తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డ తిరుమలేశ్వరరావు

“కృషి వుంటే మనుషులు ఋషులవుతారు/మహా పురుషులవుతారు/ తరతరాలకు తరగని ఇలవేల్పు లవుతారు/..” అన్న పాట విన్నప్పుడు తిరుమలేశ్వరావు గారు గుర్తుకొస్తారు. వీరు కృషి, పట్టుదల, ఆత్మబలం, ఆత్మవిశ్వాసం వీటన్నింటిని ఊపిరిగా నింపుకొని దివి నుండి భువికి దిగివచ్చిన తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డ. ఈ అపర మేధావి, రచయిత, డైలాగ్ రైటర్, సినిమా, టీవీ నటులు, రంగస్థల నటులు, నిర్మాత, దర్శకులు, షార్ట్ ఫిలిం రచయిత నటులు, ఇంకా పంచాయితీరాజ్ ఆఫీస్ లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా…. ఇలా అన్ని రంగాలలో బహుముఖీయంగా వెలుగొందుతున్న తిరుమలేశ్వరావు గారి పేరు వినగానే తెలుగు కళామతల్లి ఆనందంతో పరవశించిపోతుంది. ప్రకృతి మాత సైతం వీరి నట వైదుష్యానికి మెచ్చి పిల్లగాలుల్ని కూల్ కూల్ గా ప్రసరింప చేస్తుంది. చిలకమ్మ సైతం తన చిలక పలుకుల్ని వీరి డైలాగ్స్ తో జతకట్టి మరీ పలకరిస్తుంది. వీరినట విన్యాసానికి నాట్య మయూరి కూడా పురివిప్పి నాట్య విన్యాసాలను ప్రదర్శిస్తుంది. భారతమాత సైతం వీరి ప్రతిభకు మెచ్చి మువ్వన్నెల జెండా రెపరెపల్ని విశ్వవ్యాపితం చేస్తుంది.

ఇంతటి ప్రతిభా మూర్తిగా వెలుగొందుతూ “బహుమఖ ప్రజ్ఞ” అన్న పదానికి సరికొత్త అర్ధాన్ని తెచ్చిన తిరుమలేశ్వరరావు గారు మన గ్రేటర్ ఆంధ్రప్రదేశ్ కే తలమానికమైన గుంటూరులో శ్రీ వెంకటస్వామి, శ్రీమతి తిరుపతమ్మ పుణ్య దంపతుల ఇంట నట సార్వభౌముడిగా జన్మించారు. వీరు చిన్నతనం నుంచి కూడా ఎంతో చురుగ్గా, ఉత్సాహంగా ఉంటూ చదువులో కూడా అత్యంత ప్రతిభను కనబరిచేవారు. పాఠశాల విద్య నభ్యసస్తున్నప్పటి నుండి నటనన్నా, రచనా రంగం అన్న మక్కువ చూపేవారు. అదే రెట్టింపు ఉత్సాహంతో ఉన్నత పోస్టు గ్రాడ్యుయోషన్ ను అత్యధిక మార్కులతో పాసయ్యి హ్యాట్రిక్ సాధించారు. పంచాయితీ రాజ్ లో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే రచనారంగంపై మక్కువతో ఒక్కో మెట్టు ఎదుగుతూ వచ్చారు. మొట్టమొదటి నుంచి కూడా పెద్ద పెద్ద రచనలతోనే వీరి సాహితీ ప్రస్థానం మొదలైంది.

రంగస్థల నటుడిగా ఎన్నో నాటకాల్లో స్టేజి మీద నటించి ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు. సాహితీ మాతకు నీరాజనాలర్పిస్తూ ఈ నాటక రచయిత “పొద్దుపొడిచింది, వన్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు వన్, నాటకం కోసం, గడ్డిపరకలు, మూన్ లైట్…” లాంటి ఎన్నో మరెన్నో నాటికలు రాయడమే కాదు ఆయా నాటికల్లో నటించి నటనకు చక్కని భాష్యం చెప్పారు. ఇంకా వీరు ప్రముఖ వ్యాఖ్యాత సుమా కనకాలతో కలిసి “రేపటి మహిళ”లో నటించి ఓ మంచి భర్తగా తన నటనకు జీవం పోసి అందరి ప్రసంశలు అందుకున్నారు. ఇంకా ప్రముఖ నటీమణులు రాగిణి, తెలంగాణ శకుంతల, బృంద, నాగమణి, శ్రీవాణిలతో నటించి నటనకే వన్నెతెచ్చారు తిరుమలేశ్వరావుగారు. ఇంకా సాంఘిక నాటకాలు, చారిత్రక నాటకాలైన నేతాజీ, గౌతమ బుద్ధ, విక్రమాదిత్య, శ్రమణకం వంటి అద్భుతమైన కథాంశాలతో కూడిన నాటికలు, సీరియల్స్ లో నటించి తన నటనకు జీవం పోశారు.

తెలుగు భాష పై ఉన్న అమితమైన మక్కువతో తెలుగు భాషలోని గొప్పతనాన్ని తెలియజేస్తూ అమ్మ భాషలోని కమ్మనైన మాధుర్యాన్ని తెలియజేసే “చెయ్యెత్తి జై కొట్టు” దూరదర్శన్ నాటికలో ప్రధాన పాత్ర పోషించి తెలుగు భాషకు జేజేలు అర్పించారు. ఇంకా దూరదర్శన్ లోనే “నేర్పరి సుమతి, ఆత్మస్థైర్యం” వంటి నాటికల్లో నటించి తోటి నటులందరికీ ఆదర్శంగా నిలిచారు. “ప్రజా నాయకుడు” సీరియల్ లో కూడా ప్రధాన పాత్ర పోషించి అందరి చేత సెహభాష్ అనిపించుకున్నారు. నవ్వించడం ఒక యోగం అన్న చందాన “పూతరేకులు” పేరుతో 12 కామెడీ స్కిట్స్ తో హాస్యాన్ని పండించి అందర్నీ కడుపుబ్బ నవ్వించారు. ఇలా వీరు నాటకం జీవితానికి ప్రతిలిపిగా, వాస్తవానికి ప్రతిబింబంగా ఉండాలని నవరసాలను సంధించి నాటకానికి వాస్తవికతను జోడించి అద్భుతంగా ఆయా పాత్రలకు న్యాయం చేకూరుస్తూ నట విరాట్ గా భాసిల్లుతున్నారు.

ఇందు కలరు అందులో లేరు అన్న సందేహం వలదు ఎందెందు వెతికినా తిరుమలేశ్వరరావు గారే అన్న చందాన షార్ట్ ఫిలిమ్స్ తీయడంలో కూడా అందవేసిన చేయి. అత్యధికంగా 15 షార్ట్ ఫిలిమ్స్ కి స్కిట్స్ రాసి నటించారు. వీటిల్లో “మల్లెపూలు గొల్లుమన్నవి, బొట్టు” వంటి షార్ట్ ఫిలిమ్స్ లో అద్భుతంగా నటించి ప్రేక్షకుల నీరాజనాలు అందుకున్నారు. “ఎవడ్రా ఆపేది మనల్ని” వెబ్ సిరీస్ లో కూడా నటించారు. ఇలా మానవతా విలువలకి అద్దం పడుతూ లెక్కకు మిన్నగా నాటకాల్లో, షార్ట్ ఫిలిమ్స్ లో నటించారు. సినీ వినీలాకాశంలో కూడా తిరుమలేశ్వరావు గారు ఓ వెలుగు వెలిగారు. నూతన ఒరవడికి భాష్యం చెబుతూ ఇటీవల వీరు పేరులోనే నూతనత్వాన్ని సంతరించుకున్న “వెనక్కి తిరిగి చూడకు” అనే సరికొత్త సినిమాకి శ్రీకారం చుట్టారు. విభిన్నమైన ఉత్తమ కథాంశంతో ప్రస్తుత ట్రెండుకి అనుగుణంగా కొత్త నటి నటులతో చాలా అద్భుతంగా ఈ సినిమా తీశారు. ఈ సినిమాలో వీరు నిర్మాతగా, మాటల రచయితగా, నటుడిగా తన ప్రతిభకు పట్టం కట్టారనే చెప్పాలి. సినిమాలో కూడా వీరు ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయే ఓ చక్కని పాత్రను పోషించారు. ఫోటోగ్రఫీ అద్భుతం, అమోఘం అన్న రీతిలో ఉంది. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా వుంది. ఈ సినిమాకు చక్కని టైటిల్ ని పెట్టిన తిరుమలేశ్వరరావు గారు వెండితెరపై కూడా వెనక్కి తిరిగి చూడకుండా ఆల్రౌండర్ గా ఆకాశమంత ఎత్తు ఎదిగి మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నాను.

ఇలా వీరు ఇటువృత్తికి అటు ప్రవృత్తికి సమన్యాయం చేకూరుస్తూ పంచాయతీరాజ్ ఆఫీసులో కూడా ఒక్కో మెట్టు ఎదుగుతూ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా ఉన్నత పదవిని అలంకరించి ఆ పదవికే వన్నె తెచ్చారు. ఉన్నత పదవిలో ఉన్నా కూడా తన క్రింది స్థాయి ఉద్యోగుల్ని కూడా ఎంతో ఉన్నతంగా చూస్తూ విసుగు అనేది తన మోములో ఏమాత్రం కనబడనీయకుండా మృదుమధుర భాషణంతో మాట్లాడుతూ వారితో స్నేహపూర్వకంగా మసులుకొంటూ సానుకూలంగా పనులు చేయించుకొనేవారు. ఇలా వీరు వినయ విధేయతలు, సౌమ్యత, సౌశీల్యంతో ఆ పదవికే వన్నెతెచ్చి తోటి ఉద్యోగులకు ఆదర్శంగా నిలిచారు. ఉత్తమ ఉద్యోగిగా పేరు తెచ్చుకున్న వీరు పదవీ విరమణ చేసినా కూడా విశ్రాంతి అనే పదాన్ని దరిచేరనివ్వకుండా రెట్టింపు ఉత్సాహం, ఉల్లాసంతో కళా రంగ సేవలో మరింత మునిగి తేలుతున్నారు.

ఈ బహుమఖ ప్రజ్ఞాశాలి సాంస్కృతిక కార్యక్రమాలకి నిర్వహణ బాధ్యతలు చేపట్టి ఆయా కార్యక్రమాలకి ఆధ్యులు, పూజ్యులై ఆ కార్యక్రమాల్ని ముందుకు నడిపిస్తూ తన సేవలతో మరింత వన్నెతెస్తున్నారు. “యువ కళావాహిని సాంస్కృతిక సంస్థ”లో ఎడిషనల్ సెక్రటరీగా 1992 నుండి నిర్విరామంగా సేవలు అందిస్తూ ఆ సంస్థని ఉన్నత స్థానంలో నిలబెట్టారు. “ఆరాధన ఆర్ట్స్ అకాడమీ సంస్థ”లో అధ్యక్షులుగా ఉండి ఆ సంస్థకు మంచి గుర్తింపుని ఇచ్చే విధంగా ఎంతోమంది కళాకారుల్ని వెలికితీస్తూ వారి ప్రతిభకు పట్టం కడుతూ అందరికీ ఆదర్శవంతంగా నిలుస్తున్నారు. వీరి ప్రతిభకు తార్కాణంగా “వైకె తో నేను” వీరిద్దరి మధ్య వున్న చిరు జ్ఞాపకాల సవ్వడితో కూడిన ఓ చక్కని పుస్తకాన్ని తిరుమలేశ్వరరావు గారు తన సంపాదకత్వంలో ఆవిష్కరణకు రూపుదిద్దుకుంటున్న పుస్తకాన్ని త్వరలో సాహితీ ప్రియులకు కానుకగా ఇవ్వనున్నారు

తిరుమలేశ్వర రావు గారు పేరులోనే దైవాన్ని తలపింపజేస్తున్న ఈ ఆరడుగుల ఆజానుబాహుడు చిరునవ్వుల దరహాసాలు చిందిస్తూ వినయ- విధేయతలు పెట్టని ఆభరణాలుగా ధరించి కళల కాణాచిగా వెలుగొందుతున్న ఈ మానవతామూర్తి అవార్డుల పంటలను కూడా అద్భుతంగా పండించారు. విధి నిర్వహణలో భాగంగా వీరు “ఉత్తమ ఉద్యోగి”గా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రెండుసార్లు పురస్కారాన్ని అందుకున్నారు. రచన, నాటక రంగంలో కనబరిచిన ప్రతిభకు ఎన్నో పురస్కాలను అందుకొన్నారు. నాటకరంగంలో ప్రతిభకు సినీ నటులు మురళీమోహన్ గారి చేతుల మీదగా “నటశేఖర పురస్కారం, సి. నారాయణరెడ్డి తో పురస్కారం, రోశయ్య గారి నుంచి రెండుసార్లు ఉత్తమ నటుడు పురస్కారం, దర్శకత్వంలో ప్రతిభ కనపరచ్చినందుకు సినినటి కవిత గారి చేతుల మీదగా పురస్కారం అందుకున్నారు. ఇంకా 2006 సివిల్ సర్వీసెస్ నాటికల పోటీల్లో పాల్గొని హైద్రాబాద్ లో ఉత్తమ హాస్య నటుడుగా మాజీ ముఖ్య మంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరెడ్డి గారి నుండి పురస్కారం, జస్టిస్ రామలింగేశ్వరావు గారి చేతుల మీదగా, అక్కినేని నాగేశ్వరరావు గారి చేతులమీదగా ఘన సన్మానాలు అందుకొని ఆ సన్మానాలు, పురస్కారాలకే వన్నె తెచ్చారు.

ఇలా అన్ని రంగాల్లో అద్భుతంగా రాణిస్తున్న ఈ నిత్య కృషివలుడు, ఉద్యోగరత్న, సద్గుణ సంపన్నులు, సాహితీ-కళా పిపాసి అపూర్వము, అనన్య సామాన్యము, ఆచంద్ర తారార్కము అన్న చందాన ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధితో చుక్కల్లో చంద్రుడిలా వెలిగిపోతూ సాహితీ కళా రంగాల్లో మరిన్ని అద్భుతాలు సృష్టిస్తూ, అందరికీ ఆదర్శంగా నిలుస్తూ ఆ చంద్రార్కం ఈ భూమ్యాకాశాలు ఉన్నంతవరకు చిరంజీవిగా వెలిగిపోవాలని కోరుకుంటూ తిరుమలేశ్వరరావు గారికి జేజేలు, వందనాలు, శుభాకాంక్షలు.

మీ కళా సేవకివే మా శతకోటి వందనాలు.

పింగళి భాగ్యలక్ష్మి, కాలమిస్టు, రచయిత్రి(ఫ్రీ లాన్స్ జర్నలిస్టు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap