ప్రముఖ పరిశోధక రచయిత, ఆచార్య ఎస్. గంగప్ప (86), అనారోగ్యంతో కన్నుమూశారు. తెలుగు ఉపన్యాసకుడిగా, ఆచార్యుడిగా, నాగార్జున విశ్వవిద్యాలయం తెలుగుశాఖ అధ్యక్షులుగా పనిచేసి విశేషమైన సేవలు అందించి, ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దారు, అనేక మంది పరిశోధక విద్యార్థులకు మార్గదర్శనం చేశారు.
అనంతపురం జిల్లా పెనుగొండ తాలూకా నల్ల గొండ్రాయనిపల్లిలో వెంకటప్ప – కృష్ణమ్మ దంపతులకు 08 నవంబరు 1936 న జన్మించిన శ్రీ రామప్పగారి గంగప్ప విద్యాభ్యాసం అనంతరం, అనంతపురంలో తెలుగు ఉపన్యాసకునిగా ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించారు, పిదప కాకినాడ, విశాఖ, హైదరాబాద్, కర్నూల్లో తెలుగు ఉపన్యాసకునిగా పనిచేసి 1978 నుంచి నాగార్జున విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖ అధ్యక్షునిగా, వివిధ హోదాల్లో సేవలు అందించారు.
“కోలాచలం శ్రీనివాసరావు నాటక సాహిత్యం” పై పరిశోధన చేసిన ఆయన అనేకమంది పరిశోధక విద్యార్థులను తీర్చిదిద్దారు.
రచయితగా వందలాది రచనలు అందించారు, నాటక సాహిత్యం అంటే ఆయనకు ఎంతో మక్కువ, క్షేత్రయ్య పద సాహిత్యం, సారంగపాణి పద సాహిత్యం, తెలుగు పద కవిత, వంటి పరిశోధక రచనలతోపాటు….
తీరిన భయం (కథా సంపుటి), నవోదయం, రెండు గులాబీలు, కవితా సంపుటాలు. ఆత్మార్పణ (నవల), దీపావళి, దేశం బాగుపడాలంటే, పద కవితా పితామహుడు, వంటి అనేక నాటకాలతో పాటు.. బాల సాహిత్యంలో కూడా కొన్ని రచనలు చేశారు.
వీరి సాహితీ ప్రతిభకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారంతోపాటు తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం మరియు “ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హంస పురస్కారం” కూడా అందుకున్నారు. ప్రముఖ రచయిత డా. గుమ్మా సాంబశివ రావు వీరికి స్వయాన శిష్యుడు మరియు అల్లుడు.
ఆచార్య గంగప్ప గారి మరణానికి తెలుగు సాహితీ లోకం నివాళులర్పిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసింది.
డా. అమ్మిన