దిగ్విజయంగా 7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు

అక్టోబర్ 10-11, 2020 (శని, ఆది వారాలు) తేదీలలో 36 గంటల సేపు నిర్విరామంగా కొనసాగిన “7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు” దిగ్విజయంగా ముగిసింది. అంతర్జాలం లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా జరిగిన ఆ సాహితీ సదస్సు ను సుమారు పది వేల మందికి పైగా తెలుగు భాషాభిమానులు వీక్షించిన ఈ సదస్సు తెలుగు సాహిత్య చరిత్రలో ఒక నూతన అధ్యాయాన్ని సృష్టించింది.

ఈ బృహత్ సాహితీయజ్ఞం లో ఐదు ఖండాల నుండి, సుమారు 200 మంది సాహితీవేత్తలు 15 ప్రసంగ వేదికలలో పాల్గొని వివిధ అంశాల మీద ప్రసంగించారు. 15 నూతన పుస్తకావిష్కరణలూ, చర్చావేదికలతో వైవిధ్యభరితమైన ఈ సాహితీ సదస్సును ప్రముఖ గాయని సునీత ఉపద్రష్ట ‘మా తెలుగు తల్లికి మల్లె పూదండ’ ప్రార్ధనాగీతాన్ని ఆలపిస్తూ ఉండగా, దక్షిణాఫ్రికా న్యూజిలాండ్ సింగపూర్ భారత్ ఇంగ్లాండ్ అమెరికా దేశాలలోని తెలుగు ఆడపడుచులు దీప ప్రజ్వలన గావించారు.

వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా (అమెరికా, హైదరాబాద్), శ్రీ సాంస్కృతిక కళా సారధి (సింగపూర్), తెలుగు మల్లి (మెల్ బోర్న్, ఆస్ట్ఱేలియా), దక్షిణ ఆఫ్రికా తెలుగు సాహిత్య వేదిక (జొహానెస్ బర్గ్), సి.పి. బ్రౌన్ తెలుగు సమాఖ్య (లండన్) సంస్థల సంయుక్త నిర్వహణ లో జరిగిన ఈ సదస్సు ప్రారంభ సభని వంగూరి చిట్టెన్ రాజు నిర్వహిస్తూ ఈ 7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు ని స్వర్గీయ ఎస్. పీ. బాల సుబ్రమణ్యానికి అంకితం ఇచ్చారు. పద్మభూషణ్ డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు సభకు, భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారి అభినందనలను సందేశాన్ని అందజేయగా, డా. కె.వి రమణాచారి, శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ గారు, ప్రముఖ సినీ నటులు రచయిత శ్రీ తనికెళ్ళ భరణి, ఆచార్య సి. మృణాళిని, శ్రీ దేశపతి శ్రీనివాస్ గారు, ఆచార్య ఆవుల మంజులత గారు సముచిత ప్రసంగాలు చేశారు.

7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు తరఫున వంగూరి, మధు పెమ్మరాజు, డా. రెంటాల శ్రీ వెంకటేశ్వర రావు, డి.ఆర్. ఇంద్ర, చాయా మోహన్ సత్కార బృందం వారు ప్రముఖ రచయిత సాహితీవేత్త శ్రీ తల్లావజ్ఝుల పతంజలి శాస్త్రి గారికి “జీవన సాఫల్య పురస్కారం’ ప్రదానం వైభవోపేతంగా జరిగింది. ప్రముఖ సంగీత దర్శకులు స్వర వీణాపాణి గారు ఈ సదస్సుకు అంకితమిస్తూ ప్రత్యేకంగా ఒక గీతాన్ని వ్రాసి ఆలపించారు. ప్రత్యేక అంశాలుగా అండమాన్, నికోబార్ దీవులలొ తెలుగు వారి సాహిత్య సేవ గురించి మొదటి సారిగా ప్రపంచానికి శ్రీ మేడసాని శ్రీనివాస్ వివరించారు. సభలో పాల్గొంటున్న పిన్న వయస్కురాలు సిసిలిక రామరాజు తన స్వీయ రచనను చదివి వినిపించారు.

15 దేశాల రచయితలు పాల్గొన్న ఈ రెండు రోజుల పాటు నిర్విరామ సాహితీ సదస్సు లో ప్రముఖ సాహితీ వేత్త భువన చంద్ర తో ముఖాముఖీ, ఎస్.పీ. బాలూ కి చెరుకూరి రమాదేవి (డిట్రాయిట్) గారి ఆత్మీయ నివాళి, పొత్తూరి విజయ లక్ష్మి, రామా చంద్రమౌళి, డా. శిఖామణి, ముక్తేవి భారతి, ఆచార్య కాత్యాయని విద్మహే, వడ్డేపల్లి కృష్ణ, ఆచార్య ఎస్. వీ సత్యనారాయణ, కె. శ్రీనివాసరావు (సాహిత్య ఎకాడెమీ), వోలేటి పార్వతీశం, రేవూరు అనంత పద్మనాభ రావు, అత్తలూరి విజయలక్ష్మి, పాపినేని శివశంకర్, ‘హాస్య బ్రహ్మ’ శంకర నారాయణ, రేణుక అయోల, రాజేశ్వరి శివుని, గంగిశెట్టి లక్ష్మీనారాయణ మొదలైన భారత దేశ రచయితలు, 15 దేశాల ప్రముఖ రచయితల ప్రసంగాలూ ఆసక్తికరంగా సాగాయి.

అనేక దేశాల నుండి సుమారు 30 మంది సాంకేతిక నిపుణులు, 15 మంది ప్రసంగ వేదికల నిర్వాహకులు అహర్నిశలూ శ్రమించి విజయవంతం చేసిన ఈ 7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు ప్రధాన కార్య నిర్వాహక వర్గం సభ్యులు వంగూరి చిట్టెన్ రాజు, శాయి రాచకొండ (హ్యూస్టన్), రత్న కుమార్, రాధిక మంగిపూడి (సింగపూర్), రావు కొంచాడ (మెల్ బోర్న్), రాపోలు సీతారామరాజు (జొహానెస్ బర్గ్), జొన్నలగెడ్డ మూర్తి (ఇంగ్లండ్), వంశీ రామరాజు (హైదరాబాద్) కాగా రాధాకృష్ణ & కాత్యాయని గణేశ, భాస్కర్ ఊళపల్లి, సుధాకర్ జొన్నాదుల (సింగపూర్), కృష్ణ రావిపాటి (మెల్ బోర్న్), మధు చెరుకూరి (ఆర్లండో), రఘు ధూళిపాళ (సియాటిల్).

జీవన సాఫల్య సభ మినహా, సినీ, రాజకీయ, తదితర ప్రసంగాలకి అతీతంగా, శాలువా రహితంగా, సన్మానం సత్కారాల ఆర్భాటాలు లేకుండా కేవలం తెలుగు భాషా, సాహిత్యాలకి మాత్రమే పెద్ద పీట వేసిన 36 గంటల ఈ నిర్విరామ సాహితీ సదస్సు ను పది వేల మందికి పైగా చూసి, విని ఆనందించడం తెలుగు సాహిత్య చరిత్రలో ఒక మైలు రాయి.
వీక్షకుల కోసం:
ఈ సదస్సు ప్రారంభ సభని ఈ క్రింది లింకు లో చూడవచ్చును. తరువాత జరిగిన 14 ప్రసంగ వేదికలూ త్వరలోనే అందుబాటులోకి వస్తాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap