తెలుగు నాటకరంగం గర్వించే – G.S.R. మూర్తి

శ్రీ గిడుగు సూర్యనారాయణ శ్రీమతి సత్యవతి దంపతులకు 1927 లో, పశ్చిమ గోదావరి జిల్లా “ఏలూరు”లో మూడవ సంతానంగా జన్మించిన ఆయనకు బాలసాలలో పెట్టిన నామకరణం “గిడుగు సీతారామ చంద్రమూర్తి” ఆయన 18వ యేటనే మిలటరీలో పనిచేసారు. ఆ “క్రమశిక్షణే”వారి జీవితంలోను, నాటకరంగంలోను ఉపయోగపడింది.

G.S.R. మూర్తిగారు విజయవాడ, కేదారేశ్వరపేట” ఆంధ్ర సిమెంట్ కంపెనీ”లో దాదాపు 30 సం..లు పనిచేసారు. భార్య, ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు… ఇదీ ఆయన సంసార జీవితం. ఇక నాటకరంగమైతే, అది ఆయన పుట్టిల్లేనని చెప్పవచ్చు.

GSR Murthy and his wife

గుడివాడలో ఒక‌స్నేహితుడి చెల్లెలు పెళ్ళి ‌సహాయార్ధం ఒక నాటకం వేయాల్సి వచ్చింది. అందుకోసం విజయవాడ నుంచి గుడివాడకి ప్రతిరోజూ వెళ్ళి, రిహార్సల్స్ చేసి, ఆమె పెళ్ళికి సహకరించి వచ్చారు. వారు మొట్టమొదట ప్రదర్శిచిన సాంఘిక నాటకం” అన్నాచెల్లెలు” దర్శకులు మన కళాకారులంతా ఆరాధించే” శ్రీ నటరాజస్వామి”యే. ఇది వారి మొదటి రంగస్థల అనుభవం.

ముదిగొండ లింగమూర్తిగారు రచించిన “వెంకన్న కాపురం” నాటిక ఈయన కోసమే రాసారా? అన్నట్లుగా అందులో వెంకన్న పంతులు పాత్రని, సంసారపక్షమైన నటనతో” ప్రాణం” పోసి, ఆ నాటికకు ఎంతో విలువని తెచ్చారు. ప్రేక్షకుల మనసుల్ని దోచుకున్నారు.

“నటరాజ్”K. వేంకటేశ్వరరావుగారి శిక్షణలో అనేక నాటక, నాటికల్లో నటించారు విజయవాడ ర.స.న సమాఖ్యలో 1977 వరకు వున్నారు. ఆ తరువాత V.K.N. సమాఖ్యను స్థాపించి, నడిపించారు.

అలాగే, భమిడిపాటి రాధాకృష్ణగారి రచన “కీర్తిశేషులు” నాటకంలో గంప శంకరయ్య పాత్రలో, వాణీనాధం రాసిన గ్రంథం ప్రచురించడానికి 50 రూపాయలకు ఒప్పించే సన్నివేశంలో “అద్భుతమైన లౌక్యం”తో ప్రదర్శించే సన్నివేశం మరపురానిది.

K.V.రమణారెడ్డి, వేణుగార్లు జంటగా రచించిన నాటిక “రాజీవం”. ఆ నాటిక దర్శకత్వం వహించిన G.S.R. మూర్తిగారి దర్శకత్వానికి ఓ “మచ్చుతునక. ఆ నాటికలో మూడు సార్లు వచ్చే “షాడో” ప్లే లో…సమవర్తి, తామరపువ్వు, తుమ్మెద వాడిపోవడం, సమవర్తి రాజీ జీవం తీసుకుపోవడం లాంటివి ఆ దర్శకుడి ప్రజ్ణాపాటవాలకి నిదర్శనం.

విజయవాడలో అడుసుమిల్లి కేశవరావుగారు స్థాపించిన “కళాంజలి” నాటక సంస్థకి అనేక సంవత్సరాల పాటు దర్శకుడుగా కొనసాగి, మంచి మంచి నాటకాలు, నాటికలు తన దర్శకత్వ ప్రతిభతో ప్రదర్శింపచేశారు.

G.S.R. మూర్తిగారు అద్భుతంగా నటించిన, దర్శకత్వం వహించిన కొన్ని నాటకములు:
దొంగ వీరడు.
ఆకాశ రామన్న.
రాగ రాగిణి.
ధర్మపధం.
తూర్పురేఖలు.
కీర్తిశేషులు.
ఇదేమిటి?
నిజం.
సిద్దార్ధ.
కెరటాలు.
మొదలైనవి.

నాటికలు:

మట్టే బంగారం.
వెంకన్న కాపురం
పెళ్ళి చూపులు.
రాజీవం.
యుగ సంధ్య.
పరిష్కృతి.
కొడుకు పుట్టాల.
మని+షి.
వి‌షాదం.
ఆగండి. కొంచెం ఆలోచించండి…. మొదలైనవి.

“నటనే ప్రాణం”గా భావించే G.S.R. మూర్తిగారు రంగస్థలమే కాకుండా, “ఆకాశవాణి”లో అనేక నాటకాలు, నాటికల్లో శ్రవ్య కళాకారుడిగా”గాత్ర పోషణ” చేసి, అధికారుల మన్నన, శ్రోతల మెప్పుపొందారు.

G.S.R. మూర్తిగారిలోని “నటుణ్ణి” వెతుక్కుంటూ, వెండితెర (సినిమా) కదిలి వచ్చింది.

వారు నటించిన సినిమాలు:

తేనె మనసులు.
మరపురాని కధ.
ఆస్తులు అంతస్తులు.
తాయారమ్మ-బంగారయ్య.
ఓ మనిషీ తిరిగి చూడు.
సీతా మా లక్ష్మి.
కధా నాయిక మొల్ల.
గూటి లోని రామచిలుక.
తరం మారింది.
మొదలైన చలన చిత్రాల్లో పాత్రోచితంగా నటించి, ప్రేక్షకుల మనసుల్ని వశం చేసుకున్నారు.

G.S.R. మూర్తిగారు భేషజం, అహం భావం, అహంకారం లేని వ్యక్తి. ఆయన డైలాగ్ ని చక్కగా అనుభవిస్తూ, చక్కని ముఖకవళికలతో అభినయించేవారు పాత్రౌచిత్యాన్నిబట్టి.

G.S.R. మూర్తి గారికి నటన, నాటకం అంటే పంచ ప్రాణాలు.
(అందరూ క్షమిస్తానంటే మరొకటి చెప్తా) అదే. ఆయన కాల్చే “బీడి”. ఆయనకు ఆనందం. మూర్తి గారు ఎన్నో వందల మందికి నటనలో శిక్షణ ఇచ్చినా కూడా…..
అందరికంటే నటుడుమీరయ్య(టైలర్) నటి విజయ ఆయన కు “మంచి పేరు” తెచ్చిన వాళ్ళలో వున్నారు.

G.S.R. మూర్తి గారి కంటే, ముందు తరాల్లో ఎవరైనా ఇలా చేసారేమో తెలియదు. ప్రస్తుత నాటకరంగంలో ఇలా ఎవరైనా చేస్తున్నారో తెలియదు దర్శకుడుగా. అదేమిటంటే………
G.S.R. మూర్తి గారు తను దర్శకత్వం వహించే నాటకాలు, నాటికల్లో పాత్రల మూమెంట్స్ డిజైన్ చెయ్యడం, సెట్ చెయ్యడం ఒక గొప్ప విధానం. నాటకంలో పాత్రలు ఎక్కడ నుంచి ఎక్కడకు ఎలా నడవాలో నని “హోం వర్క్”గా, “చెస్ బోర్డ్”లో పావులను కదుపుతూ చేసేవారు. ఆయా పాత్రధారుల్ని కూడ అలాగే నడిపించేవారు.

G.S.R. మూర్తి నాటకరంగానిక “సేవ” చేస్తూ నే, 1981 ఆగస్ట్ 23 వ తేదీన
“శ్రీ నటరాజ స్వామి లో లీనమైపోయారు. ఆయన భౌతికం గా జీవించింది 54 సంవత్సరాలే అయినా, తెలుగు నాటక రంగం లో ఆయన కీర్తిశేషులు, చిరంజీవి. ఆయన తనువు చాలించిన తర్వాత, వారి భౌతిక కాయంతో విజయవాడ పురవీధుల్లో ఓ పెద్ద అంతిమ యాత్ర జరిగింది. ఆ యాత్ర శ్రీ వెలిదండ్ల హానుమంతరాయ గ్రంధాలయం హాలు దగ్గర కొద్ది సమయం ఆగినపుడు, కొంతమంది కళాకారులైన అభిమానుల మనసుల్లో ఒక ఆలోచన మెరిసింది.

