(అంజలీదేవిగారి పుట్టినరోజు సంధర్భంగా ఆచారం షణ్ముఖాచారిగారి వ్యాసం…)
ఆమె మదన మనోహర సుందరనారి, రాజ మరాళి, నాట్యమయూరి, చుక్కలకన్న చక్కనైన సువర్ణ సుందరి, నెలరాజు వలచిన కలువ చెలి, అన్నిటికీ మించి అనురాగదేవత, కరుణామయి, మాతృత్వం మూర్తీభవించిన అమ్మ… నవరస నటనావాణి. అంజమ్మగా తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలో జన్మమెత్తి, రంగస్థలాన అంజనీదేవిగా గజ్జెకట్టి, తెలుగు చలన చిత్ర సీమకు అంజలీదేవిగా పరిచయమై, ఎన్నో మైలురాళ్లనుదాటి, ప్రతిష్టాత్మక ‘అక్కినేని జాతీయ పురస్కారం’ (20౦8) అందుకున్న అంజలి’అమ్మ’కు ఆగష్టు 24న పుట్టినరోజు. ఆ నయనతార జయంతి సందర్భంగా సమర్పిస్తున్న వ్యాసమిది.
రంగస్థలి నటిగా, నర్తకిగా…
మాయలమారి, స్వప్నసుందరి, సువర్ణ సుందరి చిత్రాల్లో గంధర్వకన్యగా, జయసింహ, ప్రజారాజ్యం చిత్రాల్లో పిచ్చిపిల్లగా, పరదేశి లో ముసలి ముదితగా, రేచుక్కలో చిలిపి యువతిగా, వదినగారి గాజులులో సాదుహృదయంగల ఆదర్శ వనితగా, అనార్కలిలో భగ్నప్రేమికురాలిగా, స్త్రీ సాహసంలో సాహస యువతిగా, కీలుగుఱ్ఱంలో రాక్షసకన్యగా, పతియే ప్రత్యక్ష దైవంలో పతివ్రతగా, ఇలా ఎన్నో వైవిద్యభరిత పాత్రల్ని చిన్నవయసులోనే పోషించి, ఆ పాత్రలకు ప్రాణంపోసి, నాటి యువతరం ప్రేక్షకజన హృదయాల్లో సుస్థిర స్థానం నిలుపుకున్న మహానటి అంజలీదేవి. హావభావాలతోనే నవరసాలు పలికించగల ఈ నటనాంజలి తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలో 1927 ఆగష్టు 24న జన్మించారు. తన ఎనిమిదవ యేటనే నర్తకిగా రంగస్థల ప్రవేశం చేసి, దర్శక పితామహుడు చిత్తజల్లు పుల్లయ్య స్థాపించిన ‘యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్’ తరఫున ప్రదర్శించే నాటకాల్లో అంజనీదేవి పేరుతో పాల్గొనేవారు. అప్పట్లో పెనుపాత్రుని ఆదినారాయణరావు యీ క్లబ్ వారు ప్రదర్శించే నాటకాలకు రచన చేస్తూ, సంగీతం సమకూరుస్తూ, నటీనటులకు శిక్షణ యిస్తూ వుండేవారు. అతని శిక్షణలోనే హరిశ్చంద్ర నాటకంలో లోహితస్యుడుగా అంజలీదేవి నాటకరంగ ప్రవేశం చేశారు. 1943లో ఆదినారాయణరావు రచనచేసి ప్రదర్శించిన ‘స్ట్రీట్ సింగర్స్’నాటకంలో ధరించిన పాత్రకు అంజలీదేవి నాటి గవర్నరు సర్ ఆర్థర్ హోప్ చేతులమీదుగా బంగారు పతకం అందుకున్నారు. 1947లో అంజలీదేవి మద్రాసులో అడుగుపెట్టాక ప్రముఖ దర్శకనిర్మాత ఎల్.వి.ప్రసాద్ ‘కష్టజీవి’ అనే చిత్రంలో ఆమెను మొదటిసారి హీరోయిన్ గా బుక్ చేసి మూడురీళ్ల సినిమా తీశారు. కానీ, ఆ చిత్ర నిర్మాణం మూలపడింది. 1948లో అంజలీదేవి ఆదినారాయణరావుని వివాహమాడారు.
*చిత్రరంగంలో తొలి అడుగులు *
మీర్జాపురం రాజాగారు నిర్మించిన ‘గొల్లభామ’(1947) చిత్రంలో దర్శకులు సి. పుల్లయ్య అంజలీదేవి చేత మోహిని వేషం వేయించి తెరంగేట్రం చేయించారు. కాశీమజిలీ కథలా సాగే ఈచిత్రం విజయవంతంగా ఆడింది. అదే సంవత్సరం ‘మహాత్మా ఉదంగర్’ అనే తమిళ చిత్రంలో కూడా అంజలీదేవి నటించారు. 1948లో ఘంటసాల బలరామయ్య ‘బాలరాజు’ చిత్రం నిర్మించి అంజలీదేవిని మోహినిగా నటింపచేశారు. “తీయని వెన్నెల రేయి..ఎడబాయని చిన్నెల హాయి” పాటకు అంజలీదేవి చేసిన నాట్యం నిజంగా మోహిని వచ్చి నర్తిస్తుందా అన్నంతగా ప్రేక్షకుల్ని ఆకర్షించింది. ఈచిత్రం ఆరోజుల్లో ఆడిన బ్లాక్ బస్టర్ మూవీగా పేరుతెచ్చుకొని రజతోత్సవం జరుపుకుంది. చిత్రపు నారాయణమూర్తి దర్శకత్వంలో ‘మదాలస’(1948) చిత్రంలో కుండలగా అంజలీదేవి నటించగా, దినకరరావు, హనుమంతరావులు సమకూర్చిన సంగీతం ఈచిత్ర విజయానికి సహకరించింది. “ఆహా మహారాజా..ఓహో దానవేంద్రా” “స్వాతంత్ర్యము కన్నా స్వర్గలోకం లేదు” పాటల అభినయం అంజలీదేవికి మంచి పేరు తెచ్చింది. ఈసంవత్సరంలోనే ‘అడితాన్ కణవు’ అనే తమిళ చిత్రంలో కూడా అంజలీదేవి నటించారు. 1949లో అంజలీదేవి ఆరు చిత్రాల్లోనటించగా శోభనాచల వారి ‘కీలుగుఱ్ఱం’ అత్యంత వినోదభరిత చిత్రంగా కీర్తింపబడి శతదినోత్సవం చేసుకుంది. ఇందులో అంజలీదేవి బ్రహ్మరాక్షసి భువనసుందరిగా నటించింది. “మోహన మహా.. కీరగానములు, భ్రమరగీతములు”, “హాయీ.. భాగ్యము నాదేనోయీ” పాటలకు అంజలీదేవి నాట్య భంగిమలు చాలా బాగుంటాయి. ఈ పాత్రను అంజలీదేవి వొప్పుకొనడమే విచిత్రం. గ్లామర్ పాత్రలు ధరిస్తూ చిత్రరంగంలో స్థిరపడుతున్న సమయంలో నెగటివ్ పాత్రకు, అదీ అక్కినేనికి సవతితల్లిగా అభినయించడం సాహసమే! ఇదే చిత్రాన్ని తమిళంలో ‘మాయా కుదిరై’ గా నిర్మించగా అందులోనూ అంజలీదేవి అదే పాత్రను పోషించారు. ‘రక్షరేఖ’ చిత్రంలో భానుమతితో కలిసి అక్కినేని సరసన చిత్రగా అంజలీదేవి నటించారు. ఈ దశకం చివర్లో అన్నీ జానపద చిత్రాలే రాజ్యమేలాయి. ప్రతిభా వారి ‘స్వప్నసుందరి’, ఎన్.బి. ప్రొడక్షన్స్ వారి ‘మాయారంభ’ చిత్రాలు ఆ కోవలోనివే. కథాబలం లేకపోయినా కేవలం పాటలతో, అంజలీదేవి గ్లామర్ శోభతో విజయం సాధించిన చిత్రం ‘స్వప్నసుందరి’. ఈచిత్ర దర్శకుడు వేదాంతం రాఘవయ్య. సి. ఆర్. సుబ్బురామన్ సంగీతంలో బాలసరస్వతి పాడిన “నటనలు తెలిసెనులే.. ఓ గడసరివాడా”,”ఓ పరదేశీ మరేజాడలా”, “నిన్నే వలచే కొనరా తొలివలపు” వంటి పాటలు అంజలీదేవికి మంచి మార్కులు యిచ్చాయి. ఇక ‘మాయరంభ’ చిత్రంలో కళావతిగా నటించగా ఓగిరాల సంగీతంతో ఈ చిత్రం కూడా సక్సెస్ అయ్యింది. చిత్రమేమిటంటే పైన చెప్పిన సినిమాలు అన్నిటిలో అంజలీదేవి ఇతర అగ్రశ్రేణి హీరోయిన్లతో కలిసి నటించడం. కీలుగుఱ్ఱం చిత్రం తరవాత మీర్జాపురం రాజావారు ఒక సాంఘిక చిత్రాన్ని తియ్యాలని త్రిపురనేని గోపీచంద్ ని పిలిపించి ‘లక్షమ్మ’ చిత్రనిర్మాణ బాధ్యతల్ని ఆయనకు అప్పగించారు. అయితే దీనికి పోటీగా ఘంటసాల బలరామయ్య అక్కినేని, అంజలీదేవి జంటగా ‘శ్రీ లక్ష్మమ్మ కథ’ను విడుదల చేశారు. పతి ప్రేమకోసం పరితపించి అతని దురాగ్రహానికి బలియై అమరత్వం పొందిన పతివ్రత కథగా మలిచిన ఈచిత్రం విజయవంతం కాగా ‘లక్ష్మమ్మ’చిత్రం పరాజయం పాలైంది. ఈ విజయ పరంపర వెంట ‘పల్లెటూరి పిల్ల’ సాంఘిక చిత్రం విడుదలైంది. మీర్జాపురం రాజాతో కలిసి బి.ఏ. సుబ్బారావు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో అంజలీదేవి పల్లెటూరి పిల్ల శాంతగా నటించింది. ఇందులో జయంత్ గా ఎన్.టి. రామారావు, వసంత్ గా అక్కినేని నటించారు. ఇందులో ఎన్.టి.ఆర్ గ్రామంపై పడి ధనధాన్యాలు కొల్లగొడుతుంటే, పట్టలేని పౌరుషంతో అంజలీదేవి అతని చెంప చెళ్లుమనిపించే దృశ్యమొకటి వుంది. షూటింగులో నిజంగానే అంజలీదేవి ఎన్.టి.ఆర్ చెంప చెళ్లు మనిపించింది. ఎన్.టి.ఆర్ కి కళ్లలో నీళ్లు కారాయి. సన్నివేశం అతి సహజంగా వచ్చింది. ఎన్.టి.ఆర్ అంజలీదేవి ధైర్యాన్ని మెచ్చుకున్నారు. చిత్రం శతదినోత్సవం జరుపుకొంది. 1951లో అంజలీదేవి పది చిత్రాల్లో నటించారు. వాటిలో ‘స్త్రీ సాహసం’ చిత్రాన్ని తమిళంలో కూడా తీశారు. ‘సర్వాధికారి’,‘తిలోత్తమ’ ‘మాయలమారి’, ‘నిర్దోషి’, ‘నవ్వితే నవరత్నాలు’ ‘మర్మయోగి’(తమిళం) , ‘ఏక్ థా రాజా’ (హిందీ), ‘నిరపరాధి’ చిత్రాలు వీటిలో కొన్ని.
*అంజలి పిక్చర్స్ ఆవిర్భావం *
1950లో అంజలీదేవి దంపతులు ‘అంజలి పిక్చర్స్’ పేరిట స్వంత చిత్ర నిర్మాణ సంస్థను ఏర్పాటుచేశారు. తొలి ప్రయత్నంగా ‘పరదేశి’ చిత్రాన్ని నిర్మించి సంక్రాంతి కానుకగా 1953లో విడుదల చేశారు. ఎల్.వి.ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అంజలీదేవి, అక్కినేని, శివాజీ గణేశన్, ఎస్.వి. రంగారావు నటించారు. ఈచిత్రాన్ని తమిళంలో ‘పూంగోదై’గా ఏకకాలంలో నిర్మించారు. అయితే సినిమా ఆశించినంత విజయవంతం కాలేదు. ఇదే సంవత్సరం అంజలీదేవి ‘పెణ్’(తమిళం), ‘లడ్కి’ (హిందీ) చిత్రాల్లోనటించారు. ‘పక్కింటిఅమ్మాయి’ చిత్రంలో అంజలీదేవి రేలంగికి జంటగా నటించారు. ఈచిత్రాన్ని హిందీలో ‘పడోసన్’(1968) గా మహమూద్ రీమేక్ చేశారు. 1955లో ఆమె ఎనిమిది చిత్రాల్లో నటించగా, తన సొంత చిత్రం ‘అనార్కలి’ అఖండ విజయం సాధించి శతదినోత్సవం జరుపుకుంది. ఆరోజుల్లోనే స్లోమోషన్ టెక్నిక్ వుపయోగించిన మేధావి ఆదినారాయణరావు. ‘సువర్ణ సుందరి’(1957) చిత్రం 17 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకొని హిందీలో కూడా రీ మేక్ చెయ్యబడింది. చిత్ర కథ విని అక్కినేని ఈ చిత్రంలో నటించేందుకు మొదట విముఖత ప్రదర్శించినా వేదాంతం రాఘవయ్య మీద వున్న గౌరవంతో చిత్రంలో నటించారు. హైదరాబాదులో జరిగిన శతదినోత్సవసభకు విచ్చేసిన నాటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి మాట్లాడుతూ “అక్కినేని ఆంధ్ర విశ్వవిద్యాలయానికి 25 వేలు విరాళమిచ్చారు. మీరు కూడా ఇస్తే విద్యావకాశాలు మెరుగుపరిచే వీలు కలుగుతుంది” అని సూచించగా, అంజలీదేవి మాట్లాడుతూ “నేను వంద చిత్రాలు పూర్తి చేశాక సినీరంగం నుంచి విరమించాలని అనుకుంటున్నాను. నా నూరవ చిత్ర పారితోషికంతో యాభైవేల రూపాయలకు తగ్గకుండా ఒక నిధి ఏర్పాటుచేసి బీదల సంక్షేమానికి ఆ నిధిని వినియోగిస్తాను” అని ప్రకటించారు. అప్పటికి అంజలీదేవి 73 చిత్రాల్లోనటించి వున్నారు. ‘ఇలవేల్పు’ చిత్రంలో శారద పాత్ర ద్వారా ఆమె పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది. అంజలి పిక్చర్స్ బ్యానర్ లో ఇంకా స్వర్ణమంజరి, రుణానుబంధం, సతీ సుమతి, సతీ సక్కుబాయి, కుంకుమభరణి, అమ్మకోసం, భక్త తుకారాం, మహాకవి క్షేత్రయ్య, చండీప్రియ, ఫూలోంకి సేజ్’ (హిందీ) వంటి 28 చిత్రాలు నిర్మించారు. అనార్కలి, సువర్ణసుందరి సొంత చిత్రాల్లో నటనకు అంజలీదేవికి ఫిలిం ఫేర్ అవార్డులు వచ్చాయి. అలాగే చెంచులక్ష్మి, జయభేరి చిత్రాల్లో నటనకు కూడా ఫిలిం ఫేర్ అవార్డులు అంజలీదేవిని వరించాయి. తెలుగులో ‘వదినగారి గాజులు’ చిత్రానికి, తమిళంలో ‘పతియే ప్రత్యక్షదైవం’ చిత్రానికి 1955లో రెండు భాషల్లోనూ ఉత్తమనటి అవార్డులు అందుకున్న ఘనత అంజలీదేవికి దక్కింది.
చిత్రసీమ సీతమ్మ…,
1963లో వచ్చిన తొలి గేవాకలర్ పౌరాణికచిత్రం ‘లవకుశ’ అంజలీదేవికి విశేషమైన గౌరవాన్ని ఆపాదించిన మహోత్తర చిత్రంగా చరిత్రలో నిలిచిపోయింది. సీతాదేవిగా అంజలీదేవి కనబరచిన అభినయానికి పులకరించని తెలుగు ప్రేక్షకుడు లేడంటే అతిశయోక్తి కాదు. ఈ చిత్రంలో అద్భుత నటనకు అంజలీదేవికి రాష్ట్రపతి బంగారు పతకం లభించింది. ఈ సినిమా ప్రభావంతో అంజలీదేవిని సీతమ్మతల్లిగానే ప్రేక్షకులు భావించారు. ఆమెను కళ్లారా చూడాలని ముఖ్యంగా మహిళలు గ్రామాలనుంచి బండ్లు కట్టుకొని తరలి వచ్చి ఆమెకు పాదాభిషేకం, పుష్పాభిషేకం చేసేవారు. ఈ తతంగం చూచి పులకించిపోయిన అంజలీదేవి “ఇదంతా ఆ శ్రీరాముని ఆశీర్వాదమే” అని సమాధానపడేవారు. లవకుశ చిత్రం తర్వాత అంజలీదేవి సాంఘిక చిత్రాల్లో, తల్లి, వదిన వంటి పాత్రల్నే కోరుకున్నారు. రంగులరాట్నంలో ఇద్దరు భిన్నధృవాల మధ్య నలిగిన తల్లిగా, చిలకా గోరింకలో పరిణితి చెందిన తల్లిగా, బడి పంతులులో ఆదర్శ విశ్రాంత ఉపాధ్యాయుని భార్యగా, తాత మనవడులో కొడుకు ఆదరణకు నోచుకోని తల్లిగా ఎన్నో మంచి పాత్రల్ని పోషించి తన పెద్దరికాన్ని నిలబెట్టుకున్న అంజలీదేవికి ఎన్నో అవార్డులు, రివార్డులు లభించాయి. సుమారు 400 చిత్రాల్లో నటించిన అంజలీదేవిని ‘రఘుపతి వెంకయ్య’ అవార్డుతో ఆం.ప్ర ప్రభుత్వం గౌరవించింది. తమిళనాడు ప్రభుత్వం ‘నటశిరోమణి’, ‘కలైసెల్వి’వంటి బిరుదులూ, ‘అన్నాదురై అవార్డు’, ‘జీవనసాఫల్య పురస్కారం’ అవార్డులను అంజలీదేవికి అందజేసింది. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్నిన ప్రదానం చేసింది. తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం సెనేట్ సభ్యురాలిగా, తమిళనాడు నడిగర్ సంఘం తమ అధ్యక్షురాలిగా, దక్షిణ భారత ఫిలిం ఛాంబర్ తమ ఉపాధ్యక్షురాలిగా ఆమెను గౌరవించి సత్కరించాయి. అక్కినేని జాతీయ పురస్కారం అంజలీదేవి కిరీటంలో కలికితురాయి వంటిది. “ప్రేక్షక దేవుళ్ల ఆదరణే నాకు అత్యంత విలువైన అవార్డులు”అని వినమ్రంగా చెప్పే అంజలీదేవికి ఇద్దరు కుమారులు. ఇద్దరూ అమెరికాలో వుంటున్నారు. సత్యసాయిబాబాకి పరమ భక్తురాలైన అంజలీదేవి ‘షిర్డీసాయి పర్తిసాయి దివ్యకథ’ పేరిట తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో టెలి సీరియల్ నిర్మించి భక్తుల అభినందనలు అందుకున్నారు. అంజలీదేవి తన 86 వ యేట హృద్రోగంతో జనవరి 13, 2014 న చెన్నై విజయా ఆసుపత్రిలో కన్ను మూశారు. ఆమె తన అవయవాలను రామద్ర మెడికల్ ఆసుపత్రికి దానం చేశారు.
అవార్డులు
అనార్కలి(తెలుగు), చెంచులక్ష్మి, లవకుశ చిత్రాలలో నటనకు అంజలీదేవికి ఫిల్మ్ ఫేర్ బహుమతులు లభించాయి. 1994లో రఘుపతి వెంకయ్య పురస్కారం, నాగార్జున విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్లు కూడా లభించాయి. లవకుశలో నటనకు అంజలీదేవికి భారత రాష్ట్రపతి ప్రత్యేక బహుమతి అందజేశారు. 2008లో డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు ప్రవేశపెట్టిన జాతీయ పురస్కారాన్ని ఆమె స్వీకరించారు. అలాగే 2006లో రామినేని అవార్డు, 2000 సంవత్సరంలో తమిళనాడు ప్రభుత్వ ‘అరింగర్ అణ్ణ’ పురస్కారం, బెంగుళూరు భారతీయ విద్యాభవన్ వారు ‘బి. సరోజాదేవి’ పేరిట ఇచ్చే పురస్కారం కూడా అంజలీదేవి స్వీకరించారు.
–ఆచారం షణ్ముఖాచారి