హాస్యంలో ‘అల్లు’ వారి శైలి వేరు…

తెలుగు చిత్రసీమలో హాస్య నటులుగా ప్రఖ్యాతి చెందిన వాళ్లలో రేలంగి, రమణారెడ్డి కోవకు చెందిన నటులు అల్లు రామలింగయ్య. ఆయన తెరపై కనిపిస్తే చాలు.. ప్రేక్షకుల ముఖాలపై చిరునవ్వు కనిపించేది. తన చమత్కార అభినయంతో ఆయన నవ్వించేవారు, అలరించేవారు. తొలినాళ్లలో ఎక్కువగా నెగటివ్ షేడ్స్ ఉన్న కామెడీ కేరెక్టర్లలో తనదైన ప్రత్యేక శైలిలో నటించి, ప్రేక్షకుల హృదయాలపై చెరిగిపోని ముద్ర వేశారు. మిగతా నటులతో పోలిస్తే ఆయన బాడీ లాంగ్వేజ్ పూర్తి భిన్నం. ఆయన డైలాగ్ డిక్షనూ అంతే. తర్వాత కాలంలో పాజిటివ్ షేడ్స్ కామెడీ కేరెక్టర్లు చేసినా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించినా, ఆయన ముద్ర ఎప్పుడూ ప్రత్యేకమే. జూలై 31 ఆయన వర్ధంతి. ఈ సందర్భంగా ఆయనతో పనిచేసిన సీనియర్ డైరెక్టర్ రేలంగి నరసింహారావు జ్ఞాపకాలు…

ఆయన శైలి మరెవరికీ రాలేదు! మాది అల్లు రామలింగయ్య గారి ఊరే.. పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లు, పశ్చిమగోదావరి నుంచి అత్యద్భుతమైన కళాకారులు, సాంకేతిక నిపుణులు చిత్రరంగానికి వచ్చారు. మా పాలకొల్లు నుంచి అల్లు రామలింగయ్య గారు సినిమాల్లోకి వెళ్లి హాస్యనటులుగా పెద్ద పేరు తెచ్చుకున్నారని చిన్నతనంలో మాకు చాలా గర్వకారణంగా ఉండేది.
హాస్యంలో రామలింగయ్య గారిది ఒక శైలి. ఆ శైలిలో వేరేవాళ్లెవరూ చెయ్యలేరు. ఆయన శైలి ఇప్పటివరకూ ఎవరికీ రాలేదు, రాదు కూడా. ఆయన కేవలం కమెడియన్ కాదు.. చిన్న విలన్ పాత్రలు కూడా చేశారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా గొప్పగా రాణించారు. చిన్నదైనా, పెద్దదైనా తను చేసిన పాత్రలో ఆ విధంగా రాణించేవాళ్లు చాలా తక్కువమంది ఉంటారు. హాస్య నటనలో ఆయన స్థాపించిన ప్రమాణాల్లో ఇంకొకరు వస్తారని నేననుకోను.
నేను 1971లో సినీ ఫీల్డులో చేరాలని మద్రాసుకు వెళ్లాను. అప్పట్నుంచే ఆయనతో నాకు ప్రత్యక్ష పరిచయం. మా నాన్నగారు డాక్టర్. ఆయన రామలింగయ్య గారికి మిత్రులు. నన్ను ఆయనకు నాన్నగారే పరిచయం చేశారు. రామలింగయ్య గారు ఒక మంచి ఆర్టిస్టు మాత్రమే కాదు, ఒక మంచి డాక్టర్ కూడా. ఆయన హెూమియోపతి వైద్యానికి బాగా ప్రసిద్ధి. సెట్లో ఎవరికైనా బాగా లేదని తెలిస్తే, వాళ్లకు చక్కని మెడిసిన్ ఇచ్చి నయం చేసేవాళ్లు. చిన్నా, పెద్దా తేడా చూపకుండా అందరితోటీ కలుపుగోలుగా ఉండేవాళ్లు.
కేరెక్టర్లో లీనమైపోయి ఆయన చేసే నటన ఎవరికీ రాదు. ‘సీతాలూ వస్తావా.. అడిగిందీ ఇస్తావా..’ పాటలో ఆయన్ని చూస్తే, ఆయన హావభావాలు, బాడీ లాంగ్వేజ్ చూస్తే.. ఎంత బిగదీసుకుపోయేవాళ్లయినా నవ్వకుండా ఉండలేరు. ఆయన నటనను ఇమిటేట్ చెయ్యడం చాలా కష్టం. ఆయనలా చెయ్యాలని చాలామంది సినిమాల్లోనూ, స్టేజి మీదా చాలా ప్రయత్నించారు. కానీ ఎవరూ ఆయనను పూర్తిగా అనుకరించలేకపోయారు.
నా డైరెక్షన్లోనూ ఆయన “పరుగో పరుగు’, ‘ముచ్చటగా ముగ్గురు’, చలాకి మొగుడు చాదస్తపు పెళ్లాం’ వంటి కొన్ని సినిమాలు చేశారు. ఒక కళాకారుడిగా ఆయనలోని తపన చూసి ఆశ్చర్యపోయేవాడ్ని సాధారణంగా అంత పెద్ద వయసులో ఓపిగ్గా ఎవరూ చెయ్యలేరు. కానీ ఆఖరు వరకూ ఆ వయసులో కూడా ఆయన చేశారంటే కళాకారుడిగా ఆయనలోని నిబద్దతే కారణం. అది అద్భుతమని చెప్పాలి.
చిరంజీవి గారిని అల్లుడ్ని చేసుకోవడంలో ఆయన సెలక్షన్ ఎంత గొప్పదో అర్థమవుతుంది. అల్లుడ్ని చేసుకొనే సమయానికి చిరంజీవి గారు ఒక వర్ధమాన నటుడు. ఇంకా స్టార్ కాలేదు. అప్పటికే రామలింగయ్య గారు హాస్యనటులుగా ఎంతో ప్రఖ్యాతి పొందారు. సినిమా ఫీల్డులో అదృష్టం ఉంటే పైకొస్తారు, లేకపోతే లేదు. అన్ బ్యాలెన్స్ ఫీల్డ్. ఎవరు ఎంత కాలం ఈ ఫీల్డులో ఉంటారో, ఉండగలుగుతారో చెప్పలేం. అంటే ఎవరి కెరీర్ కూ గ్యారంటీ లేని ఫీల్డ్. అందుకని సినిమావాళ్లకి పిల్లనివ్వడానికి బయటివాళ్లు భయపడేవాళ్లు. అలాంటి కాలంలో చిరంజీవిని కళాత్మక దృష్టితో చూసి, ఆయన ప్రతిభని, మంచితనాన్ని, కష్టపడే తత్వాన్ని గుర్తించి తన కూతుర్నిచ్చి పెళ్లి చేశారు. తర్వాత కాలంలో రామలింగయ్య గారి అంచనా నిజమని నిరూపించారు చిరంజీవి గారు.
రామలింగయ్య గారి వర్ధంతి సందర్భంగా ఆయన్ను మరోసారి తలచుకొనేలా చేసినందుకు ’64కళలూ పత్రికకు నా ధన్యవాదాలు.
– రేలంగి నరసింహారావు, సీనియర్ డైరెక్టర్

SA:

View Comments (2)