విశ్వానికి విద్యనేర్పినటువంటి ఓ ఘనమైన విశ్వవిద్యాలయం మన భారతదేశం. ఇటువంటి మన భారతదేశంలో అనేక కష్టనష్టాలకోర్చి వారి వారి రంగాలలో జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతినార్జించినటువంటి మన భారతీయులెందరో వున్నారు. నేటితరం నిరంతరం స్మార్ట్ ఫోనుల మోజులో పడి అటువంటి మహామహుల రూపురేఖలను సైతం మర్చిపోతున్న తరుణంలో యావత్ భారతదేశంలోని మహనీయుల జీవిత విశేషాలను నేటి, రేపటి విద్యార్థిలోకానికి తెలుగులో పరిచయం చేయాలన్న సంకల్పంతో 64కళలు.కాం సమర్పిస్తున్న “ధృవతారలు” రెగ్యులర్ ఫీచర్లో ఆయా మహానుబావుల జన్మదిన సందర్భాలలో వారిని జ్ఞాపకం చేసుకుందాం.
ధృవతారలు – 7
మన తెలుగునేలకు బహుముఖ ప్రతిభా కథలతో వెలుగునిచ్చిన రవిరాజు అడవి బాపిరాజు. ఆధునిక తెలుగు రచనారంగంలో బాపిరాజు బాణి ఓ సంచలనం. ఒకే రంగాన్ని ఏలినవాడు రాజైతే పలురంగాలను ఏలిన కవి కులపతి బాపిరాజు, లలిత కళల
మహారాజు, తెలుగు రచనా రంగంలో రారాజు. నవ తెలుగు నవలా కారునిగా, పద్య గద్య నాటక రచయితగా, పాటల రచయితగా, చిత్రకారుడిగా తన ప్రవృత్తిని మనకు పరిచయం చేశాడు. న్యాయ వాదిగా, మచిలీపట్నం జాతీయ కళాశాల ప్రాచార్యునిగా, చిత్రరంగంలో కళాదర్శకునిగా, చిత్రదర్శకునిగా, పత్రికా సంపాదకునిగా, ఆలిండియా రేడియో సలహాదారునిగా అనేక రంగాలలో అపారమైన అనుభవాన్ని తన రచనల్లో రంగరించి మన ముందు కుమ్మరించాడు. తెలుగు పంచెకు, తెలుగు కుంచెకు తగిన మంచె మన బాపిరాజు. “నారాయణరావు” అనే వారి నవల ఆంధ్ర విశ్వకళాపరిషత్ అవార్డును అందుకున్న గొప్ప రచన. వీరి తైలవర్ణ చిత్రాల్లో సముద్రగుప్తుడు, ఆంధ్ర విశ్వవిద్యాలయం అవార్డు పొందిన తిక్కన ప్రముఖమైనవి. బాపిరాజుగారు విశ్వనాథవారి కిన్నెరసానికి, నండూరి వారి ఎంకికి తన చిత్రాల ద్వారా రూపమిచ్చి ప్రాణం పోసిన చిత్ర బ్రహ్మ. ఇన్ని కళలందు ఆరితేరిన బాపిరాజు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇటువంటి మేటి కళాకారుడు శ్రీ అడవి బాపిరాజు – నేటికీ మన ధృవతార.
(అడవి బాపిరాజు జన్మదినం అక్టోబర్ 08, 1895)
Great person, good write up. Thanq Singh garu.