‘ఈనాడు’తో 40 యేళ్ళ అనుబంధం – శ్రీధర్

శ్రీధర్ తెలుగు దిన పత్రికలలో పొలిటికల్ కార్టూనిస్టు అవసరాన్నే కాదు, కార్టూన్ల ప్రాముఖ్యాన్ని పెంచి, నాలుగు దశాబ్దాలుగా ‘ఈనాడు’ దినపత్రికలో కార్టూన్లు గీస్తూ లక్షలాది పాఠకులను తన కార్టూన్లతో అలరిస్తున్న కార్టూనిస్టు శ్రీధర్. 1979లో ‘సితార’ సినిమా పత్రికకు లే అవుట్ ఆర్టిస్టుగా ఉద్యోగంలో చేరి ‘సితార’, ‘విపుల’లలో కార్టూన్లు గీసి రామోజీరావు గారి దృష్టిలో పడి వారి ప్రోత్సాహంతో 1981 నుండి ఈనాడు దినపత్రికకు పాకెట్ కార్టూన్లు వేయడం ప్రారంభించారు. అందుకే “నన్ను కార్టూనిస్టును చేసింది రామోజీరావు గారే అంటారు శ్రీధర్”.  ది. 11 మే 2019 నాటికి నలబైయేళ్ళ పాటు ఒకే పత్రికలో కార్టూన్లు గీసి సరికొత్త రికార్డ్ నెలకొల్పారు.

నల్గొండ జిల్లాలో పుట్టిన శ్రీధర్, పొలిటికల్ సైన్స్లో ఎం.ఏ. చేశారు. వీరి పూర్తి పేరు శ్రీధర్ రావు. డేవిడ్లో, శంకర్, ఆర్.కె. లక్ష్మణ్ నా అభిమాన కార్టూనిస్టులని, లక్ష్మణ్ ప్రభావం తన బొమ్మలపై విశేషంగా ఉందని చెప్పుకుంటారు. ప్రతిష్టాత్మక బెల్జియం కార్టూన్ ఉత్సవంలో ప్రదర్శనకు మూడేళ్ళు శ్రీధర్ కార్టూన్లు ఎంపిక కాబడి 2002 సం. లో బెల్జియంకు ఆహ్వానించబడ్డారు.
‘ఈనాడు’ డైలీ పేపరులో ‘ఇదీ సంగతీ పేరుతో పాకెట్ కార్టూన్లు, ‘ఈనాడు’ ఆదివారం మేగజైన్ లో ‘చురుక్కు-చమక్కూ పేరుతో 1988 నుండి 32 సంవత్సరాలుగా పూర్తి పేజీ కార్టూన్లు గీస్తున్నారు. ఇందులో దైనందిన రాష్ట్ర రాజకీయాలపై ఒకటి, ప్రపంచ రాజకీయాలపై మీద మరొకటి ఇలా విశ్వాన్నతా నాలుగు కార్టూన్లతో ఒక్క పేజీలో మన కందిస్తున్నారు శ్రీధర్. వీరి కార్టూన్లలో కొన్నింటిని ‘శ్రీధర్ కార్టూన్లు’ పేరుతో ఈనాడు వారు పుస్తకంగా ప్రచురించారు. కేవలం కార్టూన్లే కాదు, ప్రముఖుల కేరికేచర్లు, ఎన్నో కథలకు బొమ్మలు గీసిన వీరు – ఈనాడు ‘వేసవి వినోదం’ ఫీచర్లో పిల్లలు డ్రాయింగ్ నేర్చుకునేందుకు రాసిన పాఠాలు విశేష పాఠకాదరణ పొందాయి. నవ్యించే కార్టూన్ల వెనుక ఎంతటి ప్రయాస వుంటుందో 1991 నాటి ఎన్నికల సందర్భాన్ని గుర్తు చేసుకుంటారు శ్రీధర్.” రాజీవ్ గాంధీ శ్రీపెరుంబుదూరు ఎన్నికల ప్రచారానికెళ్ళినప్పుడు ఆయన హత్య జరిగింది. అప్పటికే అచ్చయిపోయిన ‘ఈనాడు’ ఆదివారం మేగజైన్ లో రాజీవ్ పై రెండు కార్టూన్లు వున్నాయి. చనిపోయిన వ్యక్తిపై కార్టూన్లు రావటం సంస్కారం కాదని ‘ఈనాడు’ సిబ్బందంతా రెండు రోజులపాటు కూర్చోని లక్షలాది కాపీల్లో ఆ కార్టూన్లని కత్తిరించారు”. కార్టూన్లు ఎలా నవ్యిస్తాయో అలాగే ఉత్పాతాలనీ సృష్టిస్తాయి అనడానికి ఇదో ఉదాహరణ మాత్రమే.
సెన్సాఫ్ హూమర్ అనేది మన రక్తంలో ఉంది, మన సాహిత్యంలో ఉంది, మన నిత్య జీవితంలో ఉంది. ఆ సెన్సాఫ్ హూమరే కార్టూనిస్టును ఆదరిస్తుందంటున్న శ్రీధర్ కార్టూన్ సరదాగా నవ్వుకోవటానికే కాదు, సీరియస్గా ఆలోచించటానికి కూడా ఉపకరిస్తుందని అంటారు శ్రీధర్.

-కళాసాగర్ 

Sridhar cartoon
Sridhar cartoon
Sridhar cartoon

3 thoughts on “‘ఈనాడు’తో 40 యేళ్ళ అనుబంధం – శ్రీధర్

Leave a Reply

Your email address will not be published.

Share via
Copy link
Powered by Social Snap