2019 డిసెంబరు 27, 28, 29 శుక్ర, శని, ఆదివారాలలో మూడు రోజుల పాటు పి. బి. సిద్ధార్థ డిగ్రీ కళాశాల సభాప్రాంగణం, సిద్ధార్థ నగర్, విజయవాడ – 520 010, ఆంధ్రప్రదేశ్
ప్రపంచ తెలుగు రచయితల సంఘం ఆవిర్భావం 2007 విజయవాడలో కృష్ణాజిల్లా రచయితల సంఘం నిర్వహించిన ప్రపంచ తెలుగు రచయితల ప్రధమ మహాసభలలో ప్రపంచస్థాయి కలిగిన ఒక తెలుగు రచయితల సంఘాన్ని నిర్మించి, నిర్వహించే బాధ్యతలను కృష్ణాజిల్లా రచయితల సంఘానికి అప్పగిస్తూ చేసిన ఏకగ్రీవ తీర్మానం ద్వారా ప్రపంచ తెలుగు రచయితల సంఘం ఏర్పడింది. 2011 రెండవ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలలో ప్రపంచ తెలుగు రచయితల సంఘం” ఏర్పాటుకు ఆమోదం తెలుపుతూ ఏకగ్రీవంగా తీర్మానించారు. 2015లో ప్రపంచ తెలుగు రచయితల సంఘం మరియు కృష్ణాజిల్లా రచయితల సంఘం సంయుక్తాధ్వర్యంలో ఒక కార్యనిర్వాహక మండలి ఏర్పడి విజయవాడలో మూడవ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలను ఘనంగా నిర్వహించింది. ఈ మహాసభలలో ప్రపంచ తెలుగు రచయితల సంఘాన్ని తాత్కాలిక కార్యవర్గంతో రిజిష్టర్ చేయించే బాధ్యతను కృష్ణాజిల్లా రచయితల సంఘానికి అప్పగిస్తూ తీర్మానించారు.
2019లో ప్రపంచ తెలుగు రచయితల సంఘం నిర్మాణం కోసం తాత్కాలిక కార్యవర్గంతో విజయవాడలో రిజిస్టేషన్ చేయించటం జరిగింది, రేపటి మహాసభల నాటికి ప్రపంచ తెలుగు రచయితల సంఘం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సభ్యులతో, సంపూర్ణ కార్యవర్గంతో అంతర్జాతీయ సంస్థగా రూపుదిద్దుకోగలదని ఆకాంక్షిస్తున్నాము, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు రచయితలు, తెలుగు భాషాభిమానులను సమైక్యపరచటం ద్వారా తెలుగు భాష, సంస్కృతులను, సాహిత్యాన్ని విశ్వవ్యాపితం చేయటం “ప్రపంచ తెలుగు రచయితల సంఘం” లక్ష్యం, తెలుగు భాష, సంస్కృతుల ప్రాచీనతను నిరూపించే చారిత్రక పరిశోధనలను ప్రోత్సహించటం, తాజా పరిశోధనల సారాంశాన్ని తెలుగు ప్రజలకు అందించటం ద్వారా తెలుగుపట్ల జనానురక్తినీ పెంపుచేసే కృషిలో ఈ సంస్థ భాగస్వామ్యం అవుతుంది,
ఇది ప్రపంచంలోని అన్ని ప్రాంతాలలోనూ నివసిస్తున్న సాహిత్యాభిమానులైన తెలుగువారి సంస్థగా నిలవాలని మా కోరిక, అన్ని తెలుగు సాహిత్య ప్రక్రియలకూ ఈ సంస్థ సమప్రాధాన్యమిస్తుంది. తెలుగును ప్రపంచ తెలుగుగా తీర్చి దిద్దుకునే కృషిలో అందరం భాగస్వాములం కావాలని ఆకాంక్షిస్తున్నాం. మీకు స్వాగతం పలుకుతున్నాం. సభ్యులుగా చేరటం ద్వారా ఈ అంతర్జాతీయ వేదిక నిర్మాణంలో సహకరించ ప్రార్థన. 4వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభల కార్యక్రమం.
జాతీయ తెలుగు ప్రముఖులు, వివిథ భాషల్లో జ్ఞానపీఠ పురస్కార గ్రహీతలు, ప్రసిద్ధ సాహితీవేత్తలు, పాత్రికేయ ప్రముఖులు ఇంకా అనేక మందిని ఈ మహాసభలకు ఆహ్వానిస్తున్నాం. కవులు, కథకులు, నాటక రచయితలు కళాకారులు, వివిధ రంగాలకు చెందిన భాషాభిమానులైన ప్రతీ ఒక్కరినీ పేరుపేరునా ఆహ్వానిస్తున్నాం. సానుకూలంగా స్పందించ ప్రార్ధన. ఇది మన కార్యక్రమం, అందరం కలిసి ఒక గురుతర బాధ్యత వహిస్తున్నామని భావించి స్వచ్ఛందంగా ప్రతినిధిగా నమోదు కావలసిందని విజ్ఞప్తి.
మహాసభల ప్రతినిధులతో కవిసమ్మేళనాలు, ఇతర సాహిత్య కార్యక్రమాలు ఉంటాయి. మహాసభలలో ప్రతినిధులుగా నమోదయిన వారికి ప్రసంగాలు, పత్ర సమర్పణలలో ప్రధమ ప్రాధాన్యం ఉంటుందని మనవి.
ఈ మహాసభల కోసం ప్రత్యేకంగా ప్రపంచతెలుగు’ వ్యాస సంపుటి వెలువరిస్తున్నాం, సభా వేదికపైన వీలైన సమయంలో రచయితలు తమ రచనలను ఆవిష్కరింప చేసుకునే అవకాశం కూడా కల్పిస్తున్నాం.
ప్రతినిధులకు సూచనలు :
‘2019 డిసెంబరు 27, 28, 29 తేదీలలో విజయవాడలో జరిగే 4వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభల కోసం రూ. 500/- చెల్లించి ప్రతినిధులుగా నమోదు కావలసిందిగా కోర్తున్నాం. ప్రతినిధి రుసుము, సభ్యత్వ రుసుములను నేరుగా బ్యాంకులో ఆన్ లైన్ ద్వారా చెల్లించవచ్చు. బ్యాంకు వివరాలు : డిడిలను Prapancha Telugu Rachayitala Sangham పేర, విజయవాడలో చెల్లించే విధంగా తీసుకోవాలి. చెక్కులను ప్రపంచ తెలుగు రచయితల సంఘం పేరున వ్రాయాలి, యం, ఓ,లు పంపవద్దు,
దయచేసి మీ సమాచారాన్ని పోష్టుద్వారా, లేదా ఇ-మెయిల్ ద్వారా మాత్రమే పంపండి. వాట్సాప్, ఫేస్ బుక్, ఎస్సెమ్మెస్ మొదలైన ఇతర సామాజిక మాధ్యమాల్లో పంపవద్దని మనవి. దీదిలను, చెక్కులను పంపవలసిన చిరునామా : కార్యదర్శి, ప్రపంచ తెలుగు రచయితల సంఘం 1వ అంతస్తు, సత్నాం టవర్స్, ఐకింగ్హాం పేట పోస్టాఫీసు ఎదురుగా, గవర్నర్ పేట, విజయవాడ- 520002,