హైదరాబాద్, మాదాపూర్ లోని చిత్రమయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఆదివారం పూలమ్మ పేరిట ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శన సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. కళాకారులు ఏలే లక్ష్మణ్, ప్రియాంక ఏలేలు వేసిన చిత్రాలను ప్రదర్శనలో అందుబాటులో ఉంచారు. పద్మశ్రీ డాక్టర్ కె.లక్ష్మా గౌడ్, ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్ డాక్టర్ లక్ష్మి ఈ ప్రదర్శనను ప్రారంభించారు ఈ నెల 18 న ఆదివారం. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కళాకారులు వేసిన చిత్రాలు సందేశాత్మకంగా, పల్లెటూరి వాతావరణాన్ని, జీవన విధానాన్ని తెలిపేలా అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. ఆత్మీయానురాగాలు, సంస్కృతీ సంప్రదాయాలను చిత్రాలతో అద్భుతంగా చూపించే శక్తి చిత్రకారుల సొంతమని ప్రముఖ ఆర్టిస్ట్ లక్ష్మణ్ ఏలే అన్నారు. మన సంస్కృతీ, సంప్రదాయాలను నేటి తరానికి పెయింటింగ్స్ తో అందించగలమని అభిప్రాయపడ్డారు. అనంతరం ప్రియాంక ఏలే, లక్ష్మణ్ ఏలే రూపొందించిన ప్రోవర్బెయల్ పాథ్ వేస్ పుస్తకాన్ని ఆవిష్కరించారు.
ప్రదర్శనలో 73 చిత్రాలను ఉంచామని, ఈ నెల 25వ తేదీ వరకు ప్రదర్శన కొనసాగుతుందన్నారు. చిత్ర కళాకారులు నాగేశ్ గౌడ్, ఆనంద్ గడప, నిర్మ సంజయ్, అస్తపుత్ర, టైలర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.