60 ఏళ్ళు నిండిన “పసిపాపడు”

అమాయకంగా నవ్వటం, నవ్వించటం, కవ్వించటం, ‘లవ్వించటం’ తప్ప అన్నెం-పున్నెం ఎరుగడు.
ఎవర్ని ఏమీ అడగడు, తన దగ్గరున్నదేదో ఒకటివ్వకుండా ఎవర్నీ పోనివ్వడు.
బాపూ గీసిన ‘బుజ్జయీ లా వుంటాడు, లొకం తెలిసిన ‘పాపాయి ‘ లా వుంటాడు.
పొద్దస్తమానం… రాతలు గీతలే వ్యాపకం, రాత్రి-పగలు అన్నది వుండనే వుండదస్సలు జ్జాపకం.
తెలుగు బుల్లి తెరకై సీరియస్ గా ‘సిల్లీసీరియల్స్’ రాసి నాలుగేసి నందులందుకున్న (మహదా) నందుడు !. 

సంగీత సాహిత్య, నృత్య, వ్యంగ్య ‘చిత్రాలేఖ నాది లలిత కళాకోవిదుడు’
రసగులికల్లాంటి తీపి కథలు రాసే ‘కథా’ కళికుడు.
ప్యాషన్ పేరిట ‘కట్’ అవుతున్నట్టి  నేటి మన కట్టు-బొట్టు లను కట్టుదిట్టం చేయాలని తలచి,
మహిళా జగతిలో జడ పద్యాలతో ‘జగడం’ పెట్టుకున్నాడు.
చీర పద్యాలతో చిర్రు-బుర్రు లాడాడు, ఇక రేపో … మాపో ..
కచ్చితంగా పంచ్ లతో ‘పంచె ‘ తంత్రం రాసి పురుషుల భరతం పడతాడు.
ఇలా … మనకు కనపడనంత ‘అండర్ ‘  ‘వండర్ ‘ స్టాండింగ్ కలవాడు.!

ఇంతటి జ్జాన పుస్టి గల మా నార’సింహ’ మూర్తీ (బ్నిం ) కి
ఎంతో … ఎంతో ఇస్టంగాను మా అందరి తరపున  షష్టిపూర్తి శుభాకాంక్షలు. 

సీరియస్ నెస్లెస్గా ఉండే టీవీ సీరియల్స్ రాయడం ఈయన టాలెంట్ ఓప్లస్, దీనికి నంది అవార్డు గెలుచుకున్న ‘రావోయి చందమామ’ సీరియల్ ను ‘మెచ్చుతునకగా చెప్పుకోవచ్చు.
శివాజీని వాళ్ళ అమ్మ ‘ఛత్రపతి’గా తయారుచేస్తే ‘బ్నిం’ని వాళ్ళ అమ్మ ‘చిత్రపతి’గా తీర్చిదిద్దింది. ఈయన పబ్లిక్ కి, పబ్లిసిటీకి దూరంగా ఉండడానికే ఇష్టపడతారు.
నంది అవార్డులు, బిరుదులు ఈయన్ని వరించి తరించాయి. కళ్మషంలేని పసిపాపాయిల బోసినవ్వు, కల్లాకపటం ఎరుగని పసి మనసు, చిన్నవారినీ ప్రేమించే పెద్ద మనసు వున్నటువంటి అరుదైన వ్యక్తి ‘బ్నిం ‘ ఏ బిరుదుకైనా అర్హుడే. రాతలో, గీతలో సహజ భావ చిత్రణలో ‘బ్నిం’ ఫేమస్ ఏ డిగ్రీ లేకున్నా సంగీత సాహిత్య నృత్య చిత్రలేఖనాది కళల్లో అపారమైనటువంటి ప్రవేశం వున్నటువంటి, డిగ్రీ ఆఫ్ నాలెడ్జ్లో ‘బ్నిం’ ఓ జీనియస్. కొండ అద్దంముందు కొంచమై ఉండదా… అన్నట్లు బి. నరసింహమూర్తి అనే ఈ ‘బ్నిం’ మూర్తి చిన్నదైనప్పటికీ ఈయన ఘనకీర్తి ఎంతో పెద్దది.

ఇతనిని కన్న అమ్మ, ఈయన గీసిన బొమ్మ ఈయన అభివృద్ధికి పట్టుకొమ్మలు. ‘బ్నిం ’ హృదయం లలితకళల నికేతనం. ‘బ్నిం ‘ సాక్షాత్తు కళామతల్లి చేతిలోని కేతనం. కోనసీమ కొబ్బరినీళ్ళ వంటి తెలుగుభాష నందించడంలో ‘బ్నిం ‘ తనకుతానే సాటిగా నిలుస్తాడు. కోనసీమ కొబ్బరాకులపై హాస్యపు కవితలు, కథలు, కార్టూన్లు గీసి ఆంధ్రదేశమంతటా కితకితలు పెట్టిన కోనసీమ కొంటె కుర్రాడీయన. సప్తస్వరాల రంగుల కలయిక – సరిగమపదని సప్తస్వరాలు జతిలయల మేళవింపుతో నేటివరకు ఎవరూ రాయలేనని, 200కి పైగా బ్యాలేలు రాసిన ‘బ్నిం’ ఆబాలగోపాలాన్ని అలరించిన ఇవి ఈయన్ని బాలే బాద్షాగా నిలిపాయి. తల్లి ఆలనలో, పాలనలో అక్షరాభ్యాసం లేకుండానే భాషాభ్యాసం చేసి, ఆటపాటల వయసులోనే తన జీవితంలో ఎన్నో ఆటుపోటులను తట్టుకొని సాహితీ చిత్ర కళాసాగరాన్ని ఈదగలిగాడు. 17 యేళ్ళపాటు తాను పడివున్న మంచంలోనే ఈయన తన భావి ప్రపంచం సృష్టించుకుని బహుముఖ ప్రజ్ఞాశాలిగా నేడు మహెూన్నత శిఖరాలను అందుకొని, ఓ చరిత్ర సృష్టించి చరితార్థుడయ్యాడు. నేటి, రేపటి తరానికి మార్గదర్శకునిగా ఓ ఆదర్శ కళాకారునిగా మనముందు నిలిచాడు.

అక్టోబర్ 28 ఆదివారం 2018 న హైదరాబాద్ లో ‘బ్నిం’ గారి షష్టిపూర్తి సంబరాలు జరుగనున్నాయి. ఆయన ఆప్తులు, ఆత్మీయలు అక్కడ కలుసుకుందాం. హైదరాబాద్ రాలేని వాళ్ళు ఇక్కడ కామెంట్ బాక్స్ లో శుభాకాంక్షలు తెలియజేయండి.

– బి.యం.పి.సింగ్

SA:

View Comments (5)

  • డైలాగ్ అండ్ కాప్షన్ కింగ్ BMP సింగ్ గారు BNIM గారిపై రాసిన ఆర్టికల్" 60 ఏళ్ళు నిండిన పాపడు" అదుర్స్ .
    సకలకళా వల్లభుడు బినీం గారికి అరవై ఏళ్ళు నిండిన సందర్భంగా వారికి నా ముందస్తు పుట్టిన రోజు జేజేలు .28న తప్పక వారి జన్మ దిన వేడుకకు రావా లని నేను ఆసిస్తూన్నాను మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను