‘రేపల్లె చరిత్ర’కు అక్షర రూపం 

‘చరిత్ర’ అంటే కనుమరుగైన గతమే కాదు. నడుస్తున్న వర్తమానం కూడా, చరిత్రను మరచిన ఏ జాతికీ ప్రగతి వుండదని. కాలగర్భములో కలిసిపోయిన, కలసిపోతున్న చరిత్ర మన భవిష్యత్ కు ప్రేరణ కావాలని. ఇందుకు ‘చరిత్ర రచన, అధ్యయనము’ లనేవి నిరంతరమూ నిజాయితీగా సాగుతూ వుండాలని నమ్మిన మన్నె శ్రీనివాసరావు గారు ఎంతో శ్రమించి రూపొందించిన పుస్తకమే ఈ ‘రేపల్లె చరిత్ర ‘.

గుంటూరు జిల్లాలో ప్రఖ్యాతి వహించిన పట్టణాలలో రేపల్లె ఒకటి. రేపల్లె పట్టణం మాత్రమేగాక, రేపల్లె తాలూకా పరిధిలోవున్న ప్రాంతాలూ చరిత్రలో నిలువగల విశిష్టత సంతరించుకుని ఘనమైన విషయసంపదను స్వంతం చేసుకున్నాయి. కారణమేదైనా, జిల్లాలోని యితర ప్రాంతాల మాదిరిగా సరైన గుర్తింపు యీ ప్రాంతానికి రాలేదేమో అనిపిస్తుంది. జిల్లాలోని మారుమూల తాలూకా అవటంచేత, చరిత్రలో గుర్తింపతగిన అన్ని రకాల అర్హతలు వున్నప్పటికీ, గుర్తింపురాగల స్థాయిలో రాకపోవటానికి చరిత్రపై స్థానికులకు, చరిత్ర పరిశోధకులకు దృష్టి లేకపోవటం ఒక కారణం కావచ్చు. నిన్న వర్తమానానికి పూర్తిగా కనుమరుగైతే, భవిష్యత్తు అయోమయంగా అగమ్యగోచరంగా వుంటుందనే సత్యాన్ని విస్మరించటంచేతనే కావలసినంత స్థాయిలో రేపల్లెచరిత్ర ప్రజల మనోఫలకంపై ముద్రితం కాలేదని’ అనే భావనగల మన్నే శ్రీనివాసరావు ముందుకొచ్చి ఇంతటి బృహత్కార్యక్రమాన్ని చేపట్టి విజయవంతంగా నిర్వహించారు. చరిత్ర రచన అంటే ఇంట్లో కూర్చొని రాసేది కాదు. గ్రంథాలయాలలో తిష్టవేసి పది పుస్తకాలు తిరగేసి రాసేది కాదు అంటారు శ్రీనివాసరావు, నిజమే ఇలాంటి పుస్తకాలు రాయాలంటే ఎన్నో ఊర్లు తిరగాలి, ఎంతో మందిని కలిసి అనేక విషయాలు సేకరించాలి. వ్యయ ప్రయాసలు భరించాలి కూడా.

బహు గ్రంథ కర్త అయిన  శ్రీనివాసరావు రేపల్లె నివాసి. ఈయనకు మాతృభాషన్నా, జన్మభూమి అన్నా ప్రాణం. తన విద్యకు వృత్తికి ఏవిధముగానూ సంబంధము లేని తెలుగు సాహిత్యాన్ని నిశితంగా అధ్యయనముచేసి భాషమీద మంచి పట్టుసాధించాడు. నాటక రచన, నటన, దర్శకత్వం బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించి, ప్రవాసాంధ్రలోనూ ‘నాట్యశ్రీ, నాట్యభూషణ్’ వంటి అవార్డులతో సన్మానించబడ్డారు. సాహిత్య, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, రాజకీయ’ ఇత్యాది రంగాలలో దేనిని విడిచిపెట్టక అన్ని విషయాలకు సమప్రాధాన్యతనిస్తూ విశిష్టవ్యక్తుల చరిత్రలు, నాటి సామాజికపరిస్థితులు ఇత్యాది విషయాలు పూసగుచ్చినట్టు పొందుపరచిన శ్రీనివాసరావు అభిరుచి, ఆసక్తి, కృషి పటుదల మిక్కిలి ప్రశంసనీయం.

చరిత్రను మలుపుతిప్పిన అనేక ఉద్యమాలకు పుట్టినిల్లు రేపల్లె ప్రాంతం. ‘స్వామి సీతారామ్, తుమ్మల బసవయ్య వంటి అసంఖ్యాక గాంధీయవాదులు, ‘మాకినేని బసవపున్నయ్య, మోటూరి హనుమంతరావు, వేములపల్లి శ్రీకృష్ణ’ వంటి వామపక్ష యోధులు, చిత్తూరు వి.నాగయ్య, సముద్రాల రాఘవాచార్య, కె.విశ్వనాథ్, యస్. జానకి’ లాంటి చలనచిత్ర దిగ్గజాలు, ‘వెలగపూడి రామకృష్ణ వంటి పారిశ్రామిక దార్శినికులు, ‘కుడితపూడి శ్రీరామకృష్ణయ్య’ వంటి ఇంజనీరింగ్ నిపుణులు, ‘శ్రీశ్రీశ్రీ విమలానందస్వామి’ వంటి పీఠాధిపతులు, తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి’వంటి ఆధ్యాత్మిక జ్ఞానసంపన్నులు, ‘తుమ్మల సీతారామమూర్తి చౌదరి, నారాయణం రామానుజాచార్యులు, బోడేపూడి వెంకట్రావ్, నోరి నరసింహశాస్త్రి’ వంటి పండితోత్తములు, ‘అనగాని భగవంతరావు, ఈవూరు సుబ్బారావు, సింగం బసవపున్నయ్య’ వంటి రాజకీయదురంధరులు, ‘వావిలాల వాసుదేవశాస్త్రి, పంచాంగం వెంకటరామానుజాచార్యులు, పమిడిముక్కల లక్ష్మీకాంత మోహన్’ వంటి 200 మంది ప్రముఖుల జీవిత చరిత్ర, సుమారు 100 గ్రామాల చరిత్ర 480 పేజీల్లో అందమయిన ముద్రణలో చక్కటి పుస్తకాన్ని అందించిన శ్రీనివాసరావు గారు అభినందనీయులు.

– కళాసాగర్

2 thoughts on “‘రేపల్లె చరిత్ర’కు అక్షర రూపం 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap