తెలుగు సినిమాకు బాక్సాఫీస్ ‘రాముడు’

అడవి రాముడు కు 43 యేళ్ళు (28 ఏప్రిల్, 1977)
30 లక్షల బడ్జట్ – 4 కోట్లు వసూలు…

బాక్సాఫీస్ రాముడు ఎన్టీయార్ సాధారణంగా ఒక గిరి గీసుకొని, సినిమాలు చేస్తుంటారు. మిగిలిన చాలామంది తారల లాగా ఆయన గనక గిరి దాటి నటిస్తే… ఇక ఆ సినిమా ఒక ప్రభంజనమే! – ప్రసిద్ధ దర్శక – నిర్మాత స్వర్గీయ బి.ఎన్ రెడ్డి 1970ల తొలినాళ్ళలో ఎన్టీయార్ మీద ప్రత్యేక సంచిక వేస్తున్న ఒక పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ అప్పట్లో బి.ఎన్.రెడ్డి ఈ మాటలు అన్నారు. ఆ ఆ తరువాత కొన్నేళ్ళకు…ఎన్టీయార్‌కు అయిదున్నర పదుల ఏళ్ళు మీద పడ్డాయి. కెరీర్ జోరుగా సాగుతున్నా… ఎక్కడో చిన్న స్తబ్ధత. నవరసాల్లో ఏదైనా పండించగల అభినయ ప్రతిభ… అపారమైన మాస్ ఇమేజ్ ఉన్న ఒక స్టార్ హీరో ఏం చేయాలి? ఏం చేస్తే బాగుంటుంది? ఏది ప్రేక్షకులు కొత్తగా ఫీలవుతారు? సరిగ్గా అదే టైమ్ లో కేవలం మూడే సినిమాల అనుభవమున్న ఒక యువ దర్శకుడికి ఎన్టీయార్ సినిమా చేసే అరుదైన ఛాన్స్… ఇంకా చెప్పాలంటే అదృష్టం తలుపు తట్టింది. అంతే… అప్పటికి సరైన హిట్లు కూడా లేని ఆ యువకుడు బోలెడంత ఘోమ్ వర్క్ చేశాడు. ఒక స్టార్ హీరోకు ఎలాంటి కథ, కథనం, వాణిజ్య అంశాలున్న సినిమా అయితే కరెక్టో కసరత్తు చేశాడు. సినిమా నేపథ్యం నుంచి ఆట, పాట, డ్రెస్సులు అన్నీ మార్చాడు. ఎన్టీయార్ కూడా గిరి దాటి, బాక్సాఫీస్ బరిలో గర్ణించారు.
సినిమా రిలీజైంది. అంతే… ఏ థియేటర్ దగ్గర చూసినా కిటకిటలాడే జనం. ఆగకుండా వేస్తున్న షోలు వేస్తూనే ఉన్నారు… చూస్తున్న జనం చూస్తూనే ఉన్నారు… టికెట్లు దొరక్క అంతకు అంతమంది జనం వెనక్కి వెళుతూనే ఉన్నారు. టికెట్ల కోసం మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉన్నారు. వంద రోజులు… రెండొందలు… మూడొందలు…ఏకంగా ఏడాది ఆడిందా సినిమా. వెరసి… వసూళ్ళ సునామీ…. బాక్సాఫీస్ దగ్గర ఒక కొత్త చరిత్ర… హీరోగా ఎన్టీయార్ మాస్ ఇమేజ్ కు మరో సరికొత్త ఇన్నింగ్స్ కు శ్రీకారం … రిలీజైన అయిదో సినిమాకే ఆ డైరెక్టర్ కు స్టార్ స్టేటస్…. ఇవాల్టికీ జనం చెప్పుకొనే ఆ సినిమా… ‘అడవి రాముడు…. అప్పటి ఆ యంగ్ డైరెక్టర్…. కె.రాఘవేంద్రరావు…. కట్ చేస్తే… ఇప్పుడు ఆ సినిమాకు నాలుగు దశాబ్దాలు నిండాయి. అయినా సరే ఆరు పాటలు, అయిదు ఫైట్లు… మాస్ మెచ్చే వినోదం… స్టార్ హోదాను పెంచే చిత్రీకరణ… ఇలా కమర్షియల్ ఫార్ములాలన్నిటికీ ఇవాల్టికీ ఆ సినిమాయే ఓ పెద్ద బాలశిక్ష.
పాట… ఫైటు… ఇంటర్వెల్ లాక్… బ్లాస్టింగ్, ఫైట్స్ తో యాక్షన క్లైమాక్స్… ఇలా ఆ సినిమా రీలు రీలుడీ వేసిన కొలతల గీతలు దాటి రావడం నాలుగు దశాబ్దాలు గడిచినా తెలుగు సినిమా వల్ల కావడం లేదు.
తెలుగు సినిమా బాక్సాఫీస్ గరిష్ట వసూళ్ళను తొలిసారిగా నాలుగింతలు చేసి, నాలుగు కోట్ల మార్కు తాకిందా సినిమా. తెలుగు సినిమా గ్రామర్ నే మార్చేసింది. అందుకే, ఒక్క మాటలో… అది “అడవి రాముడు’ కాదు… అక్షరాలా తెలుగు సినిమాకు బాక్సాఫీస్ రాముడు.

ఇప్పటికీ ఆ సినిమా పేరు మీదే బతుకుతున్నా …
అది అన్నగారి చలవే! – కె. రాఘవేంద్రరావు అడవి రాముడు సినిమా అనగానే అన్నగారు ఎన్టీయార్ గారు, పూర్తిగా ఔట్ డోర్ లో అడవిలో ఆ సినిమా చిత్రీకరణ, ఆ సినిమా అవకాశం నాకు వచ్చినప్పటి పరిస్థితులు… ఇలా ఎన్నెన్నో జ్ఞాపకాలు. అసలు సినిమా రంగంలో నా ప్రయాణం మొదలైందే… ఎన్టీయార్ తో. నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన మొదటి సినిమా ఎన్టీయార్ భీముడిగా నటించిన ‘పాండవ వనవాసం’. కమలాకర కామేశ్వరరావు గారి దర్శకత్వంలోని ఆ సినిమాలో హనుమంతుడి విశ్వరూపాన్ని చూస్తూ, భీముడి పాత్రలో ఎన్టీయార్ ‘మనోజవం మారుతతుల్యవేగం…’ అంటూ పాడే పద్యం షాట్ తో నా కెరీర్ మొదలైంది. అసిస్టెంట్ డైరెక్టర్ గా ఆ షాట్‌కు ఎన్టీయార్ మీద తొలిసారిగా నేను క్లాప్ కొట్టిన క్షణాలు ఇప్పటికీ మర్చిపోలేను. డైరెక్టర్ అయ్యాక కెరీర్ లో కిందా మీదా పడుతున్న టైమ్ లో సత్య చిత్ర అధినేతలు నా దగ్గరకొచ్చి, ఎన్టీయార్ తో సినిమాకు దర్శకత్వం చేయాలంటే, నమ్మలేదు. ఎన్టీయార్ గారికి చెప్పారా, ఏమన్నారని అడిగాను. ఆయనకు చెబితే, ఓకే అన్నారన్నారు. సత్యచిత్ర బ్యానర్‌పై తీసిన తొలి చిత్రం మా నాన్న గారి ‘తాసిల్దారు గారి అమ్మాయి’. ఆ సినిమాకు నేను అసిసెంట్ డైరెక్టర్ ని. అందుకని, వాళ్ళతో నాకు మంచి అనుబంధం ఉంది. అదే సమయంలో ఎన్టీయార్‌కు సినిమా అనగానే ఎలాంటి కథ చేయాలా అని ఆలోచించా. సాఫీగా లేని నా కెరీర్‌కు దక్కిన గోల్డెన్ ఛాన్సను ఎలా సద్వినియోగం చేసుకోవాలా అని కసరత్తు చేశా. మద్రాసు నుంచి బయల్దేరి ఆంధ్రా వెళ్ళి అప్పుడు ఆడుతున్న అన్న గారి సినిమాలన్నీ చూశా. జనం పూలుచల్లి హారతులిచ్చే ఘట్టాలు గమనించాను. అప్పట్లో ఎన్టీయార్ గారికి అంత ఆరాధన. అయితే, ఆయన స్టెప్పులు అంతగా వేసేవారు కాదు కాబట్టి, సోషల్ సినిమాల్లో పాటల్లో జనాన్ని కుర్చీకి కట్టిపడే సేలా అష్టదిగ్బంధనం చేయాలనుకున్నా. స్టార్ హీరోకూ, ఆయన అమేజ్ కు తగ్గట్లు సినిమా చేస్తున్నప్పుడు ఏయే అంశాలు కథలో పెట్టాలి, ఎలాంటి సీన్లు తీసి ఇమేజ్ ను పెంచి చూపించాలి లాంటివన్నీ ఆలోచించా. హీరోకు మైనస్ అనుకున్న అంశాలు ప్లస్ అయ్యేలా చేయాలి. ప్లస్లను డబుల్ ప్లస్ చేయాలని నిర్ణయించుకున్నా, ఎన్టీయార్ తెరపై నడిచొస్తుంటూనే జనం పూలు చల్లుతున్నారంటే, అదే ఆయన గజారోహణం చేసి, ఏనుగు మీద వస్తేనో అనుకున్నా, అలా ఉండాలంటే, హీరో అడవిలో ఉండాలి. జంతువులతో సినిమాలకు ఫేమస్ అయిన దేవర్ ఫిల్మ్ సంస్థ తీసిన జంతువుల సినిమాలన్నీ చూశా. ట్రైనింగ్ అయిన సర్కస్ ఏనుగుల్ని పెట్టుకొని, అవి ఏవేం పనులు చేయగలవో చూసి, వాటికి తగ్గట్లు ఆ రకంగా సీనుల్లో రాసుకున్నాం. ఎన్టీయారన్ను ఏనుగు మీద ఎక్కించడానికని ఆయనను ముందస్తుగా మానసికంగా సిద్ధం చేయడం కోసం ఆయన సెట్స్ లోకి వచ్చే టైమ్ కి నేను, మా అసిస్టెంట్ డైరెక్టర్లు అక్కడ ఏనుగుల మీద తిరుగుతూ ఉండేవాళ్ళం. ఎన్టీయార్ కూడా ఏనుగును సులభంగా మచ్చిక చేసుకొని, దాని మీద తిరుగుతూ, అద్భుతమైన షాట్స్ చేశారు పాటలకు జనం లేవకూడదనే ఉద్దేశంతో అరేసుకోబోయి… పాటలో చెట్టు చాటు నుంచి జయప్రద చేతులు ఊపే దృశ్యం లాంటివి పెట్టాం. అది జనానికి బాగా పట్టింది. రిలీజ్ టైమ్ కి నేను ప్రేమలేఖలు సినిమా పోస్ట్ ప్రొడక్షన పనిలో ఉన్నా, లోపల టెన్షన్. ఇంతలో ఎన్నడూ లేనిది… పాటలకు జనం లేచి హుషారుగా తెరపైకి నాణాలు విసరడం చూసి, విజయవాడ నుంచి అప్సర థియేటర్ వాళ్ళు, డిస్ట్రిబ్ర్యూటర్లు, నిర్మాతలు నాకు ఫోన చేసి మరీ అభినందించారు. అర్జంట్ గా రావాలంటే, అపుడు నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావు గారికి చెప్పి, ఒక రోజు బ్రేక్ తీసుకొని, విజయవాడకు వెళ్ళి చూసి వచ్చా, సినిమా శతదినోత్సవం 1977 ఆగస్టు 5న విజయవాడలోనే అప్పర థియేటర్ లో చేశాం. ఏలూరు రోడ్డు అంతా ఇసకేస్తే రాలని జనం. అన్నగారిని చూడాలని అంతా గోల చేస్తుంటే, అప్పుడు నేల, బెంచీ టికెట్ కౌంటర్ మీదకు అన్నగారినీ, అందరినీ ఎక్కించి, జనానికి అభివాదం చేసేలా చూశాం.

మొదటి కారు కొన్నా …
‘అడవి రాముడు’ హిట్టయ్యాక నేను నా మొదటి కారు కొన్నా. ఆ అంబాసిడర్ కారు తీసుకొని, అన్న గారు షూటింగ్ లో ఉంటే, ఆయన దగ్గరకెళ్ళా. ‘మీ దయ వల్ల కారు కొన్నా. ఫస్ట్ మీరు నడపాలని కోరా, ఆయన చాలా ఆనందంగా అందరితో ఆ సంగతి పంచుకొని, కారులో నన్ను పక్కనే కూర్చోబెట్టుకొని, ఏ.వి.ఎం. స్టూడియో గేటు దాకా కారు నడిపారు. అది తలచుకుంటే నాకిప్పటికీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి. తీపిగుర్తుగా ఆ కారు ఇప్పటికీ, మా ఆఫీసు బేస్మెంట్ లో భద్రంగా ఉంచుకున్నా. అడవి రాముడుకు అన్న గారి గుండెల్లో కూడా ప్రత్యేక స్థానం ఉంది. ఆయన రాజకీయాల్లోకి వెళ్ళి, సీఎం అయ్యాక, అబిడ్స్ లోని ఆయన గదిలో ఆయనకు ఎదురుగా శ్రీమతి బసవతారకం గారు జ్యోతి పుచ్చుకున్న పటం, వెనకాల వెంకటేశ్వరస్వామి పటం, టేబుల్ మీద పద్మావతీ వెంకటేశ్వరుల పటం మాత్రమే ఉండేవి. ఆ పక్కనే మాత్రం ‘అడవి రాముడు’ విజయోత్సవానికి గుర్తుగా వెండి ఏనుగు మీద ఆయనకూర్చున్న షీల్ ఒక్కటే ఉండేది. ఆ గదిలో మరేమీ ఉండేవి కావంటే, ఆ సినిమాకు ఆయన ఇచ్చిన స్థానం అర్ధం చేసుకోవచ్చు.
”1976 మార్చి చివర అనుకున్న ప్రాజెక్ట్ ఇది. అడవిలో షూటింగ్ కి ఎన్టీయార్ గారి బల్క్ డేట్స్ కోసం నవంబర్ నుంచి చిత్రీకరణ అనుకున్నాం. ‘దాన వీర శూర కర్ణ’ వల్ల మాది జనవరిలో మొదలైంది. అప్పట్లో మద్రాసు హైకోర్టులో న్యాయమూర్తి అయిన జస్టిస్ నటరాజన్ నాకు బాగా ఫ్రెండ్. ఆయన చెప్పడంతో, అటవీ అధికారులు సరే అని మాకు ముదుమలై అడవుల్లో అన్ని రోజుల షూటింగ్ కు అనుమతించి, బాగా సహకరించారు. ఇక, సినిమా సెన్సారింగ్ కూడా నాకు బాగా గుర్తు. సెన్సారింగ్ లో ఆ రోజు రచయిత్రి మాలతీ చందూర్ ఉన్నారు. ఆమె చాలా టఫ్. ఏం కట్స్ చెబుతారో, ఏమిటో అని నేను కంగారుపడ్డా. కానీ, ఆవిడ బయటకొస్తూనే, ‘కృషి ఉంటే మనుషులు…’ పాట గురించి ఎంతో మెచ్చుకున్నారు. ఎంత మంచి సినిమా తీశారండీ అని ప్రశంసించారు.  తరువాత ఎన్నో సినిమాలు తీసినా, ‘అడవి రాముడు ఇచ్చిన పేరు, గుర్తింపు వేరు. ఇప్పటికీ ఆ సినిమా పేరు మీదే బతుకుతున్నా” అన్నారు రాఘవేంద్రరావు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap