సౌందర్య సృజన ఓ కళా విన్యాసం

“వందమాటలు చెప్పే అర్ధాన్ని ఒక్క చిత్రం చెప్పగలుగుతుంది. దీన్ని సంశ్లేషణ అంటారు. అదే చిత్రం వంద ప్రశ్నలకు జవాబు ఇవ్వగలదు. ఇది విశ్లేషణ, అంటే సంశ్లేషణ, విశ్లేషణల మధ్యన మనోవైజ్ఞానం పనిచేస్తుంది, ప్రకృతిని అనుసరిస్తూ, కల్పనను జోడించి సంశ్లేషణా నైపుణ్యంతో చేసే సృజన కార్యాన్నే ‘కళ “అంటారు. కళకు ఓ మనోవైజ్ఞానికుని నిర్వచనం ఇది..
వైవిద్యం నిండిన రచయితగా చిత్రకళ పై వ్రాసిన వ్యాసాలును ప్రపంచ చిత్రకళా పోకడలను తెలుగువారికి అర్థమయ్యేలా వ్రాసే బహు కొద్దిమంది రచయితల్లో ఎల్. ఆర్. వెంకటరమణ ఒకరు. గత కొన్ని ఏళ్ళుగా చిత్రకళలోని సూక్ష్మవిషయాలను పలు వ్యాసాల ద్వారా స్పృశించి వెలుగులు పూయించారు, ‘కళా సౌందర్యం’ వీరి రెండవ పుస్తకం. చిత్రకారునిగా, చిత్రకళా చరిత్రకారునిగా, కళా విమర్శకునిగా, ఉపాధ్యాయునిగా ఉద్యోగ విధుల్లో విరామం లేకుండా బిజీగా ఉంటూనే తన కృషికి రెండవ ఫలంగా ఈ ‘కళా సౌందర్యం’ పుస్తకం వెలువరించారు. మొదటిపుస్తకం ‘సౌందర్య సృజన’. రెంటిలోను ‘సౌందర్యం’ కామన్. ఇది యాదృశ్చికమే అయినప్పటికీ కళాసృజనల నుండి సౌందర్యాన్ని విడదీయలేము కదా!
తెలుగు రచయితల్లో ఉన్న వైవిధ్యాన్ని మన పత్రికలు, పాఠకులు పెంచి పోషించుకోవాల్సిన తరుణమిది. చిత్రకళపై నెలనెలా ‘విశాలాక్షి సాహిత్య మాసపత్రికలో అచ్చయిన 15 వ్యాసాలను సంపుటీకరించి పాలపిట్ట బుక్స్ ప్రచురించి పాఠకలోకానికి అందించింది. రచయిత, చిత్రకారుడు కూడా అయిన ఎల్. ఆర్. వెంకటరమణకు చిత్రకళా వ్యాసాలపై వీరికున్న సాధికారత -స్వతసిద్దమైనది, అధికారికమైనదిగా భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎం.ఏ(ఇంగ్లీషు), ఎం. ఏ(తెలుగు), ఎం.ఏ(హిస్టరీ) మరియు చిత్రలేఖనంలో బి. ఎఫ్, ఏ పట్టా, మరెన్నో అదనపు అర్హతలు వీరి సొంతం.
‘కళా సౌందర్య తత్వం’ అన్న వ్యాసం ద్వారా కళ ద్వారానే మానవ నాగరికతను అంచనా వేయగలమని వివరించారు. చిత్రకారుని వైవిధ్యమైన చూపే చిత్రకళ” అన్న వ్యాసంలో సృష్టికి ప్రతిసృష్టి కళారూపంగా మారుతుందని, అందరూ చూసే కోణానికి కళాకారుని దృష్టి కోణానికి వైవిద్య మున్నదంటారు. ‘ఉన్నట్టా, లేనట్టా… ఉండిలేనట్టా ?’ అన్న వ్యాసంలో జ్ఞానేంద్రియాల ద్వారా అందే పరిసర జ్ఞానం ప్రత్యక్షం అని, చిత్త చాంచల్యం కలిగించి బ్రమలు కలిగించే దృశ్యాల సృష్టి మొదలు నేటి 3డి గ్రాఫిక్స్ యొక్క విశ్వరూప విన్యాసం వరకు ఆధునిక కళా మేధస్సు వీక్షక మానవ మస్జిషానికి బ్రమను కల్గించి వినోదాన్ని పంచటమంటారు, “కొన్ని చిత్రాలు అలా ఎందుకు ఉంటాయి ?’ అన్న వ్యాసంలో ‘గుయోర్నికాచిత్రం వెనుక పికాసో మనోభావాన్ని వివరిస్తూ, ఆధునిక కళలో దాగివున్న వైవిధ్యాన్ని, సమస్యలను చక్కగా సోదాహరణంగా వివరించారు.
పరిశీలనే పునాది, కళ యే కళ, చిత్రకళ ఎందుకు ?, చిత్రకళ – మనో వైజానికత, చిత్రకళా ఉద్యమాలు, మానవాభివృద్ధిలో చిత్రకళ, చిత్రకళ-సాహిత్యం అన్న వ్యాసాలు ద్వారా ప్రపంచ భావాలను పరిమళింపచేస్తే, అంధ్ర చిత్రకళా వైభవం, తెలుగు మహిళ-చిత్రకళ అన్న రెండు వ్యాసాల ద్వారా తెలుగు నేలపై వికసించిన చిత్రకళలో మహిళల భాగస్వామ్యాన్ని, ఆంధ్ర చిత్రకళపై తనకున్న మక్కువను తెలుగు పాఠకులకందించటంలో కృతకృత్యులయ్యారు.
‘కళా సౌందర్యం’ చిత్రకళా వ్యాసాలు ఓ ప్రత్యేక పాఠకవర్గానికి చెందినవనే భ్రమ మనం వీడగలిగితే, ఈ వ్యాసాలు చదవటం ద్వారా మనం నిజ జీవితంలో కళ అంతర్భాగమై ఎలా ఉందో తెలుసుకునే అవకాశముంది.
చిత్రకళ మీద ఎల్, ఆర్, వెంకటరమణ ఆశ, ఆశయం వారి మాటల్లోనే… “సాహిత్యం, చిత్రకళ అన్నవి రెండు స్వరూప సాదృశ్యాలు. పాఠశాల స్థాయిలో భాషను గురువులు ఏ విధంగా నేర్పుతున్నారో అదే విధంగా చిత్రకళాచార్యులు తప్పనిసరిగా సాహిత్యం, చిత్రకళలను నేర్పాల్సి ఉంది. ఇవి నేర్చిననాడు ఒక మహోన్నత తరం తప్పక వెలుగు చూడగలుగుతుంది.” అంటారు. వారి ఆశయం సిద్ధించాలని కోరుకుందాం..
– ఆత్మకూరు రామకృష్ణ

ప్రతులకు : విశాలాంధ్ర మరియు అనేక ప్రగతిశీల పుస్తక కేంద్రాలలో, రచయిత చరవాణి: 98661 58908

SA: