సినీ లావణ్యశ్రీ… వాణిశ్రీ

(ఆగస్టు 3 వాణిశ్రీ పుట్టినరోజు సందర్భంగా ఆచారం షణ్ముఖాచారి గారి ప్రత్యేక వ్యాసం….)

తెలుగు చలన చిత్రసిమలో మహానటి సావిత్రిది ఒక అద్భుత శకం. ఆమె తరవాత ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారా అంటూ చర్చలు జరుగుతున్న రోజుల్లో ఒక వెలుగు రేఖలా కళాభినేత్రి వాణిశ్రీ చలనచిత్ర రంగానికి దూసుకొని వచ్చింది. గొప్ప నవలా నాయికగా పేరు తెచ్చుకుంది. సావిత్రి ప్రభావం తనమీదపడకుండా ఉండడానికి ఎన్నోజాగ్రత్తలు తీసుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక శైలిని అలవరచుకుంది. పదేళ్ళు సినీరంగాన్ని మహారాణిలా ఏలింది. ఏ సినిమా విడుదలైనా అందులో హీరోయిన్ వాణిశ్రీనే! ఒక పల్లెటూరి పొగరుబోతు పాత్ర ధరించాలన్నా, గొప్ప పౌరుషమున్న మధ్యతరగతి యువతి పాత్ర పోషించాలన్నా, రూపలావణ్యాలున్న నవలా నాయికగా నటించాలన్నా ఆరోజుల్లో ఒక్క వాణిశ్రీ కే ఆ అదృష్టం దక్కింది. ఆమె కథానాయిక మొల్ల పాత్రలో పద్మాసనం మీద కూర్చున్న తీరును చూసి నటరత్న ఎన్టీఆర్ ఎంతగా పొగిడారో చెప్పలేం. నటనా రంగానికి స్వస్తిచెప్పి సంసార జీవితంలో ప్రశాంతంగా కాలం గడుపుతున్న ఆ కలాభినేత్రికి ఆగస్టు 3 పుట్టినరోజు. ఆ సందర్భంగా వాణిశ్రీని అభినందిస్తూ అందిస్తున్న కొన్ని సినీ జ్ఞాపకాలు మీ కోసం….

రత్నకుమారిగా:

కళాభినేత్రి వాణిశ్రీ అసలుపేరు రత్నకుమారి. పుట్టింది నెల్లూరులో. తల్లిదండ్రులు వెంకమ్మ, రాఘవయ్య లకు ఇద్దరే కూతుళ్లు. తండ్రి చిన్నతనం లోనే అనారోగ్యంతో మరణించడంతో తల్లి వెంకమ్మ ఇద్దరు పిల్లలతో మద్రాసు చేరుకుంది. అక్క కాంతమ్మతోబాటు రత్నకుమారి నెల్లూరులోనే తొమ్మిదవ తరగతి వరకూ చదువుకుంది. తరవాత మద్రాసులోని దుర్గాబాయి దేశముఖ్ మహిళా సభ వారి పాఠశాలలో చేరి మెట్రిక్యులేషన్ తోబాటు సంగీతం, భరతనాట్యం కూడా నేర్చుకుంది. డాక్టర్ గరికిపాటి రాజారావు గారి ఇంటికి దగ్గరలోనే రత్నకుమారి ఉండడంతో అక్కడ జరిగే నాటకాల రిహార్సల్స్ గమనిస్తూ వుండేది. అదే నటన మీద రత్నకుమారి అభిరుచి పెంచుకునేందుకు దోహదపడింది. కానీ తన దృష్టంతా సినిమా నటనమీదే! ఆరోజుల్లో వెంపటి చినసత్యం పిల్లలకు కూచిపూడి నాట్యంలో శిక్షణ ఇస్తుండేవారు. వాణిశ్రీ కూడా సత్యం వద్ద కూచిపూడి నృత్యంలోని మెలకువలు నేర్చుకుంది. ఆయన రూపొందించిన ‘ఆరాధన’ అనే నృత్య రూపకంలో నాయికగా నటించింది. ఆ రోజుల్లోనే నటుడు నాగభూషణం రవి ఆర్ట్ థియేటర్స్ స్థాపించి రక్తకన్నీరు నాటకం ప్రదర్శిస్తుండేవారు. రత్నకుమారి ఆసమాజంలో చేరి రక్తకన్నీరు నాటక ప్రదర్శనల్లో పాల్గొంది. ఆ నాటక అనుభవంతోనే మద్రాసులోని అమెచ్యూర్ నాటక సమాజం వారు ప్రదర్శించే రాగరాగిణి, దొంగ, చిల్లరకొట్టు చిట్టెమ్మ వంటి నాటకాల్లో ముఖ్యపాత్రలు ధరించింది. చిల్లరకొట్టు చిట్టెమ్మ నాటక ప్రదర్శన సందర్భంగా ప్రఖ్యాత కన్నడచిత్ర దర్శకనిర్మాత హున్సూరు కృష్ణమూర్తి దృష్టిలో పడడంతో రత్నకుమారి కి ‘వీరసంకల్ప’ అనే సినిమాలో నాయిక పాత్ర పోషించే అవకాశం దొరికింది. ఆ సినిమా ఆమెకు మంచిపేరు తెచ్చిపెట్టింది. గోల్డెన్ స్టూడియోలో ఈ చిత్రం షూటింగు జరిగింది. సినిమా రషెస్ చూడడం తటస్థించిన జానపదబ్రహ్మ విఠలాచార్య ‘నవగ్రహ పూజా మహిమ’ సినిమాలో ఆమె చేత చిన్న వేషం వేయించారు. కన్నడంలో రత్నకుమారికి ‘మిస్ లీలావతి’, ‘మురియదమనే’ వంటి మంచి సినిమాల్లో హీరోయిన్ గా నటించే అవకాశం చిక్కింది. అలా రత్నకుమారి సినీరంగ ప్రవేశం కన్నడ సినిమాలతోనే మొదలైంది.

వాణిశ్రీ అవతారమెత్తిన రత్న:

‘కనకదుర్గ పూజా మహిమ’ సినిమాలో విఠలాచార్య రత్నమాలకు చిన్న వేషం ఇచ్చినా అది మంచి ప్రాధాన్యత కలిగిఉండడంతో ప్రేక్షకులకు రత్న అంటే ఎవరో తెలిసింది. ఆమధ్యలో ఒక గమ్మత్తు జరిగింది. మహానటుడు యస్.వి. రంగారావు తమిళంలో బాగాఆడిన ‘నాన్ ఒరు పెణ్ణ్’ సినిమాని ఎ.వి. మెయ్యప్ప చెట్టియార్ తో భాగస్వామ్యం కలిపి ‘నాదీ ఆడజన్మే’ సినిమాను శ్రీవాణీ ఫిలిమ్స్ అనే సొంత బ్యానర్ మీద తెలుగులో సినిమా తీసేందుకు సిద్ధమయ్యారు. అందులో నాయిక పాత్రకు రత్నకుమారిని ఎంపిక చేశారు. తన సొంత బ్యానర్ పేరు కలిసివచ్చేలా రత్నకుమారి పేరును ‘వాణిశ్రీ’గా మార్చారు. అయితే మెయ్యప్ప చెట్టి అభ్యంతరం తెలుపగా, ఆ పాత్ర జమునను వరించింది. అయితేనేం రత్నకుమారి కాస్తా వాణిశ్రీ గా రూపాంతరం చెందింది. అదే మెయ్యప్ప చెట్టియార్ తదనంతర కాలంలో వాణిశ్రీతో ఏడు సినిమాలదాకా నిర్మించారు. ఆరోజుల్లో హిందీ చిత్రరంగాన్ని ఏలుతున్న వైజయంతిమాలను వాణిశ్రీ ఆదర్శంగా తీసుకుంది. సంభాషణలు ఎలా పలకాలి వంటి విషయాలను యస్.వి.రంగారావు నేర్పారు. 1967లో వచ్చిన డూండీ సినిమా ‘మరపురాని కథ’ వాణిశ్రీ భవిష్యత్తుకు మంచి పునాది వేసింది. అప్పుడే ‘సుఖదుఃఖాలు’ సినిమాకూడా విడుదలై అఖండ విజయాన్ని సాధించడంతో ప్రేక్షకులకు వాణిశ్రీ నటనమీద మక్కువ పెరిగింది. అసలు వాణిశ్రీతో ‘మరపురాని కథ’ సినిమా చేయడానికి దర్శకుడు వి. మధుసూదనరావు కూడా మొదట జంకారు. వాణిశ్రీ నటనా పటిమను గుర్తించిన ఆయన తరవాత వాణిశ్రీ హీరోయిన్ గా కృష్ణవేణి, మంచివాడు, పవిత్రబంధం, ఎదురీత వంటి సినిమాలు నిర్మించారు. జానపద సినిమాలకు కాలం చెల్లి సాంఘిక చిత్రాలు పుంఖానుపుంఖాలుగా రావడం మొదలయ్యాక, అది వాణిశ్రీకి కలిసొచ్చింది. వాణిశ్రీ వద్ద ఒక మంచి సుగుణం వుంది. ఎటువంటి గొప్పలకు పోకుండా ప్రతి చిన్న టెక్నీషియన్ ఇచ్చే సలహాను కూడా గౌరవిస్తూ, అందులో మంచి ఉందనిపిస్తే ఆచరణలోకి పెట్టడమే ఆ సుగుణం.

పెద్ద హీరోల సరసన:

1969లో అన్నపూర్ణా వారు నిర్మించిన ‘ఆత్మీయులు’ సినిమాలో వాణిశ్రీ తొలిసారి అక్కినేని నాగేశ్వరరావు సరసన నాయికగా నటించింది. మొదట విజయనిర్మల పోషించిన పాత్రను దుక్కిపాటి మధుసూదనరావు వాణిశ్రీకి ఇవ్వజూపగా, ఆమె హీరోయిన్ పాత్రకోసం పట్టుబట్టి సాధించింది. ఆ తరవాత వచ్చిన ‘భలేరంగడు’ సినిమాకూడా విజయం సాధించడంతో వాణిశ్రీకి వెనక్కు చూసుకోవాల్సిన అవసరం కలగలేదు. నందమూరి అందగాడితో ‘నిండుహృదయాలు’ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆ చిత్రానికి కళాతపస్వి విశ్వనాథ్ దర్శకత్వం నిర్వహించారు. హాస్యనటుడు పద్మనాభం నిర్మించిన ‘కథానాయిక మొల్ల’ సినిమాలో మొల్ల పాత్రలో రాణించిన వాణిశ్రీకి మంచిపేరు రావడమే కాకుండా ఆచిత్రానికి నంది బహుమతి లభించింది. ఆరోజుల్లో వాణిశ్రీని మహానటి సావిత్రికి ప్రత్యామ్నాయంగా భావించేవారు. ఆ మూసనుంచి బయటపడటానికి వాణిశ్రీ తన ఆహార్యాన్ని పూర్తిగా మార్చివేసి, చీరకట్టు, శిరోజాలంకరణలో అనూహ్యమైన ప్రయోగాలు చేసి విజయం సాధించింది. అలా డెబ్భైయవ శకాన్ని వాణిశ్రీ ఏకఛత్రాదిపత్యంగా ఏలింది. అక్కినేని, నందమూరి, శోభన్ బాబు, కృష్ణ, కృష్ణంరాజు, హరనాథ్, కాంతారావు, రంగనాథ్, చంద్రమోహన్, రామకృష్ణ వంటి అగ్రశ్రేణి నటులతో హీరోయిన్ గా నటించింది. ఆ శకంలో వచ్చిన దసరాబుల్లోడు, కొడుకు-కోడళ్ళు, ప్రేమనగర్, బంగారుబాబు, దేశోద్ధారకులు, ఎదురులేని మనిషి, కన్నవారి కలలు, గంగ-మంగ, చక్రవాకం, జీవనజ్యోతి, ఇల్లు-ఇల్లాలు, రైతుబిడ్డ, చీకటి వెలుగులు, చక్రధారి, భక్త కన్నప్ప, జీవనతీరాలు వంటి మరెన్నో సినిమాలు బాక్సాఫీసు విజయాలు సాధించాయి. తమిళంలో శివాజీ గణేశన్ వంటి అగ్రశ్రేణి నటులతో దాదాపు ఎనభై సినిమాల్లో వాణిశ్రీ నటించింది. అలాగే కన్నడ రాజకుమార్ వంటి నాయకుల సరసన దాదాపు ముప్పై కన్నడ సినిమాల్లో నటించింది. అయితే మలయాళంలో కేవలం రెండు సినిమాల్లో మాత్రమే నటించింది. ఆమె కథానాయికగా నటించిన చివరి సినిమా ‘దేవుడు మావయ్య’.

పెళ్లి నిర్ణయం:

ఒకసారి ఊటీలో ఎన్టీఆర్ నటించిన ‘ఎదురులేని మనిషి’ సినిమా కోసం ‘కసిగా వుంది కసి కసిగా వుంది, కలవక కలవక కలిసినందుకే కస్సుమంటుంది’ అనే పాట చిత్రీకరణ జరుగుతోంది. అందులో ఎన్టీఆర్ రెచ్చిపోయి నటించేలా డ్యాన్స్ మాస్టర్ పాటను కంపోజ్ చేశారు. అటువంటి పాటల్లో నటిస్తీ తన మీద అభిమానులకున్న గౌరవం పోతుందని వాణిశ్రీ భావించింది. అలాంటిదే సాహసవంతుడు సినిమాలోని ‘ఆడలేక మద్దెల’ పాట కూడా. తనకున్న మంచి పేరును కాపాడుకుంటూ చిత్రరంగం నుంచి విరమిస్తే మంచిదనే నిర్ణయాన్ని ఊటీలోనే వాణిశ్రీ తీసుకుంది. చెంగల్పట్టుకు చెందిన యువ డాక్టర్ కరుణాకరన్ ను పెళ్ళాడాలని వాణిశ్రీ నిర్ణయించుకుంది. ఈ వివాహానికి సంధానకర్త వాణిశ్రీ కుటుంబ వైద్యులు అణ్ణామలై. అది పెద్దలు కుదిర్చిన సంబంధమే. అలా 1979 ఫిబ్రవరిలో వాణిశ్రీ డాక్టర్ కరుణాకరన్ ను పెళ్లిచేసుకుంది. ఆమెకు ఒక కూతురు, ఒక కొడుకు. కూతురు అనుపమ, కొడుకు కార్తీక్. ఇద్దరూ వైద్య వృత్తిలో స్థిరపడ్డారు. పిల్లలు పుట్టాక వాణిశ్రీ రెండవ ఇన్నింగ్స్ మొదలైంది. అదికూడా చిరంజీవి సినిమా ‘అత్తకు యముడు-అమ్మాయికి మొగుడు’ చిత్రంతో ప్రారంభం. అలా ‘బొబ్బిలి రాజా’, ‘సీతారత్నంగారి అబ్బాయి’, ‘ఏవండీ ఆవిడ వచ్చింది’ వంటి దాదాపు అరవైకి పైగా సినిమాల్లో నటించింది. ఇన్ని సినిమాలలో నటించినా వాణిశ్రీకి నచ్చిన సినిమాలు రెండే రెండు. అవి కృష్ణవేణి, ఇద్దరు అమ్మాయిలు. కృష్ణవేణి సినిమా పూర్తయ్యాక మూడునెలలదాకా వాణిశ్రీ ఆ పాత్ర ప్రభావం నుంచి బయటకు రాలేకపోయింది. అలాగే ఇద్దరు అమ్మాయిలులో ద్విపాత్రాభినయం చేసి ఆరెండు పాత్రలకు వున్న వైవిధ్యాన్ని అద్భుతంగా అభినయించి చూపింది. పెద్ద డైలాగులున్న సన్నివేశాలను ఒకే షాట్ లో ఒకే చేసే ప్రతిభగల నటి వాణిశ్రీ. అటువంటి గొప్ప నటికి ‘పద్మ’ పురస్కారం దక్కకపోవడం తెలుగువారి దురదృష్టమే!

మరిన్ని విశేషాలు:

వాణిశ్రీ తమిళ డైలాగులు పలికే తీరు గమనిచిన శివాజీ గణేశన్ ఆమెను తమిళ అమ్మాయనే భావించేవారు. కొన్నిసార్లు సందేహనివృత్తి కోసం ఆమెను అడిగేవారు కూడా. కానీ వాణిశ్రీ మాత్రం చిరునవ్వుతో ఆ ప్రశ్నకు జవాబును దాటవేసేది.

తెలుగులో అఖండ విజయాన్ని సాధించిన ప్రేమనగర్ సినిమాను హిందీలో నిర్మించ తలపెట్టినప్పుడు అందులో హీరోగా దిలీప్ కుమార్ ను, అతనికి జంటగా వాణిశ్రీ ని నటింప జేయాలనుకున్నారు నిర్మాతలు. కానీ దిలీప్ కుమార్ వహీదా రెహమాన్ ను కోరుకున్నారు. సమీకరణాలు మారడంతో ఆపాత్ర రాజేష్ ఖన్నాను వరించగా, వాణిశ్రీ పాత్ర హేమామాలినికి దక్కింది.

వాణిశ్రీ అక్క, బావ కలిసి వాణిశ్రీ జీవితాన్ని వెండితెర వరకే పరిమితం చేసి, సంఘజీవనానికి దూరంగా వుంచారు. తీవ్రమైన నమ్మక ద్రోహం చేశారు. ఆమె ఆస్తిపాస్తులన్నీ హస్తగతం చేసుకొని వాణిశ్రీకి ఇబ్బందులు కలిగించారు. చివరకు పన్నెండేళ్ళు పోరాడి కోర్టు ద్వారా తన ఆస్తులను వాణిశ్రీ తిరిగి పొందగలిగింది.

వాణిశ్రీ మేకప్ లేకుండా బయటకు వచ్చేది కాదు. షూటింగ్ షెడ్యూలు ఏడుగంటలకే అయినా తనుమాత్రం ఉదయం తొమ్మిది గంటలకు మాత్రమే షూటింగుకు హాజరయ్యేది. అందుకు కారణం వాణిశ్రీ ఒంటి రంగు నల్లగా ఉండడమే. రోజూ ఉదయాన్నే మూడుగంటలపాటు ఆమె మేకప్ చేసుకునేది. శరీరం మొత్తానికి మేకప్ చేసుకోవాల్సి రావడంతో ఆమె తొమ్మిది గంటలదాకా షూటింగుకు హాజరు కాగలిగేది కాదు. చిత్రరంగంలో ఈ విషయం అందరికీ తెలుసు కనకే అగ్రశ్రేణి నటులు కూడా అభ్యంతరం పెట్టేవారు కాదు.

జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగావున్న రోజుల్లో వాణిశ్రీకి రాజకీయ పదవి కట్టబెడతానంటే సున్నితంగా తిరస్కరించింది. అయితే సినిమాల్లో మంత్రిణి పాత్రలో మాత్రం ఆదరగొట్టేది.

రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి నవల ‘ఆరాధన’ అంటే వాణిశ్రీకి మక్కువ. ఆ నవలను చలనచిత్రంగా మలిస్తే బాగుంటుంది అనుకునేది. కానీ అది కార్యరూపం దాల్చలేదు.

వాణిశ్రీకి బాపు-రమణ అంటే యెంతో గౌరవం. ఆ గౌరవంతోనే ‘గోరంత దీపం’ సినిమాలో మేకప్ లేకుండానే నటించింది. ఆ సినిమా వెండితెర నవల వాణిశ్రీ సంతకంతో విడుదలైంది. విచిత్ర జీవితం సినిమా షూటింగుకు ఊటీ వెళ్తూ ఆ వెండితెర నవల కాపీలను వెంట తీసుకెళ్ళి, విశ్రాంతి సమయాల్లో వెయ్యి కాపీలకు పైగా స్వయంగా సంతకాలు పెట్టింది. మేకప్ లేకుండా వాణిశ్రీ నటించిన మరొక చిత్రం శ్యాం బెనెగల్ నిర్మించిన ‘అనుగ్రహం’.

తెలుగు సినిమాల్లో నవలా నాయికా అనగానే గుర్తుకొచ్చేది వాణిశ్రీనే! నవలల్లో వర్ణించే రూపలావణ్యాలు వాణిశ్రీకి సొంతం. జీవనతరంగాలు, ప్రేమనగర్, చక్రవాకం, సెక్రెటరీ, విచిత్రబంధం సినిమాలు అన్నీ గతంలో నవలలుగా వచ్చినవే.
ఆచారం షణ్ముఖాచారి
(94929 549256)

2 thoughts on “సినీ లావణ్యశ్రీ… వాణిశ్రీ

  1. నెల్లూరి చేపల పిల్లగా పాపులర్. ఖమ్మం జిల్లా పెనుబల్లి లో (వెంగళరావు గారి సలహాపై) ఒక మంచి హాస్పిటల్ ని కట్టించింది. ఈ మద్యనే ఆమె కుమరుడు చనిపోవడం చాలా భాధాకరం. వాణిశ్రీ కి పోటీ ఎవరూ లేరు. ఆమెకు ఆమే పోటీ.

  2. నమస్తే, పాత సినిమాలలో “ఓ ఫై ఉందా” అనే హాస్య నటుదు వివరాలు తెలియచేయగలరు. (రాజబాబు కాదు… ఇంకా పాత నటుదు). అలాగె ఓ పాత సినిమాలో హాస్య నాటకం… కనకం గారు పాడినదని అనుకుంటున్నాను.. ఉంగారమా ఉంగారమా.. నా ముద్దుల ఉంగారమా… ఏ సినిమలోనిదో తెలియచేగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap