మరో ఆత్రేయ జన్మించడు…

తెలుగు పాటకి..ప్రత్యేకంగా మనసు పాటలకు పట్టం కట్టి పట్టాభిషేకం చేసింది ఆచార్య ఆత్రేయ..కిళ్లాంబి వెంకట నరసింహాచార్యులు..తన పేరు చివర ఉన్న ఆచార్య ని తీసుకుని తన గోత్రం అయిన ఆత్రేయ ని దాని తర్వాత పెట్టి ఆచార్య ఆత్రేయగా స్వయంనామాకరణం చేసుకున్నాడు…

జగన్నాధ రథచక్రాలు సినిమా పాటల కొరకు నేను ఒక వారం రోజులు ఆయనతో తిరిగే భాగ్యం కలిగింది..మిగితా వారికి ఆత్రేయ గారికి తేడా ఏమిటంటే…ఆత్రేయగారు పాట మొత్తం మనసులోనే అనుకుంటాడు..బాగలేని తనకి నచ్చని మాటను తీసి మరొక మాటను ఆ స్థానంలో పొడిగి..ఇలా పాట మొత్తం పూర్తి అయ్యేవరకు మనసులోనే ఎడిటింగ్ చేసుకుంటూ..పూర్తి అయ్యాక మాత్రమే నన్ను రాసుకోమనేవారు..ప్రేసిడెంట్ హోటల్ లో రూమ్..నెపోలియన్ బ్రాందీ రెండు స్మాల్ రౌండ్స్ వేసేవారు..నన్ను అడిగారు ..నాయనా వేస్తావా..అని. నాకు అలవాటు లేదు సార్ అన్నాను..నేను కూడా తాగుబోతుని కాదు..కేవలం తాగు ని..అది కూడా వీడు బాధ పడతాడని అని బాటిల్ మీద వున్న మనిషి బొమ్మ చూపించారు..భోజనం చేసాక ఆయన బెడ్ మీద..నేను ఒక దివాన్ మీద…ఆయన ఎప్పుడు పాట చెబితే అప్పుడు రాసుకోడానికి రెడీగా ప్యాడ్ పెన్ తో రెడీగా వుండే వాడిని..ఆయన దిండు మీద దిండు వేసుకొని దాని మీద తలపెట్టి పడుకునే వారు..నేను విచిత్రంగా చూసేసరికి నా మనసులో భావాన్ని గ్రహించినట్టు ఆయనే సమాధానం చెప్పారు..మనం ఎప్పుడూ తల ఎత్తుకునే బ్రతకాలి..అందుకే నేను రెండు దిళ్లు వాడతాను..అని.. ఆయన పడుకుని కాలి మీద కాలు వేసుకుని పైన ఉన్న కాలు ఆడిస్తూ ఉండేవారు..నేను నిద్రని ఆపుకుని ఆయన కాలు వైపే చూస్తూ ఉండేవాడిని..ఒకసారి కాలు ఆడించడం ఆగిపోయింది..నేను ఆ పక్కన ఉన్న స్పూన్ క్రింద పడేసాను…ఆ శబ్దానికి కళ్ళు తెరిచి ..నేను నిద్ర పోయాననుకుని శబ్దం చేశావ్ కదూ.. అన్నారు..నేను కంగారు పడి.. లేదుసార్..పొరపాటున పడింది..అన్నాను..నువ్వు దుర్మార్గుడివి నాయనా..నేను నిద్రపోయాననుకుని సౌండ్ చేశావ్..నేను నిద్ర పోలేదు..నీ పాట గురించే ఆలోచిస్తున్నాను..అన్నారు.అదే రోజు ఇంకో రెండు గంటల తర్వాత నాకు పాట మొత్తం ఒకే సారి చెప్పారు.. ఒకేసారి ఆయన విజయగార్డెన్ లో చక్రవర్తి గారి వేరే సిట్టింగ్ కి వెళ్లారు..ఆయనకి నాకు పెరిగిన చనువుని పురస్కరించుకుని నేను కూడా వెళ్లి ఆయన పక్కన కూర్చున్నాను..ఆ పాట పూర్తిగా అయ్యింది..ఒక మూడు మాత్రల మాట ఒకటి ఆయనకు నచ్చలేదు..ఆలోచిస్తున్నారు.. సడన్ గా నాకేదో ఐడియా వచ్చినట్టు అది చెబితే ఆయన నన్ను మెచ్చుకుంటారనే భ్రమతో మెల్లగా ఆయన చెవిలో..’గురువు గారు..మల్లెలు అంటే ఎలా ఉంటుంది’..అన్నాను..అంతే.. తోక తొక్కిన తాచులా అయిపోయారు..పెద్దపెద్దగా అరిచి….మధ్యలో నువ్వెవడివి… భట్టాచార్యా..వీడి పాట రెడీ అయ్యిందిగా..వీడికి ఇచ్చెయ్ అని నా వైపు తిరిగి ఇక నువ్ దొబ్బేయ్ అన్నారు… భట్టాచార్య అంటే ప్రఖ్యాత రచయిత jk భారవి గారు..ఆయన అప్పుడు ఆత్రేయ గారి దగ్గర సహాయకుడుగా వుండే వారు)..that is Aatreya… ఈ రోజు ఆయన జయంతి సందర్భంగా..మనుసు కవికి నమస్సులు….

– శివనాగేశ్వర రావు (సినీ దర్శకులు)

SA: