా రూపశిల్పి – పింగళి

నేడు మన జాజీయ జెండా ఆమోదం పొందిన రోజు. పింగళి ని స్మరించుకుందాం.   

మన దేశానికి జెండానిచ్చిన తెలుగు వీరుడు పింగళి వెంకయ్య. స్వాతంత్ర్యానికి దశాబ్దాల ముందే జాతీయ జెండా కోసం కలలుగన్న ఆయన “భారత దేశానికొక జాతీయ జెండా’ పేరిట ఇంగ్లీష్ లో ఒక పుస్తకాన్ని 1916 లోనే రాశారు. బ్రిటిష్ ప్రభుత్వానికి ‘యూనియన్ జాక్ జెండా ఉన్నప్పటికీ నాటి బ్రిటిష్ పాల కులు సైతం తమ అధీనంలోని ‘భారత సామ్ర్యాజ్యానికి’ ఒక జెండా ఉంటే బాగుందని భావించి, జెండా రూపకల్పన కోసం నానా ప్రయత్నాలు చేశారు. అదేకాలంలో మరోవైపు కాంగ్రెస్ నాయకులు కూడా యావద్దేశానికి జాతీయ జెండా ఒకటి ఉండాలని గట్టిగా సంకల్పించారు. చాలా ప్రయత్నాల తర్వాత పింగళి వెంకయ్య రూపొందించిన జెండాను 1947 జూలై 21న కాంగ్రెస్ ఆమోదించింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎర్రకోటపై ఈ జెండానే రెపరెపలాడింది.

పింగళి వెంకయ్య కృష్ణా జిల్లా మొవ్వ మండలం లోని భట్లపెనుమర్రు గ్రామంలో 1876 ఆగస్టు 2న జన్మించారు. ఆయన తల్లిదండ్రులు హనుమంతరా యుడు, వెంకటరత్నమ్మ. తండ్రి హనుమంతరా యుడు దివి తాలూకా యార్లగడ్డ గ్రామానికి కరణంగా ఉండేవారు. వెంకయ్య ప్రాథమిక విద్యాభ్యాసం అక్కడే జరిగింది. తర్వాత మచిలీపట్నం ఉన్నత పాఠశాలలో చదువు పూర్తి చేసుకున్నారు. చిన్న అప్పటి నుంచే వెంకయ్య చురుకైన విద్యార్థి. సాహస ప్రవృత్తి ఆయనను సైన్యం వైపు నడిపింది. పంతో మ్మిదో ఏట బొంబాయి వెళ్లి సైన్యంలో చేరారు. దక్షిణా ఫ్రికాలోని బోయర్ యుద్ధంలో పాల్గొన్నారు. దక్షిణాఫ్రికాలో ఉన్న కాలంలోనే ఆయన తొలిసారిగా మహాత్మా గాంధీని కలుసుకున్నారు. అప్పటి నుంచే వారిద్దరి మధ్య అనుబంధం ఏర్పడింది. బళ్లారిలో కొంతకాలం ప్లేగు ఇన్స్పెక్టర్గా పనిచేశారు. ఉద్యోగం ఆయనకు సంతృప్తినివ్వలేదు. ఉన్నత చదువులు చదవాలనుకున్నారు. సీనియర్ కేంబ్రిడ్జి కోర్సు చేయడానికి కొలంబో వెళ్లారు. అక్కడి సిటీ కాలేజీలో చేరి, పొలిటికల్ ఎకనామిక్స్ ప్రధానాంశంగా సీనియర్ కేంబ్రిడ్జి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు. ఆ తర్వాత కొంతకాలం రైల్వే గార్డుగా పనిచేశారు. ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి లాహోర్లోని డీఏవీ కాలేజీలో చేరారు. లాహోర్లో చదువుకుంటున్న కాలంలో ఆయన సంస్కృతం, ఉర్దూ, జపాన్ భాషలలో ప్రావీణ్యం సాధించారు. జపాన్లో అనర్గళంగా మాట్లా డేవారు. దాంతో ఆయనను సన్నిహితులంతా ‘జపాన్ వెంకయ్య’ అని పిలిచేవారు.

దక్షిణాఫ్రికాలో గాంధీజీని కలుసుకున్నప్పటి నుంచే వెంకయ్యలో జాతీయ పతాకం ఆలోచన మొద లైంది. ఇక అప్పటి నుంచి అదే ఆయన అభిమాన విషయమైంది. స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత 1918 నుంచి ప్రతి కాంగ్రెస్ సభల్లోనూ వెంకయ్య పాల్గొనేవారు. కాంగ్రెస్ నాయకులతో జాతీయ పతాకం రూపకల్పనపై సుదీర్ఘ చర్చలు జరిపేవారు. అప్పట్లో బ్రిటిష్ ‘యూనియన్ జాక్ ఉన్నా, దేశంలోని చిన్న చిన్న సంస్థానాలకు వేర్వేరు జెండాలు ఉండేవి. అందుకే బ్రిటిష్ పాలకులు సైతం తమ అధీనంలోని భారత సామ్రాజ్యానికి’ ప్రత్యేక పతాకం ఉండాలని భావించే వారు. అదే కాలంలో స్వాతంత్ర్య పోరాటం సాగిస్తున్న కాంగ్రెస్ నాయకులు కూడా మనకంటూ ఒక స్వతంత్ర పతాకం ఉండటం అవసరమని భావించేవారు.

వెంకయ్య రూపొందించిన జెండాను 1916లో లక్నోలో జరిగిన కాంగ్రెస్ జాతీయ మహాసభల్లో తొలి సారిగా ఎగురవేశారు. జాతీయ పతాకంపై రాట్నం చిహ్నం ఉంటే బాగుంటుందని జలంధర్ కు చెందిన నాయకుడు లాలా హన్స్రాజ్ 1919లో చేసిన సూచ నను గాంధీజీ అంగీకరించారు. బెజవాడలో 1921లో అఖిల భారత కాంగ్రెస్ మహాసభలు జరిగినప్పుడు గాంధీజీ వెంకయ్యను పిలిపించుకుని, పైన కాషాయం, దిగువన ఆకుపచ్చ రంగులున్న జెండా మధ్యలో రాట్నం చిహ్నం ఉండేలా రూపొందించమని కోరారు. వెంకయ్య అదే తీరులో జెండాను రూపొందించారు. జెండా మధ్యలో శాంతికి చిహ్నంగా తెలుపు రంగు ఉంటుందనే ఆలోచన వచ్చింది. గాంధీజీకి. ఆయన మధ్యలో తెలుపు రంగు కూడా ఉంటే బాగుంటుందని వెంకయ్యకు చెప్పడంతో ఆయన ఈసారి మధ్యలో తెలుపు రంగును చేర్చి, తెలుపు రంగుపై రాట్నం చిహ్నం వచ్చేలా రూపొందించారు. భారత రాజ్యాంగ సభ 1947 జూలై 21న వెంకయ్య రూపొందించిన జెండా నమూనాను ఆమోదిస్తూ, ఇందులో చిన్న మార్పు తెచ్చింది. రాట్నం స్థానంలో మన ప్రాచీన ధర్మ చిహ్నమైన అశోకచక్రాన్ని ఇముడ్చుతూ జాతీయ పతాకాన్ని ఆమోదించినట్లు జూలై 22న జవహర్ లాల్ నెహ్రూ ప్రకటించారు.

నిష్కళంక దేశభక్తుడైన పింగళి వెంకయ్య 1906 నుంచి 1922 మధ్య కాలంలో భారత జాతీయోద్యమంలోని కీలక ఘట్టాల్లో పాల్గొన్నారు. ‘వందేమాతరం’ ఉద్యమం, హోమరూల్ ఉద్యమం, ఆంద్రోద్యమం వంటి ఉద్యమాల్లో ఆయన తన వంతు పాత్ర పోషించారు. సైన్యంలోను, రైల్వేలోను ఉద్యోగాలను వదిలేసి ఉన్నత విద్య పూర్తి చేసుకున్న తర్వాత వెంకయ్య కొంతకాలం బందరు జాతీయ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేశారు. వ్యవసాయ శాస్త్రం, చరిత్ర పాఠాలు చెప్పడంతో పాటు విద్యార్డు లకు గుర్రపు స్వారీ, వ్యాయామం, సైనక శిక్షణ ఇచ్చేవారు. అంతులేని జ్ఞానతృష్ణతో ఆయన కొంతకాలం రాజకీయాలకు దూరమై శాస్త్ర పరిశోధ నలపై దృష్టి సారించారు. మద్రాసు వెళ్లి ప్రెసిడెన్సీ కాలేజీలో భూగర్భ శాస్త్రంలో పరిశోధనలు సాగించి డిప్లొమా తీసుకున్నారు. తర్వాత 1924 లో నెల్లూరు చేరుకుని, అక్కడ అభ్రకం గురించి విశేషమైన పరిశోధనలు సాగించారు. వజ్రకరూరు, హంపి ప్రాంతాల్లో పర్యటించి, అక్కడి నేలల్లో దొరికే వజ్రాల గురించి విశేషంగా పరిశోధనలు చేసి, అప్పటి వరకు ప్రపంచానికి వెల్లడికాని అనేక విశేషాలను వివరిస్తూ ‘వజ్రపుతల్లి రాయి” అనే గ్రంథాన్ని 1955లో ప్రచురించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ప్రభుత్వం ఆయనను ఖనిజ పరిశోధక శాఖ సలహాదారుగా నియమించింది. ఆయన ఆ పదవిలో 1960 వరకు కొనసాగారు. అప్పటికే ఆయన వయసు 82 ఏళ్లు నిండాయి. ఖనిజ పరిశోధక శాఖలో పదవీకాలం పూర్తయ్యాక వెంకయ్య విజయవాడ చేరుకున్నారు. సైన్యంలో పనిచేసినందుకు ప్రభుత్వం ఆయనకు విజయవాడలోని చిట్టినగర్ ప్రాంతంలో కొద్దిపాటి స్థలం ఇచ్చింది. ఆ స్థలంలో గుడిసె వేసుకుని, అందులో శేషజీవితాన్ని గడపాల్సి వచ్చింది. వృద్ధాప్యంలో దుర్భరమైన ఆర్థిక కష్టాలు ఆయనను చుట్టుముట్టాయి. జాతీయ పతాక రూపకర్తలను ఏ దేశంలోనైనా ప్రభుత్వాలు అమితంగా గౌరవిస్తాయి. మన దేశంలో మాత్రం అందుకు భిన్నంగా జరగడం దారుణం. అవసాన కాలంలో పింగళి వెంకయ్య తిండికి కూడా మొహం వాచిన పరిస్థితుల్లో నానా అగచాట్లు పడ్డారని ‘త్రివేణి’ సంపాదకుడు డాక్టర్ భావరాజు నరసింహారావు పేర్కొన్నారు. ఆయన కష్టాలను గమ నించిన కొందరు పెద్దలు ఆయనకు ఏదో రూపంలో కొంత నిధిని సమకూర్చి అందించాలని సంకల్పించారు. డాక్టర్ కె.ఎల్.రావు, డాక్టర్ టీవీ. ఎస్. చలపతిరావు, కాట్రగడ్డ శ్రీనివాసరావు వంటి పెద్దలు 1963 జనవరి 15న వెంకయ్యను సన్మానించి, కొంత నిధిని అందించారు. సన్మానం జరిగిన ఆరునెలలకే- 1963 జూలై 4న ఆయన తుదిశ్వాస విడిచారు. చివరి దశలో ఆయన ‘నాకు అంత్యదశ సమీపించింది. నేను చనిపోయిన తర్వాత నా భౌతికకాయం మీద త్రివర్ణ పతాకాన్ని కప్పండి. శ్మశానానికి చేరిన తర్వాత ఆ పతాకాన్ని తీసి అక్కడ ఉన్న రావి చెట్టుకు కట్టండి’ అని తుది కోరికను కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap