బడి పంతులే కాదు… రంగస్థల రక్షకుడు..!

ఉపాధ్యాయుడిగా, నటుడిగా, చిత్రకారుడిగా మాత్రమే కాదు… యూట్యూబ్ ఛానల్ ప్రయోక్తగా బహుముఖ రంగాల్లో కృషిసల్పుతున్న శేషయ్యగారిపల్లి అంజినప్ప గారి గురించి తెలుసుకుందాం.!

ఏది నా భార్య? ఎక్కడ నా కుమారుడు..?
ఏది నా రాజ్యశ్రీ..? నేను ఏకాకినా… కాదు కాదు..
సర్వజనులనూ ఏకాకులే’ అంటూ సత్యహరిశ్చంద్ర నాటకం
వారణాసి సీనులో గంభీర స్వరంతో డైలాగులు విసిరినా..
అన్నదమ్ములును… ఆలు బిడ్డలును కన్నతల్లిదండ్రులు స్నేహితులు బంధువులు
వెంటరారుతుదిన్ వెంట వచ్చునది అదే సత్యము అదే యశస్సు
వదిలి పోయోను సామ్రాజ్య వైభవం కదిలి పోయిరి అర్ధాంగి నా కన్న కొడుకు నీవు.. నీవునూ…
నామీద కక్షబూని జారిపోయేదవేళనే…”… అంటూ
జారిపోతున్న ఉత్తరీయాన్ని ఉద్దేశించి వేదనాభరితమైన పద్యాన్ని రాగయుక్తంగా
ఆలపిస్తున్న కళాకారుడు అంజినప్పను చూసి తన్మయత్వం చెందని వారంటూ ఉండరు.

భుజాన మాసిన నల్లటి గొంగళి…సంస్కారం లేని తలజుట్టు… నుదిటిపై నల్లని గుడ్డ పీలికతో కట్టిన కట్టు.. కళ్లల్లో దైన్యం.. శూన్యంలోకి చూపులు.. మాసిన గడ్డం.. ఆ గడ్డం కింద కర్ర… భుజంపై కుండ.. విచారవదనం… కనుబొమ్మలు చిట్లించి, మోమును కన్నీటి సాగరమున ముంచిలేపే అభినయం.. స్పష్టమైన పదఉచ్ఛారణ… గంభీరంమైన గాత్రం… పాత్రకు తగ్గ అభినయం.. గద్గద స్వరంలో హెచ్చుతగ్గులను సమ్మిళితం చేస్తూ గుండెల్ని పిండేసే ఆలాపన శేషయ్యగారిపల్లి అంజినప్ప సొంతం. ఆయన నోటివెంట జాషువా పద్యాలు సెలయేరులా జాలువారుతుంటే రంగస్థల కళాభిమానుల కేరింతలు మాటల్లో చెప్పలేం. ఆ నటుడు ఎవరో కాదు… మన అంజనప్ప గారే.

బాల్యం: సత్యసాయి జిల్లా, పుట్టపర్తి మండలం అటవీ ప్రాంతమైన ఎగువ గంగిరెడ్డి పల్లిలో శేషయ్యగారిపల్లి వీరప్ప, చిన్నాగమ్మ దంపతులకు మొదటి సంతానంగా అంజనప్ప జన్మించారు. చిన్ననాటి నుంచి ఎన్నో కష్టాలు పడిన అంజనప్ప మండల పరిధిలోని నాగలూరు వద్ద గల స్థానిక రూప రాజా పి.సి.ఎం.ఆర్. కాన్సెప్ట్ స్కూల్లో ప్రవేట్ ఉపాధ్యాయుడిగా జీవనాన్ని సాగిస్తున్నారు. ఓ వైపు ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తూనే మరోవైపు తనకు ఎంతో ఇష్టమైన నాటికలు, కళల ద్వారా సమాజంలో చైతన్యం తెచ్చేందుకు తన వంతు పాత్ర పోషిస్తున్నారు. చిన్నప్పటి నుండి కళలన్నా, కళారూపాలన్నా అమితమైన ప్రేమ. పిల్లవాడైనా పెద్దల దగ్గర కూర్చొని పురాణాలు, బయలు నాటకాలు, చెంచునాటకాలు, సత్యహరిశ్చంద్ర, తోలు బొమ్మలాట, కోలాటం వంటి జానపదాల వివరాలను అడిగి తెలుసుకొనేవారు. వాటిని సమయస్ఫూర్తిగా అప్పుడప్పుడు మిత్రులతో చర్చించి, గ్రామంలో నాటకాల రికార్డింగులు వినిపిస్తేచాలు అన్నం కూడా తినకుండా నాటకశాల దగ్గరే గడిపేవారు. బాగా కష్టపడి వృక్షశాస్త్రలో పోస్ట్ గ్రాడ్యుయేషన్, డి.ఎడ్., బి.ఎడ్. వరకు చదువుకున్నారు. 2003 నుంచి 2011 వరకు ఆర్డిటి సంస్థలో టీచరుగా, విద్యా వాలంటీర్ గా సొంత ఊరిలోనే పనిచేసస్తూ ఎంతోమంది పేద విద్యార్థులకు విద్యను బోధించి, అందులో నిర్వహించే క్విజ్ పోటీలు, కళలకు సంబంధించిన పోటీలలో జిల్లా స్థాయిలో మారుమూలపల్లె విద్యార్థుల విజయపతాకాన్ని ఎగురవేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకతను, గౌరవాన్ని సంపాదించుకున్నారు. మరోవైపు డ్రాయింగ్స్ వేయడంలోను, కలప మీద బొమ్మలు చెక్కడంలోను తాత గంగప్పను ఆదర్శంగా తీసుకుని బంకమట్టితో బొమ్మలు చేసేవారు. ఈయని ప్రతిభను మెచ్చి అడవిలో ఆణి ముత్యమని పిలిచేవారు. అదే సమయంలోనే హరిశ్చంద్ర నాటకంలో చివరి ఘట్టాన్ని ప్రదర్శించి చుట్టుప్రక్కల పల్లెలలో శభాష్ అనిపించుకున్నారు.

‘తేనె తెలుగు’ యూట్యూబ్ కళావేదిక:
నాటక రంగ సాహిత్యాన్ని, కళాకారుల వివరాలను భద్రపరచడమే గాక పది మందికి పంచాలనే తపనతో స్నేహితులు, శిష్యుల కోరిక మేరకు ‘తేనె తెలుగు’ పేరుతో యూట్యూబ్ ఛానల్ ను అంజినప్ప ప్రారంభించారు. అంతరించిపోతున్న కళారూపాలకు జీవం పోయాలనే లక్ష్యంతో కళాకారులను గుర్తించి 2021లో కళాభిషేకం పేరుతో కార్యక్రమాన్ని చిత్రీకరించి, యూట్యూబ్ లో ఉంచారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని గ్రామీణ కళాకారులను 500 మందికి పైగా ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహించడమే కాక, వారిని సన్మానించారు. వారి ప్రతిభను ప్రపంచానికి చూపిస్తున్నారు. ఎంతో వ్యయప్రయాసల కోర్చి అనేక ప్రాంతాలను సందర్శించి అక్కడి రంగస్థల కళాకారులను 30 – 40 నిమిషాల నిడివి వీడియోల ద్వారా మనకు పరిచయం చేస్తున్నారు.

హరిశ్చంద్ర వేషధారిగా అంజినప్పు కళాసేవను గుర్తించి కళాప్రేమి అవార్డుతో రాయలసీమ కో ఆర్డినేషన్ వారు శ్రీకృష్ణదేవరాయ అవార్డుతో సత్కరించారు. అలాగే అక్కినేని నాగేశ్వరరావు అవార్డుతో విజయశ్రీ సాంస్కృతిక సేవా సంస్థ నిర్వాహకులు ప్రదానం చేశారు. ఆసియా వేదిక్ కల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ వారు గౌరవ డాక్టరేటుతో సత్కరించారు.

‘తేనె తెలుగు’ యూట్యూబ్ ఛానల్ ద్వారా పరిచయం కావాలనుకునేవారు (9949997672) ఈ నంబరులో సంప్రదించండి.

‘తేనె తెలుగు’ యూట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ లో వీక్షించవచ్చు.……
https://www.youtube.com/watch?v=-FWqxUAGFNc&t=3544s
https://www.youtube.com/watch?v=JnFWDNF7uLs

-కళాసాగర్ యల్లపు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap