ఓ తార రాలింది… రంగస్థలం చీకట్లోకి జారుకుంది. ఒక గొప్ప వెలుగు కనుమరుగైంది. ఇకపై ఆవిడ భౌతిక పాదముద్రలు మనకు కనిపించకపోవచ్చు, కానీ ఆవిడ పద్య మాధుర్యం, హృద్యమైన నటనా కౌశలం మన మనసుల్లో సజీవంగానే ఉంటాయి. వారి కళా ముద్రలు మన గుండెల్లో శాశ్వతమైన ఆలయాన్ని నిర్మించుకున్నాయి.
నీటిని ఏ పాత్రలో పోస్తే ఆ ఆకారాన్ని సంతరించుకున్నట్లు… ఏ వేషం వేసినా అందులో పరకాయ ప్రవేశం చేసి జీవించిన సహజ నటి ఆమె. సాధారణంగా నటులు హార్మోనియంపై ఆధారపడతారు, కానీ ఆ శృతిలయలే ఆమె గొంతుపై ఆధారపడేవంటే అతిశయోక్తి కాదు. తన నటనతో పాటు, ఎంతోమంది కళాకారులను వెలుగులోకి తెచ్చి, వారికి మార్గనిర్దేశం చేసిన సౌజన్యమూర్తి రజనీబాయి గారు.
ఈ రోజు ఆమె అనంత విశ్వపు చీకట్లలో (రజనిలో) లీనమైపోయారు. ప్రాణవాయువుతో మమేకమై ఆమె ఆలపించిన పద్యం, ఇప్పుడు అదే గాలిలో కలిసి గాంధర్వ గీతమైంది. గంధర్వ లోకాలకు పయనమైన ఆమె ఆత్మకు సుగమ ప్రయాణం కలగాలని మనసారా కోరుకుందాం.
ఇక ఎన్నడూ ఆస్వాదించలేని మాధుర్యం ఆమె గొంతు. మనకెంతగానో దూరమైన ఆ కళాతల్లికి ఒక కన్నీటి బొట్టును అర్పించడం మినహా మనం ఏమీ ఇవ్వలేము. ఇది కన్నీటితో అంతిమ వీడ్కోలు పలకాల్సిన సమయం. మరణం తథ్యమే అయినా, రజనీబాయి గారి అజరామరమైన కళాకౌశలానికి ఇవే మా అశ్రు నివాళులు… వినమ్ర నివాళులు.
–సి.హెచ్. సత్యనారాయణ చారి
