పద్మశ్రీ నేరెళ్ల వేణుమాధవ్

“పద్మశ్రీ నేరెళ్ల వేణుమాధవ్(85) మంగళవారం, జూన్ 19, 2018 కన్నుమూశారు. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన వరంగల్ లోని స్వగృహంలో ఉదయం తుదిశ్వాస విడిచారు. మిమిక్రీ వైతాళికుడికి 64కళలు.కాం సమర్పిస్తున్న అక్షరాంజలి.

వరంగల్ప ట్టణం లోని మట్టెవాడలో శ్రీహరి మరియు శ్రీలక్ష్మి దంపతులకు 1932 డిసెంబరు 28న జన్మించారు. తండ్రి గారు ప్రముఖ వ్యాపారవేత్త. సాహిత్యంలో మంచి అభినివేశం ఉండడం వల్ల, ఆ కాలంలో వరంగల్ పట్టణానికి వచ్చే ప్రముఖులందరికీ వారి ఇంట్లోనే ఆతిథ్యం ఇచ్చేవారు. అట్లా వీరింట్లో బస చేసిన వారిలో చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి, వావిలకొలను సుబ్బారావు, వడ్డాది సుబ్బారాయుడు, రాయప్రోలు సుబ్బారావు, శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి, కాశీ కృష్ణాచార్యులు, యర్రమిల్లి జగ్గన్న శాస్త్రి వంటి ఉద్ధండులున్నారు. వీరితో జరిగిన సాహితీ గోష్ఠుల ప్రభావం వేణుమాధవ్ గారి మీద పడింది. తన 8 వ ఏట లక్ష్మయ్య పంతులు గారి వద్ద అక్షరాభ్యాసం చేసి, రాఘవయ్య మాష్టారు గారి వద్ద కొంతకాలం ప్రైవేటుగా చదివి గవర్నమెంట్ స్కూల్లో 8వ తరగతిలో చేరి బోల్తా ఉభాయిదా (పెద్ద బాలశిక్ష) చదవడం ప్రారంభించారు. సినిమాలంటే ఎంతో ఇష్టం. ఆ కాలంలో వచ్చిన చిత్తూరు నాగయ్యగారి గృహలక్ష్మి, వందేమాతరం, దేవత, స్వర్గసీమ, పోతన, వేమనసినిమాలు చూసి నాగయ్య గారిమీద అభిమానం పెంచుకున్నారు. ఇవేకాకుండా వేమూరి గగ్గయ్య, మాధవపెద్ది వెంకట్రామయ్య గారలు నటించిన సినిమాలు చూసి, ఇంటికి రాగానే ఆ సినిమాల్లోని పాటలను, పద్యాలను యథాతథంగా అనుకరించి చూపేవారు. అలా మొదలయ్యింది వారి మిమిక్రీ ప్రస్థానం. ఏవీవీ (ఆంధ్ర విద్యాభివర్దిని) హైస్కూల్లో చదువుతున్నప్పుడు హరి రాధాకృష్ణ మూర్తి గారి శిష్యరికంలో చిలకమర్తి లక్ష్మీనరసింహం గారి ప్రహసనాల్లో నటించడం ద్వారా తన రంగస్థల జీవితానికి శ్రీకారం చుట్టారు. మిగతా గురువులు కందాళై శేషాచార్యులు గారు, యద్దనపూడి కోదండ రామశాస్త్రి గారు వీరి అభివృద్ధికి తోడ్పడ్డారు.

1953 లో ప్రభుత్వ పాఠశాల (జి సి ఎస్ స్కూలు హనుమకొండ) లో ఉపాధ్యాయుడుగా ప్రవేశించి, ధర్మ సాగరం, హనుమకొండలోని ప్రాక్టీసింగ్ స్కూలు, మట్వాడ ఉన్నత పాఠశాల, జనగామ మరియు శంభునిపేట పాఠశాలల్లో పనిచేశారు. అనంతరకాలంలో ప్రైవేటుగా బీ.ఏ. బీ. కాం. పాసయ్యారు. తొలి ప్రదర్శన 1947 లో ఇచ్చారు. చెప్పుకోదగిన మలి ప్రదర్శన 1953 లో రాజమండ్రిలో జరిగిన థియేటర్స్ ఫెడరేషన్ కాన్ఫరెన్స్ లో బలరాజ సహానీగారి అధ్యక్షతన, గరికపాటి రాజారావు, దాడి గోవిందరాజులు, స్థానం నరసింహారావు,చాగంటి సన్యాసిరాజు గారల సమక్షంలో ఇచ్చారు. తెనాలి పట్టణంలోని అభ్యుదయ భావాలున్న స్వాతంత్ర్య సమరయోధులు కొల్లా కాశీవిశ్వనాధం, తయారమ్మ దంపతుల కుమార్తె శోభావతి గారితో వీరి వివాహం 3-2-1957 న జరిగింది. దీనికి సంధాన కర్తగా వ్యవహరించిన వారు స్థానం నరసింహారావు గారు. వీరికి ఇద్దరు అబ్బాయిలు శ్రీనాథ్, రాధాకృష్ణ. ఇద్దరు అమ్మాయిలు లక్ష్మీతులసి, వాసంతి. | వేణుమాధవ్ గారితో సాన్నిహిత్యం ఉన్న ప్రముఖులు చిత్తూరు నాగయ్య,గుమ్మడి వెంకటేశ్వరరావు, అక్కినేని, జగ్గయ్య, ఘంటసాల, బి.ఎన్. రెడ్డి, దాశరథి, పీవీ నరసింహారావు,సి.నారాయణరెడ్డి, మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి, శివలెంక రాధాకృష్ణ, ఎల్లోరా, కె.వి.భాస్కరరావు, కపిల కాశీపతి, గుడిపూడి శ్రీహరి, ఇంటూరి వెంకటేశ్వర్రావు, సికరాజు, విద్వాన్ విశ్వం, పి.వి. రమణ, పొత్తూరి వెంకటేశ్వర్ రావు, నండూరి రామ్మోహన రావు, పురాణం సుబ్రహ్మణ్య శర్మ, పి.వి. రమణయ్యరాజా, కూచిమంచి సత్యసుబ్రహ్మణ్యం , గోరాశాస్త్రి, జి.ఎస్. వరదాచారి, రావి కొండలరావు, జ్యోతి (వేమూరి) రాఘవయ్య, స్థానం నరసింహారావు, దేవులపల్లి కృష్ణశాస్త్రి, సదాశివ బ్రహ్మం, మాధవపెద్ది గోఖలే, పింగళి నాగేంద్ర రావు, గోపాల చక్రవర్తి, చాట్ల శ్రీరాములు, ఎం. ఆర్. అప్పారావు, జలగం వెంగళరావు, ఎన్ టీ రామారావు మున్నగువారు. వీరి ప్రదర్శమనలను ప్రత్యక్షంగా వీక్షించిన ప్రముఖులు.

భారతరాష్ట్రపతులు-సర్వేపల్లి రాధాకృష్ణన్, వి.వి.గిరి, గ్యానీ జైల్ సింగ్, ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, నీలం సంజీవరెడ్డి బీ ఉపరాష్ట్రపతి – బి.డి జెట్టి బీ ప్రధానమంత్రులు – లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ, పీవీ నరసింహారావు : ముఖ్యమంత్రులు – దామోదరం సంజీవయ్య, కాసు బ్రహ్మానంద రెడ్డి, టి.అంజయ్య, ఎన్.టి.రామారావు, చంద్రబాబు నాయుడు, కేరళ ముఖ్యమంత్రి – ఇ.ఎం. ఎస్. నంబూద్రిపాద్ మరియు గవర్నర్లు – బూర్గుల రామకృష్ణారావు (కేరళ1958),శారదాముఖర్జీ, కుముద్ బెన్ జోషి, కృష్ణకాంత్, సి.రంగరాజన్. వీరికి ఆంధ్ర విశ్వవిద్యాలయం, 1977లో “కళాప్రపూర్ణ “జె.ఎన్.టి.యూ.సీ, 1987 లో, కాకతీయ విశ్వవిద్యాలయం 1992 లో గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశాయి. వీరికి తిరుపతి పట్టణంలో గజారోహణం, పొరసన్మానం జరిగాయి. వీరి బిరుదులు – ధ్వన్యనుకరణ సామ్రాట్, మిమిక్రీ సామ్రాట్, చుపే రుస్తుం ధ్వన్యనుకరణ చక్రవర్తి, కళాసరస్వతి, ధ్వన్యనుకరణ ప్రవీణ, ధ్వన్యనుకరణ కళానిధి, మిమిక్రీ రత్న, విశ్వవిఖ్యాత ధ్వన్యనుకరణ సార్వభౌమ మున్నగునవి. వీరు ‘నేరెళ్ళ వేణుమాధవ్ కల్చరల్ ట్రస్ట్’ ను స్థాపించి ప్రతియేటా తన పుట్టినరోజైన డిసెంబర్ 28న ప్రముఖ కళాకారులను పదివేల రూపాయల పురస్కారంతో సత్కరిస్తున్నారు. ఈ పురస్కారం పొందిన వారు – డా.కాశీభట్ల విశ్వనాథం (చిత్రలేఖనం 2002, ఎస్.కె.గౌడ్ (నాటకం) 2003, కవిశాబ్దిక కేసరి నల్లాన్ చక్రవర్తుల రఘునాధాచార్య (వేద పండితులు) 2004, జమ్మలమడక కృష్ణమూర్తి (నాటకం) 2005, ఉల్లి రామచంద్రయ్య (హిందుస్తానీ సంగీతం)2006, తిరుమలశెట్టి సీతాలత (నాటకం)2007, జానీలీవర్ (మిమిక్రీ) 2008, కోవెల సుప్రసన్నా చార్య (సాహిత్యం)2009, వి.హరికిషన్ (మిమిక్రీ) 2010, చుక్కా సత్తయ్య (ఒగ్గుకథ) 2011, వెలిదే హరిశంకర శాస్త్రి (హరికథ) తణుకు రాజ్యం (నాటకం) 2012. వీరి పేరిట హనుమకొండ పట్టణంలో నిర్మింపబడ్డ ‘డా.నేరెళ్ళ వేణుమాధవ్ గారి కళాప్రాంగణం ‘సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలకు చక్కని వేదికగా ఉపయోగపడుతున్నది. తన ప్రదర్శనలతో క్రమంగా ప్రసిద్ధుడయ్యాడు. ముఖ్యంగా ప్రసిద్ధులైన వ్యక్తులను, నాయకులను అనుకరించడంలో ఇతనికి పెట్టినది పేరు. ధ్వన్యనుకరణకు ఇతని వలన తెలుగునాట విశిష్టమైన ప్రాచుర్యం లభించింది. 2001లో ఇతనికి పద్మశ్రీపురస్కారం లభించింది. 1981లో శ్రీ రాజాలక్ష్మీ ఫౌండేషన్ బహుమతి లభించింది. ఇతని శిష్యులలో ప్రసిద్ధుడైన మరొక మిమిక్రీ కళాకారుడు హరికిషన్.”

Leave a Reply

Your email address will not be published.