పత్రిక ప్రారంభం:

ప్రపంచంలో ఏ ప్రాంతం నుంచైనా ఇంటర్నెట్ లో చదువుకునేందుకు, కళలను, కళాకారులను ప్రోత్సహించేందుకు 64కళలు డాట్ కామ్ (సకల కళల సమాహారం) అంతర్జాల పత్రిక (https://64kalalu.com/) పేరుతో వెబ్ మేగజైను నవంబర్, 1 వ తేదీన 2010 సం.లో ప్రారంభించాము. ఈ వెబ్ మేగజైనుకు సంపాదకులుగా గత 15 సంవత్సరాలుగా కళాసాగర్ యల్లపు అను నేను సారధ్యం వహిస్తున్నాను.

మాసపత్రికగా: మొదట మాసపత్రికగా 40 పేజీలతో రంగుల్లో డిజైన్ చేసి, పి.డి.ఎఫ్. ఫార్మేట్లో ప్రతీనెలా 1 వ. తేదీన అప్డేట్ చేసేవాడిని. ఎప్పుడైనా ఇంట్లో ఇంటర్నెట్ సమస్య తలెత్తితే బయట నెట్ సెంటర్కు వెళ్లి పత్రిక అప్డేట్ చేసేవాడిని. పత్రికను ప్రారంభిస్తే సరిపోదు కదా. నలుగురికి తెలియజేయడానికి ఇ-మెయిల్స్ ద్వారా లింక్లు పంపడం, కరపత్రాలు పంచడం ద్వారా ప్రచారం చేశాను. మొదట్లో పత్రికను నెలకు సగటున రెండు వేలమంది లోపే చదివేవారు.

యూనికోడ్ ఫాంట్స్: 2016 నుండి పి.డి.ఎఫ్. ఫార్మేట్లో పెట్టడం వలన గుగూల్ సెర్చ్ ఇంజన్ పత్రికలోని కంటెస్ట్ను గుర్తించలేదు. కాబట్టి యూనికోడ్ ఫాంట్స్లోకి మార్చితే ఇంకా ఎక్కువ మంది పాఠకులకు చేరువవుతుందని ‘వర్క్స్ప్రెస్’ టెక్నాలజీలో పత్రికను రీ-డిజైన్ చేయించాను. అంతేకాకుండా సమాచార వ్యవస్థలో వచ్చిన వేగాన్ని అందుకోవడానికి మానపత్రికను వారపత్రికగా మార్చాను.
పుష్కరోత్సవం: 2022 సం॥ నవంబర్ నాటికి పన్నెండేళ్ళు పూర్తిచేసుకొని, పుష్కరోత్సవాన్ని 2023 సం॥ మార్చిలో జరుపుకొని పుష్కరోత్సవ ప్రత్యేక సంచికను ప్రచురించాము.
స్పటిక జయంతి: 2024 లో 15 ఏళ్ళు పూర్తి చేసుకొన్న సందర్భంగా స్పటిక జయంతి ఉత్సవం 2024 నవంబర్ 10, జరుపుకొని స్పటిక జయంతి ప్రత్యేక సంచికను ప్రచురించాము.

ఎన్నో అనుభవాలు: పన్నెండేళ్లలో టెక్నాలజీ పరంగా, రచనా వరంగా, పత్రికా ఎడిటర్ గా ఎంతో నేర్చుకున్నాను. సాఫ్ట్వేర్ కంపెనీలో యూజర్ ఇంటర్ ఫేన్ డిజైనర్ పనిచేసిన నా అనుభవం ఈ వెబ్ పత్రికను ఇంతకాలం నడపగలిగేందుకు దోహదపడింది.

’64కళలు, కాం’కు పెన్ను దన్ను: www.64kalalu.com పత్రిక సకలకళల సమాహారం కాబట్టి ప్రారంభంలో నాటకం, సినిమా, సంగీతం, సాహిత్యం లాంటి పలు అంశాలలో ఆర్టికల్స్ రాయించడం, సేకరించడం కష్టంగానే అనిపించింది. అయితే నాలుగేళ్ళ తర్వాత అనేక కళారంగాలకు చెందిన రచయితలు, కళాకారులు స్వచ్చందంగా వ్యాసాలు రాసి, పంపించి నాలో ధైర్యాన్ని నింపి, ముందుకు నడిపిస్తున్నారు. అందుకు రచయితలందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటాను.

అనేక కార్యక్రమాలు: ఈ 16 ఏళ్ళలో 64కళలు. కాం పత్రిక ఎక్స్ రే సాహిత్య, సాంస్కృతిక సేవా సంస్థ, సుమధుర కళానికేతన్, జాషువా సాంస్కృతిక వేదిక, శ్రీశ్రీ సాహిత్య నిధి, SAVE ఆర్గనిజేషన్, తానా ప్రపంచ సాహిత్య వేదికలతో కలసి కార్టూన్లు, చిత్రలేఖనం పోటీలు, ప్రదర్శనలు, వర్కు షాపులు నిర్వహించింది. 2021 సం.లో చిత్రకళా పరిషత్తో కలసి రంగుల రారాజు వడ్డాది పాపయ్య శతజయంతి ప్రత్యేక సంచిక ప్రచురణ, విశాఖపట్నం, విజయవాడలలో జయంతి సభలు నిర్వహించింది. 2022 సం.లో తెలుగు కార్టూనిస్టుల పరిచయాలతో కొంటె బొమ్మల బ్రహ్మలు’ పుస్తకం, 2023 సం.లో ‘తానా’ అమెరికా వారితో కలసి లక్ష రూపాయల నగదు బహుమతులతో కార్టూన్ పోటీలు నిర్వహించింది.

మరెన్నో కార్యక్రమాలకు మీడియా పార్టనర్ గా వ్యవహరిస్తున్నది. 2021 సంవత్సరంలో తెలుగు వికీపీడియా వారు కూడా కళా సంబంధిత వ్యాసాలు రాసేందుకు నన్ను వారి బృందంలో చేర్చుకున్నారు. ఇప్పటికే వికీపీడియాలో కొన్ని వ్యాసాలు రాశాను.

64 కళలు.కాం ద్వారా ప్రచురించిన పుస్తకాలు:
1) కొంటె బొమ్మల బ్రహ్మలు – కళాసాగర్ యల్లపు
2) యూట్యూబ్‌లో తెలుగు తేజాలు – కళాసాగర్ యల్లపు
3) కళాప్రపంచం – ఎల్.ఆర్. వెంకట రమణ
4) ఆర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ – కళాసాగర్ యల్లపు
5) చిత్ర సాహితీ (రంగుల బొమ్మల కొలువు)-పి.పి.నాయుడు
For more details please contact: Kalasagar Yellapu, mail: artistkalasagar@gmail.com, mob: 98852 89995