
(గమనిక: ఈ వ్యాసం పరిధి సినిమా ఇతివృత్తానికి మాత్రమే పరిమితం)
తెలుగు సాహితీ లోకానికి ప్రాపంచిక ధృక్పథంతోపాటు భౌతిక ధృక్పథాన్ని పరిచయం చేసిన అభ్యుదయ సాహితీ సముద్రుడు ‘ఆరుద్ర’ అనే భాగవతుల సదాశివ శంకర శాస్త్రి. ఒంటిచేత్తో 13 సంపుటాల ‘సమగ్ర ఆంధ్ర సాహిత్యo’ రచించి, భాషాసేవ చేసిన కృషీవలుడు. ‘త్వమేవాహం’, ‘కూనలమ్మ పదాలు’, ‘సినీ వాలి’ వంటి కవితల నుంచి డిటెక్టివ్ కథల దాకా; ‘సాలభంజికలు’, ‘రాదారి బంగాళా’ వంటి నాటక సాహిత్య ప్రక్రియ నుంచి ‘ఆరుద్ర వ్యాస పీఠం’, ‘వేమన్న వాదం’ వంటి వ్యాస సంపుటాల దాకా ‘వెన్నెల-వేసవి’ (తమిళ కావ్యం ‘కళింగత్తుపరణి’) వంటి అనువాద రచనల నుంచి ‘కొండగాలి తిరిగింది’ వంటి సినీ సాహిత్యం దాకా ఆరుద్ర కలం ముద్రలు పడని సాహిత్యం లేదు. చదరంగం, ఇంద్రజాలం, భరతనాట్యం వంటి విభిన్నరంగ రచనలలో కలం దూర్చని సందర్భమే లేదు. “ఛందస్సులతో అడ్డమైన చాకిరీ అందంగా చేయించుకోగల సంవిధాన విధాత ఆరుద్ర” అని మహాకవి శ్రీశ్రీ చేత ప్రశంసలనందుకున్న ఈ అంత్యప్రాసల ఆరుద్ర సినీరంగానికి అందించిన సేవలు అనర్ఘం. జూన్ 4 న ఆరుద్ర వర్ధంతి సందర్భంగా ఆయన సినీ సేవలకు నీరాజనమిస్తూ ఆ దివంగత సాహితీ మూర్తిని సంస్మరించు కుంటే ఆరుద్ర ఆత్మకు ‘పద్మ పురస్కారం’ దక్కినట్లే.
సినిమాలో…‘వాలి’: చిత్రపరిశ్రమకు రాకముందు ఆరుద్ర రాయల్ విమాన దళంలో బొంబాయి, మద్రాసు యూనిట్లలో గుమాస్తాగా 1943 నుంచి 1947 వరకు పనిచేసారు. ఆరుద్రకు సినిమాలంటే యెంతో ఇష్టం. రోజుకో ఇంగ్లీష్ సినిమా చూసేవారు. వాటిల్లో కౌబాయ్ చిత్రాలు ఎక్కువగా ఉండేవి. 1947లో మద్రాసుకు మకాం మార్చి ఒక సంవత్సరం పాటు ‘ఆనందవాణి’ పత్రికకు సంపాదకత్వం వహించారు. 1950లో కడారు నాగభూషణం నిర్వహించే రాజేశ్వరి ఫిలిం కంపెనీలో చేరడంతో ఆరుద్ర సినీరంగ ప్రస్థానం ప్రారంభమైంది. అక్కడ సహాయ దర్శకునిగా, రచయితగా సినిమాకు కావాల్సిన హంగులన్నీ ఆరుద్ర సమకూర్చుతూ వుండేవారు. ఆ కంపెనీ నిర్మించిన ‘సౌదామిని’ జానపద ద్విభాషా చిత్రం కోసం ఆరుద్ర “చూలాలు సీతమ్మ కానలకు నడచె” అనే పాట రాసారు. కానీ, తెలుగుభాషా సంప్రదాయం తెలియని సంగీత దర్శకుడు ఎస్.వి. వెంకట్రామన్ ‘మాండు’రాగంలో మట్లు కడితే ఆరుద్ర పాట అందులో ఇమడక పోవడంతో సముద్రాల చేత “కుందరదనా వినవే రామకథ- రాకేందు వదనా వినవే లోకాభి రామకథ” అని మార్చి రాయడం జరిగింది. ‘సౌదామిని’లో ఆరుద్రే మరికొన్ని పాటలు రాసినా క్రెడిట్స్ మాత్రం సముద్రాలకే దక్కాయి. పాటలే కాదు, ఆ సినిమాకి సింహభాగం డైలాగులు కూడా ఆరుద్ర రాసినవే. తరవాత హెచ్.ఎం.రెడ్డి ‘నిర్దోషి’ సినిమాలో ఆరుద్ర రాసిన పాటను వాడుకున్నారు. కానీ పాట మాత్రం శ్రీశ్రీ పేరిట చలామణి అయింది. 9 డిసెంబరు 1950 న విడుదలైన పక్షిరాజా వారి ‘బీదలపాట్లు’ సినిమాలో ఆరుద్ర రాసిన పాటలకు వెండితెర సాక్ష్యంగా నిలవటంతో “ఓ చిలుకరాజా నీ పెళ్ళెపుడయ్యా- నీ పెళ్లికి నాట్యం చేస్తా” అనే పాటను ఆయన తొలిపాటగా గుర్తించారు. ఈ పాటకు వర్ణమెట్టు కట్టింది నాగయ్య గారే అయినా ఎస్.ఎం. సుబ్బయ్య నాయుడు, అశ్వథ్థామ పేర్లు తెరపై కనపడతాయి.

దశతిప్పిన ప్రేమలేఖలు: 1953లో ఆరుద్రకు ఘంటసాల స్వయంగా నిర్మించిన ‘పరోపకారం’ స్ట్రెయిట్ చిత్రానికి తొలి అవకాశం రాగా, హిందీ షోమ్యాన్ రాజకపూర్ సినిమా ‘ఆహ్’కి తెలుగు అనువాద చిత్రంగా వచ్చిన ‘ప్రేమలేఖలు’కు మాటలు, పాటలు రాసే అవకాశం దొరికింది. ప్రేమలేఖలు సినిమా ట్రాక్ ఛేoజ్ చిత్రమైనా దానిని డబ్బింగు సినిమాగానే జనం గుర్తించారు. ఆ సినిమా మంచి హిట్ కావడంతో నిర్మాతలు ఆరుద్రను డబ్బింగు రచయితగా మార్చేసి వందలకొద్దీ డబ్బింగు చిత్రాలకు పని చేయించుకున్నారు. ‘ఆహ్’ హిందీతోబాటు, తెలుగు, తమిళ భాషల్లో ట్రాక్ ఛేoజ్ చిత్రంగా నిర్మించారు. ఇందులో పాటలు మాత్రం మూడు భాషల్లోనూ వేటికవే విడివిడిగా రికార్డు చేసారు. మాటలు మాత్రం ట్రాక్ మార్పిడి ద్వారా రికార్డింగు చేసారు. ‘ప్రేమలేఖలు’ సినిమాకి బొంబాయిలో కూర్చొని మాటలు రాయడానికి ఆరుద్రకు కేవలం వారంరోజులు పడితే, పాటలకు మాత్రం మూడు విడతల్లో ఆరు నెలలు పట్టింది. హజ్రత్ జైపురి, శైలేంద్రలు రాసిన పాటల్ని రాజకపూర్ ఓకే చేసాక మాత్రమే తెలుగు, తమిళ వర్షన్ల పాటల రచనకు ఉపక్రమించాల్సి రావడంతో జాప్యం జరిగింది. తెలుగులో ఆరుద్ర రాస్తే తమిళంలో కణ్ణదాసన్ పాటలు రాసారు. ఈ సినిమాకి హజ్రత్ జైపురి, శైలేంద్రలతో ఆరుద్ర పనిచెయ్యడంతో ట్యూన్లు కట్టే రహస్యాలు, అంత్యప్రాస మెళకువలు, సన్నివేశాల కిటుకులు బాగా వంటబట్టాయి. హిందీ మాతృక “జానే న నజర్, పెహచానే జిగర్” పాటను “నీవెవ్వరివో చిరునవ్వులతో” అంటూ నేటివిటీకి దగ్గరగా ఉండేలా స్వేచ్ఛానువాద పాటగా మలిచారు. అంతేకాదు ఆరుద్ర తెనిగించిన ఈ సినిమా పాటలు లిప్ మూవ్మెంట్ కు కచ్చితంగా సింక్ కావడం ముఖ్యంగా చెప్పుకోవాలి. ఉదాహరణకు, “మేరా అంగ్ అంగ్ ముస్కాయా” అనే లైనుకి “మది పొంగి పొంగి పులకించే” అంటూ రాయటం ఆరుద్ర గొప్పతనం. అలాగే “ఝణన్ ఝణన్ ఝణన్ ఝణన్ ఘుంఘర్వా బాజే” పాటను “ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు గజ్జెల సంగీతం”గా; “ఆజారే అబ్ మేరా దిల్ పుకారా” పాటను “రారాదా మది నిన్నే పిలిచే కాదా” గా; “రాజాకి ఆయేగి బారాత్ రంగీలి హోగి రాత్” పాటను “పందిట్లో పెళ్లవుతున్నాది, కనువిందవుతున్నాది”గా; “యేషామ్ కి తన్హాయియా-ఐసె మై తేరాఘమ్” పాటను “ఏకాంతమూ సాయంత్రమూ ఎద నీకై వేగేనూ” అంటూ అర్థవంతంగా రాసారు. ఆరుద్ర పాటలన్నీ డబ్బింగు పాటల్లా వుండకపోవడానికి కారణం సందర్భోచితమైన పదాల అల్లికతో అనువదించడమే! సహచర గేయ రచయిత తోలేటి వెంకటరెడ్డి అకాల మరణానికి గురైనప్పుడు ‘ఆలీబాబా 40 దొంగలు’ తమిళ సినిమా డబ్బింగు పనులు ఆరుద్ర పూర్తిచేసి ఆ సినిమాకు రావలసిన పారితోషికాన్ని మొత్తం తోలేటి కుటుంబానికి ఇచ్చి వారిని ఆదుకున్న సహృదయులు ఆరుద్ర. మోడరన్ ధియేటర్స్ వాళ్ళు తమ తమిళ సినిమాలన్నిటినీ ఆరుద్ర ముందు పెట్టి, అనువాదానికి పనికొచ్చే వాటిని ఎంపిక చెయ్యమన్నారు. తమిళంలో సావిత్రి నటించిన ‘మహేశ్వరి’ సినిమాని ఎంపికచేసి ‘రాణీ రంగమ్మ’ పేరుతో డబ్ చేసి ‘ఆలీబాబా 40 దొంగలు’ సినిమాకన్నా ముందే విడుదలచేస్తే, అది విజయవంతమైంది. అనువాద పర్వంలో ఆరుద్రకు పేరు తెచ్చిపెట్టిన మరోచిత్రం ‘మురిపించే మువ్వలు’. తమిళంలో ‘కొంజుం సెలంగై’ పేరుతో వచ్చిన ఈ సినిమాకు ఎస్.ఎమ్. సుబ్బయ్య నాయుడు సంగీతదర్శకుడు. అందులో “సింగార వేలనే దేవా” పాటను ఆరుద్ర “నీ లీల పాడేద దేవా-మనవి ఆలించ వేడెద దేవా” గా రాయగా ఎస్. జానకి అద్భుతంగా పాడింది. ఆమె ఎక్కడ కచ్చేరి చేసినా ఈ పాట తప్పనిసరిగా పాడేవారు. ఘంటసాల నిర్మించిన ‘పరోపకారం’ సినిమా విషయానికొస్తే, అది బెంగాలీలో దేవకీబోసు నిర్మించిన సినిమాకి స్వేచ్చానుకరణ. “పరోపకారాయ పుణ్యాయ-పాపాయ పరిపీడనం” అనే ఆర్యోక్తి నేపథ్యంలో సాగే యీ సినిమాలో సంగీతానికి చక్కని అవకాశముండటంతో పాటలు ఎంతోబాగా కుదిరాయి. ఒకే సిట్టింగులో ఆరుద్ర మూడేసి పాటలు రాస్తుంటే, ఘంటసాల వెంటనే వాటికి మట్లు కట్టేవారు. ఈ సినిమాలో ఆరుద్ర చిన్న బిచ్చగాడి పాత్ర కూడా వేశారు. ‘పరోపకారం’ విజయవంతం కాకపోవడంతో ఆరుద్ర రచనా ప్రతిభకు గుర్తింపు రాలేదు.
పురాణ పాటలపై సాహిత్య విహారం: చాగంటి సోమయాజులు (చాసో), శ్రీశ్రీల మార్క్సిస్టు భావాలు ఆరుద్ర కవితా ధోరణిలో ప్రస్ఫుటంగా కనిపిస్తాయనే మాట నిజం. అటువంటి ఆరుద్ర, పౌరాణిక సినిమాలకు అద్భుతమైన పాటలు రాసారు. ‘చెంచులక్ష్మి’ సినిమాలో నారదుడికి రాసిన “కరుణాల వాలా, ఇది నీకు లీలా-అంతయును వింత, పొగడగ నేనెంత” అనే పల్లవితో సాగే పాటలో నారదుడు ప్రవేశించే ప్రతిసారీ, సందర్భోచితంగా ఉండేలా చరణాలు రాసారు. “పరసతులను చెరబట్టే అంధుడు-ఆ సురలోకం పాలించే ఇంద్రుడు: పదవిమీద ఆశచేత ప్రభువాయెను పశువు-పాపం తననేమిచేసె కడుపులోని శిశువు”అంటూ అంత్యప్రాసలతో ఆడుకున్నారు. “శ్రీ వేంకటాచలవాసా-నిను సేవింతుమో శ్రీనివాసా”(శ్రీవెంకటేశ్వర వైభవం), “నారాయణ నీ లీలా నవరస భరితం”(బాలభారతం),“వెడలెనుకోదండపాణి”; “సీతారాముల కల్యాణం-చూచినవారిదె వైభోగం”(సంపూర్ణ రామాయణం), “పలుకే బంగారమాయెరా కోదండరామా”(అందాల రాముడు), “మేలుకో శ్రీరామ-మేలుకోరఘురామ”: “శ్రీయుతమౌ శ్రీరామనామం జీవామృతసారం”(శ్రీ రామాంజనేయ యుద్ధం), “నోముపండింది మానోము పండింది కృష్ణా”(యశోద కృష్ణ), “శ్రీ కాళహస్తీశ్వరా హరహర-కరుణించి నను బ్రోవరా”(భక్త కన్నప్ప), “శ్రీరామ నామాలు శతకోటి-ఒక్కొక్క పేరు బహుతీపి” (మీనా), “జయ మంగళ గౌరీ దేవి- దయచూడుము చల్లని తల్లీ” (ముద్దుబిడ్డ) పాటలు ఇందుకు నిదర్శనాలు.
నిషాపాటల ఖుషీ హేల: హాలీవుడ్, బాలీవుడ్ సినిమాల ప్రభావ ప్రవాహంలోపడి తెలుగు సినిమాల్లో కూడా క్లబ్ డ్యాన్సుల జోరు, నిషా పాటల ఖుషీలు ఎక్కువైనాయి. అటువంటి సందర్భాలకు పాటలు రాసేందుకు నిర్మాతలు, దర్శకులు ఆరుద్రనే సూచించేవారు. ఆండ్రూ సిస్టర్స్ ఆలపించిన “డ్రింకింగ్ రమ్ అండ్ కోకాకోలా” స్పూర్తితో ఆరుద్ర “ఏస్కో కోకాకోలా-తీస్కో రమ్ము సారా” అని ‘రౌడీలకు రౌడీలు’ సినిమా కోసం ఆరుద్ర పాట రాసారు. అలాగే దేవుడు చేసిన మనుషుల్లో రమేష్ నాయుడు వరసలు కట్టిన “మసక మసక చీకటిలో మల్లెతోట వెనకాల” పాట వంటి క్లబ్ సాంగ్ తదనంతర కాలంలో రాలేదనే చెప్పాలి. ఇంకా చెప్పుకుంటే “డైమన్ రాణీ గులాబి బుగ్గ నీదే” (నేరం నాదికాదు ఆకలిది), “ఏస్కో బుల్లోడా నాటుసారాయి” (చైర్మన్ చలమయ్య), “రా రమ్మంటేరారా- నీ భరతంపడతారా”(అందరూ దొంగలే) “డేగలాగావస్తా, తూనీగాలాగావస్తా” (కన్నతల్లి), “తాగాలి రమ్ మనమందరం” (దేవుడమ్మ), “ఏస్కో నారాజా ఏస్కో- ఆకేస్కో, వక్కేస్కో, ఆపైన చూస్కో”(చిట్టి తమ్ముడు), “తాగినోడి మాట మంచినీళ్ళ మూట”(కొరడా రాణి) “మొదటి పెగ్గులో మజా-వేడి ముద్దులో నిషా” (శ్రీమంతుడు) “తకిట దిమితక తైతై తమాషా మైకం” (మోసగాళ్ళకు మోసగాడు) వంటి మైకం పాటలు ఆరుద్ర సాహిత్య పొదిలో కోకొల్లలు.
అనుపమ గీతాలు: అనుపమ బ్యానర్ కింద తిలక్ నిర్మించిన సినిమాల్లో పాటలకు ఒక ప్రత్యేకత వుంది. అది ఆరుద్ర-పెండ్యాల-తిలక్ ల సంయుక్త సంజనితం. ముద్దుబిడ్డ సినిమాలో “చూడాలని ఉంది అమ్మా చూడాలని వుంది” పాట ‘దీక్ష’ సినిమాలో ఆత్రేయ రాసిన “పోరాబాబూపో” పాటకు దగ్గరగా వుంటుంది. అందులోనే ఆరుద్ర రాసిన “ఎవరుకన్నారు, ఎవరుపెంచారు నవనీతచోరుని, గోపాలబాలుని” పాట మల్లాది రామకృష్ణ శాస్త్రికి యెంతోయిష్టమైన పాట. హైదరాబాదుని రాజధానిగా నిర్ణయించక పూర్వం కళాత్మకంగా వర్ణిస్తూ రాసిన “ఇదేనండి ఇదేనండి భాగ్యనగరం-మూడుకోట్ల ఆంధ్రులకు ముఖ్య పట్టణం” పాటను ఎం.ఎల్.ఏ సినిమాకోసం ఆరుద్ర రాసారు. అదే చిత్రంలో ఎస్. జానకిని పరిచయం చేస్తూ ఘంటసాల గళం కలిపిన “నీఆశ అడియాస-చేజారే మణిపూస” పాట విననివారు ఆ తరంలో ఎవరూ వుండరనేది నిర్వివాదాంశం. మరో పాట “జామి చెట్టు మీదనున్నజాతి రామ చిలుక-ఎంతో ముచ్చట పడినా నాపై ఎందుకు నీకీ అలుక” కూడా అందమైనదే. ‘అత్తా ఒకింటి కోడలే’ సినిమాలో జగ్గయ్య, గిరిజ కోసం ఆరుద్ర రాసిన “పైలాపైలా పచ్చీసు, పరువంలోనే లేడీసు-మగాళ్ళతోటి సమానమంటూ ఎక్కారండీ సైకిల్సు” సరదాగా సాగే పాట. సూర్యకాంతాన్ని భయపెడుతూ జగ్గయ్య పాడే “జోడుగుళ్ల పిస్తోలు ఠా- నేను ఆడీ తప్పని వాణ్ణి జీహా”పాటలో “తొండ ముదిరితే ఊసరవెల్లి-హజం ముదిరితే హళ్లికి హళ్లి” అని ఆరుద్ర చేసిన ప్రయోగాన్ని జనం ఎంత మెచ్చుకున్నారో చెప్పలేం. ‘ఈడూ-జోడూ’ చిత్రం కోసం రాసిన “ఇదేమి లాహిరి ఇదేమి గారడీ…ఎడారిలోన పూలుపూచి ఎంతసందడి” పాటను మహాబలిపురంలో చిత్రీకరిస్తూ వుండగా అక్కడికొచ్చిన జపాన్ దేశపు సాంస్కృతిక బృందం, ఆ పాటను మళ్ళీ మళ్ళీ ప్లే చేయించుకొని విన్నారట. ఇక ‘ఉయ్యాల-జంపాల’ చిత్రంకోసం ఆరుద్ర రాసిన “ఓ పోయే పోయే చినదానా, నీ తీయని మనసు నాదేనా, కలలో పూచిన కమ్మని ప్రేమ కాయా పండా నెరజాణా”; “ఏటిలోని కెరటాలు ఏరు విడిచిపోవు-ఎదలోపలి మమకారం ఎక్కడకీ పోదు”; “నీలోన ఊగె, నాలోన ఊగె-చూడచక్కనీ ఊయలొక్కటి- ఉయ్యాలా జంపాలా”; “కొండగాలి తిరిగింది-గుండె ఊసులాడింది, గోదావరి వరదలాగా కోరిక చెలరేగింది” పాటలు అజరామరాలే. అదే సినిమాలో హిందీ ట్యూనుతో ఒక పాటుంది. ‘జంగ్లి” సినిమాలో “చాహే కోయి ముఝే జంగ్లి కహే” అనే ఆ పాటను స్పూర్తిగా తీసుకొని “దాచిన దాగదు వలపు-ఇక దాగుడు మూతలు వలదు, చక్కనీ కోపము చల్లనీ తాపము ఎందుకు మనలో మనకు” అని ఆరుద్ర పాటగా మలిచారు. నాస్తిక సిద్ధాంతాన్ని నమ్మే ఆరుద్ర ‘ఉయ్యాల-జంపాల’చిత్రం కోసం రాముడి మీద ‘’అందాల రాముడు ఇందీవర శ్యాముడు ఎందువలన దేముడు’’ అనే ఒక పాట రాసారు. “శ్రీరామచంద్రుడు దేవుడు” అంటూ టీచర్ విద్యార్ధులకు బోధిస్తుంటే “ఆయన దేవుడెందుకు అయ్యాడు” అని పిల్లలు ప్రశ్నిస్తారు. దానికి ఆమె పాట రూపంలో జవాబిస్తుంది. “తండ్రి మాటకై పదవుల త్యాగమే జేసెను-తన తమ్ముని బాసకై తాను బాధపొందెను: అనుభవించదగిన వయసు అడవిపాలు జేసెను-అడుగు పెట్టినంతమేర ఆర్యభూమి జేసెను: ధర్మపత్ని చెరబాపగ దనుజుని దునుమాడెను-ధర్మము కాపాడుటకా సతినే విడనాడెను” అని పాడుతూ ప్రతి చరణం చివర “అందాల రాముడు, ఇందీవర శ్యాముడు, ఇనకులాబ్ది సోముడు అందువలన దేముడు” అని సోదాహరణంగా పిల్లలకు సంశయ నివృత్తి చేస్తుంది. కోలాటం పాటగా ఇదో అద్భుత ప్రక్రియ. ఆరుద్ర కృష్ణుడి మీద కూడా ‘కృష్ణ ప్రేమ’ చిత్రంలో ఇలాంటి ప్రయోగమే చేసారు. రాధకు, చెలికత్తె చంద్రావళికి మధ్య జరిగే సంవాదంగా ఆపాటను ఎస్.వరలక్ష్మి, జిక్కి పాడారు. రాధ “నవనీత చోరుడు, నందకిశోరుడు అవతార పురుషుడు దేవుడే” అంటే “తెలియని మూఢులు కొలచినవాడు ఎటువంటివాడు భగవానుడే” అని ఉడికిస్తుంది సఖి. “పసి వయసునందే పరిపరి విధముల ప్రజ్ఞను చూపిన మహనీయుడే” అనేది రాధ జవాబు. “కోనేట యువతుల స్నానాలుచేయ, కోకల దొంగ మొనగాడటే” అనే సఖియ ప్రశ్నకు “పడతులకపుడు పరమార్ధ పథము భక్తిని నేర్పిన పరమాత్ముడే- పదునాల్గు జగములు పాలించువాడే ప్రత్యక్ష దైవము శ్రీకృష్ణుడే” అంటూ రాధ జవాబిస్తుంది. ఆ మాటకు “ఎదురేమిలేని పదవి లభిస్తే ఎటువంటివాడైనా భగవంతుడేలే” అంటూ చంద్రావళి దెప్పిపొడవటం కొసమెరుపైతే, తరవాత వచ్చే సీక్వెల్ పాటలో చంద్రావళే కృష్ణుని భగవంతుని గా కొలవడం ఆరుద్ర ముద్ర. ఇలా అనుపమ తిలక్ కె కాకుండా మరెందరో నిర్మాతలకు తన కలం పస నిరూపించిన అసాధారణ ప్రతిభాశాలి ఈ ఆరుద్ర పేరుతో పిలవబడిన సదాశివ శంకరశాస్త్రి.
హాస్య రచనా ధురీణ: ఆరుద్ర హాస్య గీతాల శైలి విలక్షణంగా వుంటుంది. గుత్తా రామినీడు సినిమా ‘మా ఇంటి మహాలక్ష్మి’లో ప్రేమలో పడిన ప్లీడరు గుమాస్తా రమణారెడ్డికి ఆరుద్ర ఒక పాట రాసారు. ఎంత ప్రేమలో పడినా కోర్టు భాషా పదజాలం పరిధిలోనే ఆపాట వుంటుంది. “నువ్వంటేనే నాకు మోజు-అలా రాసిస్తానే దస్తావేజు-మీను లాంటి నీ కన్నులు అమీనై-జామీను లేని నా మదిని జప్తు చేసినై… నీ మనసు నీ హృదయం ఎక్స్ పార్టీలై తీసుకున్నాయ్ డిక్రీనీ నాపై” అంటూ సాగుతుంది. అలాగే ‘అక్కా-చెల్లెళ్ళు’ సినిమాలో ఇంద్రజాలికుని వేషంకట్టిన రమణారెడ్డి కోసం “ఇండియాకు రాజధాని ఢిల్లీ-నా గుండెల్లో ప్రేమరాణి లిల్లీ” అంటూ మరోపాట రాసి నవ్వులు కురిపించారు. జగపతి రాజేంద్రప్రసాద్ తొలిప్రయత్నంగా నిర్మించిన ‘అన్నపూర్ణ’ సినిమాలో “ఎన్నాళ్ళైనదిరో మావయ్యా… ఎప్పుడు వచ్చావురో, మావయ్యా ఎన్నాళ్లుంటావురో” అనే పాటను జైలునుంచి బయటకు వచ్చిన రమణారెడ్డిని ప్రశ్నించేదిగా ఆరుద్ర మలిచారు. అందులోనే రేలంగి కోసం రాసిన మరొక అద్భుతమైన పాట “వగలాడి వయ్యారం బలే జోరు-నీ వయ్యారం ఒలికించు ఒన్సు మోరు”లో “కోరుకున్నదిచ్చుటలో కొద్దిగా లేటు-కోపమేల ఇదేకదా నా పొరబాటు” అని రేలంగి చెబుతుంటే, ‘’పొరబాటులు చేయుటే తమకలవాటు, అయినా ఇమ్మంటారు హృదయంలో చోటు’’ అంటూ గిరిజ జవాబివ్వడం సరదాగా వుంటుంది. ఇక ‘అత్తా ఒకింటి కోడలే’ సినిమాలో చదలవాడ కుటుంబరావు, సీత పనిమనుషులుగా వుంటారు. వారిద్దరి మధ్య వచ్చే తడిక బేరం పాటను “మాయదారి కీచులాట మా మధ్య వచ్చింది-రాయబారం చెయ్యవే తడికో తడికా…” అంటూ రాసి తడిక రాయబారానికి శ్రీకారం చుట్టారు ఆరుద్ర. ‘ఆరాధన’ సినిమాలో రేలంగి, గిరిజకు ఆరుద్ర రాసినరెండు హాస్యగీతాలున్నాయి. “ఒహోహో మామయ్యా ఇదేమయ్యా బలేబలే బాగా వుందయ్యా- ఇంటిని విడిచి షికారు కొడితే యెంతో హాయి కలదయ్య… అంటుంటే రేలంగి “ఒహోహో అమ్మాయి ఇది కాలేజీ బలేబలే బతికిన కాలేజీ’’ అంటూ జవాబిస్తూ చుట్టూతిప్పడం బాగుంటుంది. మరొకటి “ఇంగ్లీషులోన మ్యారేజి-హిందీలో అర్ధము షాది- ఏ భాషలో ఏమన్ననూ మన తెలుగులోన పెళ్లి” రెండోది. రెండు పాటలు హుషారుగా నడిచేవే. “ఆడదాని ఓరచూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వరో” అనే క్లబ్ పాట ఆరోజుల్లో ప్రతి యువకుని నోట్లో నానిందే. ఇలాంటి చమత్కారపు పాటలు ఆరుద్ర ఎన్ని రాశారో లెక్ఖే లేదు.
కొసమెరుపు: గుత్తా రామినీడు ‘భక్తపోతన’ సినిమాకోసం ఆరుద్రను శ్రీనాధుడు పాడుతూవుంటే రాజనర్తకి నృత్యంచేసే సన్నివేశానికి పాట రాయమన్నారు. శ్రీనాధుడి నుడికారాలను ఉపయోగిస్తూ “నాగరాజ కన్య, జగదేక మాన్య-కమనీయ దివ్యకల్యాణ ధన్య-సెలయేట ఆడి, చిరుబంతి పసుపు-చెలువార కదిలే హరసేవ కొరకు” అంటూ అద్భుతమైన పాటను ఆరుద్ర రాయగా రాజేశ్వరరావు అంతే అద్భుతంగా స్వరరచన చేసారు. డ్యాన్సు డైరెక్టరు పసుమర్తి కృష్ణమూర్తి ఆపాటలో కొన్ని విరుపులు చేర్చితే బాగుంటుందంటే ఆరుద్ర సరేనన్నారు. పసుమర్తి అనేక మార్పులు సూచించడంతో అసలు పాటనే మార్చాల్సిన పరిస్థితి ఎదురైంది. ఆరుద్రకు కోపమొచ్చింది. ఇంకెవరిచేతనైనా పాట రాయించుకోమని కరాఖండిగా చెప్పి, రాసిన పాటను దర్శకుని చేతిలోపెట్టి వెళ్ళిపోయారు. అంతే! సినిమాలో ఆరుద్ర రాసిన పాటే ఉండిపోయింది.
ఆరుద్ర గురించి చిన్న వ్యాసంలో చెప్పేందుకు పదాలు చాలవు. ఆయనదో సుదీర్ఘ ప్రస్థానం. సతీతులసి, దక్షయజ్ఞం, కన్నతల్లి, ముద్దుబిడ్డ, అమరసందేశం, కృష్ణప్రేమ, పెంకిపెళ్లాం, పరోపకారం, బాలభారతం, యశోదాకృష్ణ, గూఢచారి 116, అసాధ్యుడు, పెళ్లిపిలుపు, నువ్వా-నేనా, మోసగాళ్ళకు మోసగాడు, భలే గూఢచారి, అన్నపూర్ణ, లక్ష్మీనివాసం వంటి ఎన్నో సినిమాలకు కథ, మాటలు, పాటలు సమకూర్చినా; ఉయ్యాల-జంపాల, తూర్పువెళ్ళేరైలు, జీవితచక్రం, బావామరదళ్ళు, ఈడు-జోడు, దేవాంతకుడు, ఆస్తులు-అంతస్తులు, ఆనందనిలయం, దేశద్రోహులు, అల్లూరిసీతారామరాజు, ఆత్మీయులు, ఆత్మగౌరవం, పవిత్రబంధం, ఇల్లరికం, ఆంద్రకేసరి, మిస్టర్ పెళ్ళాం, పెళ్ళిపుస్తకం, బుద్ధిమంతుడు, డాక్టర్ చక్రవర్తి, మంచిమనసులు, వీరాభిమన్యు, ముత్యాలముగ్గు, దేవదాసు(కృష్ణ), మీనా, గోరంతదీపం వంటి అసంఖ్యాక సినిమాలకు పసందైన పాటలు రాసినా ఆరుద్ర కలానికి అలుపు రాలేదు.
‘సమగ్ర ఆంధ్ర సాహిత్య’ రచనకు పూనుకోకుండావుండివుంటే ఆరుద్ర ఇంకా ఎన్నో రసరంజకమైన పాటలు రాసేవారే! “నీలి మేఘాలలో-గాలికెరటాలలో”(బావామరదళ్ళు), “కొండగాలి తిరిగింది-గుండె ఊసులాడింది”(ఉయ్యాల-జంపాల), “జగమే మారినది మధురముగా ఈవేళా” (దేశద్రోహులు), “అదిగో నవలోకం వెలసే మనకోసం” (వీరాభిమ న్యు), “మనసే అందాల బృందావనం” (మంచికుటుంబం), “పయనించే మనవలపుల బంగరు నావ” (బావామరదళ్ళు) వంటి ఆరుద్ర భావగీతాలు సరళమైన శైలిలో, భావగర్భితంగా వుంటాయి. “గాంధి పుట్టిన దేశమా ఇది” (పవిత్రబంధం), “నమోనమో బాపు మాకు న్యాయ మార్గమే చూపు”(ఎం.ఎల్.ఎ) పాటలు సమాజశ్రేయస్సుకోసం రాసిన గీతాలు. “ముత్యమంతా పసుపు ముఖమెంతో చాయా” (ముత్యాలముగ్గు) తెలుగునాట సాంప్రదాయబద్ధమైన పాట. “రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా”(గోరంతదీపం), “శ్రీరస్తుశుభమస్తు”(పెళ్ళిపుస్తకం) పాటలు కలకాలం గుర్తుండిపోయేవి. ఇంతమంచి సాహిత్య సేవ చేసినా ఆరుద్రకు రావలసినంత గుర్తింపు రాలేదుసరి కదా ఎలాటి పురస్కారమూ దక్కలేదు. కానీ ఆరుద్ర స్థానం అటు సాహిత్య సేవలో, ఇటు సినీరంగ సేవలో అసామాన్యమే!!!
–ఆచారం షణ్ముఖాచారి