యూట్యూబ్ కు ఊతం ఇచ్చిన సుప్రీం కోర్ట్

యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్స్ అయినా ప్రతి జర్నలిస్టు రక్షణ ఉంటుంది-సుప్రీం కోర్ట్

ప్రమఖ జర్నలిస్టు వినోద్‌ దువాపై దేశద్రోహం కేసును సుప్రీంకోర్టు కొట్టివేసింది.

ఈ సందర్భంగా 1962 నాటి కోర్టు తీర్పును ప్రస్తావించిన న్యాయస్థానం.. ఇలాంటి కేసుల్లో ప్రతి జర్నలిస్టుకు రక్షణ పొందే హక్కుందని పేర్కొంది.

గతేడాది దిల్లీలో జరిగిన అల్లర్లపై వినోద్‌ దువా తన యూట్యూబ్‌ ఛానల్‌లో ఓ కార్యక్రమాన్ని ప్రసారం చేశారు. అయితే అందులో తప్పుడు కథనాలు ప్రసారం చేశారని, ప్రజలను తప్పుదోవ పట్టించేలా అసత్య ప్రచారాలు చేశారని ఆరోపిస్తూ హిమాచల్‌ ప్రదేశ్‌ భాజపా నేత ఒకరు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై రాజద్రోహం కేసు నమోదైంది.ఈ ఎఫ్‌ఐఆర్‌ ను సవాల్‌ చేస్తూ వినోద్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.దీనిపై గతంలో విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం.. అతడిపై సత్వర చర్యలు తీసుకోకుండా రక్షణ కల్పించింది.

తాజాగా ఈ కేసులో జస్టిస్‌ యూయూ లలిత్‌, జస్టిస్‌ వినీత్‌ శరణ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి.. వినోద్‌ దువాపై రాజద్రోహం,ఇతర కేసులను కొట్టివేసింది. 1962 నాటి కేదార్‌నాథ్ సింగ్‌ తీర్పు ప్రకారం.. ఇలాంటి కేసుల్లో ప్రతి జర్నలిస్టుకు రక్షణ ఉందని గుర్తుచేసింది. ‘‘చట్టబద్ధమైన మార్గాల ద్వారా మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తే, అందుకు బలమైన పదాలను ఉపయోగించి నంత మాత్రాన రాజద్రోహం’’ కాదని 1962 నాటి సుప్రీంకోర్టు తీర్పు చెబుతోందని ధర్మాసనం తెలిపింది.అందువల్ల వినోద్‌పై ఉన్న కేసులను కొట్టివేస్తున్నట్లు వెల్లడించింది.అయితే, 10ఏళ్ల అనుభవం ఉన్న మీడియా సిబ్బందిపై ఎలాంటి కమిటీ నివేదిక లేకుండా కేసులు నమోదు చేయవద్దని వినోద్‌ అభ్యర్థనను మాత్రం న్యాయస్థానం తిరస్కరించింది.

వినోద్ దువా భారతీయ జర్నలిస్ట్, దూరదర్శన్ మరియు ఎన్డిటివి(NDTV) ఇండియాలో పనిచేశారు. 1996 లో గౌరవనీయమైన రామ్‌నాథ్ గోయెంకా ఎక్సలెన్స్ ఇన్ జర్నలిజం అవార్డును పొందిన మొదటి ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్. ఆయనకు 2008 లో జర్నలిజంలో చేసిన కృషికి పద్మశ్రీని భారత ప్రభుత్వం ప్రదానం చేసింది.

SA: