డైరెక్ట్ గా నాటక రచన చేయడం ఒక రచనాత్మక ప్రక్రియ అయితే, ఒక కథని నాటక రూపంలోనికి మార్చడం మరొక అనుసృజనాత్మక కళ. కథలోని ఇతివృత్తాన్ని దృశ్శాత్మకంగా మార్చడానికి కొన్ని సర్దుబాట్లు నాటక రచయితకు తప్పనిసరి. కథను దృశ్యాలుగా విభజించి ఒక దృశ్య రూపంగా మలుచుకోవడం కూడా తక్కువ సాహిత్య సృజన ఏమి కాదు. కథను ఆత్మగతం చేసుకుంటూ రచయిత ఉద్దేశానికి ఆశయానికి భంగం కలగకుండా, ఇష్టం వచ్చినట్లు మార్చేయకుండా(తిమ్మిని బొమ్మి చేయకుండా) స్వయంగా రచయితే మరోసారి తను కనబిడ్డనే మరొక రూపంలో చూసుకోవడం కూడా ఒక త్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. నాటక అనుసరణ చేసేవారు అలా అది రెండు వైపులా పదనుగల కత్తి మీద నడవడమే. ఏదీ ‘అతి’ కాకూడదు. మూల రచయితకు అన్యాయం జరగకూడదు. మరొకవైపు నాటకీయత ప్రేక్షకుడికి కృతకంగా అనిపించకూడదు. అలా రెంటి బ్యాలెన్స్ ఎప్పుడు జరుగుతుందంటే.. మూల కధారచయిత పట్ల ఏమాత్రం గౌరవం తగ్గకుండా.. “కడుపు కోసి భీభత్సంగా సర్జరీ చేయడం కాకుండా బటన్ కి హోల్ సర్జరీ చేసి రక్తస్రావం కాకుండా శస్త్ర చికిత్స జరిపి త్వరగా ఇంటికి పంపించడం లాంటిది”. రంగస్థలం ప్రదర్శన మర్మం- ప్రేక్షక నాడి ఎక్కడా దెబ్బ తినకుండా రచయితను, ప్రేక్షకుడిని మెప్పించడమే! కథ తాలూకు డ్రైనెస్ ప్రేక్షకుడు ఎక్కడా ఫీల్ కాకూడదు చివరిదాకా. మూల కథారచయితను, ప్రేక్షకుడిని ఒప్పింపచేయడమే ఆ ప్రక్రియలోని కౌశలం, ధురీణత.
‘అమ్మ ఒడి’అన్న మూల కథను “స్త్రీ మాత్రే నమః” అన్న నాటికగా మార్చడంలోని శ్రమ, నైపుణ్యం కథను దృశ్యాత్మకంగా రంగస్థల వేదికపై ప్రదర్శించగా, దానికి ప్రేక్షక ఆమోదం లభించడం నూటికి రెండు వందల శాతం ఫలితం సాధించడం, స్త్రీ మాత్రే నమః -అలా రెండు పరీక్షలలో ఒకేసారి డిస్టింక్షన్ లో ఉత్తీర్ణత సాధించిన నాటిక.
చిట్టి పాపను చిట్టి (బాబు)గా మార్చడం, సత్యానంద్(సత్య ప్రకాష్) పాత్రను సృష్టించి ఒక వైపు సస్పెన్స్ తో అనుమానాస్పదంగా, కొన్ని సీన్స్ లో ఆ చివరి డైలాగ్స్.. ఆ పాత్ర ఒక సీక్రెట్ ఏజెంట్ ఏమో నన్న అనుమానం, ఉత్కంఠను రేకెత్తించడం ఇంకొక ఎత్తుగడ.
చైతన్యతో కలిసి యు.ఎస్ వెళ్లవలసిన శ్వేత, తమ్ముడి కోసం ఇక్కడే ఉండిపోయి వర్క్ ఫ్రం హోం, మేనేజ్మెంట్ వారికి ఇష్టం కాకపోతే రాజీనామా చేసి చంటితో పాటు అలాంటి వాళ్ళ కోసం ఒక ‘హోమ్’ నడపాలి అనుకోవటం.. శ్వేత పాత్రలో త్యాగం, చెల్లి- తల్లి పాత్రకు మారిపోవడం, తనకు తల్లిదండ్రుల నుండి దక్కాల్సిన ప్రేమ చిట్టి మూలంగా దక్కకపోవడం, చిట్టికి ‘పిచ్చటగా’ అన్న అవమానకర మాటలు, చూపులు భరించిన శ్వేత ఆఖరికి, తన ఇంటర్ రిజల్ట్ విషయం చెప్పబోతే తల్లి.. చంటి ‘అచ్చులు తప్పులు లేకుండా చెప్పాడన్న సంతోషంతో ఆమె ముఖం వెలిగిపోతుంటే, తన సక్సెస్ గురించి చెప్పలేక చప్పబడిపోతుంది. చంటి మూలంగా ఇల్లు కదల లేకపోతున్న తల్లి, ఏ పార్టీలకు ఫంక్షన్లకు రాకపోవటం, తనను తీసుకువెళ్లకపోవడం.. తల్లి కోల్పోతున్న సంతోషకర సందర్భాలను చెప్పి బాధ తగ్గించుకుందామనుకుంటే, ఆ తల్లి, శ్వేత తన గురించి ఎంతగా ఆలోచిస్తుందో తెలుసుకుని ఇంకా ఎక్కువగా శ్వేత అర్ధమై, ఆమెను నిండు మనసుతో తన ఒడిలోకి తీసుకున్నప్పుడు, తనకే కాదు అమ్మ ఒడి ఈ ప్రపంచంలో ఎంత సురక్షితమైనదో- దాని అవసరం తనకంటే చంటికే ఎంత ఎక్కువగా ఉందో మొదటిసారి అర్థం చేసుకుంటుంది శ్వేత.
తల్లిదండ్రులను బెంగళూరుకు రప్పించి దర్శనీయ స్థలాలు చూపి, పిన్ని దగ్గర వదిలి వచ్చిన చంటి కోసం షాపింగ్ కు పంపి తాను ఆఫీసుకు వెళ్తుంది. అప్పుడు జరిగిన కాబ్ యాక్సిడెంట్లో ఆ ఇద్దరినీ కోల్పోతుంది. చంటిని తనతోనే ఉంచుకుని, పెళ్లి చేసుకోవాలనుకున్న చైతన్యని కూడా వదులుకోవడానికి సిద్ధపడుతుంది. అప్పుడు కేర్ టేకర్ గా ప్రవేశించిన సత్యానంద్ లో శ్వేత తల్లి తండ్రి- ఇద్దరినీ అతనిలో చూస్తుంది. తాను కూడా ఆ ఒడిలో కాసేపు అన్నీ మరిచి విశ్రాంతి తీసుకుంటుంది.
ఇప్పుడు చంటిని తన వైపు తిప్పుకోవడానికి సత్యానంద్ చేసిన ప్రయోగాలు సత్ఫలితాలను ఇస్తాయి. తను మళ్ళీ ఆఫీసుకు వెళ్లగలటం, చిట్టి పట్ల తన మానసిక ఆందోళన తగ్గి మామూలు మనిషి కాగలుగుతుంది, నిశ్చింతతో శ్వేత.
భార్యను కోల్పోయిన సత్యం.. చంటి బాధ్యతని ఒక వ్యాపకంగా కాకుండా అదృష్టంగా భావించిన సన్నివేశం వస్తుంది. ఈ క్రమంలో చిట్టికి ఓంకారం నేర్పడం, హగ్ చేసుకోవడంలోని ఆనందం వంటి సన్నివేశాలు ప్రేక్షకుడి కళ్ళు చెమరింపచేస్తాయి. చిట్టితో సత్యానంద్ ఆర్మ్ రెజ్లింగ్ చేసి ఓడినట్లు నటించడంతో చిట్టికి పట్టరాని ఆనందం కలగడం చూసి శ్వేత నిశ్శబ్దంగా వచ్చి ఆ ‘అంకుల్’ కాళ్లకు మొక్కుతుంది. ఇది ప్రేక్షకుడికి కూడా మానసికంగా ఎంతో ఊరటనిచ్చే దృశ్యం. మానవీయ భావనలతో హృదయం బరువెక్కుతుంది. మరోపక్క శ్వేత చైతుల మధ్య వేడివేడిగా సాగే సంభాషణలు ఘర్షణ రూపంలోకి మారుతాయేమో అన్న భయం ప్రేక్షకుడికి కూడా కలిగేటట్లు చేశాడు దర్శక నట నాటక కర్త ఉదయ్ భాగవతుల.
నాటిక ముగింపు దిశగా సాగుతున్న దశలో చిట్టి, అంకుల్ కి బాగా కనెక్ట్ కావడం, వశీకరణ లాంటి నేర్పుతో చిట్టిని లాలించడం, టేమ్’ చేయడం, మాట వినేటట్లు మార్చడం, దర్శకుడిచ్చిన నాటకీయ ట్రీట్మెంట్, దీనిని ఒక సైకలాజికల్ డ్రామా జానర్ లోకి తీసుకు వెళుతుంది. అంకుల్, అమ్మలా చీర కట్టుకొని చిట్టికి అన్నం తినిపించడం, లాలి పాట పాడి నిద్రపుచ్చడం వంటి చర్యల ద్వారా, ఆ ఇద్దరి మనసు చూరగొంటాడు సత్యానంద్. అప్పుడు తన మనసు విప్పి చెబుతుంది శ్వేత. ఒక సమయంలో చిట్టిని తాను ఎంతగా ద్వేషించిందీ.. అందుకు కారణాలు, ఇక్కడే రచయిత్రి కథ ఫ్రేమ్ వర్క్ ని నాటిక రచయిత, దర్శకుడు చక్కగా ఉపయోగించుకున్నాడు.
ఈ దశలో మరొక ట్విస్ట్ సత్యకు గుండెపోటు రావడం, చిట్టి ఓంకారం చెబుతూ నెమ్మది పరచడం.. ఈ మార్పుకు శ్వేతా సత్యానంద్ ఇద్దరు ఎంతో సంతోష పడతారు. శ్వేత అంటుంది- “అంకుల్! ఎవరైనా మంచివారనో, చెడ్డవారనో అనిపిస్తారు కదా! కానీ మీరు మాత్రం ‘మన వారు’ అనిపిస్తారనడం ప్రేక్షక హృదయాన్ని సైతం మెప్పిస్తుంది.
ఇప్పుడు క్లైమాక్స్ సీన్. చైతు శ్వేతతో తాడో పేడో తేల్చుకోవడానికి యూఎస్ నుండి వస్తాడు. అక్కడ తండ్రిని చూసి మొదట ఆశ్చర్యపోతాడు. ఇంతకుముందు ఈ క్యారెక్టర్ ని శంకింప చేసిన ఫోన్ కాల్స్ సంధ్య అనే శ్వేత స్నేహితురాలు ద్వారా, సత్య ప్రకాష్, సత్యానంద్ గా ఆ ఇంటిలో ప్రవేశించి ఆమెకు ఎప్పటికప్పుడు ఫోన్ చేసి ప్రోగ్రెస్ చెబుతూ ఆమె ద్వారా ఇక్కడ పరిస్థితిని చైతుకు తెలియజేసే సస్పెన్స్ కు ముగింపు పలకడానికి సంధ్య ద్వారా చైతును, శ్వేత ఇంటికి రప్పిస్తాడు. శ్వేత ఇంట్లో తన నాటకం రక్తి కట్టడానికి కారణం.. తనెవరో అంతకుముందు శ్వేతకు తెలియకపోవడానికి కారణం- చైతూ ఎప్పుడూ తన అమ్మానాన్నల ఫోటో చూపించకపోవడంమే. అందుకు చైతూని సత్య ‘స్టుపిడ్’ అని ముద్దుగా తిడతాడు.
ఇక ఇద్దరి మధ్య అపార్ధాలను దూరం చేస్తూ, చైతూతో “నీ ఆశయం కోసం ఆ అమ్మాయి అమెరికా రావాలి అనుకున్నావు గానీ, తన అవసరం కోసం నువ్వు ఇండియాలో ఉండాలి అనుకోలేదు. మగతనం అంటే ఆడవాళ్ళ మీద అధికారం చలాయించడం కాదురా! ఆడవాళ్ళకి సహకారం అందించడం. ప్రేమించడం, ఇష్టపడడం కాదురా! కష్టాలలో కూడా తోడుగా ఉండడం’. చంటి కోసం శ్వేత యూఎస్ రాననడంలో తన తలరాతే కాదురా, తన గుండె కూత కూడా ఉంది. అది అర్థం చేసుకోలేకపోయావు.
‘అమ్మ ఒడి’ కథకి “స్త్రీ మాత్రే నమః” అన్న పేరు ఎందుకు సరైనదో.. సత్యం ఈ క్లైమాక్స్ డైలాగ్ చూడండి.. “ప్రతి వారికి ఏదో ఒక సందర్భంలో, ఏదో విధంగా తల్లి స్థానంలో నిలబడుతుంది ఆడది. ఆడదంటేనే అమ్మ. ఆడదే అమ్మ! ఆడదాన్ని అమ్మను చేయాలని, వాళ్ళకి ఆ శక్తిని, సహనాన్ని ఇచ్చాడో లేక ఆ శక్తి సహనం వాళ్ళకి ఉన్నాయనే వాళ్ళని అమ్మని చేశాడో ఆ భగవంతుడికే తెలియాలి. కానీ ఆడదంటేనే అమ్మ! ఆడదే అమ్మ !అమ్మను, నీకు ప్రేమ కావాలా? బాధ్యత కావాలా? అంటే బాధ్యతనే తలకెత్తుకుంటుంది, కానీ ప్రేమను పంచుతూనే ఉంటుంది. ఏ కుటుంబాన్ని అయినా నడిపించేది, గెలిపించేది ఆడది, స్త్రీ మూర్తి. ఆ శక్తిని శ్రీమాత్రే నమః అని పూజించినట్లే, ఈ శక్తిని కూడా స్త్రీ మాత్రే నమః అని పూజించాలి, గౌరవించాలి. మగవాడు ఎప్పటికీ అమ్మ కాలేడు” అన్న ఉదాత్తమైన సందేశంతో నాటిక ముగుస్తుంది. ఆ చివరలో వాయిస్ ఓవర్ ఇలా వినిపిస్తుంది.. ‘పిల్లల్ని రాచి రంపాన పెట్టే సవతి తల్లులు, కోడళ్లను కాల్చి చంపే అత్తగార్లు, అత్తమామల్ని హింసించే కోడళ్ళు, చివరికి భర్తలను పిల్లల్ని చంపేస్తున్న విచిత్రమైన ఆడవాళ్లు కూడా ఉన్నారు. వీళ్ళందరూ అర్థం చేసుకోవాలి.. ఆడది అంటే అమ్మ. అమ్మంటే ప్రేమ. స్త్రీ మాత్రే నమః”. నేను కూడా స్త్రీ మాత్రే నమః అని చెబుతూ ఈ సమీక్షను ముగించే ముందు, తమ తమ పాత్రలను అద్భుతంగా పోషించిన పాత్రధారులను నాటికను ఒక ఉన్నత శ్రేణి తెలుగు నాటికగా తీర్చిదిద్దిన ఉదయ్ భాగవతుల ను అభినందిస్తూ ఇందులో శ్వేతగా ప్రియాంక చైతన్యగా నర్రా ప్రశాంత్ చిట్టిగా కార్తీక్ సత్య ప్రకాష్/ సత్యానంద్ గా ఉదయ్ భాగవతుల నటించలేదు, జీవించారు. సంగీతం సురభి నాగరాజ్ వై సాయి తేజ. రంగాలంకరణ/ రంగోద్దీపనం సురభి జయవర్ధన్, సురభి ఉమా శంకర్.
–మల్లేశ్వరరావు ఆకుల
79818 72655
