2020లో సినిమాల వెల్లువ

గత రెండు మూడు సంవత్సరాలతో పోల్చితే 2019లో అత్యధికంగా 270 వరకూ స్ట్రయిట్, డబ్బింగ్ చిత్రాలు విడుదలయ్యాయి. విశేషం ఏమంటే, ఈ యేడాది సెట్సపై ఉన్న సినిమాలను చూస్తుంటే.. ఏకంగా 300 చిత్రాలకు చేరుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదనిపిస్తోంది. అంటే సగటున వారానికి ఐదు లేక ఆరు సినిమాలు విడుదలయ్యే ఆస్కారం ఉంది. ఈ లెక్కలు గాలివాటం కాదని జనవరి తొలివారంలో విడుదలవుతున్న చిత్రాలు చెప్పకనే చెబుతున్నాయి. పన్నెండు సినిమాల సందడి! జనవరి అంటే సంక్రాంతి సీజన్. అయితే… పండగ సమయంలో అగ్ర కథానాయకుల చిత్రాలు వస్తాయి కాబట్టి చిన్న చిత్రాలు, మీడియం బడ్జెట్ మూవీస్ సహజంగా జనవరి మొదటివారంలో జనం ముందుకు రావడం పరిపాటి. అయితే ఏకంగా ఈ యేడాది వాటి సంఖ్య 12 ఉండటం మాత్రం విశేషం అనే చెప్పాలి. జనవరి 1న రామ్ గోపాల్ వర్మ ప్రొడక్షన్ హౌస్ నుండి ‘బ్యూటిఫుల్’ చిత్రం వచ్చింది. దానితో పాటే అదే తారీఖున ఖోఖో నేపథ్యంలో రూపుదిద్దుకున్న ‘రథేరా’, నటుడు సత్యప్రకాశ్ దర్శకత్వం వహిస్తూ తన కుమారుడిని హీరోగా పరిచయం చేసిన ‘ఉల్లాల.. ఉల్లాల’, అనువాద చిత్రాలు ‘అతడే శ్రీమన్నారాయణ’, ‘తూటా’, ‘రాజా నరసింహా’ చిత్రాలు వచ్చాయి. ఇక ఈ యేడాది తొలి శుక్రవారం కూడా అనువాద చిత్రం ‘బూమరాంగ్’తో పాటు ‘హల్చల్, ఉత్తర, కళాకారుడు, నమస్తే నేస్తమా, వైఫై’ చిత్రాలు విడుదల అవుతున్నాయి. దాంతో ఈ యేడాది తొలివారం మొత్తంగా పన్నెండు సినిమాలు జనం ముందుకు వచ్చినట్టు!

సంక్రాంతి బరిలో నువ్వా – నేనా! .
ఈ యేడాది సంక్రాంతి సీజన్ సైతం ఆసక్తికరంగా మారింది. రజనీకాంత్ – మురగదాస్ కాంబినేషన్లో రూపుదిద్దుకున్న ‘దర్బార్’ మూవీతో ఈసారి పండగ మొదలు కాబోతోంది. ఆ వెనుకే మహేశ్ బాబు కొత్త సినిమా ‘సరిలేరు నీకెవ్వరూ’ వస్తోంది. అనిల్ రావిపూడి తోనే కాదు కథానాయిక రష్మిక మందన్నతోనూ మహేశ్ తొలిసారి నటిస్తున్నాడు. మిలటరీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో విజయశాంతి రీ ఎంట్రీ ఇస్తుండటం విశేషం. ఇక ‘జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాల తర్వాత అల్లు అర్జున్, త్రివిక్రమ్ కలిసి వర్క్ చేసిన ‘అల వైకుంఠపురం’ జనవరి 12న వస్తోంది. దీని వెనుకే నందమూరి కళ్యాణ్ రామ్ ‘ఎంతమంచి వాడవురా’ 15వ తేదీ” విడుదల కాబోతోంది. కథల పరంగా నాలుగు సినిమాలూ వైవిధ్యమైనవే అయినా… ఒకదాని విజయ ప్రభావం మరోదానిపై ఉండటం ఖాయం. 2020 క్రేజీ ప్రాజెక్ట్స్ ఈ యేడాది ఆసక్తికరమైన సినిమాలు అనేకం తెలుగువారిని పలుకరించబోతున్నాయి. అందులో ముందుగా చెప్పుకోవాల్సింది ‘ఆర్.ఆర్.ఆర్.’ మూవీ గురించి. ‘ బాహుబలి’ తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇటు కొమరంభీమ్, అటు అల్లూరి సీతారామరాజు పాత్రల నుండి స్ఫూర్తి పొందిన పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమా ఈ యేడాది ప్రధమార్గం చివరలో రాబోతోంది. ఇక మొన్న ‘సైరా’తో మెప్పించిన చిరంజీవి ఈ యేడాది మాత్రం కొరటాల శివ దర్శకత్వంలో ఓ సోషల్ మూవీలో చేస్తున్నారు. ఇందులో ఆయన సరసన త్రిష నటిస్తోంది. ఇక ‘సింహా, లెజెండ్’ వంటి బ్లాక్ బస్టరు బాలకృష్ణకు ఇచ్చిన బోయపాటి శ్రీను బాలకృష్ణతోనే మూడో సినిమాను ఇటీవల ప్రారంభించాడు. అలానే ఈ యేడాది ‘మన్మథుడు -2’తో అభిమానులను నిరాశ పర్చిన నాగార్జున మేకోవర్ అయి ‘వైల్డ్ డాగ్’ అనే కాప్ మూవీతో రాబోతున్నాడు. మరో సీనియర్ హీరో వెంకటేశ్ తమిళ చిత్రం ‘అసురన్’ రీమేక్ లో నటించబోతున్నాడు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన తర్వాత సినిమాలకు కాస్తంత దూరంగా ఉన్న పవన్ కల్యాణ్ ‘పింక్’ రీమేక్ లో నటించనున్నాడు. ఈ విషయంలో అధికారిక వార్త రాకున్నా… సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ అయితే మొదలయ్యాయి. ఇక పాన్ ఇండియా మూవీ స్టార్ ప్రభాస్ ఈ యేడాది ‘ జాన్’గా జనం ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు.
అలానే లేడీ ఓరియంటెండ్ ప్రాజెక్ట్ లో చెప్పుకోవాల్సినవి అనుష్క ‘నిశ్శబ్దం’, కీర్తిసురేశ్ ‘డ్రీమ్ గర్ల్’, సమంత ’96’ చిత్రాలు ఉన్నాయి. ఇక రవితేజ ‘డిస్కోరాజా’, నాగశౌర్య ‘అశ్వత్థామ’, నాని, సుధీర్ బాబు ‘వి’, రానా ‘విరాట పర్వం 1992’, విజయ్ దేవరకొండ ‘వరల్డ్ ఫేమస్ లవర్’, నితిన్ ‘భీష్మ, రంగ్ దే’, వరుణ్ తేజ్ ‘సోలో బతుకే సో బెటర్’, నాగచైతన్య శేఖర్ కమ్ములతో తన అదృష్టం పరీక్షించుకోబోతున్నారు. ఇలా ఈ యేడాది ఆసక్తికరమైన చిత్రాలు ఎన్నో తెలుగువారి ముందుకు రాబోతున్నాయి. మరి వీటిలో వైవిధ్యానికి పెద్ద పీట వేసి, జనం మదిలో ఏయే సినిమాలు చోటు దక్కించుకుంటాయో చూడాలి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap