30 ఇయర్స్ గుర్తుండేలా… పృథ్వీరాజ్

“తిరుమల కొండకు రావడమే గొప్ప అదృష్టం. అలాంటిది శ్రీ వేంకటేశ్వర భక్తి చానెల్ (ఎస్వీబీసీ) చైర్మన్గా నియమితుడవడం నా జీవితానికి ఓ అద్భుతమైన వరం. ప్రపంచంలోనే నా అంత అదృష్టవంతుడు ఎవరూ ఉండరు” అంటూ సినీనటుడు పృథ్వీరాజ్ ’64కళలు.కాం’తో చెప్పారు. శనివారం (27-07-2019) శ్రీవారి మెట్టు మార్గం ద్వారా కాలినడకన తిరుమలకు వెళ్లి స్వామివారి ఆశీస్సులు తీసుకుని ఎస్వీబీసీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన శుభ సందర్భంగా పృథ్వీరాజ్ పంచుకున్న విశేషాలు… ఆయన మాటల్లోనే..
ఇది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా, కోట్లాదిమంది శ్రీవారి భక్తుల్లో నాకే ఈ అవకాశం రావడం స్వామివారి కృప. ప్రతిభకు, పారద్మకతకు పట్టం కట్టి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఏకగ్రీవంగా నాకు బాధ్యతలను అప్పగించారు. ఇదంతా స్వామివారి దయ.
నా తక్షణ కర్తవ్యం :
ఎస్వీబీసీలో గతంలో జరిగిన అవకతవకలపై దృష్టి సారిస్తా, స్వామివారికి చెందినవన్నీ.. ఆయనకే దక్కాలి. అవి మిస్ యూజ్ అయితే నేను సహించను. అలాంటి వాటిని ఎంకరేజ్ చేయను. ప్రపంచంలో ఉన్న కోట్లాది మంది స్వామివారి భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా మంచి కార్యక్రమాలతో ముందుకు తీసుకువెళ్తా, బోర్డు మీటింగ్ ఏర్పాటు అనంతరం గతంలో జరిగిన అక్రమాలపై నిజనిర్ధారణ కమిటీ వేస్తాం. అలాంటివి ఏవైనా జరిగాయని తెలిస్తే ఉపేక్షించేది లేదు. ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరిస్తాం.
నూతన గాయకులకు అవకాశమిస్తాం:
ఎస్వీబీసీ ఛానెల్ ను ఎక్కువ మంది భక్తులు చూసేలా వివిధ రకాల కార్యక్రమాలను రూపొందిస్తాం. అద్భుతమైన అన్నమయ్య కీర్తనలు ఎన్నో ఉన్నాయి. ఇప్పటివరకు ప్రాచుర్యంలోకి రాని వాటన్నింటినీ బయటకు తీస్తాం. అలాగే స్వామివారి జీవిత చరిత్రలో అనేక ఘట్టాలు ఉన్నాయి. వాటిని కూడా భక్తులకు అందిస్తాం. అలాగే అన్నమయ్య సంకీర్తనలు పాడే నూతన గాయకులకు అవకాశం కల్పిస్తాం.
30 ఇయర్స్ గుర్తుండేలా..
“30 ఇయర్స్ ఇండస్ట్రీ’ అనే నా డైలాగ్ ఎంత ఫేమస్ అయ్యిందో అంతలా ఎస్వీబీసీని కూడా 30 ఏళ్ల పాటు చెప్పుకునేలా అభివృద్ది చేస్తా. ఎస్వీబీసీని అత్యంత భక్తిభావంతో గాడిలో పెడతా. ప్రస్తుతం చానల్ లో పనిచేస్తున్నవారిని కుటుంబ సభ్యులుగా కలుపుకుని పనిచేస్తా.
సీఎం జగన్ కు జీవితాంతం రుణపడి ఉంటా:
పార్టీలో ఒక కార్యకర్తగా నేను పడ్డ కష్టాన్ని గుర్తించి నాకు ఇంత గొప్ప బాధ్యతను అప్పగించిన మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, నా రాజకీయ గురువులైన విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి గార్లకు జీవితాంతం రుణపడి ఉంటా. అలాగే నన్ను అభిమానించే మా పార్టీ కార్యకర్తలందరికీ రుణపడి ఉంటా.
శ్రీవారి సన్నిధిలో రాజకీయాలు మాట్లాడను:
నేను ఎస్వీబీసీ చైర్మన్ పదవితో పాటు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కూడా ఉన్నా, అయినా తిరమల సన్నిధిలో ఉన్నంతవరకు ఎలాంటి రాజకీయాలు మాట్లాడను. ఒక భక్తుడిలా స్వామివారికి సేవ చేసుకుంటా. కులమతాలకు అతీతంగా, నిస్పక్షపాతంగా అద్భుతమైన ప్రగతిని చూపించా లనే ఉద్దేశంతోనే పనిచేస్తాను.
సినిమా ఛాన్సులు వదులుకోను:
స్వామివారి సేవలో ఉండడం వల్ల సినిమా ఛాన్సులు మిస్ అయ్యే అవకాశమేమీ ఉండదు. నాకు జీవితాన్నిచ్చిన చిత్రపరిశ్రమ నుంచి ఎలాంటి ఛాన్స్ వచ్చినా వదులుకోను. ఓ వైపు స్వామివారి సేవ చేస్తూనే మరోవైపు సినిమాలు కూడా చేస్తా, నా వెన్నంటే ఉండే నా తమ్ముడు శ్రీధర్ సీపాన మంచి రచయిత, దర్శకుడు. నా కోసం మంచి పాత్రలు రాస్తున్నాడు. నాకోసం పాత్రలు రాసే చాలామంది రచయితలు, దర్శకులు ఉన్నారు. కాబట్టి నేను దేనికీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నా డేట్లు, మా స్వామివారి సేవా డేట్లకు అనుగుణంగా నా సినీ . భవిష్యత్తును మలచుకుంటాను. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవిగారి ‘సైరా’ సినిమాలో చేస్తున్నా. శ్రీధర్ సీపాన సినిమాతో పాటు ఫైటోమాస్టర్స్ రామ్లక్ష్మణ్ గార్ల మేనల్లుడు స్వరాజ్ గారి సినిమా కూడా చేస్తున్నా ‘లౌక్యం’ దర్శకుడు శ్రీవాస్ గారి సినిమాలో అద్భుతమైన పాత్ర చేస్తున్నా. మొత్తంగా సినీ కెరీర్ అన్ని రకాలుగా బాగుంది.
– ఎస్.కె.

1 thought on “30 ఇయర్స్ గుర్తుండేలా… పృథ్వీరాజ్

Leave a Reply

Your email address will not be published.

Share via
Copy link