శరత్ బాబు జీవితంలో చివరకు మిగిలింది…?

ఆ హాస్యనటికి శరత్ బాబు నచ్చాడు. 1974 నాటికి సహజీవనం అనే పదం ప్రచారంలో లేదు. కాని ఆ సమయంలోనే వారు జంటగా 14 ఏళ్ళు పెళ్ళిలేని కాపురం చేశారు. పిల్లలు కలిగితే వారి జీవితం ఎలా ఉండేదో. పిల్లలు వద్దనుకున్న ఆ జంట నిర్ణయం, ఇతర కారణాలు వారిని దూరం చేశాయి.

కొందరి జీవితాలు చిత్రంగా సాగుతాయి. వారి వ్యక్తిత్వాలు భిన్నంగా ఉంటాయి. వారితో పరిచయం వున్నవారందరికీ గొప్పవాడు. కాని అయినవాళ్ళ దృష్టిలో మంచి అభిప్రాయం ఉండక పోవటం కొందరి వ్యక్తిత్వం. దీనికి భిన్నంగా అయిన వారికి అద్భుతంగా ప్రేమను పంచగలిగి, కట్టుకున్న వారితో మాత్రం సన్నిహితంగా ఉండలేరు, వారికి ప్రేమను పంచలేరు మరికొందరు.
ఈ రెండవ కోవకు చెందుతాడు ఇటీవలే మరణించిన సినీనటుడు శరత్ బాబు. శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాలవలసలో ఒక సాంప్రదాయ కుటుంబంలో పుట్టిన అందగాడు సత్యంబాబు. డిగ్రీ వరకు కల పోలీసు అధికారి కావాలనేది.

కుటుంబం కోరుకున్నది తమ కుటుంబ హోటల్ బిజినెస్ కొనసాగించాలని. హోటల్ కౌంటర్లో ఒక సంవత్సరం కూర్చోపెట్టినా ఆ ఇడ్లీ, వడ వ్యాపారం అబ్బలేదు అతనికి. డిగ్రీ ఫైనల్ కి రాకముందే వచ్చిన కంటిచూపు తేడా పోలీసు డిపార్ట్మెంటుకి పనికి రాకుండా చేసింది. చివరికి అతనికి మిగిలిన చక్కని రూపంతోనే ఏదయినా చెయ్యటం.

లెక్చెరర్స్, స్నేహితుల ప్రోత్సాహంతో స్థానికంగా ఆడిన నాటకాల విజయం, కొత్త నటులు కావాలన్న ప్రకటనకు స్పందించేలా చేసింది. అలా 23 వీళ్ళ చిన్నవయసులోనే చెన్నపట్నంనుండి సినిమా ఆఫర్ రావటం ఒక రకమైన మలుపు.
అలా ఒడ్డు, పొడుగు, మంచి అందమైన ముఖం, చక్కని నవ్వు కలిగిన ఒక కొత్త నటుడు శరత్ బాబు రూపంలో తెలుగు సినీ పరిశ్రమకు దొరికాడు. అతని టాలెంటిని తమిళ దర్శకుడు బాలచందర్ గుర్తించాడు. అలా తమిళంలోకి వెళ్ళాడు. మలయాళం, కన్నడ సినీరంగాలు శరత్ బాబుకి ఆహ్వానం పలికాయి. సినీరంగములోకి అడుగు పెట్టిన తొలిరోజుల్లోనే శరత్ బాబు తనకన్నా అయిదు సంవత్సరాలు పెద్దది అయిన సినీనటి మీద మనస్సు పడ్డాడు.

ఆ హాస్యనటికి శరత్ బాబు వచ్చాడు. 1974 నాటికి సహజీవనం అనే పదం ప్రచారంలో లేదు. కాని ఆ సమయంలోనే వారు జంటగా 14 ఏళ్ళు పెళ్ళిలేని కాపురం చేశారు. పిల్లలు కలిగితే వారి జీవితం ఎలా ఉండేదో. పిల్లలు వద్దనుకున్న ఆ జంట నిర్ణయం, ఇతర కారణాలు వారిని దూరం చేశాయి.
1988లో వారి సహజీవనం ఆగిపోయి ఎవరి జీవితాలు వారివి అయ్యాయి. ఒకరిగురించి మరొకరు మీడియా ముందు వెళ్ళగక్కుకున్నారు. 14 ఏళ్ళ తర్వాతకూడా మనసులు పూర్తిగా కలవలేదు. ఒంటరి శరతాబాబు మరో వనితను పెళ్ళాడాడు. సినీనటుడు కూతురైన స్నేహలతని 1990లో పెళ్ళి చేసుకున్నాడు. వారి సంసారం పద్దెనిమిది సంవత్సరాలు సాగింది. వారికి ఇద్దరు పిల్లలు అనేది బహిరంగంగా అంగీకరించని విషయం. 2008లో ఆమె విడాకులు తీసుకుని దూరమయిన తరువాత శరత్ బాబు జీవితం మళ్ళీ మొదటికి వచ్చింది. వ్యక్తిగత జీవితం గురించి బయటకు అంతగా చెప్పుకునేందుకు శరతాబాబు ఇష్టపడేవాడు కాదు. తాను సినిమాల ద్వారా దగ్గరయిన స్నేహితులు కమల్ హాసన్, రజనీ కాంత్ లాంటి వారితో సరదాగా ఉండేవాడు. తనకంటూ వస్తున్న సినిమా ఆఫర్లు అంగీకరించి తన పనులు తాను చేసుకునేవాడు. తోడబుట్టినవారి సంతానాన్ని చదివించి ప్రయోజకులను చేశాడు. సోదరుడు పంచిన ప్రేమ, ఆదరణ గురించి వారు ఘనంగా చెప్పుకునేవారు. కాని ఇంత ప్రేమ పంచిన వ్యక్తి తన భార్యతో పొసగకపోయి, దూరం చేసుకోవటమే చిత్రం.
ఒంటరితనం వేధిస్తుంది. తోడు కావాలని మనసు కోరుకుంటున్నది. 57 ఏళ్ళ వయసులో ఒంటరయిన శరత్ బాబు మరెవరితోనో దాంపత్యం కోరుకున్నాడని, ప్రేమలో పడ్డాడని మీడియా అనేది. మీడియాలోకి ఎక్కిన ఆమె మాత్రం నాకన్నా రెట్టింపు వయస్సు వున్నవాడితో నాకు సంబంధ మేమిటి! అంటూ కొట్టిపారేసింది.

70వ ఏటకూడా ఆయనింకా తోడు ఆశవదలని వాడంటూ చెన్నై పత్రికలు రాస్తుండేవి. సినిమాలు, సీరియళ్ళతో జీవితం బిజీగా మార్చుకున్నప్పటికీ ఒంటరితనపు ఒత్తిడి, సినీరంగపు ప్రత్యేక అలవాట్లు కలిసి శరత్ బాబును కుంగతీశాయి. మనిషిలో మార్పు వచ్చింది. ముఖం పీక్కుపోయింది. కాని అది క్యాన్సర్ అని ఎన్నడూ బయటకు తెలియదు. మైలోమియా అనే రక్త క్యాన్సర్తో బాధపడుతూ, చికిత్స తీసుకుంటూనే నటనారంగంలో కొనసాగించాడు. పాత్రలు మరీ నిడివి తగ్గిపోయాయి. ‘వకీల్సాబ్’, ‘మళ్ళీ పెళ్ళి’వంటి చివరి సినిమాలలో అలనాటి అందాల నటుడు శరత్ బాబుని గుర్తుపట్టటం కష్టమయ్యేది. అయినా తన ఆరోగ్యానికి సమస్య ఏమీలేదు అంటూ తోసిపుచ్చేవాడు. రక్తంలో పోరాటశక్తి పడిపోయి, రక్తంలోకి విష కారక సూక్ష్మజీవి చేరటంతో శరీరం తట్టుకోలేకపోతున్నది. ఆ ‘పెప్సిస్’ అనేది ప్రాణాంతకం అని తెల్సు. 2023 ప్రారంభంలోనే తేడా తెలిసింది. బెంగళూరులోని ప్రైవేటు ఆసుపత్రిలో మార్చి నెలలో చేరాడు. పెప్సిస్తో వరసగా అంగాలు పని తీరు పాడైంది. వెంటిలేటర్మీద బతికించారు. హైదరాబాద్ లోని పెద్ద ఆసుపత్రికి తరలించిన తరువాత ఎంత మెరుగైన చికిత్స అందించినా వెంటిలేటర్మీదే సాగింది జీవితం, ఒక అంగం తరువాత మరొకటి వరసగా విఫలమవటంలో మే 22న శరత్ బాబు కన్నుమూశాడు. అంత్యక్రియలకు ఆయనకి ఇష్టమయిన మద్రాసుకి తరలించారు.

-దుగ్గరాజు

SA: