గుంటూరులో చారిత్రాత్మక రంగస్థల విజయం–“ఆర్య చాణక్య” అద్భుత ప్రదర్శన
మాగంటి మురళీ మోహన్ ద్వితీయ నాటకోత్సవాలు, గుమ్మడి శ్రీమన్నారాయణ కళాసమితి 19వ వార్షికోత్సవాలు, వై.కే. నాగేశ్వరరావు కళాపరిషత్ 9వ వార్షికోత్సవాల సందర్బంగా డిజిటల్ సాంకేతికతతో చరిత్రను సజీవంగా ఆవిష్కరించిన మహతి క్రియేషన్స్ – కళావిపంచి సంయుక్త నాటక మహోత్సవం.
“మహతి క్రియేషన్స్” మరియు “కళావిపంచి, హైదరాబాద్” వారి సంయుక్త నిర్వహణలో గుంటూరు బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలోని అన్నమయ్య కళావేదికపై సోమవారం ప్రదర్శించబడిన “ఆర్య చాణక్య” చారిత్రాత్మక నాటకం కళాప్రియులకు ఒక విశిష్టఅనుభూతిని అందించింది.
ఈ నాటకం కేవలం ఒక ప్రదర్శనగా కాకుండా, చరిత్రను రంగస్థలంపై సజీవంగా ప్రతిబింబించిన అరుదైన కళారూపంగా నిలిచింది.
ఈ నాటకంలోని ప్రధాన విశేషం నటీనటుల ప్రదర్శనే అని చెప్పాలి. ప్రతి పాత్రధారి తమ పాత్రలో పూర్తిగా లీనమై, భావవ్యక్తీకరణ, సంభాషణా పటిమ, శరీర భాష… మొత్తం కలిపి అద్భుతమైన నటనను కనబరిచారు.
- ముఖ్యంగా చాణక్య పాత్రధారి (చంద్రశేఖర్) ఆ పాత్రలోని గంభీరత, రాజకీయ చతురత, ధైర్యం, డైలాగ్ డెలివరీలో టైమింగ్ ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంది.
- ఇతర పాత్రలు కూడా తమ తమ స్థాయిలో కథను బలంగా ముందుకు నడిపించాయి.
- ఇదివరకు గుంటూరులో అరుదుగా కనిపించిన ఒక సాంకేతిక వినూత్నత ఈ నాటకంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
- డిజిటల్ స్క్రీన్ వినియోగం ద్వారా ప్రతి సన్నివేశానికి తగిన నేపథ్యాన్ని ప్రత్యక్షంగా చూపించడం ద్వారా ప్రేక్షకులు కథలో మరింతగా మునిగిపోయేలా చేశారు.
- నాటకం దర్శకులు శ్రీ సుబ్బరాయ శర్మ గారి సీనియార్టీ ప్రతిభ ఈ నాటకంలో ప్రతి అంశంలో స్పష్టంగా కనిపించింది. కథా నిర్మాణం, పాత్రల ఎంపిక, సన్నివేశాల అమరిక ప్రతి దానిలోనూ ఆయన నైపుణ్యం ప్రతిఫలించింది.
- కళావిపంచి బుజ్జి గారి నిర్వహణ సామర్ధ్యం మరోమారు నిరూపితమైంది. భద్రుని పాత్రతో నాటకం పట్ల తన నిబద్ధతను చాటుకున్నారు.
- చంద్రగుప్తుని పాత్రకు న్యాయం జరిగింది.
‘ముర’ పాత్రధారిణి శ్రీమతి శోభారాణి గారు, విషకన్యగా అభినయించిన శ్రీమతి ప్రియాంక గారు తమదైన శైలిలో నటనతో పాటు నృత్యంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. - సీనియర్ నట దిగ్గజాలు భాగీశాస్త్రి గారు, లంకా లక్ష్మీనారాయణ గారు, నిట్టల గారు, తిరుమలేశ్వరరావు గారు తదితరులు తమ పాత్రల్లో ఒదిగిపోయారు.
- పాత్రల వస్త్రధారణ నాటకానికి మరింత విశ్వసనీయతను జోడించింది.
- సోదరులు సాయితేజ అందించిన నేపథ్య సంగీతం భావోద్వేగాలను మరింత గాఢంగా చేరవేసింది.
- సురభి సంతోష్ నేతృత్వంలో సాంకేతిక వర్గం చేసిన కృషి ప్రశంసనీయం.
- లైటింగ్, సౌండ్ (శ్రీను), మదన్ చౌదరి గారి డిజిటల్ ప్రెజెంటేషన్ అంశాలు సమయోచితంగా వినియోగించబడ్డాయి.
- మొత్తంగా చూస్తే, “ఆర్య చాణక్య” నాటకం గుంటూరు ప్రేక్షకులకు ఒక నూతన అనుభూతిని అందిస్తూ, చారిత్రక నాటకాల ప్రాముఖ్యతను మరోసారి గుర్తు చేసింది.
- ఎక్కడా అనవసర దృశ్యాలు, డైలాగ్స్ లేకుండా మీటర్ బద్ధంగా సాగిన ఈ అద్భుత ప్రదర్శనకు కృషి చేసిన దర్శకులు సుబ్బరాయ శర్మ గారికి, కళావిపంచి బుజ్జి గారికి, నటీనటులకు, సాంకేతిక నిపుణులకు హృదయపూర్వక అభినందనలు.
- “ఆర్య చాణక్య” నాటకాన్ని ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రధాన వేదికలపై ప్రదర్శించాల్సిన అవసరం ఉంది.
పొగర్తి నాగేశ్వరావు, (జర్నలిస్ట్, నటుడు, రచయిత, దర్శకుడు)
(9381243599)