గొప్ప నటుడు, దర్శకుడు అయిన ఆయన పేరు మరచిపోకుండా చిరస్మరణీయం చెయ్యాలని. ఆ ఆలోచనల సముదాయ ఫలితమే “శ్రీ G.S.R. మూర్తి మెమోరియల్ నాటక పరిషత్, విజయవాడ.” అలా ఆవిర్భవించింది ఆ నాటక పరిషత్.

అప్పుడు ఆ కాలంలో T V లేవు,. సెల్ ఫోన్లు లేవు, ఇన్ని పత్రిక లేవు, వాటికి జిల్లా ఎడిషన్స్ లేవు. ఉన్న కొద్ది పత్రికలే రాష్టమంతా వెళ్ళేవి. ఆ పరిషత్ గురించి, ఆ నాటకాల వివరాలు తెలుసుకుని అన్ని జిల్లాల నుంచి ఎక్కడెక్కడి నుంచో నాటక కళాకారులు, నాటక అభిమానులు విరగబడి వచ్చేవారు. ఫ్లెక్సీలు లేని ఆరోజుల్లో, విజయవాడ గవర్నర్ పేట” అప్సర”సినిమా హాల్ సెంటర్లో, భారతమహిళామండలి కాంపౌండ్ వాల్ దగ్గర అన్ని నాటకాల వివరాలతో చేత్తో రాయించిన “అత్యంత పెద్ద బ్యానర్”రోడ్ మీద వచ్చి పోయే వాళ్ళకి చాలా పెద్ద ఆకర్షణీయంగా ఆకట్టుకుంది.

“కొడుకు పుట్టాల” నాటిక కళాంజలి కళాబృదంతో G.S.R. మూర్తి.

ఎక్కడెక్కడి వూళ్ళ నుంచో వచ్చిన కళాకారులు తెలిసినా తెలియక పోయినా మీరు ఎవరు? ఎక్కడ నుంచి వచ్చారు? అనే ప్రశ్నే లేదు. కడుపు నిండా కమ్మగా భోజనాలు చెయ్యడం, ఆనందంగా నాటక ప్రదర్శన లు చూడడం, సున్నితంగా విమర్శనాత్మకంగా చర్చించుకోవడం వాళ్ళ పని.
విజయవాడ శ్రీ వెలిదండ్ల హనుమంతరాయ గ్రంధాలయం హాలు ప్రేక్షకులకు కూర్చుండటానికే కాదు. నిలబడి చూసేందుకు కూడా వీలులేని పరిస్థితి. హాలు పట్టక తలుపులు వేసి నాటకాలు ప్రదర్శించారు. నేను రాసి పెట్టిన “HOUSE FULL” బోర్డ్ తగిలించారు గేటుకి. ఆ బోర్డ్ ఫోటో తీసి, పత్రికల వాళ్ళు ప్రచురించారు. నాకు తెలిసినంతలో,… నాటక పరిషత్ లో నాటకాలు చూడ్డానికి,”టిక్కెట్లు” పెట్టి, “HOUSE FULL” బోర్డ్ పెట్టిన నాటక పరిషత్ ఇదేనేమో ?!

అప్పుడు వైభవంగా, అత్యద్భుతంగా జరిగిన ఆ నాటక పరిషత్ తెలుగు నాటకరంగలో చిరస్థాయిగా నిలబడిపోయింది “ఎనిమిది” సంవత్సరాలు విజయకేతనం ఎగురవేసి. అప్పుడు ఆ వైభవాలను చూసి, ఆ జ్నాపకాలు నెమరువేసుకునే మెదళ్ళలో కదలాడే తరంగాలు తప్ప. అవి చూసిన “ప్రేక్షకులే అదృష్టవంతులు”.

తెలుగు నాటక రంగంలో G.S.R. మూర్తి చిరంజీవి….

నా గురు పుత్రుడు, నా ప్రియ మిత్రుడు G S R మూర్తి గారి రెండవ కుమారుడు నటన, దర్శకత్వం తండ్రి గారి నుంచి వారసత్వ సంపద పొందిన వ్యక్తి శ్రీ రాజ గోపాల్, హైదరాబాద్ వారి మాటల సహకారం తో…….

“కళామిత్ర” అడివి శంకరరావు
ప్రగతి నగర్, హైదరాబాద్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap