రంగుల రహస్యం తెలిసిన చిత్రకారుడు

రూపం మోసం చేస్తుంది అని ఎవరు అన్నారో కానీ సూర్యప్రకాష్ విషయంలో ఆ మాట వందకు వెయ్యి శాతం నిజం. అధాటున అతడిని ఎవరైనా చూస్తే ఏ రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగో, లేకపోతే ఏ సాఫ్ట్ వేర్ దిగ్గజమో అనుకుంటారు తప్పిస్తే రంగుల హృదయం తెలిసిన, రంగుల రహస్యం తెలిసిన అంతర్జాతీయ చిత్రకారుడు అని ఎవరూ అనుకోరు. అతడి కాన్వాస్ ఎంత పెద్దదో అతడి ప్రొఫైల్ అంత చిన్నది. ఈ ప్రపంచం ఎటు పోతేనేమి నాదైన చిత్ర ప్రపంచము నాది అనుకున్నాడు ఆయన అచ్చు మన కృష్ణశాస్త్రి లా తన రంగుల లోకంలో తానొక సప్త వర్ణాల ఇంద్రధనస్సులా మారిపోయాడు.. ఎక్కడో మారుమూల ఖమ్మం జిల్లాలోని మధిరలో జన్మించిన సూర్యప్రకాష్ చిత్ర ప్రస్థానం అంత అలవోకగా జరిగిందేమీ కాదు. పబ్లికేషన్ డివిజన్లో మూడు సంవత్సరాలపాటు చేసిన ఉద్యోగాన్ని వదులుకుని చిత్రకళనే జీవనవాహికగా చేసుకోవాలంటే గొప్ప పాషన్ ఉంటే కానీ సాధ్యపడదు. చిన్నతనంలో నోట్ పుస్తకాల మీద స్కెచ్లు వేసుకుంటూ చదువును నిర్లక్ష్యం చేస్తున్న కొడుకును చూసి ఆ తండ్రి “వీడి జీవితం, మహా అయితే స్కూల్లో డ్రాయింగ్ టీచర్” గా ముగిసిపోతుంది అనుకుని వుంటాడు తప్పిస్తే అంతర్జాతీయంగా తలెత్తి చూస్తే తప్ప కనపడనంత  ఎత్తుకు ఎదుగుతాడని అనుకుని ఉండడు. అలా అనుకుంటే అతడికి కావలసిన ప్రోత్సాహాన్ని ఇచ్చి ఉండేవాడేమో. లోలోపల దహించే కోరిక ఏదో ఉంటే తప్ప సూర్యప్రకాష్ లో ఎదగడం సాధ్యం కాదేమో. సూర్యప్రకాషను చూస్తే అమెరికన్ స్టీల్ మాగ్నెట్ Charles M Schwab అన్న మాటలు A person can succeed at almost anything for which they have unlimited enthusism గుర్తుకువస్తాయి. అవును passion overcomes everything.

ఢిల్లీలో ప్రముఖ చిత్రకారుడు రామ్ కుమార్ దగ్గర ఆరు నెలల పాటు శిష్యరికం చేసినతరువాత హైదరాబాద్ చేరుకున్న సూర్యప్రకాష్ ఒక చిన్న గ్యారేజ్లో ఫ్రీలాన్సర్గా చిత్రకళాజీవితం మొదలు పెట్టాడు. నలభయ్ రూపాయల పెయింటింగ్తో మొదలై నలభయ్ లక్షల రూపాయల పెయింటింగ్ వేసేంతవరకు సాగిన అతడి ప్రస్థానంలో చేదోడువాదోడుగా నిల్చింది ఎల్ వి ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ మరియు సి.సి.ఎం.బీ. భార్గవ. వాళ్లిద్దరూ లేకపోతే సూర్యప్రకాష్ లేడు. నైరూప్య వాస్తవికతకు పెట్టింది పేరు అయిన సూర్యప్రకాష్ తన చిత్రాలలో మానవ ఆకృతులకు అసలు ఎంత మాత్రమూ ప్రాముఖ్యత ఇవ్వలేదు. విశాలమైన ల్యాండ్ స్కేప్స్, ఎతైన వృక్షాలు, రాలుతున్న పండుటాకులు, కమలాల కొలను అతడికి చాలా పేరుతెచ్చిన విషయాలు. వెనిస్ పేరుతో వేసిన సిరీస్, రిఫ్లెక్షన్స్ సిరీస్ అతడిలోని లోలోపలి చిత్రకారుడి ఆత్వికతను పట్టి ఇస్తాయి. ఆయిల్ పెయింటింగ్స్ను బాగా ఇష్టపడే సూర్యప్రకాష్ యాక్రిలిక్ పెయింటింగ్లో కూడా తనదైన ముద్ర వేసాడు. చివరకు డిజిటల్ పెయింటింగ్స్ లో కూడా, – చాలామంది చిత్రకారులు చాలా అరాచకంగా వుంటారు. అరాచకం అన్నమాట కూడా సరి అయినది కాదేమో. ఒక రకంగా మావెరిక్  అన్నమాట. కానీ సూర్యప్రకాష్ అందుకు పూర్తిగా విరుద్ధం. చిత్రకారుడికి భావోద్వేగాలను నియంత్రించే శక్తి ఉండాలి. లేకపోతే అతడు తన సృజన శక్తి నంతా బూడిదలో పోసిన పన్నీరులా వృధా చేసుకుంటాడు అనే సూర్యపూష్ తన భావోద్వేగాలు అన్నిటినీ తన చిత్రాలలోనే అమూర్తంగా అద్భుతంగా చిత్రీకరించాడు. అతడి చిత్రాలన్నీ అనేక పొరలుగా విచ్చుకుంటాయి. ఒక్కొక్క చిత్రంలో ఆరు నుండి పదిహేను దాకా లేయరు దాకా ఉంటాయి. దార్క్ కలర్స్తో మొదలు పెట్టి లైట్ కలర్స్ కి రావడం చలన చిత్రంలో వస్తుగత కాంతి బలంగా వీక్షకుడి దృష్టిని ఆకర్షిస్తుంది. ఒక కవికి తన కవితను ఎన్ని సార్లు తిరగ రాసిన తృప్తి ఉండనట్టు ఒక చిత్రం పూర్తి అయింది అన్న భావన ఎప్పుడూ సూర్యప్రకాషకి కలగదు. అందుకేనేమో అతడు చాలాసార్లు ప్రదర్శనకు పంపిన తన చిత్రాలను వెనక్కు తీసుకుని మళ్ళీ పెయింట్ చేశారు. చిత్త ప్రసాద్ చిత్రాలలాగా సూర్యప్రకాష్ చిత్రాలు మనల్ని దుఃఖం తోనో, దాహం తోనో, అసహనం తోనో, క్రోధం తోనో మెలితిప్పవు. రవి వర్మ చిత్రాలలాగా సూర్యప్రకాష్ చిత్రాలు మనల్ని ఆశ్చర్య, ఆనంద, అద్భుత లోకాలలోకి తీసుకుని వెళ్లవు. అడవి బాపిరాజు చిత్రాలలాగా సూర్యప్రకాష్ చిత్రాలు మనలని ఆధ్యాత్మిక లోకాలలోకి తీసుకుని వెళ్లవు. కానీ లోలోపల ఏదో సన్నని దుఃఖ ధ్వని, ఎక్కడో సుదూరంగా ఒక పండుటాకు రాలిపడుతున్న చప్పుడు వినిపిస్తాయి. చిత్తప్రసాద్ చిత్రాన్ని సమాజం ఓవర్టేక్ చేస్తే సూర్యప్రకాష్ చిత్రాన్ని అంతరంగం ఓవరేక్ చేస్తుంది. సూర్యప్రకాష్ చిత్రాలన్నీ పూర్తిగా వ్యయక్తిక అనుభూతుల సమాహారం. “చిత్రం పూర్తిగా నా వ్యక్తిగత అనుభవం మీద, అనుభూతి మీద వాటి సాంద్రతల మీద ఆధారపడివుంటుంది. అది వీక్షకుడితో ఒక్కొక్కసారి కనెక్ట్ కాకపోవచ్చు. ఉదారణకి నా రిఫ్లెక్షన్స్ అనే సిరీస్ పూర్తిగా నీటి ఉపరితల

ప్రతిస్పందనలతో స్ఫూర్తిని పొంది చేసింది. నీటి ప్రతిస్పందనలు చిత్రంలోకి వచ్చేసరికి పూర్తి నైరూప్యంగా మారిపోయాయి. ఇప్పుడు మీరు ఆ చిత్రాలని చూస్తే నీటి ఉపరితల ప్రతిస్పందనలు మీకు ఎక్కడా కనపడవు. కానీ రిప్లెక్షన్ నాకు మాత్రం అనుభవంలో ఉంటుంది. అది పదే పదే నన్ను ఆరాది పెడుతుంది” అంటారు సూర్యప్రకాష్

ఈ నేపథ్యంలో నుండి సూర్యప్రకాష్ చిత్రాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. లోటస్ సూర్యప్రకాష్ చిత్రాలలో పదే పదే కనిపించే

ప్రతీక. నిజానికి తన ఇంట్లోని చిన్న సరస్సులోని కమలం ఈ సిరీస్చేయడానికి అతడికి ప్రేరణ. ఈ సిరీస్లో చేసిన చిత్రాలు అన్నిటిలో ఎండిపోయిన, జీవం కోల్పోయిన పత్రాలు ప్రముఖంగా కనిపిస్తాయి. నిండు వేసవిలో రాలిపడే ఆకులలో వచ్చే మార్పులు మీద అతడు చాలా నెలలు పరిశీలించి చిత్రాలుగా తీర్చి దిద్దాడు. ఈ చిత్రాలను చాలా మంది చిత్ర కళా విమర్శకులు అంతరంగంలో ఏకాకిగా మిగిలిపోతున్న మానవుడికి

ప్రతీకలు అని వ్యాఖ్యానించారు. చూసినదాన్నే, కళ్ళతో వీక్షించిన దాన్నే కచ్చితంగా నమ్ము అనే సూత్రాన్ని బలంగా నమ్మే సూర్యప్రకాష్ శిశిర కాలపు ప్రాకృతిక దృశ్యాలకోసం అమెరికాలో రెండేళ్లు వున్నాడు. ఆ అనుభవాలతో వేసిన ల్యాండ్ స్కేప్స్ లో గోధుమ, ఎరుపు, వైబ్రంట్ ఆరేంజ్ రంగులు కాన్వాస్ మీదకు వచ్చి వీక్షకుడిని ఆకట్టుకున్నాయి. ల్యాండ్ స్కేప్స్ లో సూర్యప్రకాషది ప్రత్యేకమైన శైలి. తన గురువు రాంకుమార్ ల్యాండ్ స్కేప్స్ “ఆత్మ శోధన” మీద దృష్టిని కేంద్రకరిస్తాయి. అక్బర్ పదంసీ ల్యాండ్ స్కేప్స్ “భౌతిక ఆవరణాన్ని మించిన మెటా స్పేస్”ని దృశ్యమానం చేస్తాయి. పరంజిత్ ల్యాండ్ స్కేప్స్ మత సంబంధమైన” జాగృతిని కలగా చేస్తాయి. ఎఫ్ ఎన్ సౌజ ల్యాండ్ స్కేప్స్ “మనిషి లోపల ఘర్షణ”లకు రూపాన్ని ఇస్తాయి. వీటన్నిటికీ భిన్నంగా సూర్యప్రకాష్ ల్యాండ్ – సేష్ “మనిషిలో పెరిగిపోతున్న శిశిర సౌందర్యాన్ని” పట్టి చూపుతాయి. ఒక మంచి కవితను చదివినప్పుడో, ఒక మంచి చిత్రాన్ని చూసినప్పుడో మనం మాట రాక మౌనంగా ఉండిపోతాము, మౌనంగా వున్నాము అంటే మన అనుభవంలోకి వచ్చిన కళా రూపాలతో ఒక ఆత్మ సంభాషణ చేస్తున్నామని అర్ధం, సూర్యప్రకాష్ చిత్రాలను చూసినప్పుడు కూడా మనం మౌనంలోకి జారిపోతాము. హృదయం ఏదో చెప్పమంటుంది. మాట పెదవి దాటి బయటకు రాదు. హృదయానికి, మెదడుకు మధ్య ఉన్న ఒక వంతెన కూలిపోయి కేవలం అనుభవం మాత్రమేమిగిలే హృదయం ఏదో మిగులుతుంది. అప్పుడు నిశ్శబ్దం గొప్పగా సంభాషిస్తుంది ఆ చిత్రంతో, సూర్యప్రకాష్ మరణంతో పత్రహరితంలో హరితం పత్రాన్ని విడిచి వెళ్ళిపోయింది. సూర్యుడు అస్తమించాడు. హైదరాబాద్ ఒక గొప్ప చిత్రకారుడిని కోల్పోయింది,

– వంశీకృష్ణ

1 thought on “రంగుల రహస్యం తెలిసిన చిత్రకారుడు

  1. సూర్యప్రకాష్ గారి గురించిన వ్యాసం చదువుతుంటే చాలా వేదన కలిగింది. మన గొప్ప చిత్రకారుని గురించి నేను చాలా ఆలశ్యంగా తెలుసుకున్నానని.ప్రకాష్ గారి పేరున ఆర్ట్ గేలరీ ఉందని తెలుసు కానీ… ఎంతటి సాధన చేశారో అనేది ఇంతవరకూ తెలుసుకోలేక పోయాను.
    వంశీకృష్ణగారి రచనలో సూర్యప్రకాష్ గారి కళా సామర్థ్యం ప్రస్ఫుటమై పరిమళించింది.
    అంత చక్కని పరిచయవాక్యాలు రాసిన వంశీకృష్ణగారికిఅభినందనలు.
    కళాసాగర్ గారికి ఓ విజ్ఞప్తి.. మనచుట్టూ ఉన్న మన గొప్ప చిత్రకారులను
    ముఖ్యంగా వయోవృద్ధులను … వారి ప్రతిభాన్విత కృషినీ మన తెలుగువారికి అందించమని మనవి.
    మీరు చేస్తున్న ఈ కళా సేవ అసామాన్యం. మీకు మేమెంతైనా ఋణపడినాము…కళాసాగర్ గారూ… ! జోహార్లు ..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap