విశ్రాంత ఆకాశవాణి ఉద్యోగి ఏ.బి. ఆనంద్ గారి అనుభవాలు..
పారి నాయుడు నాకు మంచి మిత్రుడు శ్రీకాకుళం పరిసర ప్రాంతాలలో పల్లెలలో పిల్లల్లో విద్యా వ్యాప్తి చేయడానికి ఎంతో కృషి చేస్తున్నాడు ఆయన వావిలాల గోపాలకృష్ణయ్య గారి భక్తుడు. వావిలాల వారి పేరుతో అనేక పాఠశాలలు నిర్మించి విద్యార్థులను ప్రోత్సహించే మనస్తత్వం కలిగినవాడు. ఆయన ఒకసారి నా సహకారం కావాలన్నారు తప్పకుండా చేస్తానని చెప్పమన్నాను. మా పిల్లలు ఎవరికి అక్షరం ముక్కరాదు వారికి ఎవరికీ చదువు సంధ్యలు లేవు వేలిముద్ర గాళ్ళు వాళ్లను ఉత్తేజ పరచడానికి అప్పుడప్పుడు మీరు వచ్చి ఉపన్యాసాలు చెప్పాలి అన్నాడు. అలాగే వెళ్లి అనేక పాఠశాలల్లో ఉపన్యాసాలు ఇచ్చి వచ్చాను. ఓ రోజు నా కార్యక్రమం అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంట్లో కబుర్లు చెప్పుకుంటూ చిన్న సలహా ఇచ్చాను. పిల్లలతో నాటకాన్ని ఏర్పాటు చేస్తే దానిని రేడియోలో ప్రసారం చేస్తాను దానివల్ల వాళ్ళలో ఉత్తేజం పెరుగుతుంది అంటే చాలా తక్కువ రోజుల్లోనే పిల్లలకు సంబంధించిన నాటకం నేను బడికి పోతా పేరుతో వేదిక పైన కూడా ప్రదర్శించడం కోసం ఏర్పాటు చేసుకున్నాడు.
ఆ నాటకంలో జి. అరుణ, సూర్యకుమారి, వెంకట్రావు, బి.ఎస్. చంద్రశేఖర్ వాళ్లంతా పాల్గొన్నారు. దానిని ముందు ఆకాశవాణిలో ప్రసారం చేసి తరువాత వేదికపై ప్రదర్శించడానికి నేను అక్కడే పది రోజులు ఉండి సాధన చేస్తే అంతా మెరికల్ లా చేశారు. ఆ పది రోజులు అక్కడే ఉన్నాను ఉపాధ్యాయులంతా రేడియోకి వేదికకు భేదాన్ని చెబుతూ వారితో సాధన చేస్తున్న క్రమాన్ని చూసి ఇది చాలా గొప్ప ప్రయోగం సార్ అక్షరం ముక్క తెలియని మా పిల్లల తోనే ఎంతో గొప్పగా చేయించారు అంటే మామూలు నటులతో మీరు ఇకెంత అద్భుతంగా తయారు చేయగలరో అర్థం చేసుకోగలం అందుకే మీ నాటకాల్లో ఉద్వేగం ఉంటుంది కదా అని కొనియాడడం నాకు జ్ఞానపీఠ్ వచ్చినంత ఆనందాన్ని కలిగించింది. ఆకాశవాణి తలుచుకుంటే చేయలేని పని సామాజిక సేవ ఉండబోదు.
-ఏ.బి. ఆనంద్