బాలీవుడ్ శోకదేవుడు… భరత్ భూషణ్

ప్రముఖ దర్శకుడు కీదార్ నాథ్ శర్మ 1941లో ‘చిత్రలేఖ’ సినిమా ద్వారా ఒక నూతన నటుణ్ణి పరిచయం చేశారు. ఆ సినిమా ఒక సంప్రదాయ సంగీత నేపథ్యంలో నిర్మించబడింది. ఆ మ్యూజికల్ హిట్ చిత్రం అద్భుతంగా ఆడి కాసులు రాల్చింది. ఆ చిత్రం ఎంత జనరంజకమైనదంటే 1964లో అదే కీదార్ నాథ్ శర్మ ‘చిత్రలేఖ’ సినిమాను పునర్నిర్మిస్తే ప్రేక్షకులు ఆ చిత్రానికి కూడా బ్రహ్మరథం పట్టారు. కానీ, ఆ దర్శకుడు తొలిసారి వెండితెరకు పరిచయం చేసిన నటుడు మాత్రం తన నటనాపటిమను నిరూపించుకునేందుకు 1952 వరకూ ఆగాల్సి వచ్చింది. అతడి చలనచిత్ర జీవితమే కాదు, అతడి వ్యక్తిగత జీవితం కూడా ఒడుదుడుకులమయమే. ఆ నటుడే ‘బైజు బావరా’ అనే ఒక్క చిత్రంతోనే స్టార్డం అందుకున్న భరత్ భూషణ్. విచిత్రమేమిటంటే ‘బైజు బావరా’ కూడా గొప్ప హిందుస్తానీ సంప్రదాయ సంగీత సమారోహం. మహాత్మాగాంధి తిలకించిన ఒకే ఒక సినిమా ‘రామరాజ్య’ (1943) ను నిర్మించిన దర్శకుడి కుంచెలో రూపుదిద్దుకున్న ఒక సినీమణిపూస ‘బైజు బావరా’. ఆ సినిమాతో ఈ నటుడు ఎంత ఎత్తుకెదిగాడో మరో ఇరవై ఏళ్ళలో అంతటి అదఃపాతాళానికి జారిపోయాడు. ముంబైలోని విలాసవంతమైన బాంద్రా ప్రాంతంలో భరత్ భూషణ్ కు ఎన్ని బంగళాలు, ఎన్ని ఖరీదైన కార్లు ఉండేవో లెఖ్ఖలేదు. పేకాట వంటి ఎన్నో వ్యసనాలు, బాక్షాఫీసు వద్ద బోల్తాకొట్టిన సొంత సినిమాలు, సోదరుని మోసపూరిత వ్యవహారాలు భరత్ భూషణ్ ని అప్పుల ఊబిలోకి లాగగా, మురిపెంగా కట్టుకున్న ఖరీదైన బంగళాలను రాజేష్ ఖన్నా, రాజేంద్రకుమార్, జితేంద్ర వంటి నటులకు అమ్ముకోవలసి రావడం భరత్ భూషణ్ దురదృష్టం కాక మరేమనుకోవాలి? అంతటి స్టార్డం పెంచుకున్న హీరో చివరకు మురికివాడల్లో నివసిస్తూ ఒక ఫిలిం స్టూడియోలో చౌకీదార్ గా చరమాంకం గడపడం మనం ఊహించగలమా?? అనాధ ప్రేతంలా రోడ్డు ప్రక్కన ప్రాణం విడవడం తట్టుకోగాలమా??? విధివంచితుడైన అటువంటి ఆ అద్భుత నటుడి జయంతి జూన్ 14 న జరుగుతున్న సందర్భంగా భరత్ భూషణ్ జీవితంలోని కొన్ని వెలుగునీడలు…

పుట్టుకతోనే తల్లిని పోగొట్టుకొని…

భరత్ భూషణ్ జన్మించింది జూన్ నెల 14, 1920 న ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ పట్టణంలో. భరత్ తండ్రి రాయ్ బహదూర్ మోతిలాల్ బాగా పేరుతెచ్చుకున్న ప్రభుత్వ న్యాయవాది. భరత్ భూషణ్ ను చిన్నతనం నుంచే దురదృష్టం వెంటాడింది. అతనికి రెండేళ్ళు వయసున్నప్పుడే అనారోగ్యంతో తల్లి మరణించింది. తల్లి మరణానంతరం భరత్ భూషణ్ తన అన్న రమేష్ చంద్రతో కలిసి ఆలిఘర్ లో ఉంటున్న అమ్మమ్మ గారి ఇంటికి చేరారు. భరత్ భూషణ్ చదువు ఆలిఘర్ లోనే కొనసాగింది. అతడు అక్కడే ధరమ్ సమాజ్ కళాశాలలో చదివి డిగ్రీ పుచ్చుకున్నాడు. భరత్ కు సినిమాల్లో నటించాలనే ఆపేక్ష వుండేది. కానీ అది తన తండ్రికి నచ్చని విషయం. తండ్రి సలహాను పాటించకుండా సినిమాల్లో అవకాశాలు వెదుక్కుంటూ కలకత్తా నగరం చేరుకున్నాడు. తరవాత భరత్ మకాం బొంబాయికి మారింది. దర్శక నిర్మాత మెహబూబ్ ఖాన్ ను సిఫారసు ఉత్తరంతో కలిశాడు. అదే సమయంలో మెహబూబ్ ఖాన్ ‘ఆలీబాబా 40 చోర్’ చిత్ర నిర్మాణంలో తలమునకలై ఉండడంతో భరత్ భూషణ్ ను పట్టించుకోలేదు. తరవాత దర్శకుడు రామేశ్వరశర్మ ను కలవగా ‘భక్త కబీర్’ (1941) చిత్రంలో ‘కాశీ నరసింగ’ అనే చిన్న పాత్ర ఇచ్చి 60 రూపాయల జీతానికి తన సంస్థలో చేర్చుకున్నాడు. 1941 లో దర్శకుడు కీదార్ నాథ్ శర్మ ‘చంద్రలేఖ’ చిత్రాన్ని నిర్మిస్తూ అందులో భరత్ భూషణ్ కు వెండితెరమీద కనిపించే తొలి అవకాశాన్ని ఇచ్చాడు. భగవతి చరణ్ వర్మ నవల ఆధారంగా నిర్మించిన ఈ చిత్రంలో సంప్రదాయ హిందుస్తానీ సంగీతానిది ప్రధాన నేపథ్యం. చిత్రలేఖగా మెహతాబ్, సామంత్ బీజగుప్తుడుగా నంద్రేకర్ ముఖ్యపాత్రలు పోషించగా భరత్ భూషణ్ సహాయక పాత్రను ధరించాడు. భైరవి, కోమల గాంధారి (అసావరి)వంటి శుద్ధ హిందుస్తానీ క్లాసికల్ రాగాలతో ఉస్తాద్ ఝాండే ఖాన్ పాటలకు స్వరాలు అల్లితే, రామ్ దులారి ఆలపించిన ఆ పాటలన్నీ అజరామరాలయ్యాయి. ముఖ్యంగా “తుమ్ జో బడే భగవాన్ బనే”, “సయ్యా సవేరే భాయే బావరే” పాటలు నేటికీ క్లాసికల్ సినీ గీతాలకు ప్రామాణికాలుగా నిలుస్తాయి. ఈ సినిమా అత్యధిక వసూళ్లు రాబట్టి విజయవంతమైంది. ఇదే సినిమాను 1964లో కీదార్ నాథ్ శర్మే ప్రదీప్ కుమార్, అశోక్ కుమార్, మీనాకుమారి లతో పునర్నిర్మించగా ఆశించినంత విజయం అందుకోలేదు. అయితే రోషన్ అందించిన సంగీతం ఆకట్టుకుంది. ఈ సినిమా తరవాత జి.కె. మెహతా నిర్మించిన ‘భాయిచరా’ (1943), ద్వారకా ఖోస్లా నిర్మించిన ‘సావన్’ (1945), కేదార్ నాథ్ శర్మ నిర్మించిన ‘సోహాగ్ రాత్’ (1948)వంటి సినిమాల్లో భరత్ భూషణ్ నటించాడు. అయితే వీటిల్లో ‘సోహాగ్ రాత్’ చిత్రం మాత్రమే వసూళ్లపరంగా విజయవంతమైంది. ఈ చిత్రంతోనే గీతాబాలి వెండితెరకు పరిచయమైంది. అదే వరసలో ‘ఆంఖే’, ‘కిసీ కి యాద్’, ‘హమారీ షాన్’, ‘సాగర్’ వంటి చిత్రాల్లో అడపాదడపా భరత్ భూషణ్ నటించినా అతనికి గుర్తింపు రాలేదు.

అంబరాన్ని తాకిన బైజు బావరా…

15 శతాబ్దంలో గ్వాలియర్ ను పరిపాలించిన మాన్ సింగ్ తోమర్ ఆస్థానంలో బైజు అనే ప్రాచీన హిందుస్తానీ శాస్త్రీయ సంగీతంలో నిష్ణాతుడైన విద్వాంసుడు ఉండేవాడు. ‘ధృపద్’ పేరిట వ్యవహరించే సంగీత విద్యలో బైజు ని మించిన వారు లేరని ప్రతీతి. తాన్ సేన్ ఆహ్వానం మేరకు రేవా మహారాజు రామచంద్ర బఘేలా ఆస్థానంలో ‘మాల్కోస్’ రాగంలో బైజు ఆలాపన చేసి ఒక బండరాయిని కరిగింఛి వేస్తాడు. ఈ కథా నేపథ్యంలో ప్రకాష్ పిక్చర్స్ సంస్థ విజయ భట్ దర్శకత్వంలో ‘బైజు బావరా’ సినిమా నిర్మించింది. 5, అక్టోబరు 1952 న విడుదలైన ఈ చిత్రంలో భరత్ భూషణ్ ‘బైజు’ గా, మీనాకుమారి ‘గౌరి’ గా, సురేంద్ర ‘తాన్ సేన్’ గా, బిపిన్ గుప్త ‘అక్బర్ చక్రవర్తి’ గా, కులదీప్ కౌర్ ‘రూపమతి’ గా నటించారు. అసలు ఈ చిత్రంలో హీరో వేషం దిలీప్ కుమార్ కి, హీరోయిన్ వేషం నర్గీస్ కు దక్కాల్సింది. పారితోషికం విషయంలో ఇబ్బందులు ఎదురవడంతో భరత్ భూషణ్, మీనాకుమారిని ఎంపిక చేశారు. మీనాకుమారి కూడా ఈ చిత్రంతోనే స్టార్డం అందుకుంది… ఉత్తమ నటిగా మీనాకుమారికి, ఉత్తమ నటుడుగా భరత్ భూషణ్ కు ఫిల్మ్ ఫేర్ బహుమతులు దక్కడం విశేషం. ఫిలింఫేర్ బహుమతులు ప్రవేశపెట్టింది ఇదే సంవత్సరంలో కావడం, తొలిబహుమతులు వీరికి దక్కడం విశేషమేగా! ‘బైజూ బావరా’ సినిమాతో భరత్ భూషణ్ ‘ట్రాజెడీ కింగ్’ గా వ్యవహరించబడుతున్న దిలీప్ కుమార్ కు జతగా, పోటీదారుడుగా నిలిచాడు. సున్నితమైన, సుకుమారమైన కంఠస్వరం తో, సానుభూతి పరమైన పాత్రల్లో యిట్టే ఒదిగిపోయి నటించడంలో భరత్ భూషణ్ మంచిపేరు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా తాన్ సేన్- బైజు ల మధ్య జరిగే సంగీత పోటీ (జుగల్బంది) ఆద్యంతం ఆకట్టుకుంది. తాన్ సేన్ (సురేంద్ర) మేఘమల్హర్ రాగంలో ఆలపించే “ఘనన ఘనన ఘన్ గర్జో రే యే ఝణన ఝణన ఝణ బరసో హో బరసో” అనే పాటను ఉస్తాద్ ఆమిర్ ఖాన్ చేత సంగీత దర్శకుడు నౌషాద్ ఆలపింపజేసిన తీరు అమోఘం అనిపిస్తుంది. అలాగే తాన్ సేన్- బైజు ల మధ్య అహిర్ భైరవి, మేఘ మల్హర్ రాగాల్లో నడిచే “ఆజ్ గావత్ మన్ మేరో ఝూం కే తొరి తాన్ భగవాన్” అనే సంవాద గీతాన్ని ఉస్తాద్ ఆమిర్ ఖాన్, డి.వి. పులాస్కర్ ల చేత ఆలపింపజేసి మంచి రసకందాయంలో పడేసిన నౌషాద్ ప్రతిభను వెల కట్టలేం. పైగా భరత్ భూషణ్ సరసన పోటీకి నిలిచిన సురేంద్ర తరవాతి కాలంలో అదే తాన్ సేన్ పాత్రను ‘రాణి రూపమతి’ (1957), ‘మొఘల్-ఎ-ఆజం’ (1960) చిత్రాల్లో పోషించి ఆ పాత్రకే వన్నె తెచ్చారు. ఈ సినిమాలో సంగీతం సమకూర్చడానికి నౌషాద్ ఆరు నెలలు కష్టపడ్డారు. మహమ్మద్ రఫీ మాల్కోస్ రాగంలో ఆలపించిన “మన్ తడప్ హరి దర్శన్ కో ఆజ్ మోరే తుమ్ బిన్ బిగడే సగరే కాజ్”; దర్బారీ రాగంలో ఆలపించిన “ఓ దునియా కే రఖ్ వావే సున్ దర్ద్ భరే మేరె నాలే”; తోడి రాగంలో ఆలపించిన “ఇన్సాన్ బనో కార్లో భలాయి కా కోయీ కామ్”; భైరవి రాగంలో లతాజీతో కలిసి ఆలపించిన “తూ గంగా కి మౌజ్ మై జమునా కా ధారా హో రహేగా మిలన్ ఏ హమారా హో హమారా” పాటలతో సినిమా హోరెత్తిపోయింది. ఇవికాక పీలు, దేశి రాగాల్లో మట్లు కట్టిన పాటలు సంగీత ప్రియులను అలరించాయి. నౌషాద్ కు ఉత్తమ సంగీత దర్శకుడిగా తొలి ఫిలింఫేర్ బహుమతి లభించింది. దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు ఈ సినిమాను స్పూర్తిగా తీసుకొని 1954లో అమర్ నాథ్, శ్రీరంజని, పద్మిని లతో ‘అమరసందేశం’ సినిమాకు దర్శకత్వం వహించారు.

అరవయ్యో దశకం దాకా దూసుకెళ్ళి…

భరత్ భూషణ్ కు బిమల్ రాయ్ దర్శకత్వంలో బాంబే టాకీస్ వారు నిర్మించిన ‘మా’ (1952) అనే హిందీ చిత్రంలో నటించే అవకాశం దొరికింది. ఈ చిత్ర నిర్మాణం కోసం బిమల్ రాయ్ కలకత్తా నుండి తొలిసారి బొంబాయి వచ్చారు. భరత్ భూషణ్ తోబాటు ఇందులో శ్యామా, లీలా చిట్నీస్, నాజిర్ హుసేన్, బి.ఎం. వ్యాస్ నటించారు. హాలీవుడ్ చిత్రాన్ని నేపథ్యంగా తీసుకొని నిర్మించిన ‘మా’ సినిమా విజయవంతమైంది. బంకిం చంద్ర చటర్జీ బెంగాలి నవల ‘ఆనంద్ మఠ్’ ను హేమెన్ గుప్తా సినిమాగా మలిచారు. పృద్విరాజ్ కపూర్, భరత్ భూషణ్, గీతాబాలి, ప్రదీప్ కుమార్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రంలో లతాజీ ఆలపించిన ‘వందేమాతరం’ పాట హైలైట్. సినిమాకూడా విజయవంతమైంది. ఈ సినిమాను తమిళంలోకి డబ్ చేశారు. ఎ.వి.ఎం వారు తెలుగు, తమిళంలో ఒకేసారి నిర్మించిన ‘సంఘం’ సినిమాను హిందీలో ‘లడ్కి’ (1953)పేరుతో పునర్నిర్మించారు. అందులో కిషోర్ కుమార్ కు జంట హీరోగా భరత్ భూషణ్ వైజయంతిమాలతో నటించారు. ఆ సంవత్సరం విడుదలైన సినిమాలలోకెల్లా అత్యధిక వసూళ్లు చేసిన సినిమాగా ఈ చిత్రం రికార్డులకెక్కింది. తరవాత ఎం. సాదిక్ దర్శకత్వంలో నిర్మించిన ‘షబాబ్’ (1954) చిత్రంలో భరత్ భూషణ్ నూతన్ సరసన హీరోగా నటించారు. నౌషాద్ సమకూర్చిన సంగీతంతో ఈ చిత్రం మ్యూజికల్ హిట్టయింది. దర్శక నిర్మాత సోహ్రాబ్ మోడీ ప్రముఖ కవి ‘మిర్జా గాలిబ్’ జీవిత కథను సినిమాగా నిర్మించారు. అందులో భరత్ భూషణ్ గాలిబ్ గా, సురయ్యా మోతీ బేగంగా నటించారు. సంగీత దర్శకుడు గులాం మహమ్మద్, మహమ్మద్ రఫీ, తలత్ మెహమూద్, సురయ్యా ల చేత ఆలపింపజేసిన గజళ్లు జనం నోళ్ళలో నానుతూ ఉండేవి. ఈ చిత్రం జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగాను, ప్రాంతీయ భాషా చిత్రాల్లో ఉత్తమ చిత్రంగాను ఎంపికైంది. ఫిలింఫేర్ బహుమతులు కూడా ఈ చిత్రాన్ని వరించాయి. రాష్ట్రపతి భవన్లో పండిత జవహర్ లాల్ నెహ్రు, రాజేంద్ర ప్రసాద్ లు ఈ చిత్రాన్ని తిలకించి అభినందించారు. 1956లో భరత్ భూషణ్ నటజీవితాన్ని మరో మలుపు తిప్పిన చిత్రం రాజా నవాథే దర్శకత్వంలో విడుదలైన ‘బసంత్ బహార్’ సినిమా. ఇది ఒక మ్యూజికల్ హిట్ చిత్రం. శంకర్-జైకిషన్ లు ఈ సినిమాలోని 9 పాటల్ని సూపర్ హిట్ చేశారు. కన్నడ నవల ‘హంసగీతె’ కు సినిమారూపం ఈ చిత్రం. ఇందులో భరత్ భూషణ్ సరసన నిమ్మి నటించగా, కుంకుం, మన్మోహన్ కృష్ణ, లీలా చిట్నీస్, ఓం ప్రకాష్ ఇతరపాత్రలు పోషించారు. ఈ సూపర్ హిట్ చిత్రానికి జాతీయ బహుమతి రావడం కూడా ఒక విశేషమే. 1958 లో బిభూతి మిత్రా నిర్మాణ దర్శకత్వంలో వచ్చిన ‘ఫాగున్’ సినిమా అత్యధిక వసూళ్లను రాబట్టింది. ఇందులో భరత్ భూషణ్ కు జోడీగా మధుబాల నటించింది. ఓ.పి. నయ్యర్ అద్భుత సంగీతం ఈ చిత్ర విజయానికి దోహదపడింది. 1960 రోషన్ సంగీత దర్శకత్వంలో ఖవ్వాలి పాటలతో అదరగొట్టిన పి.ఎల్. సంతోషి సినిమా ‘బర్సాత్ కి రాత్’. మధుబాల, భరత్ భూషణ్, శ్యామా, ముంతాజ్ బేగం నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ హిట్టయింది. మధుబాల నటించిన చిట్టచివరి చిత్రాల్లో ఇదొకటి. “జిందగీ భర్ నహి భూలేగి వో బర్సాత్ కి రాత్”(రఫీ), “మైనే షాయద్ తుమ్హే పెహలె భి కహి దేఖా హై” (రఫీ), “ఏ హై ఇష్ఖ్ ఇష్ఖ్” (ఖవ్వాలి), “జీ చాహతా హై చూం లూన్ తేరి నజర్ కో మి” (ఖవ్వాలి)పాటలు మరువలేనివే కదా! అరవయ్యో దశకం తరవాత భరత్ భూషణ్ ‘నయా కానూన్’, ‘ప్యార్ కా మౌసమ్’, ‘రంగా ఖుష్’, ‘ఖూన్ పసీనా” వంటి సినిమాల్లో సహాయక పాత్రలు పోషించారు. దాంతో భరత్ భూషణ్ నటప్రస్థానం మసకబారుతూ వచ్చింది. కీదార్ నాథ్ శర్మ నిర్మించిన రెండు చిత్రాలు ‘బైజు బావరా’, ‘చైతన్య మహాప్రభు’ సినిమాలలో నటనకు భరత్ భూషణ్ ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ బహుమతి అందుకున్నారు. భరత్ భూషణ్ అతిథి పాత్రలో కనిపించిన చివరి చిత్రం ‘ఆఖరి చేతావని’ (1993). భరత్ భూషణ్ బైజు బావరా, మిర్జా గాలిబ్, బసంత్ బహార్, కవి కాళిదాస్, బర్సాత్ కి రాత్, సంగీత సామ్రాట్ తాన్ సేన్ వంటి సినిమాలలో పోషించిన అసామాన్యమైన పాత్రలు మరెవరూ పోషించలేరంటే అతిశయోక్తి కాదు. అటువంటి అద్వితీయ నటుడు స్టార్డం తెచ్చుకోవడానికి ఏకంగా పదేళ్ళు నిరీక్షించవలసి వచ్చిందంటే అది కేవలం అతని దురదృష్టమనే చెప్పాలి.

వ్యక్తిగతం…

భరత్ భూషణ్ మీరట్ లో స్థిరపడిన ప్రముఖ వ్యాపారవేత్త రాయ్ బహదూర్ బుద్ధ ప్రకాష్ కూతురు సరళ ను వివాహం చేసుకున్నాడు. వారికి అనూరాధ, అపరాజిత అనే ఇద్దరు కుమార్తెలు కలిగారు. అనూరాధకు పోలియోవ్యాధి సోకి అంగవైకల్యం సంభవించింది. అపరాజితను ప్రసవించడంలో జరిగిన వైద్య వైఫల్యాలవలన భరత్ భూషణ్ భార్య సరళ బిడ్డను కని 1960 ప్రాంతంలో కనుమూసింది. అప్పుడే పి. ఎల్. సంతోషి దర్శకత్వం లో భరత్ భూషణ్ హీరోగా నటించిన హిట్ చిత్రం ‘బర్సాత్ కి రాత్’ తయారవుతోంది. అందులో నూతన నటి ‘రత్న’ ని దర్శకుడు పరిచయం చేశారు. ఆ అమ్మాయిని భరత్ భూషణ్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. అన్న రమేష్ భరత్ భూషణ్ ని చిత్ర నిర్మాణంలోకి దింపి పూర్తిగా నష్టపోయేలా చేశాడు. భరత్ ఆస్తులన్నిటినీ హస్తగతం చేసుకున్నాడు. భరత్ భూషణ్ పుస్తక ప్రియుడు. అతని బంగళాలో కొన్ని వేల అరుదైన పుస్తకాలు ఉండేవి. బంగళాలు అమ్మేశాక వాటిని భద్రపరిచే స్థలం లేక కొన్ని గ్రంధాలయాలకు వాటిని విరాళాలుగా ఇచ్చేశారు. 27, జనవరి 1992 న జేబులో చిల్లి గవ్వ కూడా లేకుండా రోడ్డు ప్రక్కన పడి చనిపోయి వుంటే, ఒక పాదచారి భరత్ భూషణ్ ని గుర్తు పట్టి ఆటోలో బోర్విల్లి నేషనల్ పార్కు సమీపంలో వుండే ఆసుపత్రికి చేర్చాడు. ఆసుపత్రిలో అతణ్ణి దింపే సమయానికే భరత్ భూషణ్ తనువు చాలించాడు. బోర్వెల్లి నేషనల్ పార్కు వద్దే ‘బైజు బావరా’ సినిమా షూటింగు జరగడం విధి లిఖితం!

-ఆచారం షణ్ముఖాచారి
(94929 54256)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap