“మహా నటుడు అనొద్దు మంచి నటుడు అనండి సబబుగా ఉంటుంది” ఇది తన గురించి తను చెప్పుకున్న కోట వారి మాట! తెలుగు సినిమాకు విలన్లు ఎస్వి రంగారావు, రాజనాల, రావు గోపాలరావు, కైకాల సత్యనారాయణ, ఆ తరువాత గొల్లపూడి, కోట! మిగిలిన విలన్లు పక్క రాష్ట్రాల నుంచి అరువు తెచ్చుకున్న వాళ్లే! కైకాల కోట ఇద్దరూ కామెడీ విలన్లుగా కూడా రాణించారు. కోట మూడున్నర దశాబ్దాల పాటు తెలుగు ఇండస్ట్రీలో కోటలా నిలబడ్డారు.
బ్యాంకు శ్రీనివాసరావు నాటకాలు వేసుకుంటున్న రోజుల్లో ముత్యాల సుబ్బయ్య చూసి టి. కృష్ణకు చెబితే ప్రతిఘటన కాశయ్యగా కోట నటన పరాకాష్ట. ప్రాణం ఖరీదు సినిమా నుంచి మొదలు పెట్టి ఆఖరి సినిమా హరిహర వీరమల్లు వరకు మొత్తం 784 సినిమాల్లో నటించారు. ఇంకో 31 సినిమాలు విడుదల కానివి వెరసి 814 సినిమాలు అని ఒకసారి నాతో కోట శ్రీనివాసరావు అన్నారు. అదీ ఒక నెల క్రితం చెప్పిన మాట.
నిజానికి ఆయన బెజవాడ మిత్రుడు హరిబాబు నేను తాజాగా ఈ మధ్యనే కోట శ్రీనివాసరావును కలిశాము. ఆయన ఆత్మకథ రాయాలని హరిబాబు నన్ను తీసుకెళ్లారు. ఆరోజు చెప్పిన లెక్క మొత్తం 814. మొదట్లో ఆత్మకథ కు అంగీకరించలేదు. కానీ, బలవంతంగా హరిబాబు ఒప్పించారు. పద్మభూషణ్ కు ప్లస్ అవుతుందని చెప్పడంతో కోట ఒప్పుకున్నారు. కానీ, రెండో సిట్టింగ్ లోపే ఆయన వెళ్లిపోయారు.
కోట నాకు మూడున్నర దశాబ్దాల పరిచయం. ఉధ్రుతంగా నటిస్తున్న రోజుల్లో జ్యోతిచిత్రకు ఇంటర్వ్యూ చేయించారు ఎడిటర్ మోహన్ కుమార్! ఆ పరిచయం అలా కొనసాగుతూ వార్తలో బంధం బాగా బలపడింది. వార్తలో నేను రాస్తున్న డైరీ లో ఒక పేజీ కోసం 2004లో అనుమతి అడిగాను. “కొత్తగా రాసేదేముంది ఏడిశావులే” అన్నారు. సరే బలవంతంగా ఒప్పించి ఒకరోజు అంతా ఆయనతో వున్నాను. కోట భార్య రుక్మిణి గారు అన్నారు “మొత్తానికి ఇంట్లో వుంచావయ్య, షూటింగ్ లేదంటే ఫ్రెండ్స్ తో పార్టీలు షికార్లు” అని ఆమె దెప్పిపొడిచింది. సరే, వార్తలో ఫుల్ పేజీ రాశాను. వారం తరువాత ఇంటికి పిలిచారు. వెళ్ళగానే నేను రాసిన ఐటమ్ ఫ్రేమ్ కట్టించి పెట్టుకున్నారు! ఎదురుగా కనిపించింది. ఇన్నేళ్లు తన గురించి ఇలాంటి ఐటమ్ రాలేదని మెచ్చుకున్నారు. నేను రాసే నాటకాల సమీక్ష ఆయనకు చాలా ఇష్టం! “రాకున్నా నాటకం కళ్లకు కట్టేలా రాస్తావు, అయ్యో మిస్ అయిపోయామని బాధపడేలా రాస్తావు” అంటూ చాలాసార్లు ఫోన్ చేసి అభినందించారు. నీ కోసమే వార్త వేయించుకుంటున్న అని ఆయన చెప్పడం అప్పట్లో నాకెంతో కిక్ ఇస్తుండేది.
ఆయనకు నటించి మెప్పించడం చెవి కోసుకునేంత ఇష్టం. ఏ పాత్ర ఇస్తే ఆ పాత్ర కనిపించాలి కానీ, ప్రకాష్ రాజ్ కనిపించకూడదు అని జోక్ కట్ చేసే వారు. నట గురువులైన వారి అన్న కోట నరసింహారావు, భావనాచారి, దేశరాజు హనుమంతరావును సందర్భచితంగా స్మరించుకోవడం ఇష్టపడే వారు! సినీ పరిశ్రమలో తనకంటూ ఒక అధ్యాయం సృష్టించినందుకు కాస్త గర్వంగా ఫీల్ అవుతుంటారు! కులమతాలకు అతీతంగా అందరినీ ప్రేమించిన సహృదయం. బాబూమోహన్ కాంబినేషన్ బాగా పేలింది! ఇద్దరూ ఒకే కంచంలో భోజనం చేసేంత స్నేహం. కోట షూటింగులో ఉంటే మిగిలిన నటులకు పండుగ. ఎందుకంటే ఇంటి నుంచి రోటి పచ్చళ్ళు, నోరూరించే సాంబార్ లంచ్ టైమ్ కు వచ్చేది.
నాటక రంగం నుంచి సినిమా పరిశ్రమకు వచ్చారు కాబట్టి తానేంటో తనకు బాగా తెలుసు. కర్ర విరిగేలా సాము చేయలేదు. అప్పుడప్పుడు తానొక టాప్ విలన్ అనే భావం గుర్తుకొచ్చి కొందరిని హర్ట్ చేసినా, ఆ వెంటనే తప్పు తెలుసుకుని క్షమాపణలు చెప్పేవారు. ఇట్టే కలసిపోయే వారు. తెలుగు సినిమాల్లో పక్క రాష్ట్రాల విలన్లు దిగుమతి చేసుకోవడం జీర్ణించుకోలేక పోయారు. బాహాటంగా విమర్శించారు. ఏది దాచుకోవడం రాదు. మిగిలిన నటుల్లా నిజ జీవితంలో నటించడం చేత కాదు. అందుకే విరోధులను పెంచుకున్నారు కోట.
2010లో కుమారుడు ఆంజనేయ ప్రసాద్ బైక్ ప్రమాదంలో కనుమూసినప్పటి నుంచి ఆయన జీవితంలో పెద్ద సుడిగుండం ఏర్పడింది. అందులోంచి కోలుకోవడం కష్టమైపోయింది. మరోవైపు కారు ప్రమాదంలో కుమార్తె కాలు పోగొట్టుకోవడం కూడా కుంగదీస్తూ వచ్చింది! భార్య ఆరోగ్యం మొదటి నుంచి కూడా అంతంత మాత్రమే! అసలు భార్య ఆరోగ్య పరీక్షల కోసమే ఆయన బెజవాడ ఎస్బిఐ నుంచి హైదరాబాద్ బ్యాంక్ కు బదిలీ చేయించుకున్నారు. అదే రవీంద్రభారతిలో నాటకాలు వేయడానికి, సినిమా వారి కళ్ళల్లో పడటానికి, జీవితం గొప్ప మలుపు తీసుకోవడానికి కారణమయ్యింది. సినిమా అవకాశాలు వచ్చాక బిజీ అయిపోయారు. పిల్లలతో ఆడుకోలేకపోయారు. చదువుల గురించి పట్టించుకునే తీరిక లేదు. “అదృష్టం కొద్దీ వారు మంచి చదువులే చదువుకున్నారు” అని ఒకసారి అన్నారు. తనను రెండు విషయాలు వెంటాడి బాధించాయని, ఒకటి పిల్లలతో గడిపే సమయం లేక కొన్నాళ్ళు, గడిపే సమయానికి వారు అందుబాటులో లేక కొన్నాళ్ళు బాధ వేధించింది, వేధిస్తూనే ఉందని కంట తడిపెట్టారు ఒకసారి కోట.
కోటకు ఈతరంలో ఇష్టమైన హీరో జూనియర్ ఎన్టీఆర్! ఆ అబ్బాయిలో నటనతో పాటు అన్నీ ఉన్నాయి అనేవారు. ఆతరంలో ఎన్టీఆర్, అక్కినేనిని ఇష్టపడే వారు! మరి, పెద్ద ఎన్టీఆర్ ను ఢీ కొట్టి మండలాధీశుడు చేసారుగా అనడిగితే, అంతా కృష్ణ వల్లనే అని చెప్పారు. నా పిలుపే ప్రభంజనం సినిమాలో ఎన్టీఆర్ ను అనుకరించడంతో మండలాధీశుడు అవకాశం వచ్చింది. ఆ సినిమా చేశాక విజయవాడలో ఎన్టీఆర్ అభిమానులు దాడి కూడా చేశారు. ఎన్టీఆర్ ను రెండేళ్ల వరకు కలవడానికి భయపడ్డారు. బ్రహ్మర్షి విశ్వామిత్ర షూటింగ్ లో ఎన్టీఆర్ ను కలిస్తే ఆయన అక్కున చేర్చుకుని “మీరు మంచి నటులు బాగా చేస్తున్నారు బ్రదర్” అని మెచ్చుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించి ఆ మహానుభావుడి కాళ్ళ మీద పడిపోయానంటూ ఒకసారి గుర్తు చేసుకున్నారు.

బిజెపి సీనియర్ నేత విద్యాసాగర్ పరిచయం కోటను రాజకీయాల వైపు నడిపించింది. బిజెపి విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గా గెలిచారు. రెండవ దఫా ఓడిపోయి రాజకీయాలకు స్వస్తి పలికినా చివరి వరకు బిజెపిలోనే కొనసాగారు. “బాబూమోహన్ మినిష్టర్ అయ్యాడు కదా” అని ఒకసారి అంటే, అతడి సుడి, ప్రాంతీయ పార్టీ కాబట్టి ఆ అదృష్టం అతనికి దక్కింది, జాతీయ పార్టీ కాబట్టి తనకు ఆ స్థితి రాలేదు, అలా అని అసంతృప్తి కూడా లేదన్నారు. పద్మశ్రీ రావడం తనకు ప్లస్ అయ్యిందిగా అని చెప్పుకున్నారు.
అప్పుడప్పుడు వేదికలపై అతిధులుగా కలుస్తుండే వాళ్ళం. ఎప్పుడైనా మాట్లాడాలనిపిస్తే వారం ముందు డేట్ టైమ్ ఫిక్స్ చేసే వారు. ఫిల్మ్ నగర్ క్లబ్ లో లేదా వారింట్లో కాలక్షేపం చేసే వాళ్ళం. మనవడు శ్రీనివాస్ అంటే చాలా ఇష్టం. వాడి ఇంజనీరింగ్ పూర్తి అయి మంచి జాబ్ లో చేరితే పెళ్ళి చేసి ఇక సెలవు తీసుకోవాలని అంటుండే వారు. ఇటీవల కాలంలో తీవ్ర మనోవేదన, షుగర్ బాగా పెరిగిపోవడంతో రెండు కాళ్ళల్లోనూ కొన్ని వేళ్ళు తొలగించాల్సి వచ్చింది. దాంతో వీల్ చెయిర్ కు పరిమితం అయ్యారు. కూర్చుని నటించే పాత్రలు వస్తేనే చేస్తూ వచ్చారు. “గ్యాంగ్రీన్ ఇంత ఇబ్బందిపెట్టినా కాలు తీసేసే పరిస్థితికి రాలేదు, దేవుడి దయ” అనే వారు. ఆసుపత్రి పాలై లాక్కుంటూ పీక్కుంటూ పొడిపించు కుంటూ కాకుండా శుభ్రంగా చనిపోవాలని కోరుకున్నారు. అలాగే ఆదివారం వేకువ ఝామున నాలుగు గంటలకు చనిపోయారు. తెలుగు సినిమా లో తెలుగు విలన్ శకం ముగిసింది. తెలుగు చిత్ర పరిశ్రమలో బ్రహ్మాండమైన కోట కూలిపోయింది.
- డా. మహ్మద్ రఫీ
