విశ్వానికి విద్యనేర్పినటువంటి ఓ ఘనమైన విశ్వవిద్యాలయం మన భారతదేశం. ఇటువంటి మన భారతదేశంలో అనేక కష్టనష్టాలకోర్చి వారి వారి రంగాలలో జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతినార్జించినటువంటి మన భారతీయులెందరో వున్నారు. నేటితరం నిరంతరం స్మార్ట్ ఫోనుల మోజులో పడి అటువంటి మహామహుల రూపురేఖలను సైతం మర్చిపోతున్న తరుణంలో యావత్ భారతదేశంలోని మహనీయుల జీవిత విశేషాలను నేటి, రేపటి విద్యార్థిలోకానికి తెలుగులో పరిచయం చేయాలన్న సంకల్పంతో 64కళలు.కాం సమర్పిస్తున్న “ధృవతారలు” రెగ్యులర్ ఫీచర్లో ఆయా మహానుబావుల జన్మదిన సందర్భాలలో వారిని జ్ఞాపకం చేసుకుందాం.
ధృవతారలు – 3
హరికథా పితామహుడు అజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసు రచయిత, కవి, బహుభాషాకోవిదుడు. ఈయన జీవితమంతా శ్రీహరి గాథలను హరికథల రూపంలో గానం చేస్తూ ఆ శ్రీమన్నారాయణునికి దాసాను దాసుడయిన సార్ధక నామధేయుడు. చిన్ననాటనే తన నోట భాగవతాది శ్లోకాలు వల్లింపబడటం వలన దాసు హరి కథాగానాన్ని ఔపోసన పట్టగలిగాడు. ఉమర్ ఖయ్యాం ఋబాయితులను తెలుగు, సంస్కృతంలోకి అనువదించాడు. నవరస తరంగిణి, జగజ్జ్యోతి, హరికథామృతం వంటి ప్రముఖ రచనలు చేశాడు. మంజరి వృత్తాన్ని 90 రాగాలుగా మార్చిన ఈ ప్రముఖ సంగీత జ్ఞానిని ప్రజలు లయబ్రహ్మ అని 5 తాళాలకు అనుగుణంగా పాడటం వల్ల “పంచముఖి పరమేశ్వర” అని అన్నారు. సంగీత, సాహిత్య స్వరబ్రహ్మ అని బిరుదు కూడా ఇచ్చారు. జయంతి రామదాసు గారి ప్రోత్సాహంతో హరికథకు ప్రపంచాన ఎంతో ఔన్నత్యం ఆపాదించాడు. ఎందరికో భుక్తిగా, ముక్తిగా హరికథా గానాన్ని ప్రసాదించాడు. ఆయన జీవిత కాలంలో తెలుగులో 17, సంస్కృతంలో 3, అచ్చ తెలుగులో 1 హరికథలను రచించాడు. విజయనగరం రాజా వారి గాన పాఠశాలలో మొట్టమొదటి అధ్యాపకునిగా ద్వారం వెంకట స్వామినాయుడు గారు వీరి దగ్గర పనిచేసిన సహెపాధ్యాయుడు. గానగంధర్వుడు ఘంటసాలకు కూడా సంగీతంలోని మెళకువలను నేర్పించిన గురుబ్రహ్మ నారాయణదాసు. ఆంగ్లేయులు ఇప్పిస్తానన్న నోబుల్ పురస్కారాన్ని తిరస్కరించి మన తెలుగుతల్లికి నమస్కరించి తన సంస్కారాన్ని తెలుపుకున్నాడు. ఈ తెలుగు భాషాదాసు విజయనగర ఆస్థాన విద్వాంసునిగా ఎనలేని పేరు ప్రతిష్టలను ఆర్జించి, హరికథలు రచించి, పాడి నేర్పించి తెలుగు ప్రజలకు ఆరాధ్యుడైన ఈ హరి కథాపితామహుడు అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు నేటికీ మన ధృవతార.
(ఆదిభట్ల నారాయణ దాసు జన్మదినం ఆగస్ట్ 31, 1864)
great tribute to Adhibatla garu.