అడివి బాపిరాజు 69 వ వర్థంతి (22-09-1952)
“వేదంలా ఘోషించే గోదావరి, అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి. శతాబ్దాల చరిత గల సుందర నగరం, గతవైభవ దీప్తులకు కమ్మని కావ్యం…” అంటూ చాలా అద్భుతంగా ఆవిష్కరించారు గోదావరి నదీమతల్లి గురించి, ఆ పట్టణం గురించి ఓ సినీ మహాకవిగారు. నిజమే కదండి, ఇలా గతవైభవ దీప్తులకు కమ్మని కావ్యంగా నిలిచిన ఓ గొప్ప కళాకారుడు, సాహితీవేత్త మన గోదావరి జిల్లాలోనే మన ముందు తరంలో ఉదయించిన సూర్యుడు వీరు. వారే అడవి బాపిరాజుగారు. తన ప్రతిభతో తెలుగు సాహితీ కళామతల్లి ప్రతిష్టను ప్రపంచం నలుమూలల వ్యాపింపజేసిన గొప్ప తేజోమూర్తి. ఇంతటి గొప్ప కళా పిపాసిని కన్న భారతమాత కూడా ఆనంద పారవశ్యంలో మునిగి తేలుతూ జాతీయ జెండా రెపరెపలతో వీరి ఖ్యాతిని వినువీధుల్లో ఎగురవేసింది. ఇంతటి ప్రాధాన్యతను సంతరించుకొని బహుముఖ ప్రజ్ఞ అన్న పదానికి కొత్త అర్థాన్ని తెచ్చారు బాపిరాజుగారు. ఓ కవిగా, ఉత్తమ నవలాకారుడిగా, ప్రసిద్ధ కథకుడిగా, వ్యాసకర్త, రేడియో నాటక రచయిత, విమర్శకుడు, ఏకాంకిక రచయిత, అనువాదకుడు, మేటి పత్రిక సంపాదకుడు, ప్రముఖ చిత్రకారుడు చలన చిత్ర కళాదర్శకుడు, గాంధేయవాది, దళిత జనోద్ధారకుడు… ఇలా అనంతంగా అన్ని రంగాలలో మేలిమి బంగారంలా మెరిసిపోతూ అందరికీ ఆదర్శంగా నిలిచారు.
ఈ ఆదర్శ ధ్రువతార అడవి బాపిరాజుగారు ఆంధ్ర ప్రదేశ్ లోని గోదావరి నదీమ తల్లికి అతి చేరువలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో 1895 అక్టోబర్ 5న కృష్ణయ్య, సుబ్బమ్మ పుణ్యదంపతుల ఇంట కళామతల్లి ముద్దుబిడ్డగా జన్మించారు. వీరు చిన్నతనం నుంచి కూడా విశేషమైన ప్రతిభ కనబరిచేవారు. హైస్కూల్ విద్య భీమవరంలో చదివి, రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో బి.ఏ చదివారు. మద్రాసు లా కాలేజిలో లా డిగ్రీ అత్యధిక మార్కులతో పాసయ్యి సరస్వతీ మాత వరాల పుత్రునిగా భాసిల్లారు. కొంతకాలం న్యాయవాదిగా సేవలందించారు. 1934 నుండి 1939 వరకు బందరు నేషనల్ కాలేజిలో అధ్యాపకునిగా, ప్రిన్సిపాల్ గా పనిచేశారు. ఇంకా వీరు పాటల్లో ఒక కోణం, రచనల్లో ఒక కోణం, కథల్లో ఇంకొక కోణం, చిత్ర వర్ణనలో ఇంకొక కోణం, ఇలా అన్నింటా అద్భుతాల్ని ఆవిష్కరించిన సాహిత్య రాజు అడవి బాపిరాజుగారు.
వీరు అత్యధికంగా 44 కథలు రాశారు. “తూలికా నృత్యం, శైలబాల, వీణ, నాగలి, నేలతల్లి, సోమసుత” కథలు బహుళ ప్రచారం పొందాయి. “అడవి శాంతిశ్రీ నవల, కోనంగి, హిమబిందు, నారాయణరావు, జాజిమల్లి, గోన గన్నారెడ్డి”.. నవలలు పాఠకులకు అందించారు. అలాగే రేడియో నాటకాల్లో “దుక్కిటెద్దు, ఉషా సుందరి, భోగిరలోయ, నారాయణరావు, శైలబాల, పారిజాతం”.. నాటికలు అద్భుతంగా రేడియోలో ప్రదర్శింపబడి శ్రోతల మదిని దోచుకున్నాయి. కథల సంపుటాలలో “తరంగిణి, రాగమాలిక, అంజలి, వింద్యాచలం”.. ప్రసిద్ధి చెందినవి. ఇంకా “శశికళ పాటల సంపుటి” అద్భుత ప్రాచుర్యం పొందింది. లెక్కకు మిన్నగా గేయాలు కూడా రాశారు. వీరు రాసిన గ్రంథాలలో “వడగళ్ల వాన” అద్భుతమైన గ్రంథము. ఈ గ్రంథానికి సుమారుగా 75 ఏళ్లు. ఈ గ్రంథంలో అడవి బాపిరాజు గారు రాసిన కథలు, రాస్తున్న కథలు, పాటలు అన్నీ దీనిలోనే ఉండేవి. ఈ గ్రంథాన్ని వీరు ఎక్కడికి వెళ్లినా తన వెంట తీసుకు వెళ్లేవారు. ఈ గ్రంథం అంటే వీరికి అంత ఇష్ట.
ఒక సమగ్రమైన పరిధిలో రాసిన అంతే విశేషమైన విలక్షణమైన కథ ఈ “వడగళ్ళు” ఈ కథలో మూడు రకాలైన వడగళ్ళు ఉన్నాయి. తెలంగాణాను, హైదరాబాదును ప్రముఖంగా చూపిస్తూ రచనను అద్భుతంగా మలిచారు. ఈ రచనలోని కథానాయకుడు హైదరాబాదులో జీవించడం ఒక భాగం. జనగామలో కథానాయకుడికి ఐదు ఎకరాల పొలం ఉంది. అది ఒకసారి వడగళ్ల వాన కురిసి బాగా నష్టం వచ్చింది. దాంతో అతను హైదరాబాదు వలస వచ్చాడు. సుల్తాన్ బజార్ లో ఒక కాంగ్రెసువాది తన కొట్టులో కొంత భాగం, అంటే వీధి అరుగు మీద అద్దె లేకుండా ఇచ్చాడు. దాంట్లో కథానాయకుడు పాన్ షాప్ పెట్టుకుని సుఖంగా జీవించాడు. ఆ రోజుల్లో భారతీయ సైనికదళాల విముక్తిని సముపార్జించి స్వేచ్ఛను నెలకొల్పిన ప్రజా కళాకారుల దురహంకారం తొలగిపోయి కాంగ్రెస్ లోనే మరో వడగళ్ల వాన కురిసింది అంటారు రచయిత. కథలో రెండవ వడగళ్ల వాన ఇది. పంజాబ్ లో జరిగిన బీభత్సం లో భార్య, కుమారుడు మరణిస్తే కూతుర్ని తీసుకుని పండిట్ కృష్ణకుమారి గాయత్రి అనే అయోధ్య వంశం అతను హైదరాబాదు వలసవచ్చారు. ఈ కథలో పతంజలి శాస్త్రి వీరికి 200 గజాల స్థలం ఇచ్చాడు. చిన్న కుటీరం నిర్మించుకొని నివాసం ఉంటారు పండిట్. పతంజలి పండిట్ గారి కూతుర్ని ఇష్టపడతాడు. కవి అంటారు, “పంజాబ్ నుంచి వచ్చిన ఉత్తర హిందూ దేశ సంప్రదాయంలో పుట్టి పెరిగిన అమ్మాయి దక్షిణ భారతదేశంలో ఉన్న ఒక వ్యక్తి పట్ల ఆకర్షితురాలవడమనేది ఉత్తర, దక్షిణ దేశ సంస్కృతుల సమన్వయం” అంటూ చెప్పారు బాపిరాజు గారు. బాపిరాజు గారు పతంజలికి అద్భుతమైన ప్రశంస కూడా ఇచ్చారు. “జీలం నది తీరం నుంచి వచ్చిన ఓ జాతరాహ, యవ్వన హృదయానికి ఈ ముచుకుండ నదీతీర వాసులైన పతంజలి బాలికను కష్టాల నుంచి రక్షించే వెలుగులా కనబడగలడు”. రచయిత ఇంకా అంటారు, “ఆమె జీవితానికి పతంజలి ఆగస్టు 15 అయ్యాడు. అంటే ఆగస్టు 15న దేశానికి స్వాతంత్రం స్వాతంత్రం వచ్చింది, పతంజలి ఆమె జీవితంలోకి రాకతో వడగళ్ళు అమృత బిందువులై కురిసి ఆమెకు స్వాతంత్య్రం వచ్చింది” అంటారు కవి . త్యాగనిరతి, ఆర్ద్రత, దేశభక్తి, వినయ శీలత, ఉదాత్తత అన్ని కలగలిపి అద్భుతంగా మలచారు ఈ వడగళ్ల వాన గ్రంథాన్ని.
అలాగే బాపిరాజుగారి కలం నుండి జాలువారిన మరో ఆణిముత్యం లాంటి నవల “నారాయణరావు”. నిజ జీవితంలోని వ్యక్తుల జీవితాలను ప్రధాన ఇతివృత్తంగా స్పురింపజేసే సాహితీ ప్రక్రియ ఈ నవల. ఈ నవలని బాపిరాజు గారు 1934 లో రాశారు.ఈ “నారాయణరావు” నవలలో జీవితాలు, అభిరుచులూ ఆంధ్రుల గుణశీలాలు, గ్రామీణ జీవితాలు, రాజ్యాంగ వ్యవస్థలు, విదేశీ విశేషాలు స్థల పురాణాలు, శాస్త్రాల గురించిన విశేషాలు… ఇలా అనేక అనేక కొత్త విషయాలను ఈ నవలలో అక్షరీకరించారు. ఈ నవలలో అన్ని యదార్థ సంఘటనలే చూపించారు. ఇందులో నారాయణరావు పాత్రని బాపిరాజుగారు పోషించారు. ఇందులో చదువురాని శారద పాత్రని, చదువుకున్న శ్యామల పాత్రని అద్భుతంగా చూపించారు. ఈ శారద, శ్యామల పాత్రల ద్వారా స్త్రీలకి చదువు ఎంత ముఖ్యమైనదో ఈ నవల ద్వారా బాపిరాజుగారు చాలా చక్కగా చెప్పారు. అలాగే ప్రాపంచిక విషయాలు బాపిరాజు గారిని ఏమీ చెయ్యలేక అవే కథావస్తువులుగా ముస్తాబై బాపిరాజు గారి ఎదుట నిలబడేవి. వాటినే కథలో ప్రవేశ పెట్టేవారు. అలాగే కవితా హృదయం ఉన్న ప్రతి ఒక్కరిని ఈ నవల చదివిస్తుంది. ఇలా ఆద్యంతం ఎంతో ఉత్కంఠంతో బాపిరాజుగారి ప్రతి రచన కూడా పాఠకుల్ని మొదటి నుండి చివరి వరకు చదివిస్తుంది. ఈ నారాయణరావు నవల ఆంధ్ర, చెన్నపురి విశ్వవిద్యాలయాల్లో పాఠ్యగ్రంధంగా ప్రవేశపెట్టారు. అలాగే ఈ నవలని ‘ఆంధ్ర విశ్వకళా పరిషత్తు’ వారు పెట్టిన పోటీకి పంపారు. అదే సమయంలో విశ్వనాథ సత్యనారాయణగారి “వేయి పడగలు” నవల కూడా పోటీలో నిలిచింది. న్యాయనిర్ణేతలు ఎవరికి ఇవ్వాలో తేల్చుకోలేక ఇద్దర్ని విజేతగా ప్రకటించి పారితోషికం 750 + 750 రూపాయల్ని ఇద్దరికీ సమానంగా అందజేశారు. ఆడవి బాపిరాజుగారి నవల విశ్వనాథ సత్యనారాయణగారి నవల వేయిపడగలు నవలకి ధీటుగా నిలిచి ప్రముఖుల ప్రశంసలు అందుకుంది.
వీరు స్వాతంత్ర్య సమరయోధునిగా జాతీయోద్యమంలో పాల్గొని ఒక సంవత్సరం జైలు జీవితం కూడా గడిపారు. బాపిరాజు గారు జైలులో ఉన్నప్పుడు భార్య వీరిని చూడడానికి వస్తే ఆమె ఖద్దరు చీర కట్టుకొని రాలేదని ఆమెతో మాట్లాడలేదు. దాంతో ఆమె ఇంటికి వచ్చి చాలా బాధపడ్డారు. ఇది ఆయన దేశ భక్తికి నిదర్శనంగా చెప్పవచ్చు. అలాగే తాను అనుభవించిన జైలు జీవితాన్ని “తొలకరి” అనే ఒక నవలగా మలచి చిత్రీకరించారు. ఈ నవలలో తన పాత్రని బాపిరాజుగారు అద్భుతంగా పోషించారు. అలాగే సినిమా రంగంలో కూడా వీరు ఎంతో గొప్పగా రాణించారు. “మీరాబాయి, ధ్రువ విజయం, పల్నాటియుద్ధం, అనసూయ” సినిమాలకు 1930-1940 మధ్యకాలంలో కళాదర్శకుడిగా తనదైన శైలిలో అద్భుతంగా మలచి ఆ చిత్రాలకు మంచి పేరు తెచ్చి పెట్టారు. అలాగే వీరు రేడియో నాటకాలు కూడా అద్భుతంగా రాసి వాటిలో నటించారు. ఇంకా వీరు ఆకాశవాణి సలహాదారునిగా కూడా పనిచేశారు. వీరు “మీజాన్” దినపత్రిక “త్రివేణి” పత్రికలకు సంపాదక వర్గం బాధ్యతలు చేపట్టి అన్ని విధాల పోటీ ప్రపంచంలో ముందుండి నడిపించి కళ్ళముందు కదలాడే వార్తలను కథనాలను ప్రచురించి మంచి పేరు సంపాదించారు. అలాగే మరో అద్భుతం తెలుగుసాహిత్యంలో ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎవర్ గ్రీన్ గా అందరూ ఎంతో అద్భుతంగా పాడుకునే “బావా బావా పన్నీరు/ బావను పట్టుకు తన్నేరు/ వీధి వీధి తిప్పేరు /వీశెడు గంధం పూసేరు /చావిడి గుంజకు కట్టేరు /చప్పిడి గుద్దులు గుద్దేరు”. అనే పాటని అడవి బాపిరాజు గారు రాశారు. ఈ పాట ఆబాలగోపాలాన్ని ఎంతో గొప్పగా ఆకర్షించింది. ఇంకా అందరిని అలరించే ఉత్తేజపూరితమైన గీతాలను ఎన్నో రాశారు. ఈ బావా బావా పన్నీరు పాట రాసినప్పటినుండి వీరి సమకాలికులంతా కూడా వీరిని “బాపిబావ” అని ఎంతో ముద్దుగా పిలుచుకుంటూ ఆ పాటపై వారికున్న అభిమానాన్ని చూపించేవారు. ఇలా అందరి అభిమానాన్ని చూరగొని బాపిరాజుగారు సృష్టించిన సాహిత్యంలో స్పృశించని అంశం లేదు.
బాపిరాజుగారు ఎక్కడ ఉంటే అక్కడ కళాపీఠం, ఎక్కడ మాట్లాడితే అక్కడ ఒక సాహిత్య నందనం వెల్లివిరిసేది. వీరి ఉపన్యాసం వినడానికి విద్యార్థులు అధిక సంఖ్యలో వచ్చేవారు. వీరి ఉపన్యాసంలో మాట, పాట, ఆట అన్ని కలగలిసి అద్భుతమైన పదబంధాలతో ప్రేక్షకులకు గొప్ప ఆనందాన్ని ఇచ్చేది. వీరి అభిమానులు ఎవరైనా ఆటోగ్రాఫ్ అడిగితే బొమ్మ వేసి మరీ సంతకం చేసేవారు. వీరికి బొమ్మలంటే అంత ప్రాణం.
చిత్రకళ అంటే వీరికి ప్రాణం. చిన్నతనం నుండి చిత్రకళ మీద ఉన్న మక్కువతో బందరు జాతీయ కళాశాలలోని ప్రమోద్ కుమార్ చటోపాధ్యాయ దగ్గర శిష్యునిగా చేరి భారతీయ చిత్రకళలో నైపుణ్యం సాధించారు. ఆ నైపుణ్యంతో చిత్రకళలో ఆకాశమంత ఎత్తు ఎదిగారు. కిన్నెరసాని ఎలా ఉండాలి, నాయుడు బావ ఎలా ఉండాలి అని ఊహించి నండూరివారి కవితలకి చక్కని చిత్రాలను గీసారు బాపిరాజుగారు. కిన్నెరసాని ఎలా ఉండాలి అని ఊహించి విశ్వనాథ సత్యనారాయణ గారికి కవితలకి కూడా చిత్రలేఖనం గీసింది బాపిరాజు వారే. ఇంక విశ్వనాధవారి గేయ సంపుటి కూడా చిత్రాలన్ని బాపిరాజు వారే గీశారు. ఇంకా వీరు చిత్రించినటువంటి ప్రసిద్ధిపొందిన రెండు చిత్రాలు “సముద్రగుప్తుడు, తిక్కన”. వీరు గీసిన “శబ్దబ్రహ్మ” చిత్రం నేటికీ డెన్మార్క్ ప్రదర్శనశాలలో ఉంది. “భాగవత పురుషుడు, ఆనందతాండవం” మొదలగు చిత్రాలు తిరువనంతపురం మ్యూజియంలో ఉన్నాయి. మద్రాసు ప్రభుత్వం కోరికమేరకు సింహళంలోని “సిగేరియా కూడ్య చిత్రాలు” బాపిరాజు గారే చిత్రించారు. మీరు వేసిన “త్రివేణి భంగము” అంటే “ద్రౌపది వస్త్రాపహరణము, కురులు విరుచుకున్న బొమ్మ, భారతి” ప్రసిద్ధి చెందిన పెయింటింగ్స్. అలాగే సరస్వతి దేవి ఒక చేతితో వీణ పట్టుకుని, రెండు చేతులతో వేదాలు పట్టుకొని, ఒక చేతితో త్రివర్ణ పతాకము పట్టుకున్న భారతమాత బొమ్మని ఎవరి ఊహకందనంత అందంగా, మాటలకు అందనంత గొప్పగా చిత్రీకరించి తనలోని చిత్రకళా ప్రతిభను వినువీధుల్లో ఎగరవేశారు.
అడవి బాపిరాజుగారు ప్రతిభాపాటవాలకు మెచ్చి ప్రముఖులంతా వీరిని “ఆంధ్ర రవీంద్రుడు” అంటారు. బాపిరాజు వారి గురించి రాయప్రోలువారు ఇలా అన్నారు “మీ అమ్మ ఏ తార చాయలో నిను గాంచె. పయోసదుల పాల పాయసంబులుగిడిపెంచే. లేకుండా నీకు ఈ శిల్పకళా రుచి రాదు,కాకున్న సాధు కంఠమబ్బక పోదు. అడవి వారి చిన్నాడా – అమృతధార లవాడా…” అంటూ అద్భుతంగా ప్రశంసించారు రాయప్రోలు సుబ్బారావుగారు. విశ్వనాథవారు వీరి బొమ్మల గురించి చెప్తూ గీసిన గీత బొమ్మై, చూసిన చూపు మెరుపై, అతడు పలికిన పలుకు పాటై, తలపు వెలుగై అతని హృదయములోన సుతిమెత్తన” అంటూ గొప్పగా అభినందించారు. ఇంకా నండూరివారు ఇలా అంటారు, “ఆయన బొమ్మలలో పాటలే కారణమైతే, నేను ధన్యుడను” అంటారు. అలాగే దాశరథి కృష్ణమాచార్యుల వారు “ఓ సాహితీ హిమాలయోత్తమ, హిమాలయ శిఖరమ్ము వలె గంగా, యమునా నదుల వలె ఉత్తమ శాశ్వతత్వమును పొందిన ఉత్తమ సాహితీ పుష్పాలలో అడవి బాపిరాజుగారు అగ్రగణ్యులు” అంటూ ప్రశంసించారు. ఇలా అందరి చేత అద్భుతమైన ప్రశంసలు అందుకుని పేరుకు తగ్గట్టుగా అన్ని రంగాల్లో రారాజులా వెలిగిపోతూ చిత్రకళ, సాహిత్యరంగాలలో విశ్వవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచి అందరిచేత “బాపిబావ” అని పిలిపించుకున్న అడవి బాపిరాజుగారు 1952 సెప్టెంబర్ 22 న తెలుగు కళామతల్లి పాదాల చెంతకు చేరారు. వీరు మన మధ్య లేకపోయినప్పటికీ “బావా బావా పన్నీరు పాట” రూపంలో మన ముందు కదలాడుతూనే ఉండాలని కోరుకుంటూ… అడవి బాపిరాజుగారికి ఘన నివాళి.
-పింగళి భాగ్యలక్ష్మి,
కాలమిస్టు, రచయిత్రి
మొబైల్: 9704725609