విజయవాడ స్వరాజ్య మైదానంలో పుస్తక ప్రదర్శన
జనవరి 03 నుంచి 12వ తేదీ వరకూ నిర్వహణ
ఈ సంవత్సరం 270 స్టాళ్లు ఏర్పాటు
విజయవాడలో ఏటా సంక్రాంతికి ముందే వచ్చే పెద్ద పండగ రేపటి నుంచి ఆరంభం కాబోతోంది. 31వ విజయవాడ పుస్తక మహోత్సవం జనవరి 03 నుంచి 12వ తేదీ వరకూ నిర్వహించనున్నారు. పుస్తకాలకు పట్టం కట్టే ఈ వేడుక నిరంతరాయంగా గత మూడు దశాబ్దాలుగా బెజవాడ స్వరాజ్య మైదానంలో జరుగుతోంది. స్వరాజ్య మైదానం మొత్తం పుస్తక మహోత్సవం కోసం ఈ ఏడాది వినియోగిస్తున్నారు. ఎల్ ఆకారంలో స్టాల్స్ ఉంటాయి. లోపలికి ప్రవేశించేందుకు, బయటకి వచ్చేందుకు రెండు మార్గాలను ఏర్పాటు చేశారు. స్టేట్ గెస్ట్ హౌస్ వైపు ప్రధాన మార్గం, రైతుబజార్ వైపు రెండో మార్గం ఉంది. పుస్తక ప్రియులు ఏ మార్గం నుంచి ప్రవేశించినా మొత్తం స్టాల్స్ అన్నీ సందర్శించి వచ్చేలా చర్యలు తీసుకున్నారు.
పుస్తక మహోత్సవ కమిటీ ..
31 ఏళ్ల పాటు నిరంతరాయంగా ప్రదర్శన దిగ్విజయంగా నిర్వహించడం వెనుక పుస్తక మహోత్సవ సంఘం పాత్ర కీలకమైనది. ఈ ఏడాది కూడా వేడుకను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పుస్తక మహోత్సవ సంఘం గౌరవాధ్యక్షుడిగా బెల్లపు బాబ్జీ, అధ్యక్షుడిగా కె.లక్ష్మయ్య, కార్యదర్శిగా ఎస్.వెంకటనారాయణ, సంయుక్త కార్యదర్శిగా మనోహరనాయుడు, ఉపాధ్యక్షుడిగా సాయిరాం, కోశాధికారిగా కె.రవి ప్రస్తుతం వ్యవహరిస్తున్నారు.
పుస్తక మహోత్సవంలో ఈ ఏడాది 270 స్టాళ్లు ఉంటాయి. స్వరాజ్య మైదానం మొత్తం ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో స్టాల్‌ను 10/9 విస్తీర్ణంలో ఉంటుంది. పది రోజుల ప్రదర్శనకు గాను తెలుగు స్టాల్‌కు రూ.9 వేలు, ఆంగ్ల పుస్తకాల స్టాల్‌కు రూ.20 వేలు అద్దెగా నిర్ణయించారు. స్టాళ్లలో కేజీ నుంచి పీజీ వరకూ పుస్తకాలు అందుబాటులో ఉంచుతున్నారు. పిల్లలకు సంబంధించిన భారతం, రామాయణం, భగవద్గీత, కథల పుస్తకాలు, పంచతంత్రం వంటివి ఈ ఏడాది అధికంగా ఉండబోతున్నాయి. తెలుగు, ఆంగ్లం నవలలు, ఇంజినీరింగ్, మెడికల్, ఆధ్యాత్మిక పుస్తకాలు సహా అన్ని రకాలూ ఉంటాయి. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ పుస్తక విక్రేతలు, ప్రచురణ కర్తలు తరలివచ్చి స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు.
10 శాతం రాయితీ:
ప్రదర్శనలో ఉండే ప్రతి స్టాల్‌లోనూ ప్రతి పుస్తకంపైనా తప్పనిసరిగా 10 శాతం రాయితీ ఇస్తున్నారు. పుస్తక మహోత్సవం నిబంధన ప్రకారం ప్రతి పుస్తకంపైనా రాయితీ ఉంటుంది. ప్రదర్శనకు వచ్చే వారందరికీ ప్రవేశం ఉచితం.
విజయవాడ పుస్తక మహోత్సవం ఏటా జనవరి 01 నుంచి 11 వరకూ నిర్వహించేవారు. అయితే ఈ సంవత్సరం నుంచి తేదీలను కొద్దిగా మార్చారు. హైదరాబాద్ పుస్తక ప్రదర్శన నిర్వాహకులు ఈ ఏడాది నుంచి తేదీలను మార్చారు. డిసెంబర్ నెలలో ముగిసే హైదరాబాద్ పుస్తక మహోత్సవం ఈ ఏడాది జనవరి 01 వరకూ కొనసాగింది. ప్రచురణ సంస్థలు, పుస్తక విక్రేతలు అక్కడి ప్రదర్శనలో స్టాళ్లను ఏర్పాటు చేసుకున్నారు. అందుకే.. విజయవాడ పుస్తక మహోత్సవం తేదీలను మార్చారు. హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చేందుకు, ఏర్పాట్లకు రెండు రోజుల సమయం సరిపోతుంది కనుక 3వ తేదీ నుంచి ఏర్పాటు చేశారు. ఏటా 11 రోజులు జరిగే పుస్తక మహోత్సవం ఈ ఏడాది మాత్రం పది రోజులు నిర్వహిస్తున్నారు.
రోజూ మధ్యాహ్నం 2 గంటల నుంచి..
ప్రతి రోజూ మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ ప్రదర్శన నిర్వహిస్తారు. రాష్ట్రంలోనే అత్యంత ఆదరణ పొందిన పుస్తక మహోత్సవం ఇది. చుట్టుపక్కల చాలా జిల్లాల నుంచి పుస్తక ప్రియులు వచ్చి కొనుగోలు చేస్తుంటారు. పది రోజుల్లో కనీసం పది లక్షల మంది పుస్తకప్రియులు ఏటా వచ్చి సందర్శించి వెళుతుంటారు. పెద్ద సంఖ్యలో పుస్తకాల కొనుగోళ్లు జరుగుతుంటాయి. ఏడాదంతా డబ్బులు దాచుకుని మరీ వచ్చి పుస్తక మహోత్సవంలో కొనుగోలు చేసేవారున్నారు. చాలా విద్యాలయాల నిర్వాహకులు తమ గ్రంథాలయాలకు అవసరమైన పుస్తకాలను ఏడాదికోసారి ఇక్కడే కొనుగోలు చేస్తుంటారు.
బెల్లపు రమేష్ ప్రాంగణం:
ఈ ఏడాది పుస్తక ప్రదర్శన ప్రాంగణానికి బెల్లపు రమేష్ పేరు పెట్టారు. గుంటూరు న్యూస్టూడెంట్ బుక్స్ సెంటర్ వ్యవస్థాపకుడు రమేష్ గత ఏడాది చనిపోయారు. ఆయన సంస్మరణకు గుర్తుగా ప్రాంగణానికి పేరు పెట్టారు.
రాఘవాచారి సాహిత్య వేదిక:
ప్రధాన సాహిత్య వేదికకు సి.రాఘవాచారి పేరు పెట్టారు. ప్రముఖ రచయిత, రచయిత్రల పేర్లు సాహితీ వేదికకు పెడుతుంటారు. సీనియర్ పాత్రికేయుడు, రచయిత రాఘవాచారి గత ఏడాది చనిపోవడంతో.. ఆయన పేరు పెట్టారు. ఈ వేదికపై పుస్తకాల ఆవిష్కరణలు, శత జయంతి సభలు, చర్చాగోష్ఠులు, రాఘవాచారి సంస్కరణ సభ, నవోదయ రామ్మోహన్‌రావు, బెల్లపు రమేష్ సంస్కరణ సభలు జరుగుతాయి.
హేమ పరిమి ప్రతిభా వేదిక:
ప్రాంగణంలో ఉండే ప్రతిభా వేదికకు డాక్టర్ హేమ పరిమి పేరు పెట్టారు. హేమ పరిమి గత ఏడాది చనిపోయారు. పిల్లలకు సంబంధించిన ప్రదర్శనలు, క్విజ్, జస్ట్ ఏ మినిట్ వంటివి ప్రతిభా వేదికపై జరుగుతుంటాయి. 4వ తేదీ నుంచి 11 వరకూ ఈ వేదికపై కార్యక్రమాలను నిర్వహిస్తారు.
పుస్తక ప్రియుల పాదయాత్ర:
ఏటా మాదిరిగా ఈ సారి కూడా పుస్తక ప్రియుల పాదయాత్రను నిర్వహిస్తున్నారు. పుస్తక పఠనం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించేందుకు ఈ పాదయాత్ర చేస్తారు. జనవరి 7న సాయంత్రం 4 గంటలకు పాదయాత్ర ఉంటుంది. విజయవాడ ప్రెస్‌క్లబ్ నుంచి అలంకార్ సెంటర్ మీదుగా ఏలూరు రోడ్డు, విజయా టాకీస్, నక్కల రోడ్డు మీదుగా.. పుస్తక మహోత్సవ ప్రాంగణానికి పాదయాత్ర చేరుకుంటుంది. సాహితీ ప్రముఖులు, పుస్తక ప్రియులు పాల్గొని.. జనానికి పుస్తక పఠనంపై అవగాహన పెంచడంలో భాగంగా ఈ పాదయాత్రను ఏటా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.