మే నెల తరువాత లాక్డౌన్ తీసేస్తారు అని చంకలు గుద్దుకోవాల్సిన పనిలేదు…ఎందుకంటే అసలు కథ ఇప్పుడే మొదలవుతుంది. ఇప్పటిదాకా ఇంట్లోనే ఉండండి బాబులు, అమ్మలూ అంటూ గడ్డం పుచ్చుకుని బ్రతిమిలాడి చాలావరకూ మన ప్రధాని గారు దేశాన్ని కాపాడగలిగారు. కానీ మే 3 తర్వాత మనల్ని మనమే పరిరక్షించుకోవాలి. ఒక్కసారి ఇంటినుండి అడుగు బైట పెడితే ప్రతీదీ సమస్యే. ఎలాగంటారా?
ఆటో ఎక్కాలంటే అనుమానం ఎందుకంటే ఆ ఆటోలో ఇంతకుముందు ఎవరెవరో ప్రయాణం చేసి ఉండచ్చు, వారిలో వారికి తెలికుండానే కరోనా పాజిటివ్ ఉండి ఉండచ్చు. కరోనా ఉరికే ఉండదుగా..ఎక్కిన ప్రతివారితో నవ్వుకుంటూ వాళ్ళింటికెళ్లిపోతుంది , అసలే కలుపుగోలుతనం ఎక్కువ మన కరోనాకి..ఇంట్లో అందరినీ పలకరించేస్తుంది. ఇక కరోనా నేనున్నాను మీ ఇంట్లో అని చెప్పేటప్పటికే అది సాధ్యమైనంతమందిని కవర్ చేసేస్తుంది.
సరే మాకు కారుంది.. మేము మార్గదర్శి లో చేరాం..కారు కొనుక్కున్నాం అని స్వంత కారులో షికారుకి పోయారా…ఇక్కడా సమస్యే. అదెలా అంటారా…కారెక్కి మార్కెట్ కో, బంధువుల ఇంటికో లేక స్నేహితుల ఇళ్లకో వెళ్తారు. కారు డోర్ డోర్ హ్యాండిల్ అన్ని ప్రమాద సూచికలే. శానిటైజర్ తో ప్రక్షాళన చేశాకే హ్యాండిల్ కానీ, డోర్ కానీ ముట్టుకోగలం. మళ్ళీ కారు డోర్ మూసాక మన చేతులు శానిటైజర్తో మళ్ళీ ప్రక్షాళన చేసుకోవాలి. సరే..ఈ కార్యక్రమం అంతా పూర్తయ్యాక ఇంట్లోకి వెళ్ళగానే ఆప్యాయంగా ఆలింగనం చేసుకోటాలు, షాకేహాండ్లు గట్రా పొరపాటున కూడా చేయకూడదు. మనం వచ్చిన దగ్గరనుండి మనతో వారు ఫ్రీగా ఉండలేరు ఎందుకంటే కరోనా అంతలా భయపెట్టేసిందిమనల్ని. అదేవిధంగా మనం కూడా వారింట్లో తినాలన్న, తాగాలన్నా భయమే. అంతెందుకు వారింట్లో ఒక పుస్తకం లేదా మంచినీళ్లు గ్లాస్ ముట్టుకోవాలన్నా సంకోచమే..ఇవన్నీ అబద్ధాలు కావండి.. మే 3 తర్వాత మనం ఎదుర్కొనబోయే విపరీతాలు.
బైట తిండి తినాలంటే భయం.. ఎవడు చేసాడో, వాడికి జలుబే ఉందో, దగ్గే ఉందో.. ఎవడికి తెలుసు?? లాక్డౌన్ లో కాబట్టి మన కాలనీలకే వచ్చి అమ్మారు కూరగాయలు ఇతర వస్తువులు. కానీ లాక్డౌన్ తర్వాత మనమే వెళ్ళాలి సంతకి.. అక్కడ చూడండి ఇక..సర్వం జగన్నాధం. ఎవరు తాకుతారో తెలీదు, ఎవరు ఉమ్మేస్తున్నారో తెలీదు, కరోనా ఎటువైపునుంది వచ్చి మన చంకనెక్కుతుందో తెలీదు. ఇంటికి వచ్చి స్నానం చేసి, కూరగాయల్ని శుభ్రం చేసుకుని ఎన్ని జాగర్తలు పడ్డా కరోనాని ఆపగలం అనిమాత్రం నమ్మకం లేదు.
ఇక ఫంక్షన్లు, గాధరింగ్స్, ఫ్రెండ్స్ మీట్స్, పుట్టింటికి, అత్తగారింటికి అంటూ స్టార్ట్ చేయకండి. ఎన్నాళ్ళయిందో అందరం కలిసి అని తెగ ఆవేశపడిపోయి పరుగులు పెట్టకండి. ఇంకా మనం డేంజర్ జోన్ లొనే ఉన్నాము. నిజంగా మనం మనవాళ్ల మేలు కోరుకుంటే వారిని కలవటానికి ఇంకొన్నాళ్లు వేచి ఉండండి. ఎందుకంటే ఇప్పటిదాకా మనము ఎవరి ఇంట్లో వారు ఉంటూ సామాజిక దూరాన్ని పాటించటం అలవాటు చేసుకున్నాము. ఈ లాక్డౌన్ అనేది ఇంకా పొడిగించటం అనేది సాధ్యపడదు కనుక ఇప్పుడు మనం జనం లో ఉన్నా సామాజిక దూరం పాటించటం వల్ల మాత్రమే ఈ విపత్తు ను ఎదుర్కొనగలం.
ఇప్పటిదాకా బైటికి వెళ్తే పోలీసులు కొడుతున్నారు అని పోలీసుల మీద జోకులు, ఫైరింగులు వేసింది చాలు, ఎందుకంటే ఇప్పుడిక ఆ జోకులన్నీ మనమీద మనమే వేసుకునే పరిస్థితి. ఇప్పటిదాకా మనల్ని వారు రక్షించారు. ఇప్పుడు మనల్ని, మన కుటుంబాన్ని మనమే రక్షించుకోవాలి అత్యవసరం అయితే తప్ప బైటికి వెళ్లకూడదు. సామాజిక దూరం పాటించటం తప్ప వేరే మార్గమే లేదు.
దేశ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా లాక్డౌన్ ఎత్తివేసినా మనం మాత్రం మన పరిధిలోనే ఉండాలి.
కరోనా బారిన పడి అగ్ర దేశాలు ఈనాడు మట్టికొట్టుకు పోతున్నాయి. మన ప్రియతమ ప్రధానమంత్రి మోడీ గారి దూరదృష్టి పుణ్యమా అని మనదేశంలో ఈమాత్రమైనా బ్రతకగలుగుతున్నాము. ఇకముందు కూడా ఇదే సహకారం, సంకల్పంతో మన దేశాన్ని, మనల్ని కాపాడుకుందాం. పోలీసులు, డాక్టర్లు, మునిసిపాలిటీ వర్కర్స్ అందరూ మనల్ని తమ రక్షణ కవచాలతో రక్షించారు.వారి ఋణం తీర్చలేనిది. వారి ఋణపడటం మాట అటుంచితే ఇక వారిని కష్ట పెట్టకూడదు. వారు తమ కుటుంబాలకు దూరంగా ఉండి, ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఎంతో సేవ చేసి ఎన్నో ప్రాణాలను రక్షించిన త్యాగధనులు. ఇక వారి బాధ్యత కూడా మనదే. జగమంత కుటుంబం మనది. అందరూ బాగుండాలి.. అందులో నేనుండాలి అనే దృఢ సంకల్పంతో మరికొన్నాళ్లు, ఈ విపత్తును పూర్తి స్థాయిలో రూపుమాపేవరకు అందరం శ్రమిద్దాం. మనల్ని మనమే కాపాడుకుందాం.