
తెనాలి అంటే కళాకారులు గుర్తొస్తారు. ముఖ్యంగా శిల్పులకు ప్రసిద్ది చెందిన పట్టణమది. అలాంటి శిల్ప కారుల కుటుంబం లో అక్కల కోటిరత్నం, అక్కల మంగయ్య గారి దంపతులకు ది. 26 ఏప్రిల్ 1975 లో జన్మించారు అక్కల వీర సత్య రమేష్. 10 వ తరగతి తర్వాత డ్రాయింగ్ లోనూ, క్లే మోడల్ లోనూ హైయ్యర్ గ్రేడ్ సర్టిఫికెట్ కోర్సులు చేసారు. డ్రాయింగ్ టీచర్ ట్రైనింగ్ కూడా పూర్తి చేసారు. పిదప వారి సొంత శిల్పశాలలో లోహ శిల్పాల రూపకల్పనలో జీవనం కొనసాగిస్తున్నారు. వీరి సోదరుడు రామలింగేశ్వర కుమార్, బాబాయిలు అక్కల రామకృష్ణా రావు గారు, అక్కల శ్రీరాం గారు పేరొందిన శిల్పులు.
అక్కల రమేష్ గారు ‘శ్రీ అజంతా కళారామం ‘ ను స్థాపించి చిత్ర, శిల్ప కళలు మరియు ఫోటోగ్రఫీ లోన్ జాతీయ స్థాయిలో పోటీలు, ప్రదర్శనలు నిర్వహించి వందలాది కళాకారులను ప్రొత్సహించారు. 2012 లో అజంతా కళారామం ప్రారంభం నుండి నేను సంస్థకు గౌరవ సలహాదారునిగా వున్నాను. అప్పటి నుండి ప్రతీ విషయాన్ని నాతో చర్చించి నిర్ణయాలు తీసుకునేవారు. ఈ సందర్భంలో అధ్యక్షులు శ్రీ కొలసాని తులసీ విష్ణు ప్రసాద్ గారితోనూ, ప్రముఖ కవి, రచయిత అయినాల మల్లేశ్వర రావు గారితోనూ నాకు అనుబంధం ఏర్పడింది.
అజంతా కళారామం వ్యవస్థాపక కార్యదర్శి అక్కల రమేష్ ఆకస్మిక మరణం కళారంగానికి తీరనిలోటు. అదే రోజు (27-12-20) ఉదయం 11.30 నిమిషాలకు నాతో తను 64కళలు.కాం కు రాసిన ఒక ఆర్టికల్ గురించి మాట్లాడారు. మధ్యాన్నం భోజనం చేసిన తర్వాత వర్క్ షాప్ కు వెళ్ళి అక్కడే సుమారు సాయత్రం 5.30 ని. లకు గుండెపోటుతో సోదరుడు, కుమారుడు సమక్షంలో కన్నుమూసారని రాత్రి 7 గంటలకు సమాచారం అందింది. సోమవారం నాడు విజయవాడ నుండి డ్రీం రమేష్, నేను తెనాలి కి వెళ్ళి రమేష్ గారి పార్థీవ దేహానికి పూలమాలతో నివాళులర్పించాం.
ఐదేళ్ళ క్రితం రమేష్ గారి ఒక కుమారుడు అనారోగ్యం కారణంగా మరణించారు. ఆ గాయం మానకముందే మరో విషాదం వారి ఫ్యామిలీని కమ్మేసింది. మరో కుమారుడు రతన్ రాకేష్ బి.టెక్. పూర్తి చేసి హైదరాబాద్లో ఒక సాఫ్త్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. రమేష్ గారి శ్రీమతి రాజ్యలక్ష్మి గారు కూడా వారు చేసే కార్యక్రమాలకు తన వంతు సహకారం అందించేవారు.

నాట్య రంగంలో కూడా ప్రవేశం వున్న రమేష్ గారు కొన్ని ప్రదర్శనలు ఇచ్చారు. లయన్స్ క్లబ్, రోటరి క్లబ్ లాంటి సేవా సంస్థలతో నడచి తన వంతు సేవలందించారు.
చిత్రకారునిగా కూడా నిలబడాలన్న లక్ష్యంతో ఈ మధ్య (కరోనా) కాలం లో సుమారుగా 50 లాండ్ స్కేప్ చిత్రాలు వేసానని నాకు చెప్పారు. వాటితో ఒక వన్ మేన్ షో పెట్టాలని కోరిక వ్యక్తం చేసారు. మేము వడ్డాది పాపయ్య గారి శత జయంతి సందర్భంగా చేయబోయే కార్యక్రమానికి గాను వపా గారి బస్ట్ సైజ్ ప్రతిమ చేసిస్తానని చెప్పి, నా దగ్గర కొన్ని ఫోటోలు కూడా తీసుకున్నారు. కాని అనుకున్న వన్నీ జరగవు కదా ! అనుకోలేదని ఆగవు కదా..!
ఇంకా ఎంతో కళా సేవ చేయాలని… మరెన్నో విజయాలు సాధించాలనీ .. నిత్యం తపించే మిత్రుడు అక్కల రమేష్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ…
–కళాసాగర్
editor: www.64kalalu.com

_________________________________________________________________________
అజంతా రమేష్ కి అశ్రునివాళి
లోకంలో మనుషులెందరో పుడతారు మరణిస్తారు. అయితే పుట్టినవారిలో ఎక్కువమంది ఒక లక్ష్యం లేకుండా జీవనం సాగిస్తే, చాలా తక్కువ మంది మాత్రమే ఏదో సాదించాలి సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలి అనే ఒక తపన జిజ్ఞాషలతో జీవిస్తారు అందుకనుగుణంగా తనదైన రీతిలో కృషి చేస్తారు. అందుకు వయసు తో పనిలేదు. చిన్నతనంలోనే అలాంటి ఆలోచనతో ముందుకు సాగి సమాజంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని ఆరాటపడతారు, తద్వారా అందరిని ఆకట్టుకుంటారు. జన్మతహా మరియు తన కుటుంభ పరంగా వున్న కళానేపధ్యానికి మరింత వన్నె తీసుకురాలని ఆరాట పడతారు. అలాంటి వున్నత లక్ష్యం కోసం తన శక్తికి మించి కృషి చేసిన యువకుడు అక్కల వీర సత్య రమేష్ గారు. నాలుగు పదుల వయస్సు నిండకుండానే జాతీయస్థాయి చిత్ర కళా పోటీలు నిర్వహించడానికి అజంతా కళా రామం అనే సంస్థను స్థాపించిన కొద్ది సంవత్సరాలకే దాని ద్వారా తనకు, తన ప్రాంతానికి ఎంతో గుర్తింపు తీసుకువచ్చి సౌత్ ఇండియాలోని ఎందరో చిత్ర శిల్పకారుల హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్న అక్కల రమేష్ గారు ది 27-12-2020 నాడు గుండె పోటుతో ఆకస్మికంగా దివికేగినారనే వార్త నిజంగా అందరిని కలచివేసింది.

అక్కల రమేష్ గారితో నాకు గల ఎనిమిదేళ్ళ ఏళ్ళ భంధం అజంతా కళా రామం అనే సంస్థ ద్వారా ఏర్పడింది. 2012 లో శ్రీ కొలసాని తులసీ విష్ణు ప్రసాద్ గారు అధ్యక్షులుగా శ్రీ అక్కల రమేష్ గారు కార్యదర్శిగా అజంతా కళారామం ను ప్రారంబించిన తొలి ఏడాది నిర్వహించిన జాతీయ చిత్రకళా పోటీలలో నా స్టొరీ టేల్లెర్ చిత్రానికి అజంతా కళారామం ప్రతిభా పురస్కారం దక్కించుకుంది . నాటి నుండి ప్రతీ ఏడాది నేను పాల్గొనడమే గాక ఏదో బహుమతి గెల్చుకోవడం జరుగుతుండేది. రాష్ట్రంలో గత రెండున్నర దశాబ్దాలుగా చిత్రకళా పోటీలు నిర్వహిస్తున్న కోనసీమ చిత్రకళా పరిషత్ కార్యదర్శి కోరసాల గారిని ఆదర్శంగా తీసుకుని గత ఎనిమిదేళ్ళుగా వారు నిర్వహిస్తున్న జాతీయ చిత్రకళా పోటీలు నిజంగా ఎంతో ప్రత్యేకంగా నిలిచాయి అని చెప్పవచ్చు. కారణం ఈ పోటీలను వీరు కేవలం చిత్రకళకే పరిమితం చేయకుండా దానితో పాటు శిల్పకళ ఫోటోగ్రఫి మరియు కార్టూన్ కళలో కూడా పోటీలు నిర్వహంచి బహుమతులు అందజేయడం గొప్ప విశేషం .అంతే గాక పోటీలలో పాల్గొన్న ప్రతీ చిత్రకారుడి ఫోటోతో పాటు అతడి చిత్రాన్ని కూడా అందంగా రంగుల్లో ముద్రించి ప్రతీ ఏడూ ఒక సావనీర్ ను ముద్రించడం గొప్ప సాహసం అని చెప్పవచ్చు.. అంతే గాకా ప్రారంబించిన తొలి ఏడాదే విశిష్ట అతిదిగా అంతర్జాతీయంగా పేరుగాంచిన నైరూప్య చిత్రకారుడు శ్రీ ఎస్. వి. రామారావు గారిని మలి ఏడాది సురభి వాణీ దేవి గారిని మరో సారి రాష్ట్ర నాటక అకాడమి చైర్మన్ శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ గారిని ఇలా ప్రముఖ వ్యక్తుల ను ఆహ్వానించడంతో పాటు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ప్రదేశంలో వార్షికోత్సవం నిర్వహించడం మరింత సాహసంతో కూడుకున్న విషయం. అలా రమేష్ గారు అజంతాకళారామం వార్షికోత్సవాన్ని మొదట తన జన్మస్థానమైన తెనాలిలోను తర్వాత విజయవాడ , హైదరాబాదు ఇలా పలుచోట్ల నిర్వహించి తన ప్రత్యేకతను చాటుకున్నారు .తాను ఇంత గొప్పగా ఆ కార్యక్రమాన్నీ నిర్వహిస్తున్నప్పటికీ తోటి సంస్థలు నిర్వహించే చిత్ర కళాకార్యక్రమాలలో తను ఒక సంస్థ నిర్వాహకుడిని అనే భావం లేకుండా మామూలు శిల్పకారుడిగా పాల్గొని ఏమాత్రం బేషజం ప్రదర్శించని వ్యక్తి.
మొదట్లో వంశ పార పర్యంగా అబ్బిన సాంప్రదాయ శిల్పకళకే పైమితమైనప్పటికి తరువాత పట్టుదలతో చిత్రకళా విద్యను శ్రీ వెంకటేశ్వరా లలిత కళాశాల నుండి అభ్యసించి అకడమిక్ పరంగా కూడా మెలకువలను నేర్చుకుని చిత్రకళ, శిల్పకళల కోసం నింతరం తాపత్రయం కలిగిన మంచి చిత్రకారుడు శిల్పి, కళాభిలాషి, కళారాధకుడు.ఇంకా ఐదు పదులు కూడా నిండని వయసులో అకస్మాత్తుగా మననుండి దూరం కావడం కళాపరంగా ఎంతో తీరని లోటు.

ఎప్పుడు ఫోన్ చేసినా చిత్రకళ గురించి తన అభిప్రాయాలను తెలియజేస్తూ తన సంస్థ గురించి ఏ ఏడాది కా ఏడాది మరింత గొప్పగా నిర్వహించాలనే తపనను వ్యక్తం చేసేవారు. దాదాపు పదేళ్లుగా నేను చేస్తున్న చిత్ర కళా రచనా వ్యాసంగమును గుర్తించి ప్రఖ్యాత కళా విమర్శకులు డాక్టర్ సంజీవ్ దేవ్ స్మారక పురష్కారాన్ని అజంతా కళారామం ద్వారా నాకు అందజేసి సత్కరించడం ఒక గొప్ప అనుభూతి. అంతే గాకా తాను కూడా చిత్రకళా వ్యాసాలను రాయాలనే తపనను వ్యక్తంజేసేవారు. అలా నా గురించి కూడా ఆయన ఒక వ్యాసాన్ని 64 కళలు.కాం లో రాయడం జరిగింది. తాను ప్రతీ ఏట ప్రచురించే సావనీర్లో తప్పనిసరిగా నాచేత ఒక ఆర్టికల్ రాయించే వారు. ఈ ఏడాది తన సంస్థ తొమ్మిదవ వార్శికోత్సవం నిర్వహించుకోవాల్సిన సమయంలో శ్రీ రమేష్ గారు ఇలా ఆకస్మిక ముగా మన నుండి దూరం కావడం తన కుటుంభానికే గాక చిత్ర శిల్ప కళాలోకానికి ఎంతైనా తీరని లోటు, వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని వారి శ్రీమతి మరియు పిల్లలకు కుటుంభ సభ్యులకు ఈ భాదాకార ఘటనను తట్టుకునే శక్తిని మనో ధైర్యాన్ని ఆ భగవంతుడు వారికి ఇవ్వాలని కోరుకుందాం.
-వెంటపల్లి సత్యనారాయణ



Nice person, great service.
Om santhi