“అభినవ శ్రీకృష్ణదేవరాయ” కోనేటి సుబ్బరాజు

అందానికి అందం, చూడచక్కని రూపం, విశాలమైన నుదురు, విశిష్టమైన నటన, గర్వించదగిన ప్రతిభ, గమనించదగిన ప్రవర్తన, ఆత్మీయమైన పలకరింపు, నిరంతరమైన క్రియాశీలకత, అపూర్వమైన రీతిలో నాటకాభిమానం… ఎంతో… ఎంతెంతో… సహనశీలత.. అన్నిటికీ మించి మంచిమనసు. అన్నీ కలిస్తే ఆయనే కోనేటి సుబ్బరాజు. హృదయపూర్వకంగా నాటకాన్ని ప్రేమించి, నాటకాన్ని అక్కున చేర్చుకుని, నాటకాన్ని లాలించి, నాటకాన్ని మనసారా ఆస్వాదించి, నాటకాన్ని నిరంతరం అర్చించి, నాటకమే తన ఊపిరిగా, నాటకమే తన జీవన ప్రయాణంగా, జీవిత గమ్యంగా మార్చుకొన్న మహా కళాకారుడు కోనేటి సుబ్బరాజు.

కోనేటి సుబ్బరాజు, సుబ్బమ్మ దంపతుల కుమారుడు సుబ్బరాజు. (ఆయన తండ్రి పేరు కూడా సుబ్బరాజే) ఎవరి తల్లిదండ్రుల పేర్లు ఒక్కటిగా ఉంటాయో, వారి సంతానం అఖండమైన ఖ్యాతి పొందుతారని నా చిన్ననాట ఓ గ్రామీణ తత్త్వం విన్నాను. సుబ్బరాజు వంటి ప్రతిభావంతుల్ని చూసినప్పుడు అది యదార్థమేనని అన్పిస్తుంది నాకు.

కళలకు నిలయమైన రాయలసీమలోని కడపజిల్లాలోని రాజంపేట మండలం, మిట్టపల్లె గ్రామంలో 1963 లో జన్మించిన సుబ్బరాజు బాల్యం నుండే నాటకం మీద ఇష్టాన్ని పెంచుకొన్నారు. సుబ్బరాజుకు నాటకం మీద అభిమానం కలగడానికి కారణం వారి తండ్రిగారే. వీధి నాటకాలలో వారికి ఎంతో ప్రవేశం, అభినివేశం ఉండేవి. ఎన్నో వీధి నాటకాలను ఎంతో సమర్థవంతంగా వందలాది ప్రదర్శనలు చేసిన గొప్ప కళాకారుడు సుబ్బరాజుగారి తండ్రి. అందుకే… కోనేటి సుబ్బరాజు తొలి గురువు ఆయన తండ్రిగారేననడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. ఎంతోమంది మహానటుల జీవితంలో జరిగినట్టే, సుబ్బరాజు జీవితంలో కూడా, ఆయన చదివిన పాఠశాలే ఆయనకు నాటకరంగ ఆరంభాన్ని నిర్దేశించింది. బాలనటుడిగా నాటకరంగ ప్రవేశం చేసి, నాటకంతో మమేకమవడానికి ప్రధానమైన వేదిక ఆయన చిన్ననాటి పాఠశాలే అయ్యింది. 1974 లో బాలనటుడిగా, లఘునాటికలతో ప్రారంభమైన సుబ్బరాజు… క్రమంగా 1980 నాటికి రంగస్థలం మీద గుర్తింపును పొందగలిగారు.

ఏ రంగంలోనైనా పేరు ప్రఖ్యాతులు సాధించిన వారి జీవితాన్ని పరిశీలిస్తే కన్పించే గొప్ప సత్యం ఒకటి ఉంటుంది. అదే గొప్ప సంకల్పం. కఠోరమైన శ్రమ. సుబ్బరాజు విషయంలోనూ అది సత్యమయ్యింది. ఆ కృషి, పట్టుదలే సుబ్బరాజుకు ఎనలేని గౌరవాన్ని సాధించి పెట్టాయి. అది ఎంతగా వ్యాపించిందంటే, కోనేటి సుబ్బరాజు, తిరుపతి అని వ్రాస్తే చాలు.. ఉత్తరం అయినా, కొరియర్ అయినా నేరుగా ఆయనకు చేరిపోతాయి. కళారంగం ఆయనకు ఇచ్చిన గొప్ప గౌరవం అది.

తిరుమల కొండలపై కొలువైన దేవదేవుడు శ్రీవేంకటేశ్వరుడి కరుణా కటాక్షాలతో, సుబ్బరాజుకు తిరుమల తిరుపతి దేవస్థానంలోనే ఉద్యోగం లభించింది. దివ్య క్షేత్రమైన తిరుపతి, ఆయనలోని కళా ప్రతిభకు ఎంతో ప్రేరణ నిచ్చింది. తిరుమల తిరుపతిలోని అనేక సాంస్కృతిక సంస్థలతో, ఎందరో కళాకారులతో ఆయనకు అనుబంధం ఏర్పడింది.
ఈ కళా ప్రయాణంలో భాగంగానే, స్వయంగా సుబ్బరాజు కళాపరిషత్ స్థాపించారు. కళా పరిషత్ నిర్వాహకుడిగా, నాటక రచయితగా, నటుడిగా, గుణ నిర్ణేతగా… ఇలా సుబ్బరాజు నాటక రంగంతో గత నాలుగు దశాబ్దాలుగా అవిశ్రాంతమైన ప్రయాణం సాగించారు.

పాత్రల ఎంపికలో సుబ్బరాజు పాటించిన పద్ధతి ఎంతో విలక్షణమైనది. సాధారణంగా మంచి రూపం, శరీర సౌష్టవం, అందం ఉన్న నటులు సర్వసాధారణంగా నాయక పాత్రలే ఎంపిక చేసుకుంటారు. ప్రతినాయక పాత్రలవైపు ఎక్కువ దృష్టి పెట్టరు. ఇక ప్రతినాయక పాత్రల్లో నటించాలనుకొన్నవారు నాయక పాత్రలవైపు దృష్టి పెట్టరు. పైగా ఈ రెండు విధాలైన పాత్రల స్వభావం, పద్ధతి, లక్షణాలు భిన్నంగా ఉంటాయి. నటుడి యొక్క మానసిక స్వభావం కూడా ఎంతోకొంత ఈ పాత్రల్ని పోషించడంలో ఏదో ఒక రూపంలో కన్పిస్తుంది. అందువల్ల ఏ నటుడైనా నాయక, ప్రతినాయక పాత్రల్ని సమానంగా పోషించడం చాలా కష్టసాధ్యమైన విషయం. ఈ విషయంలో మహానటులు కీ.శే. నందమూరి తారక రామారావుగారినే చెప్పుకోవాలి. శ్రీరామ, శ్రీకృష్ణ పాత్రల్లో ఎంత అందంగా దర్శనమిచ్చారో… రావణ, దుర్యోధన పాత్రల్లోనూ అంత ప్రతిభావంతంగా గొప్ప ప్రదర్శన చేసిన మహానటుడు కీ.శే. ఎన్.టి.ఆర్. అందుకే వారు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా కీర్తించబడ్డారు. కోనేటి సుబ్బరాజు విధానం కూడా అదే. అచ్చం ఎన్.టి.ఆర్. పోషించిన గొప్ప పాత్రల్నే ఆయనా పోషించి, ప్రేక్షకలోకం చేత బహుముఖ ప్రశంసలందుకున్నారు.

దేవదేవుడైన శ్రీనివాసుడిగా నయన మనోహరంగా కన్పించిన సుబ్బరాజే, విశ్వామిత్రుడి పాత్రలో అద్భుతంగా రౌద్ర రసాన్ని పండించారు. సకల మానవాళికి ఆధ్యాత్మిక శాంతిని ప్రసాదించిన, షిరిడీ సాయినాధుడిగా ప్రేక్షకులకు కనువిందు చేసిన సుబ్బరాజే, శ్రీకృష్ణదేవరాయల పాత్రలో విజయనగర సామ్రాజ్య స్వర్ణయుగాన్ని ప్రత్యక్షం చేశారు.
సునిశితమైన హాస్యంతో, సుందరమైన దరహాసంతో ప్రేక్షకుల్ని పారవశ్యంలో ముంచెత్తిన, నారద పాత్రలో సుబ్బరాజు అభినయం మనోహరం. అభిమానధనుడైన కురుసార్వభౌముడు రారాజు సుయోధనుడిగా సుబ్బరాజు నటన కమనీయం. ఆయా పాత్రల్లో ఇమిడిపోవడంలో సుబ్బరాజు చూపే నేర్పు చాలా గొప్పది. ముఖ్యంగా… ప్రతి నాయక పాత్రల్లో వారి ప్రతిభ ప్రేక్షకుల ప్రశంసలందుకుంది. విమర్శకులకు సంతృప్తి నిచ్చింది.

గంభీరమైన స్వరంలో, తారస్థాయిలో ప్రతినాయక పాత్రల్లో రంగస్థలం పైన సుబ్బరాజు కన్పిస్తే చాలు, ప్రేక్షకులు కదలకుండా ఉండిపోతారు. ఆ పాత్రల్లో ఆయన నటన ప్రేక్షకుల్ని అంతగా కట్టిపడేస్తుంది.
కోనేటి సుబ్బరాజు కళా ప్రయాణం ఒక అద్భుతమైన ప్రయాణం. ఆయన నాటకాలు చిన్నవికావు. ఇద్దరు ముగ్గురు కళాకారులతో కూడినవి కావు, అవి పెద్ద నాటకాలు, నలభై ఏభైమంది నటీనటులతో కూడిన నాటకాలవి, ఆమాటకొస్తే ఒక్కోసారి డెబ్బైమంది నటీనటులతో కూడా నాటక ప్రదర్శనలు చేసిన ఘనత కోనేటి సుబ్బరాజుకే స్వంతం, ఆంధ్రప్రదేశ్ లోనే కాక, ఇతర ప్రాంతాలలో దాదాపుగా ఎన్నో నాటక ప్రదర్శనల్ని విజయవంతంగా చేసిన ఘనత సుబ్బరాజుది.

ఇక అవార్డుల మాటకొస్తే… ఆంధ్రప్రదేశ్ లోని అన్ని పరిషత్ లలో బహుమతుల్ని సుబ్బరాజు కళాపరిషత్ స్వంతం చేసుకొంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొలిసారిగా నంది నాటకోత్సవాలను రవీంద్ర భారతిలో నిర్వహించినపుడు, వీరి శ్రీనివాస కళ్యాణానికి బంగారు నంది అవార్డ్ లభించింది. మరోసారి, నంది నాటకోత్సవాలలో విరాట పాండవీయం నంది అవార్డుతో గౌరవించబడింది. ఇలా తొమ్మిది నంది అవార్డుల్ని సుబ్బరాజు కళాపరిషత్ గెల్చుకొంది. తిరుపతిలోని ప్రసిద్ధిచెందిన శ్రీవేంకటేశ్వరా నాట్యకళాపరిషత్ లో కూడా, గొప్ప ప్రదర్శనలిచ్చి మరెన్నో గరుడ అవార్డుల్ని అందుకొన్నారు సుబ్బరాజు. అంతేకాదు… గరుడ అవార్డుల వజ్రోత్సవ వేడుకలకు కోనేటి సుబ్బరాజే కళాపరిషత్ కార్యదర్శి కావడం నిజంగా ఓ మధురమైన అనుభూతి. రంగస్థల నటుడిగా కోనేటి సుబ్బరాజును ఎన్నో సత్కారాలు వరించాయి. ఆయన నట ప్రతిభకు మెచ్చి స్వర్ణ కంకణధారణ చేశారు ప్రేక్షకులు. సువర్ణ కిరీటంతో సత్కరించారు. ప్రగతి కళామండలి సత్తెనపల్లి వారి “పత్రి జగన్నాధరావు పురస్కారం”, ఉప్పులూరి రాజారావు కళాపీఠం వారి సత్కారం, యువ కళావాహిని హైదరాబాద్ వారి ‘వనారస గోవిందరావు పురస్కారం” ఇలా ఎన్నో పురస్కారాలు… మరెన్నో పైగా సత్కారాలు… సన్మానాలు సుబ్బరాజుకు ఆయనలోని కళాప్రతిభకు నీరాజనాలు సమర్పించాయి.

ప్రేక్షక జనావళి ఆయన ప్రతిభకు మెచ్చి, ఎన్నో… ఎన్నెన్నో.. బిరుదులతో గౌరవించారు. “నటరత్న, కళారత్న, నటసింహ, నటకేసరి, కళాతేజం, కళాప్రపూర్ణ, కళాభోజ వంటి ఎన్నో గౌరవాలు ఆయన కీర్తి కిరీటంలో కలికితురాయిగా ప్రకాశించాయి, ప్రకాశిస్తున్నాయి. ఇలా ఎంత చెప్పినా తరగని ఓ కళా ప్రేమికుడి, కళాకారుడి గొప్ప కథ సుబ్బరాజుది.

తెలుగు నాటక రంగంలో గత పదేళ్ల కాలంలో కోనేటి సుబ్బరాజు సాధించింది చాలా ఉంది. ముఖ్యంగా పౌరాణిక నాటకాలను రాష్ట్రంలోని ప్రధాన నగరాలలో వరుసగా ప్రదర్శన లిచ్చిన మంచి నాటక నిర్వాహకుడు ఆయన. అలాగే ఆయన దర్శకత్వం వహించిన ‘అహో ఆంధ్రభోజ’ నాటకం ‘భారత్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ లో చోటుచేసుకుంది. అలాగే బళ్లారిలోని రాఘవ కళామందిరంలో ఆయనకు ‘బళ్ళారి రాఘవ జాతీయ పురస్కారం’ లభించింది. వీటన్నిటికీ మిన్నగా ఏ పరిషత్తులోనూ ప్రదర్శించబడని నూతన నాటికలను, నూతన కళాకారులను ప్రోత్సహించడానికి ఆయన నిర్వహించిన నాటిక పరిషత్ నిస్సందేహంగా గొప్పది. వందలాది మంది నటీనటులను సత్కరించిన నాటక ప్రేమికుడు కోనేటి సుబ్బరాజు.

ఇలా నాటకాన్ని ప్రేమించి, నాటకం కోసం తపించి, నాటకమే శ్వాసగా బ్రతికిన కోనేటి సుబ్బరాజు ఈనెల 30 వ తేదీన..తిరుపతిలో అస్తమించడం నిజంగా బాధాకరం. తెలుగు నాటకానికి తీరని లోటు.
ఈ జీవన రంగస్థలంపై నుండి నిష్క్రమించిన.. ఆ నాటక ప్రేమికుడి వినయంతో శతసహస్ర వందనాలర్పిస్తున్నాను.

వాడ్రేవు సుందర్రావు
(నంది, గరుడ అవార్డుల గ్రహీత)

Share via
Copy link
Powered by Social Snap