గుంటూరు జిల్లా, వెల్దుర్తి మండలంలోని తేరాల ఊరు చివర వున్న చెరువు లో చాళుక్య దేవాలయ పునాదులు బయల్పడినాయని పురావస్తు పరిశోధకుడు, కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ & అమరావతి (సిసివిఏ) , సీఈవో, డా. ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. వారసత్వ స్థలాలను గుర్తించి పరిరక్షించడానికి కల్చరల్ సెంటర్ చేపట్టిన ‘ప్రిజర్వ్ హెరిటేజ్ ఫర్ పోస్టారిటీ’ పథకంలో భాగంగా, మంగళవారం నాడు, ఆయన తేరాల పరిసరల్లో జరిపిన అన్వేషణలో, రూపులమ్మ ఆలయ పక్కన వెంగీ చాళుక్య వాస్తుశైలిలో నిర్మించిన గర్భాలయ గోడల పునాదులు, అదే ఆలయానికి చెందిన చక్కటి శిల్పాలు చెక్కి ఉన్న ద్వారశాఖలు వెలుగుచూశాయని ఆయన చెప్పారు. తేరాలలో సిద్దేశ్వరాలయంలోనున్న వేంగి చాళుక్య వంశానికి చెందిన చాళుక్య జై సింహని (క్రీ.శ.643-672) తెలుగు శాసనం, కప్పు వరకు పూడుకు పోయిన రూపులమ్మ గుడి ఆధారాలుగా పరిశీలించి చూస్తే, బయల్పడిన ఆలయ పునాదులు కూడా క్రీ.శ. 7వ శతాబ్దకి చెందినవని చెప్పవచ్చని శివనాగిరెడ్డి చెప్పారు. వేంగి చాళుక్య ఆలయ వాస్తుకు అద్దం పడుతూ చారిత్రక ప్రాధాన్యతను సంతరించుకొన్న ఈ ఆనవాళ్ళును, భావితరాలకు అందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పురావస్తు శాఖ అధికారులకు ఆయన విజ్ఞప్తి చేశారు. తేరాల గ్రామస్తులకు ఆలయ పునాదుల గురించి అవగాహన కల్పించి, పరీరక్షించుకోవాల్సిన అవసరాన్ని చెప్పారు. ఈ కార్యక్రమంలో దుర్గి పట్టణానికి చెందిన నాగార్జున శిల్పశాల నిర్వాహకుడు చెన్నుపాటి శ్రీనివాసాచారి, ఆగమశాస్త్ర పండితులు మున్నంగి జగన్నాథచార్యులు పాల్గొన్నారు.