200 వందల మంది కవులతో “పద్యమేవ జయతే”

తెలుగుభాషకి గుర్తింపు కరువు అనుకుంటున్న తరుణంలో ఇటివల ఆగస్ట్ 26 మరియు 27 తారీఖుల్లో పద్యానికి బ్రహ్మరథం పడుతూ దాదాపు 200 వందల మంది కవులు, కవయిత్రులు, సాహితీప్రియులు, అవధానులు, శతావధానులు, పద్యములో లబ్ధ ప్రతిష్ణులు, శతకకర్తలు, మరెందరో సాహిత్యం కోసం కృషిచేస్తున్న మహామహులవంటి తానా సాహిత్యవిభాగం అధ్యక్షులు డా. తోటకూర ప్రసాద్ గారు, తానా పశ్చిమోత్తర విభాగ కార్యదర్శి శ్రీనివాస అబ్బూరి గారు, సినీ దర్శకులు వీ.ఎన్. ఆదిత్య గారు, ప్రముఖ సంగీత దర్శకులు నేమాని పార్ధసారథి గారితో పాటు ఎంతోమంది పసిద్ధ పండితాళితో మహాసభలు జరిగాయి.
మంథని పద్య కూటమి పద్యగురువు కొల్లారపు ప్రకాశరావు శర్మ గారు మరియు అనంతచ్చందం కూటమి పద్యగురువు తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మగారు సంయుక్తంగా నిర్వహించిన ఈ “తెలుగు సాహిత్య గ్రంథోత్సవం” మహాసభ పద్యానికి కట్టిన బ్రహ్మోత్సవం అని చెప్పవచ్చు.

ఒక్క పుస్తకం ఆవిష్కరించడం గగనమనుకునే రోజుల్లో… ఈ రెండు రోజుల సభలో 35 శతకములు ఆవిష్కరింపబడటం విశేషం. అందులో పద్యశిక్షణ, పద్యకావ్యములు, భక్తి ముక్తి ప్రపత్తులతో అధ్యాతిక చింతన పెంపొందించే రచనలు ఉండటం ముదావహం. ఈ కవులలో 17 సంవత్సరముల శతావధాని భరతశర్మ గారి దగ్గరనుంచి 82 సంవత్సరముల మంథని రాజవరం హరికిషన్ గారు అదే ఉత్సాహంతో శతక రచన చేయటం గమనించదగ్గ విషయం. “పద్యమేవ జయతే” అన్న నినాదం అడుగడుగున మర్మోగింది. దాదాపు 70 మంది పైగా కవులు మరియు ఆవిష్కర్తలను ఘనంగా సన్మానించారు. కొన్ని శతకములకు “తెలుగు బుక్ అఫ్ రికార్డ్స్” కూడా గుర్తించి అదే వేదిక పై అవార్డ ప్రథానం చేయడం కూడా గమనించవచ్చు.

ఇదేగాక పద్య సాహిత్య రంగంలో కృషి చేస్తున్న తొమ్మిదిమంది ప్రముఖులకు పురస్కారాలు అందించబడ్డాయి.

  1. శ్రీ కొల్లారపు ప్రకాశరావు శర్మ గారు- సాహితీశ్రీ మరియు ‘ఛందో ద్రోణ’
  2. శ్రీ ముద్దు రాజయ్య గారు- ‘అవధాన భీష్మ’
  3. డా. తోటకూర ప్రసాద్ గారు-‘సాహిత్యార్ణవ సుధాకర’
  4. శ్రీ మిరియాల దిలీప్ గారు (చందం సాఫ్ట్వేర్)-‘ఛంద సాంకేతిక ప్రవర్తక’
  5. శ్రీ రంగి సత్యనారాయణ గారు –‘గీర్వాణ భాషా రసజ్ఞ’
  6. శ్రీ వేగరాజు శ్రీరామ్ గారు-‘సాహిత్య వదాన్య శేఖర’ & ‘ఛందః పద్య కవి శ్రేష్ఠ’
  7. శ్రీ కంది శంకరయ్య గారు-‘పద్య వశంకర’
  8. శ్రీ ఆత్రేయపురం పాండురంగ విఠల్ ప్రసాద్ గారు-‘కవి కుంజర’
  9. శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ-‘ఛందో బ్రహ్మ’

ఉభయ తెలుగు రాష్ట్రాలనుంచి అనేకమంది సాహితీప్రియులు వీక్షించగ, నిరంతర కరతాళధ్వనుల మధ్య హైదరాబాద్, ఎల్.బీ. నగర్, బైరామల్ గూడా హరిహర అయ్యప్ప దేవాలయం ప్రాంగణంలో చదువుల తల్లికి పద్య నీరాజనం జరిగింది.

“పద్యమేవ జయతే”

SA: