‘రంగస్థల రారాజు’కు కాంస్య విగ్రహం

తెలుగు పౌరాణిక పద్య నాటక రంగస్థలం పై 5 దశాబ్దాలు పైన తనదైన ముద్రతో నటించి, భాసించి, శోభిల్లిన, రంగస్థల రారాజు స్వర్గీయ శ్రీ ఆచంట వెంకటరత్నం నాయుడు గారి కాంస్య ప్రతిమను, ఆయన నడయాడిన విజయవాడ నడిబొడ్డున, కృష్ణవేణీ నదీమతల్లి తీరాన, అందునా కళలకు నిలయంగా భాసిల్లుతున్న తుమ్మలపల్లి కళాక్షేత్ర ప్రాంగణంలో నేడు (ఆగస్ట్ 12 న) ఆచంట నటసింహం యొక్క ప్రతిరూపం అవిష్కరించ బడుతున్న సందర్భంగా ప్రత్యేక వ్యాసం.

తెలుగు నేల నలు దిశలనుండీ విచ్చేసిన, నాటకరంగ అభిమానులుకూ.. పోషకులకూ..నాటక సమాజ నిర్వహుకులకూ, నటీనటులకూ, సాంకేతిక కళాకారులకూ స్వాగతం..!!సుస్వాగతం..!!

పౌరాణిక పద్యనాటక రంగస్థల నటులు… ప్రయోక్త… సమాజ నిర్వాహకులు.. షణ్ముక నాట్యమండలి వ్యవస్థాపకులు… మన శ్రీ వెంకటరత్నం నాయుడు ఆచంట…!!
మయసభలో రారాజుగా తెలుగు నాటక రంగ ప్రేక్షకుల కన్నుల పంట…!!

ఆంధ్రదేశాన ఆచంట అంటే ఓ రంగస్థల రారాజు…
ఒక అభిమానధన సుయోధన…
ఒక రాక్షసరాజు జలంధరుడు…
ఒక జరాసంధ మహారాజు…
ఒక బొబ్బిలి పులి
తాండ్ర పాపారాయుడు….
ఒక బ్రహ్మర్షి విశ్వామిత్ర….
ఒక ద్రోణాచార్య…
ఒక హైదర్ జంగ్…..
ఒక యమధర్మరాజు

నిండైన విగ్రహం.. కనువిందు చేసే రూపం.. నిండుగా పెల్లుబికే క్రోధావేశం.. మెండుగా మ్రోగే కంచు కంఠం. విశాలమైన ఎత్తైన వక్షస్థలం… కండలు తిరిగిన కైదండలు… అవమానభారంతో, నిప్పు కణికెల్లా క్రౌర్యంగా ఎర్రగా వెలిగే కళ్ళు… పగతో పటపట లాడే పళ్ళు.
సుయోధన చక్రవర్తి శౌర్యాన్నీ సంపదనీ..చాటే.. మణిమయ, సువర్ణ రత్న ఖచిత కిరీట, భుజకీర్త, కంఠాభరణ.. గద.. మెరుపుల ధగధగలు….
ధీర గంభీర తేజోమయ ముఖవర్ఛస్సు… ఆభిమానధనమే ఇంధనంగా మెలితిరిగి, మిస మిసా మెరిసే మీసాలు…సుతారంగా దువ్వే రత్నాల పొదిగిన ఉంగరపు వేళ్ళు…..
అసూయ.. అవమాన క్రోధావేశాలతో, ఎక్కుపెట్టిన విల్లులా ఒకవైపుకు లేచి నిలిచే కనుబొమలు… మదించిన సింహపు నడక.
సుయోధన పాత్రలో ఆయనకు సరి ఎవరు లేరంట..
గంభీరభాషణలోన గానీ.. వికటాట్టహసన లోన గానీ… అత్యద్భుతం..!!

వారి అపూర్వ హావభావల మయసభ ఏకపాత్రాభినయం…!!
అద్భుత సుదీర్ఘ సమాసాల…అలవోక ఉచ్చారణ భాషణ భూషణం.. అసమాన నటనా ప్రతిభల ప్రభ…!!!…
అద్భుత రాజసానికీ… అభిమానాన్నీ.. ప్రతీక…!!
ఆకాశమంత.. అహంకార… క్రోధావేశాల విన్యాసం…!!
అదుపుచేయలేని ఈర్ష్యా అసూయల ప్రదర్శన సమాహారం….!!
గర్జించే మేఘం…!!
గాండ్రించే సింహం..!!
తెలుగు నాటక “రంగస్థల “రారాజు” మన ఆచంట…..
ఇది ఏ ఒక్కరి మాట మాత్రమే కాదు…
తెలుగు నాట ప్రతిమారు మూల పల్లెలోనూ….ప్రముఖ పట్టణాల లోనూ … పండిత పామరుల నోటి మాటల ప్రశంసల నీరాజనాలతో జనం రారాజుగా శ్రీ ఆచంట వారికి కట్టిన కంచుకోట…!!
ప్రేక్షక అభిమానాల మూట…!!

రాక్షసరాజు జరాసంధుడి, వికృత భయానక వికట్టాట్టహాసం…
రారాజు సుయోధనుడిగా అహంకారపూరిత క్రోధావేశ అట్టహాసం….

భాషణలోనూ… భంగిమలోనూ, హాసంలోనూ, నట విన్యాసంలోనూ.. ప్రతి కదలికలోనూ, రాక్షసరాజుకూ రారాజుకూ గల పాత్రల స్వభావాల వైవిధ్యాన్ని ప్రస్పుటంగా ప్రదర్శిస్తూ.. నటిస్తూ.. ప్రేక్షకుల మన్ననలు పొందిన నటనాగ్రేసరులు శ్రీ ఆచంట.

ఎన్టీఆర్ ప్రశంస: ఒక సందర్భములో.. ఐశ్వ విఖ్యాత నటసార్వభౌములు, అన్న ఎన్టీఆర్, ఆచంట వారి నటన వీక్షించి “బ్రదర్.. సుయోధన పాత్ర నటన నన్ను చూచి నీవు నేర్చావా… నిన్ను చూచి నేను నేర్చానా ” అని మన ఆచంట నటనను ప్రశంసించారు.

పద్యనాటక పరిమళాలను తెలుగువారికి తన గళంద్వారా, రాగాల తీగల శృతులతో.. నటనాకౌశలం ద్వారా అందించిన మహానటుడు ఆచంట శ్రీ వెంకటరత్నం నాయుడు 1935, మే 28 వ తేదీన కృష్ణాజిల్లా, కొండపల్లి లో జన్మించారు. వెంకటరత్నం నాయుడుగారి తండ్రి వెంకటేశ్వర్లు నాయుడుగారు రంగస్థల కళాకారులు. అదే వారసత్వంగా ఈయనకు అబ్బింది.

చిన్నప్పటి నుంచే నీతిశాస్త్రంలో శ్లోకాలు, పద్యాలు కంఠస్థం చేసి, స్పష్టమైన వాచికంతో, చక్కటి గాత్రంతో పాడుతుంటే స్కూల్లో ఉపాధ్యాయులు ప్రశసించేవారు. 10 ఏండ్ల ప్రాయంలో 5 వ తరగతి చదివిదేటప్పుడు ఆచంట వారు “దృవోపాఖ్యానం” అనే నాటకంలో స్త్రీ పాత్రతో రంగస్థల ప్రవేశం చేశారు.

రంగస్థల ఆరంగేట్రం: ఆ తరువాత 16 ఏండ్ల ప్రాయంలో 1951 సం.లో గుంటూరు టౌన్ హై స్కూల్ వార్షికోత్సవంలో “జీవన జ్వాల” అనే ప్రముఖ పత్రికాసంపాదకులు నార్ల వెంకటేశ్వరరావు గారు రచించిన సాంఘిక నాటకంలో 80 ఏండ్ల వయసున్న వృద్ధుని పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించి 1st ప్రైజ్ పొందారు. గుంటూరు స్కూల్లో ఎస్.ఎస్.ఎల్.సి. పాసైన ఆచంటగారు కొంతకాలం ఆయుర్వేద మందులకి రిప్రెజెంటేటివ్‌గా పనిచేసి, వృత్తికీ, ప్రవృత్తికీ సమన్వయం కుదరక వృత్తిని వదులుకొని నాటకాలలో ప్రవేశించారు.

ఒకసారి ఒక పౌరాణిక నాటకంలో పాత్రధారి సమయానికి రాకపోవడం వలన, అప్పటికప్పుడు సంభాషణలు చదివి, కురుక్షేత్రం సంగ్రామంలో పాండవుల గూడచారి అయిన “కరండకుడు” పాత్ర వేసి ప్రజల మెప్పు పొందారు.. దానికి నాటక సమాజంవారు 5 రూ. పారితోషకం ఇచ్చారు… అది ఆ రోజుల్లో ఒకరకంగా పెద్ద మొత్తమే.దాంతో ఆయనకు చదుకుని ఉద్యోగం సంపాయించే దానికన్నా… నాటకాలాడితే ఇంకా ఎక్కువ సంపాయించవచ్చు అని తలచి… కరండకుడు పాత్రలో పలికిన క్లిష్ట సమాసాల ఉచ్చారణ ప్రేరణా స్పూర్తితో దుర్యోధన పాత్రపై దృష్టి సారించి… అప్పటికి దాదాపు వందఏండ్లకు పూర్వం మొక్కపాటి వెంకటరత్నం అనే ఒక కవి గారు పూర్తి సంక్లిష్టభూరిత సుదీర్ఘ సమాసాలతో రచించిన “మయసభ” దుర్యోధన ఏకపాత్ర పై దృష్టి సారించి సాధన చేశారు…మయసభలో పద్యాలు ఆలపించుటకు తన గురువు అయిన హుళక్కి భాస్కరరావు గారివద్ద… సంగీతం… రాగాలు.. వచనం అనడంలో ఒడువు… పలుకుల్లో విరుపు నేర్చుకున్నారు.

అప్పటివరకూ ప్రతి నాయకుడయిన దుర్యోధనుడు పాత్ర కోణాన్నే తనదైన నటనతో నాయకుడి పాత్రగా మలిచారు. ఆ తరువాత కాలంలో ఆంధ్ర దేశాన దుర్యోధనుడి పాత్రకు పర్యాయపదం గా నిలిచారు. 1957 లో గుంటూరు లో నటరాజ కళా మండలి నాటక సమాజాన్ని స్థాపించారు.
కేవలం పద్యనాటకాలే కాకుండా అనేక సాంఘిక నాటకాల్లో కూడా శ్రీ ఆచంట తమ ప్రతిభా పాటవాలను తెలుగు దేశ ప్రజలకి తెలియజేశారు. గుంటూరు నాట్యసమితి ప్రదర్శించిన రామరాజు, నాయకురాలు, అపరాధి వంటి నాటకాలతో రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. తనకంటూ ఓ ముద్ర నేర్పరుచుకున్న నాయుడి గారి ప్రతిభ చూసిన పలు నాటక సంస్థలు ఆయనకి పౌరాణిక చారిత్రక నాటకాల్లో కూడా ప్రధాన పాత్రలను ఇచ్చి ప్రోత్సహించాయి.

ఆంధ్ర లలిత కళాపరిషత్ ప్రదర్శించిన బొబ్బిలి నాటకంలో హైదర్‌జంగ్, తులాభారం నాటకంలో వసంతకుడు, సక్కుబాయి నాటకంలో కాశీపతి, రామాంజనేయ యుద్ధంలో యయాతి, హరిశ్చంద్రలో విశ్వామిత్ర మొదలైన పాత్రలతో విజయదుందుభి మోగించారు.

మయసభ ఏకపాత్రాభినయం నాయుడిగారి నట జీవితంలో ఒక మైలురాయి. సాత్విక పాత్రలకంటే తామస పాత్రలు ఆయనకి ఎంతో ఇష్టం. ఆయన ప్రతిభకు మెచ్చిన అనేక సంస్థలే కాక రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక సన్మానాలు, సత్కారాలతో ఆయనని అభినందించింది. ఈలపాట రఘురామయ్య, షణ్ముఖి ఆంజనేయ రాజు, ఎ.వి. సుబ్బారావు, మాధవపెద్ది సత్యం, పీసపాటి నరసింహమూర్తి మొదలైన ఉద్ధండులైన నటులతో దాదాపు 12000 ప్రదర్శనలలో నటించారు.
తులసీజలంధర నాటకం ప్రదర్శిస్తే కనకవర్షం కురుపించేదని ప్రజలు చెప్పుకునేవారు.

విజయవాడకి సుమారు 30 కిలో మీటర్ల దూరంలో ఉన్న‘నున్న’ ప్రాంతంలో ఒక చిల్డ్రన్ నటశిక్షణాలయం స్థాపించి భావితరాలకు పద్యనాటక కళాకారులను తీర్చిదిద్దారు.

నటించిన నాటకాలు: శ్రీకృష్ణ రాయబారం, శ్రీకృష్ణ తులాభారం, బొబ్బిలి యుద్ధం, రామరాజు, నాయకురాలు, అపరాధి, రామాంజనేయ యుద్ధం, సక్కుబాయి, హరిశ్చంద్ర, తులసీ జలంధర.
నటించిన పాత్రలు: కరండకుడు, దుర్యోధనుడు, జలంధర, జరాసంధ, ద్రోణుడు, అశ్వత్థామ, గయుడు, హైదర్‌జంగ్, వసంతకుడు, కాశీపతి, యయాతి, విశ్వామిత్ర, తాండ్రపాపారాయుడు మొదలైనవి.

కేవలం రంగస్థలమేకాదు:
హైదరాబాద్ దూరదర్శన్ లో ప్రసారమైన ‘తులసీ జలంధర’ లో జలంధరుడిగా, సావిత్రి నాటకంలో యమధర్మరాజుగా, తన ప్రతిభాసామర్థ్యాన్ని ప్రదర్శించారు.
అంతేకాకుండా కె.బి. తిలక్ దర్శకత్వం వహించిన కొల్లేటి కాపురంలోనూ, భూమికోసం, పండంటి జీవితం, మోహన రాగం, శ్రీ దత్త దర్శనం వంటి అనేక చలనచిత్రాలలోనూ ఎన్నోమంచి పాత్రల్ని పోషించారు.

స్వదేశంలోనే కాదు, మారిషస్ మహాసభల్లో కూడా ఆచంట వారి “మయసభ” హూంకారం వినబడింది. అందర్ని ఆనందింపజేసింది. మద్రాసు ఏ. వి.ఏం. కంపెనీ వారు ఆచంట వారి… మయసభ. ఏకాపాత్ర. తులసీ జలందర. నాటకాన్ని ఎల్.పి. రికార్డులు గా విడుదల చేసారు.

ఇలా…రంగస్థల, టి.వి., చలనచిత్ర మాధ్యమాలలో తన నట విశ్వరూపాన్ని చూపిన ఆచంట వేంకటరత్నం నాయుడు గా‌రికి అందని గౌరవం లేదు. రంగస్థలం మీద, కనకాభిషేక సత్కారాల్ని అందుకొన్న రంగస్థల శ్రీనాధుడు ఆయన. స్వర్ణకంకణాలు, స్వర్ణ కిరీటాలు.. రజిత పాత్రలు, పట్టుబట్టలు, కాశ్మీరు శాలువలు…. నిజంగా ఆచంట వేంకటరత్నం నాయుడు గారు ధన్యజీవి.

ఈ నట సార్వభౌముని ఎన్నో పురస్కారాలు వరించాయి:
నాల్గవ ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేత సన్మానం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే హంస అవార్డు (2000), తంగిరాల కృష్ణప్రసాద్ స్మారక అవార్డు (2002), సి.హెచ్‌.సాంబయ్య స్మారక పురస్కారం (2009), ఎన్.టి.ఆర్. రంగస్థల పురస్కారం (2001).

తన బాల్యం నుండీ జీవితాంతం నాటకాన్ని ఆశించి.. శ్వాసించి.. క్రీడించి… భాసించి… రాణించి… జీవించి… తెలుగు పౌరాణిక నాటక రంగానికి విశేషమైన సేవలను అందించిన తన 81వ యేట 2015 సంవత్సరం, నవంబర్ నెల 25, తారీఖు బుధవారం రోజున మన రంగస్థల రారాజు ఆ నటరాజు సాన్నిధ్యం చేరారు.

పౌరాణిక పద్య నాటకరంగస్థలాన ఆచంట వెంకటరత్నం…
సాటిలేని నటనా వైదుష్యాన్ని ప్రదర్శించిన ఒక అద్భుత నటరత్నం…

రంగస్థలాన ప్రదర్శన జరినంతవరకూ మయసభ..
ఈ తెలుగునేల మరువదులే ఆచంట వారి ప్రభ….!!

సుయోధన పాత్ర పోషణలో ఆచంట పొందిన ఖ్యాతి..!!
ఎందరో నటులకు అవుతోంది స్ఫూర్తి..!!

మన తెలుగు నాటక రంగస్థల రారాజు…!!
దుర్యోధన పాత్రకు తెచ్చారు ఎంతో క్రేజు..!!

జయహో.. ఆచంట…!!
దిగ్విజయహో ఆచంట…!!

ఆగస్ట్ 12 వ తేదీన భారతదేశ మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు విగ్రహాన్ని ఆవిష్కరించారు. గౌ”మాజీ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

విగ్రహావిష్కరణ కమిటీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap