ఉత్తమ పాత్రికేయ శిరోమణి పురస్కారాలు

వైభవంగా అక్కినేని 98వ జయంతి వేడుకలు
ఘనంగా అక్కినేని – శృతిలయ ఉత్తమ పాత్రికేయ శిరోమణి పురస్కారాల ప్రదానోత్సవం

సమాజంలో పాత్రికేయులు కీలక బాధ్యతను సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారని తెలంగాణ ప్రభుత్వ ఢిల్లీ అధికార ప్రతినిధి డాక్టర్ ఎస్.వేణుగోపాలాచారి ప్రశంసించారు. తెలుగు జాతి ఉన్నంతకాలం అక్కినేని నాగేశ్వరరావు, నందమూరి తారక రామారావు తరతరాలుగా గుర్తు ఉండిపోతారని అయన అన్నారు. సోమవారం రవీంద్రభారతిలో శృతిలయ ఆర్ట్స్ అకాడమీ, సీల్ వెల్ కార్పొరేషన్, కోవిద సహృదయ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యం లో అక్కినేని 98వ జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి. ముఖ్య అతిధిగా విచ్చేసిన డాక్టర్ ఎస్.వేణుగోపాలాచారిగారు మాట్లాడుతూ నిజాలను నిర్భయంగా వెల్లడిస్తూ వేగంగా స్పందిస్తూ సమాజానికి పాత్రికేయులు విశేష సేవలు అందిస్తున్నారని, కోవిడ్ సమయంలో మరింత బాధ్యతగా వ్యవహరించి స్పూర్తిని అందించారని అభినందించారు.
సభాధ్యక్షులు డాక్టర్ వోలేటి పార్వతీశం మాట్లాడుతూ అక్కినేని నాగేశ్వరరావు కాలంతో ప్రవహించిన పరిపూర్ణ నటుడు, ఎవర్ గ్రీన్, నట శిఖరం అని కొనియాడారు. ప్రతిభా మూర్తులను వెలికి తీసి సమాజంలో ఆవిష్కరించే సుగుణం పాత్రికేయులకు మాత్రమే ఉందని అయన అభినందించారు.

అవార్డు కమిటీ చైర్మన్ డాక్టర్ మహ్మద్ రఫీ మాట్లాడుతూ సమాజం లో మారిన ట్రెండ్ కు అనుగుణంగా పాత్రికేయ వ్యవస్థ అద్భుతంగా పని చేస్తున్నదని, విలువలు లేవని మాట్లాడటం ఫ్యాషన్ అయిపోయిందని, అన్ని రంగాల్లో మాదిరిగా పాత్రికేయ రంగంలో కూడా మంచి చెడు వుంటాయనే విషయాన్నీ ప్రజలు తెలుసుకుంటే విమర్శకు తావు ఉండదని అన్నారు.

ఇంకా ఈ వేడుకలో శృతిలయ చైర్మన్ డాక్టర్ బి.భీంరెడ్డి, కోవిద సహృదయ ఫౌండేషన్ అధ్యక్షురాలు డాక్టర్ జి.అనూహ్య రెడ్డి, సామాజికవేత్త గుడ్ల ధనలక్ష్మి, ఆదర్శ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కుసుమ భోగరాజు పాల్గొని పాత్రికేయులకు శుభాకాంక్షలు తెలిపారు.
పురస్కార గ్రహీతలు ఆటగదరా శివ ఫేమ్ హీరో ఉదయ్ శంకర్ ను అక్కినేని యువ నట పురస్కారంతో ఘనంగా సత్కరించారు.
అక్కినేని శృతిలయ జీవన సాఫల్య పురస్కారాలను సినీ పాత్రికేయులు శైలి టివి డైరెక్టర్ భగీరథ, సుమన్ టివి క్రియేటివ్ హెడ్ ఎ.ప్రభు, ABN ఎంటర్ టైన్ మెంట్ బ్యూరో చీఫ్ పసుమర్తి నాగేంద్ర కుమార్ స్వీకరించారు.

Best journalist award

అక్కినేని శృతిలయ ఉత్తమ పాత్రికేయ శిరోమణి పురస్కారాలతో టివి5 హిందూ ధర్మం చీఫ్ ఎడిటర్ దండమూడి నందకిషోర్, ఈటీవి ఆహా రుచుల వ్యాఖ్యాత, సీనియర్ పాత్రికేయులు కిషోర్ దాస్, నమస్తే తెలంగాణ లీగల్ స్పెషల్ కరెస్పాండంట్ పెమ్మరాజు శ్రీనివాస్, టివి9 న్యూస్ కో ఆర్డినేటర్ చిలుకూరి హరిప్రసాద్, తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా యూనియన్ అధ్యక్షులు సయ్యద్ ఇస్మాయిల్, సాక్షి ఫోటో ఎడిటర్ కె.రవికాంత్ రెడ్డి, ఈనాడు హైదరాబాద్ సిటీ బ్యూరో సీనియర్ రిపోర్టర్ ఎల్.వేణుగోపాల్ నాయుడు, న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ సీనియర్ అసిస్టెంట్ ఎడిటర్ మంజులత కళానిధి, సుమన్ టివి ప్రోగ్రాము ప్రొడ్యూసర్ నిరుపమ లను సన్మానించారు.
ఈ సందర్భంగా సత్కార గ్రహీతలను అభినందిస్తూ మెగాస్టార్ చిరంజీవి పంపిన ఆడియో సందేశం ప్రభు ప్రత్యేకంగా వినిపించారు. ప్రముఖ సాంకేతిక నిపుణులు మదన్ గుప్తా ప్రత్యేకంగా రూపొందించిన హీరో ఉదయ్ శంకర్ లఘు చిత్రాన్ని ప్రదర్శించారు. వ్యాఖ్యాన బ్రహ్మ పి.ఎం.కె.గాంధీ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. శృతిలయ ఆమని సమన్వయం చేశారు.

అక్కినేని జయంతి సందర్భంగా నవరస గాయని ఆమని ఆధ్వర్యంలో మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఆరు గంటల పాటు సీల్ వెల్ సుస్వరాలు శీర్షికతో అక్కినేని సినిమాల్లోని పాటలు పాడి అలరించారు. గాయకులు చంద్రతేజ, సుభాష్, శ్రీనివాస్, చక్రవర్తి, విజయ తదితరులు అక్కినేనికి స్వరనివాళి సమర్పించారు. తులసీరామ్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
-మహ్మద్ రఫీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap