“అభినయ శ్రీమంతుడు” అక్కినేని శతజయంతి

తెలుగు సినిమా చరిత్రలో అక్కినేని నాగేశ్వరరావు, నందమూరి తారక రామారావులది ఒక స్వర్ణయుగం. వారిద్దరూ తెలుగు చలనచిత్రజగత్తుకు రెండు కళ్ళుగా భాసిల్లారు. శరత్ నవలకు నిండైన రూపంగా, భగ్నప్రేమికుడుగా ‘దేవదాసు’ చిత్రంతో చరిత్ర సృష్టించిన నాయకుడు అక్కినేని. నవలా నాయకుడుగా అక్కినేని ఆర్జించిన పేరు ప్రఖ్యాతులు తెలుగు చలనచిత్రసీమలో మరెవ్వరికీ దక్కలేదు. డి.ఎల్. నారాయణ ‘దేవదాసు’ నవలను తెరకెక్కించాలని అనుకున్నప్పుడు ఎన్ని విమర్శలు? అయితే విమర్శలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని అక్కినేని దేవదాసు పాత్రను రక్తి కట్టించారు. మరో శరత్ నవల ‘బడదీది’ని భానుమతి ‘బాటసారి’ పేరుతో సినిమాగా మలిస్తే అందులోని సురేంద్రనాథ్ పాత్రలో అక్కినేని పరకాయ ప్రవేశంచేసి ఆ నవలలో శరత్ ఉదహరించిన పాత్ర స్వభావాన్ని యధాతధంగా పండించి, తనకు అభిమాన పాత్రగా చెరగని ముద్ర వేసుకున్నారు. సెప్టెంబర్ 20 న అక్కినేని శతజయంతి జరుగుతున్న సందర్భంగా అక్కినేని ని గురించి కొన్ని జ్ఞాపకాలు…

అక్కినేని అభిమాన పాత్ర…బాటసారి

ఎప్పుడైనా అక్కినేనిని తనకు నచ్చిన సినిమా పాత్ర ఏదని అడిగితే వచ్చే జవాబు ‘బాటసారి’ సినిమాలో సురేంద్రనాథ్ పాత్ర. శరత్ రచించిన ‘బడదీది’ నవలకు వెండితెర రూపమే ‘బాటసారి’. ఈ నవలను ప్రముఖ నిర్మాత చక్రపాణి తెలుగులోకి అనువదించారు. అత్యల్ప సంభాషణలతో అద్భుత భావ ప్రకటనతో ఆకట్టుకున్న పాత్ర సురేంద్రనాథ్ ది. ఏ లోకంలోనో విహరిస్తూ, ఎక్కడో ఆలోచిస్తూ, అన్నపానీయాల విషయం కూడా గుర్తుకురాని ఒక అద్భుత పాత్ర అది. అక్కినేని ఈ సినిమాలో నటించేందుకు ముందు చక్రపాణిని కలిసి పాత్ర స్వభావాన్ని గురించి చర్చించి ఆకళింపు కేసుకున్నారు. అందులో భానుమతిది బాల్య వివాహంతో వైధవ్యం ప్రాప్తించి ప్రేమకు నోచుకోని మాధవి అనే తలుపు చాటు పాత్ర. సామాజిక బంధనంలో తన ప్రేమను వ్యక్తం చేయలేని స్థితిలో వున్న మాధవికి తనవలన అన్యాయం జరిగిందని తెలుసుకున్న సురేంద్రనాథ్ అనారోగ్యాన్ని లెఖ్ఖ చేయకుండా గుర్రం మీద వస్తూ, కళ్ళజోడు పోగొట్టుకొని, మసక చూపుతో మాధవిని కలుసుకొని క్షమాపణ కోరుతూ ఆమె ఒడిలోనే తుది శ్వాస విడిచే సన్నివేశంలో అక్కినేని నటన పరాకాష్టను అందుకుంది. ఆ సన్నివేశాన్ని చూసే యే ప్రేక్షకుడైనా కంటినీరు పెట్టకుండా, అక్కినేని నటనకు జోహార్లు చెప్పకుండా సినిమా హాలు విడిచి రాలేడంటే నమ్మాల్సిందే!ఈ చిత్రం మూగ ప్రేమకు సాక్ష్యం… నిష్కళంక అనుబంధానికి దర్పణం.

Akkineni in Devadas
with Bhanumathi

శరత్ దేవదాసు గా…
వినోదా సంస్థ అధిపతి డి.ఎల్. నారాయణ శరత్ నవల ‘దేవదాసు’ను చిత్రంగా నిర్మించిన విషయం విదితమే. డి.ఎల్. ఈ సినిమా నిర్మించ తలపెట్టినప్పుడు శరత్ సృష్టించిన దేవదాసు పాత్రకు జానపద పాత్రలు వేసే అక్కినేని పనికిరారని విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఈ విమర్శలు నిర్మాతకు పంతం పెరిగి పట్టుదలని పెంచడమే కాకుండా దేవదాసు చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించడానికి ఉపయోగపడ్డాయి. డి.ఎల్ కి అక్కినేని నటన మీద ఎంతో నమ్మకం. విమర్శలకు జడవలేదు. తెలుగులో వచ్చిన మొదటి విషాద ప్రేమకథా చిత్రం భరణీ పతాకంపై భానుమతి రామకృష్ణ తీసిన ‘లైలా మజ్నూ’(1949). ఆ చిత్రంలో ఖైస్ గా అక్కినేనిని ఎంపిక చేసినప్పుడు కూడా ఇలాంటి విమర్శలే వచ్చాయి. అక్కినేనికి ఆ చిత్రం చాలా మంచిపేరు తెచ్చింది. అక్కినేని దేవదాసు పాత్రను మరింత లోతుగా విశ్లేషించుకుంటూ, వీలున్నపుడల్లా చక్రపాణితో కూర్చుని ఆ పాత్ర ప్రవృత్తి, నడవడిక, స్థితిగతుల్ని చర్చిస్తూ దేవదాసు పాత్రని అవగాహన చేసుకొని, తాగుడుకు బానిసైన భగ్నప్రేమికునిగా నటించి మెప్పించారు. దేవదాసు గా అక్కినేని పలికే సంభాషణలు ఆ పాత్ర సంస్కారానికి అద్దం పట్టాయి. ఈ చిత్రంలోని తాగుడు దృశ్యాలను రాత్రిళ్ళు యేకబిగిన చిత్రీకరించారు. నిద్రలేమితో కళ్ళు అరమూతలు పడాలని అర్ధరాత్రిళ్ళు షూటింగ్ చేశారు. అక్కినేని మాటల్లో చెప్పాలంటే ‘దేవదాసు’ చిత్రం తనకు ఓ పరిశోధనా అంశం లాంటిది. దేవదాసు పిరికివాడు కాదు, కేవలం తండ్రిమాట జవదాటలేని అశక్తుడే అనిపించేలా దేవదాసు పాత్రలో అక్కినేని నటించి మెప్పించారు.

తెలుగులో మరో బెంగాలీ సినిమా అర్థాంగిలో…

బెంగాలీ సాహిత్యవేత్త మణిలాల్ బెనర్జీ రచించిన ‘స్వయంసిద్ధ’ నవలను 1955లో పి.పుల్లయ్య ‘అర్ధాంగి’ చిత్రంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో అక్కినేని పాత్రకు కాళిదాసు పాత్రకు దగ్గర పోలికలుంటాయి. సగం సినిమా వరకు అక్కినేని (రఘు) అమాయకత్వం మూర్తీభవించిన పిరికివాడు…బొమ్మలతో ఆడుకొనే బాలుడు. ఆ తరవాత గాంభీర్యం అలముకొన్న చూపులతోనే తమ్ముణ్ణి నిలువరించగల స్థాయికి ఎదుగుతాడు. ఇంతటి వైవిధ్యాన్ని అక్కినేని ఒక క్రమపద్ధతిలో అంచెలంచెలుగా నిర్మిస్తూ వచ్చారు. అసహజం అనిపించకుండా స్లోగా పాత్రకు నిండుతనం తెచ్చారు. అలా నటించాలంటే మాటలు కాదు. అక్కినేని తన నటనలో మోతాదు మించని నిస్సహాయత, అమాయకత్వం, బేలతనం, జడత్వం, గాంభీర్యం, వీరత్వం, హుందాతనం, పెద్దరికం, కఠినత్వం చూపించారు. పెళ్లిపీటలమీద మంగళసూత్రాన్ని కళ్ళకద్దుకోవడం, తన మెడలో కట్టుకోబోవడం, పెళ్ళికూతురికి కట్టమన్నప్పుడు తనను పెంచిన ఆయమ్మ వైపు చూడడం, పెళ్ళయ్యాక చెక్కపెట్టెలో కూర్చొని అరటిపండు తినడం, శోభనం గదిలో పెళ్లామంటే ఆడుకొనేందుకు వచ్చిన నేస్తంగా భావించి నవ్వుకోవడం, భార్య గంభీరంగా వుండడం చూసి “ఆయమ్మా” అంటూ తలుపు తీసుకొని వెళ్ళడం వంటి సన్నివేశాల్లో నటించడం అంత తేలిక కాదు. అర్హత వుండటం చేతనే అక్కినేని నటసామ్రాట్ అని పిలిపించుకోగలిగారు.

చక్రభ్రమణం, ప్రేమనగర్ నవలా నాయకుడిగా…

1964లో అక్కినేని నిర్మించిన సొంత చిత్రం ‘డాక్టర్ చక్రవర్తి’ కోడూరి కౌసల్యాదేవి నవల ‘చక్రభ్రమణం’ కు ఇది వెండితెర రూపం. అందులో చనిపోయిన చెల్లెలు సుధను మాధవిలో చూసుకుంటూ ఆమెను ఆరాధించే చక్రవర్తిగా, ఒక డాక్టరుగా ఆమెను బ్రతికించే బాధ్యతగల వ్యక్తిగా అక్కినేని నటన అపూర్వం.. అనితర సాధ్యం. అక్కినేని నటనానుభవంలో కనిపించే లక్షణాల్లో మొదటిది పాత్రలో పరకాయ ప్రవేశం చెయ్యగల ప్రతిభ, పాత్ర్ర ఔచిత్యాన్ని తెలుసుకొని నటించటం రెండోది. నవలలో వర్ణించే ఇమేజ్ కి భంగం కలగకుండా పాత్రే కనిపించేలా నటించటం ఈ చిత్రంలో అక్కినేని సాధించిన విజయం. అక్కినేనిని అనుక్షణం నీడలా వెంటాడే రొమాంటిక్ ఇమేజ్ ఎక్కడా ఈ చిత్రంలో కనపడనీయకుండా అక్కినేని నటించి చిత్ర విజయానికి సహాయపడ్డారు. కోడూరి కౌసల్యాదేవి రచించిన ‘ప్రేమనగర్’ నవలను అదే పేరుతో ప్రముఖ నిర్మాత రామానాయుడు నిర్మించిన విషయం తెలిసిందే. అత్యంత విజయవంతమైన తెలుగు నవలాచిత్రాల్లో ప్రేమనగర్ కి సముచిత స్థానం వుంది. రామానాయుడు సినీరంగంలో నిలదొక్కుకోవడానికి ఉపయుక్తమైన ఈ చిత్రం 1971లో విడుదలైంది. నాగేశ్వరరావు వుంటే ఏ నవలాచిత్రమైనా బాగా నడుస్తుందనే నానుడికి ప్రేమనగర్ సినిమా ఒక ప్రామాణికం. ఈ సినిమాలో అక్కినేని పాత్ర కల్యాణ్ కేంద్ర బిందువు. రాచరికపు ప్రమాణాలకు లోబడి తల్లిదండ్రుల ప్రేమకు దూరంగా ఆయా సంరక్షణలో పెరగటంచేత, అదుపుతప్పి దురలవాట్లకు లోనయ్యే పాత్ర అది. కానీ “చెడిపోయిన వాళ్ళను చేరదీశానే గాని ఎవ్వరినీ చెరపలేదు” అంటూ తనవ్యక్తిత్వాన్ని ఎస్టాబ్లిష్ చేస్తాడు కల్యాణ్. పరచింతన లేని భోగలాలసుడుగా, హాస్యప్రియుడుగా, రసార్ద్ర హృదయుడుగా, పిరికితనంలేని పెద్దమనిషిగా, దేహ వాంఛలకన్నా అతీత భావన కలిగిన మహోన్నతుడుగా అన్ని ఫ్రేముల్లోనూ అక్కినేని నటనా కౌశలం ప్రేమనగర్ చిత్రంలో పుష్కలం. తరతరాలుగా అహంకారంతోబాటు జీర్ణించుకుపోయిన వంశ గౌరవానికి భంగంరాకుండా నటించే ప్రతిభ అక్కినేనికే సొంతం. మహా నటుడుగా విశ్వరూపం ప్రదర్శించిన అక్కినేని నవలా చిత్రం ప్రేమనగర్.

యద్దనపూడి నవలా నాయకుడిగా…

1976లో వచ్చిన ‘సెక్రెటరి’ సినిమా ప్రముఖ రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి నవలా చిత్రమే. ప్రేమనగర్, సెక్రెటరి చిత్రాలు రెండూ కమర్షియల్ సూత్రాలతోనే నడిచేవి. సినిమాలుగా వాటిని మలిచినప్పుడు కమర్షియల్ అంశాలు వున్నాయి కనుకనే విజయవంతమయ్యాయి. దర్శకుడు కె.ఎస్. ప్రకాశరావు చిత్రీకరణ విధానంలో వ్యాపార లక్షణాలు ఎక్కువగా వుండవు. పాత్రోచితమైన ఆలోచనా విధానాలనే సమర్ధించే వ్యక్తిత్వం అతనిది. ప్రేమనగర్, సెక్రెటరి చిత్రాలేకాక కన్నతల్లి, బందిపోటుదొంగలు వంటి చిత్రాల్లో అక్కినేని, ప్రకాశరావు సారధ్యంలో నటించారు. సెక్రెటరి నవల అంతకుముందే జ్యోతి మాసపత్రికలో సీరియల్ గా వచ్చింది. బామ్మ తప్ప మరెవరూ దిక్కులేని ఒక మధ్యతరగతి అమ్మాయి జయంతి(వాణిశ్రీ) కథ ఈ సినిమా. వనితలు, స్నేహితులు ఇష్టపడే రాజశేఖర్ అనే ధనవంతుని పాత్రలో అక్కినేని జీవించారు. సరళంగా, హాయిగా సాగిపోతుందీ సినిమా. యద్దనపూడి సులోచనారాణి మరొక నవల ‘విజేత’ ఆధారంగా ‘విచిత్రబంధం’ సినిమా వచ్చింది. ‘ఆత్మీయులు’, ‘బంగారుకలలు’ సినిమాలు కూడా యద్దనపూడి కలంనుంచి జాలువారినవే! తెలుగు చలన చిత్ర చరిత్రలో నవలాధారిత చిత్రాలు ఎక్కువగానేవచ్చాయి. వాటిలో మొదటి తరం నవలానాయకుడు అక్కినేనే. తరవాత వచ్చిన మీనా, జీవనతరంగాలు వంటి చిత్రాలు ఇతర నటులతో నిర్మించినా, ఆ నవలలు పాఠకులు చదువుతున్నప్పుడు అక్కినేనినే నాయకుడిగా ఊహించుకునేవారనేది నిర్వివాదాంశం. నవలా నాయకుడంటే అక్కినేని నాగేశ్వరరావుదే ప్రధమస్థానం.

ప్రయోగాత్మకంగా…

అక్కినేని ఆదుర్తి సుబ్బారావుతో కలిసి లాభాపేక్ష లేకుండా ప్రయోగాత్మక ప్రజోపయోగ సినిమాలు నిర్మించాలని చక్రవర్తిచిత్ర అనే సంస్థను నెలకొల్పి మొదటి ప్రయత్నంగా 1968లో ‘సుడిగుండాలు’ చిత్రాన్ని నిర్మించారు. యువత పెడదారిపట్టడానికి గల కారణాలను పరిశీలించి, వారిని మార్చడమే ధ్యేయంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో అక్కినేనిది ఉదాత్తమమైన న్యాయమూర్తి పాత్ర. సినిమాలో తన కొడుకు ఈతకొట్టేందుకు స్నేహితునితో వెళ్లి తిరిగిరాకపోవడం న్యాయమూర్తికి ఆదుర్దా కలిగిస్తుంది. కానీ ఆ ఆదుర్దాని సంభాషణలు లేకుండా ముఖ కవళికల్లోనే నటించి చూపుతారు. అలాగే ఒక మంచి తీర్పు చెప్పినప్పుడు పొందే తృప్తిని, మనోభావాల్ని కళ్ళతోనే వ్యక్తీకరిస్తారు. ఆ అబ్బాయి స్విమ్మింగ్ పూల్లో విగతజీవుడై వున్నప్పుడు అక్కినేని చూపే మూగ బాధ సినిమా చూస్తేనే తెలుస్తుంది. తన బాబుని అతని స్నేహితుడే గొంతు నులిమి చంపినట్టు తెలుసుకొని పుత్రశోకంతో అల్లాడిపోయే పైకి కనుపించని అక్కినేని నటన; న్యాయమూర్తిగా తన బాబు స్నేహితునికి శిక్ష విధించి, ఒక వ్యక్తిగా అతడిని వురికంబమెక్కకుండా కాపాడాలని, ఆ హత్యకు ప్రేరేపించిన కారణాలను కనుక్కొని సమాజానికి సందేశమివ్వాలని అతడు పడే బాధ వర్ణనాతీతం. “నేరస్తులను అసహ్యించుకోకు.. నేరాలను అసహ్యించుకో” అని పూజ్య బాపూజీ చెప్పిన మాటల్ని గుర్తుచేసుకుంటూ అక్కినేని నటించినప్పుడు చూపే హావభావాలు ఆయన నటనకు పరాకాష్ట అని నిస్సందేహంగా చెప్పవచ్చు. తొలిప్రయత్నం ‘సుడిగుండాలు’ ఆదరణకు నోచుకోక పోయినా సాహసించి అక్కినేని, ఆదుర్తిలు 1970లో ‘మరోప్రపంచం’ అనే మరో ప్రయోగాత్మక చిత్రానికి శ్రీకారం చుట్టారు. భారతదేశ మనుగడకు ప్రజలంతా కుల, మత, ప్రాంతీయ భేదాలన్నీ మరిచి సమైక్యంగా ఉంటేనే అది సాధ్యమనే సందేశాన్ని గుర్తుచేస్తూ దేశ స్వరూప స్వభావాలు, భావి భారత పౌరుల ప్రవర్తన ఎలా ఉండాలో హృద్యమంగా చూపించిన చిత్రమే ‘మరోప్రపంచం’. పూజ్య గాంధీజీ పేరును నాయకులు స్వప్రయోజనాలకోసం విచ్చలవిడిగా వాడుకుంటున్న రోజుల్లో కన్నబిడ్డలకు తిండి పెట్టలేక, చదువు చెప్పించలేక, తల్లిదండ్రులు నానా అవస్థలు పడుతున్న తరుణంలో నిస్వార్ధమైన తొమ్మిదిమంది యువతీయువకులు ఒక బృందంగా ఏర్పడి స్వార్ధపరులు అక్రమంగా సంపాదించిన డబ్బుని కైవసం చేసుకొని, పేద పిల్లల్ని, పడుపు వృత్తిలో ఉన్నవారి పిల్లల్ని చేరదీసి వారిని భావి పౌరులుగా తీర్చిదిద్దేందుకు నడుం బిగిస్తారు. వీరిని పట్టుకోవడంలో పోలీసు శాఖ విఫలమైన సందర్భంలో, కేంద్ర గూఢచారి వచ్చి దర్యాప్తు చెయ్యగా, ఆ తొమ్మండుగురు నిర్మించిన మరో ప్రపంచాన్ని చూసి ముగ్ధుడై వారితో చేతులు కలుపుతాడు. క్లుప్తంగా ఇదీ ‘మరోప్రపంచం’ కథ. ఇందులో అక్కినేని గూఢచారి రవీంద్రగా నటించారు. అక్కినేని హావభావాలు చిత్రానికి హైలైట్ గా నిలుస్తాయి. ఈ చిత్రం తీసి ఏటికి ఎదురీదడంతో చేతులు కాలాయి. ఇక ప్రయోగాల జోలికి ఇద్దరూ స్వస్తి చెప్పారు. గొప్ప ఆశయంతో ఉద్భవించిన ఒక స్వార్ధరహిత చిత్ర నిర్మాణ సంస్థ అలా మూలపడిపోయింది.

జనపథంతో తొలి అడుగులు…

తెలుగులో జానపద చిత్రనిర్మాణం మొదలైంది అక్కినేని నాగేశ్వరరావు తోనే. జానపద చిత్రాల్లో కథే కథానాయకుడు. ఆ కథా బలాన్ని బట్టి, సన్నివేశాల సృష్టినిబట్టి ఆ సినిమా జయాపజయాలు నిర్దారమయ్యేవి. అలా అక్కినేని ప్రేక్షకులకి తెలిసింది జానపదాలతోనే. జానపద చిత్రాల్లో అక్కినేనికున్నన్ని సూపర్ హిట్స్ మరెవరికీ లేవు. ఒకదాని వెంట మరో విజయం. అ విజయాలే అక్కినేనిని వెన్నుతట్టి నిలబెట్టాయి. నాగేశ్వరరావు నటజీవితానికి గట్టి పునాదులు వేసింది ఆ జానపదాలే. ఘంటసాల బలరామయ్య నిర్మించిన ‘సీతారామ జననం’ పౌరాణికంలో అక్కినేనిది రాముడి పాత్ర. బలరామయ్యే అక్కినేనికి తొలి సినీగురువు. అక్కినేని తను నటించిన మొదటి టేకే ఒకే చేశారు. కంఠం కాస్త వణికినట్లైనా “శ్రీరాముడికి అది పెద్దలపట్ల వుండే వినయవిదేయతలకీ, భక్తిప్రపత్తులకీ ఆలంబనంగా వుంటుందిలే” అంటూ బలరామయ్య అక్కినేనికి ధైర్యం చెప్పి ఆశీర్వదించారు. తెలుగు తెరకు ఒక కొత్త నటుడు పరిచయమై తన ప్రతిభను చూపేందుకు 22-11-1944న సినిమాహాలులో వేసిన తొలి అడుగు అదే. తరవాత గూడవల్లి రామబ్రహ్మం 1945లో నిర్మించిన జానపద చిత్రం ‘మాయాలోకం’లో అక్కినేని నటించారు. అప్పుడు అక్కినేని వయసు 20 యేళ్ళు. ఆ చిత్రంలో అతని పాత్ర శరాబంది రాజు. ముగ్గురు భార్యలు శాంతకుమారి, ఎస్. వరలక్ష్మి, కన్నడ నటి ఎం.వి. రాజమ్మలను పెళ్ళాడే యువరాజు పాత్ర. అక్కినేని ఈ ముగ్గురు భార్యల మధ్య అర్భకుడిలా ఉంటాడని మొదట్లో రామబ్రహ్మం అతనికి పాత్ర ఇచ్చేందుకు విముఖత చూపినా, చల్లపల్లి రాజా సిఫారసుతో వేషమైతే దక్కిందిగానీ, కోపం పోలేదు. ఎం.వి. రాజమ్మ ఆనాటికే పెద్ద హీరోయిన్. నాగేశ్వరరావు పక్కన ఆమెను నిలబెట్టి చూడాలని కబురెట్టితే, అక్కినేని చైనా బజారుకెళ్ళి ఎత్తుమడమల జోళ్ళు కొనుక్కుని నిలబడి ఒకే అనిపించుకున్నారు. మొదటి జానపద చిత్రంలోనే గోవిందరాజుల సుబ్బారావు, సి.ఎస్.ఆర్, కన్నాంబ వంటి పెద్ద నటీనటుల మధ్య వుండటంతో, డైలాగ్ మాడ్యులేషన్ ఎలావుండాలో వారివద్ద తర్ఫీదు పొందగలిగారు. శాంతకుమారి ఐతే ‘ఈ అబ్బి నా బిడ్డలా వున్నాడు. వీడితో నటించటం ఎలాగమ్మా” అంటూనే అక్కినేనికి దర్జాగా నిలబడటం, కళ్ళల్లోకి సూటిగా చూడటం, భంగిమలు మార్చడం వంటి అనేక విషయాలు నేర్పారు. నెలరోజుల షూటింగు పూర్తయ్యాక న్యూటోన్ స్టూడియోలో రషెస్ చూసిన రామబ్రహ్మంకు అక్కినేని నటన పట్ల సంతృప్తి కలిగింది. రామబ్రహ్మంకు పిల్లలులేరు. అక్కినేని చూపే వినయం చూసి అతణ్ణి తన ఇంట్లో ఉంచుకొని భార్యాభర్తలు ఇద్దరూ సొంతకొడుకు లాగే చూసుకున్నారు. ఆ సినిమా తరవాత ఘంటసాల బలరామయ్య 1946లో ‘ముగ్గురు మరాఠీలు’ చిత్రాన్ని ఆరంభించారు. అక్కినేనికి అది మూడో చిత్రం. దాన్ని ఒక మరాఠీ కథ ఆధారంగా నిర్మించారు. అందులో అక్కినేని గోవిందరాజుల సుబ్బారావు అన్న కొడుకుగా, టి.జి. కమలాదేవి సరసన హీరో వేషంలో నటించారు. తరవాత అక్కినేని నటించిన మరో జానపదం భరణీ వారి తొలి చిత్రం ‘రత్నమాల’. భానుమతి భర్త రామకృష్ణ ఆ చిత్రానికి దర్శకులు. భరణీ సంస్థలో ప్రొడక్షన్ ఎక్సిక్యుటివ్ గా పని చేస్తున్న డి.ఎల్. నారాయణ (దేవదాసు నిర్మాత) అక్కినేనికి అందులో వేషం ఇప్పించారు. అది హీరో పాత్ర కాకపోయినా మంచి ప్రాధాన్యమున్న మంత్రి కుమారుని పాత్ర. ఆ పాత్ర చిత్తరువును భానుమతికి చూపి, కత్తికి కంకణం కట్టిస్తారు. శోభన మందిరంలో తను భర్తను కాదని అక్కినేని చెప్పే పాత్ర అది. ఆ తరవాత రామకృష్ణ లైలా మజ్ను, చక్రపాణి, విప్రనారాయణ, బాటసారి వంటి గొప్ప చిత్రాల్లో హీరోగా అక్కినేని చేత నటింపజేయటం జరిగింది. ఈ సినిమా కథ కాకమ్మ కథలా అనిపించినా విజయవంతంగా ఆడింది.

బాలరాజు ప్రభంజనం…

Anr in Balaraju

అక్కినేని విజయ పరంపరను ఘనంగా చాటిన చిత్రం 1948లో ఘంటసాల బలరామయ్య నిర్మించిన ‘బాలరాజు’ సినిమా. అక్కినేనికి ఇది ఏడో సినిమా. పేరుకే ఇది జానపదం. కథా నేపథ్యమంతా ప్రేమే. అక్కినేని, ఎస్. వరలక్ష్మి ఇద్దరూ యక్షులే. ఇంద్రుని శాపవశాన మానవ జన్మెత్తి, తన గతం మరచిపోయిన ప్రియుడి చేత తిరస్కరించబడి, అతడికోసం అలమటించి, ఆఖర్న అతణ్ణి తనవాడిగా చేసుకోవటం ఈసినిమా కథాంశం. సెంటిమెంటు, పాతివ్రత్యం, పతిభక్తి వంటి అంశాలను చక్కగా మలచడంచేత సినిమా మహిళాలోకాన్ని విపరీతంగా ఆకర్షించింది. ఈ సినిమాతో అక్కినేనికి మంచి స్టార్డం వచ్చింది. అక్కినేని ఆ రోజుల్లోనే తను నటించబోయే పాత్రను పూర్తిగా ఆకళింపు చేసుకొని, ఆ పాత్ర స్వభావానికి అనుగుణంగా నటించటం అలవాటు చేసుకున్నారు. ఆ అభ్యాసాన్ని చివరి సినిమాల దాకా కొనసాగించారు. యూత్ లవ్ సినిమాల ఆవిర్భావానికి బాలరాజు చిత్రమే ప్రేరణ కావచ్చు. ఈ చిత్రం చూసేందుకు పల్లెటూర్లలనుంచి జనం రెండెడ్ల బండ్లు కట్టుకొని వచ్చి రెండు ఆటలూ చూసుకొని వెళ్ళేవారు. ఇక్కడనుంచే అక్కినేని తన కెరీర్ ప్లానింగ్ చేసుకున్నారు. మూస పాత్రలు రాకుండా జాగ్రత్తపడ్డారు.

కీలుగుఱ్ఱంతో మరో మైలురాయి…

1949లో అక్కినేని మరో బ్లాక్ బస్టర్ చిత్రం ‘కీలుగుఱ్ఱం’ విడుదలైంది. ఈ సినిమా విడుదలకు ఒకరోజు ముందు అక్కినేనికి అన్నపూర్ణతో దెందులూరులో వివాహం జరిగింది. తమిళంలో ‘మాయక్కుదిరై’ గా డబ్ చేసి విడుదలచేస్తే అక్కడకూడా ఇది ఘన విజయం సాధించింది. తమిళంలోకి అనువాదం కాబడిన మొదటి తెలుగు చిత్రం కీలుగుఱ్ఱం. అక్కినేని సరసన సూర్యశ్రీ అనే అమ్మాయి హీరోయిన్ గా నటించింది. జానపద చిత్రాల్లో అప్పటివరకూ కథానాయకుడి హెయిర్ స్టైల్ వెనక్కి ఉంటూ వచ్చింది. కీలుగుర్రంలో అక్కినేనికి మాత్రం ప్రక్కపాపిట తీయించారు. కొయ్యగుర్రం మీద ఆకాశయానం, రాకాసి ప్రాణాలు దాగిన కీటకాన్ని చిదిమి, రాక్షసిని చంపటం వంటిఅద్భుతాలు ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకర్షించాయి. హీరోగా అక్కినేనికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఈ చిత్రంతోనే మొదలైంది. ఈ విజయంతో అక్కినేని జానపద చిత్ర ప్రస్థానం వరసగా మూడేళ్లు సాగింది. అలా కీలుగుఱ్ఱం మీద స్వారి చేసిన బాలనాగేశ్వరరావు ఇక మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. కీలుగుఱ్ఱం తరవాత ‘రక్షరేఖ’ సినిమా వచ్చింది. అది కూడా 3 కేంద్రాల్లో వందరోజుల పండగ చేసుకుంది. ముందే చెప్పినట్టు అక్కినేని నటనకు పెద్దగా అవకాశంలేని చిత్రాలు కావటం చేత ‘దేవదాసు’(1953) వచ్చేదాకా అక్కినేని నటనంటే ఏమిటో తెలియలేదు. అక్కినేని జానపదులన్నీ గ్లామర్ వెంట నడిచిన చిత్రాలే! సువర్ణసుందరి చిత్రంలో నటించమని అంజలీదేవి, ఆదినారాయణరావు అడిగినప్పుడు అందులో నటించడానికేముంది అని అక్కినేని ప్రశ్నించారు. అయినా వారిద్దరి మీద గౌరవంతో, వేదాంతం రాఘవయ్య మీద వున్న గురుభావనతో అందులో నటించారు. ఆ సినిమా చరిత్ర పుటల్ని తిరగరాసింది. 24 కేంద్రాల్లో ఏకబిగిన నూరు రోజులాడింది. హిందీలో అదే చిత్రాన్ని అంజలి పిక్చర్స్ వారు పునర్నించిన చిత్రంలో కూడా అక్కినేని నటించగా ఆ సినిమాకూడా విజయవంతమైంది. తరవాత 1959లో వచ్చిన ‘జయభేరి’ చిత్రం నాగేశ్వరరావు కి నటనాపరంగా మంచిపేరు తెచ్చింది. ఇదొక సంగీత భరిత చిత్రం. కేవలం 60 రోజుల్లోనే చిత్రాన్ని దర్శకుడు పి. పుల్లయ్య పూర్తి చేశారు. ‘మాయాలోకం’ చిత్రంలో అక్కినేనికి నాయికగా నటించిన శాంతకుమారి, జయభేరిలో అక్కినేనికి వదినగా నటించింది. ఈ చిత్రం 12 వారాలు ఆడింది. తరవాత కాలంలో అక్కినేని సాంఘిక, పౌరాణిక, చారిత్రాత్మక చిత్రాల్లో వైవిధ్య భరితమైన పాత్రలు ధరించి మెప్పించారు.

గ్రామీణ యువకునిగా అక్కినేని

అక్కినేని తొంభై ఏళ్ళు అందుకున్నవాడు. రెండు వందల యాభైకి పైగా మెట్లెక్కినవాడు. మిట్టలెక్కి పల్లాల్లో పడ్డవాడు. అభిమానుల దృష్టిలో కుర్రవాడు. పెద్దల హృదయాల్లో దాగున్నవాడు. ముందుకెళ్ళి సాధించిన ఫలాన్ని మనకు మిగిల్చి వెళ్ళినవాడు. నాగేశ్వరరావు స్వతహాగా పల్లెటూరి రైతుబిడ్డ. ముఖానికి రంగువేసుకోవడం, స్టేజీల మీద నాటకాలాడడం ఇష్టపడే పనులు కావటంచేత, అన్న రామబ్రహ్మం గారి సహకారంతో ఇన్నిమెట్లెక్కి చలనచిత్ర నటుడై, నటసామ్రాట్టుగా నిలిచారు. వైవిధ్య భరితమైన పాత్రలు ధరించి, ఆ పాత్రల్లో ఒదిగి పొయ్యారు. అలా అందరికీ అభిమాన నటులయ్యారు. అక్కినేని పోషించిన పాత్రల్లో గ్రామీణ యువకునిగా మెప్పించినవెన్నో వున్నాయి. పల్లెటూరి వాతావరణంలో, సహజమైన సంఘటనలతో నిర్మించిన అనేక చిత్రాల్లో అక్కినేనే హీరో. అక్కినేని పల్లెటూరి నేపధ్యంలో నటించిన మొదటి చిత్రం దర్శక నిర్మాత బి. ఏ. సుబ్బారావు నిర్మించిన ‘పల్లెటూరిపిల్ల’ గా చెప్పవచ్చు. అక్కినేనికి ఇది ఎన్.టి.ఆర్ తో కలిసి నటించిన మొదటి మల్టీ స్టారర్ చిత్రం. ఇందులో అక్కినేని పాత్రకు మొదట కల్యాణం రఘురామయ్యను తీసుకుందా మనుకుంటే, అందులో పోరాట సన్నివేశాలున్నందున తను చెయ్యలేనని చెబితే, అక్కినేనికి ఆ అవకాశం దక్కింది. పసిబిడ్డను కాపాడే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయే త్యాగమూర్తి పాత్రలో అక్కినేని అద్భుతంగా నటించారు. బుల్ ఫైట్ సన్నివేశంలో యెంతో సహజంగా నటించారు. అక్కినేని ఎన్.టి.ఆర్ తో కలిసి నటించిన మరో పల్లెటూరి కథా చిత్రం ఎల్.వి. ప్రసాద్ దర్శకత్వం వహించిన ‘సంసారం’. ఎన్.టి.ఆర్ కి తమ్ముడిగా, పల్లెటూరి రైతు పాత్రలో ప్రవేశం చేసి, పట్నవాసంలో నాగరికత నేర్చుకున్న యువకునిగా అక్కినేనిని నటన సాంఘిక పాత్రల్లో అతని స్థానాన్ని సుస్థిరం చేసింది. 29-12-1950న విడుదలైన ఈ చిత్రం రజతోత్సవం చేసుకుంది. 1954లో వచ్చిన తాతినేని ప్రకాశరావు చిత్రం ‘నిరుపేదలు’లో పల్లెటూరి యువకునిగా ఉంటూ కరువుకాటకాలవలన పట్నానికి వలస వెళ్లి రిక్షా కార్మికునిగా మారే పాత్రలో అక్కినేని నటించారు. ఈ చిత్రం 5 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది. అదే సంవత్సరం తాతినేని ప్రకాశరావు మరో చిత్రం ‘పరివర్తన’ కూడా విడుదలైంది. ఇందులోకూడా ఎన్.టి.ఆర్, అక్కినేని ఇద్దరూ నటించారు. అక్కినేని, షావుకారు జానకి నటించిన ‘రోజులు మారాయి’ చిత్రం గ్రామీణ వాతావరణంలో దున్నేవాడిదే భూమి అనే నేపథ్యంలో సాగుతుంది. అన్యాయాన్ని ఎదిరించే నవతరం ప్రతినిధిగా, బడుగు రైతులకు అండగా ఉంటూ ఆదర్శ రైతుబిడ్డగా అక్కినేని ఎంతో సహజంగా నటించారు. దుక్కిపాటి మధుసూదనరావు నిర్మాతగా అన్నపూర్ణా సంస్థను నెలకొల్పి కె.వి.రెడ్డి దర్శకత్వంలో నిర్మించిన ‘దొంగరాముడు’ సినిమాలో గ్రామీణ వాతావరణాన్ని సృష్టించినా అక్కినేనిది పూర్తి స్థాయి గ్రామీణ పాత్రకాదు. 11-1-1957 లో వచ్చిన సొంతచిత్రం ‘తోడికోడళ్ళు’లో చదువుకున్న ఆదర్శ రైతుగా అక్కినేని భూమిక నిర్వహించిన విధానం గొప్పగా వుంటుంది. శరత్ నవల ‘నిష్కృతి’ ఆధారంగా నిర్మించిన ఈ చిత్రానికి తొలిసారి ఆదుర్తి సుబ్బారావు అన్నపూర్ణ సంస్థకు దర్శకత్వ బాధ్యతలు నిర్వహించి, తదుపరికాలంలో ‘పూలరంగడు’ చిత్రం దాకా ఆ పరంపరను కొనసాగించారు.

మరికొన్ని విషయాలు
అక్కినేని తల్లి పున్నమ్మ ఆయన బాల్యంలో నాగేశ్వరరావు విషయంలో బాధపడుతూ వుండేవారు. ఎదుకంటే ఆమెకు బేసి సంఖ్యలో పుట్టిన సంతానం యేదీ ప్రాణం నిలుపుకోలేదు. నాగేశ్వరరావు పున్నమ్మకు కలిగిన తొమ్మిదవ సంతానం. ఆయన పుట్టినరోజే అక్కినేనికి మెడమీద పెద్ద పుండు లేచింది. వైద్యుడు పెదవి విరిచాడు. కానీ అనూహ్యంగా అక్కినేని తేరుకున్నారు. భోగి పండుగరోజు అక్కినేని కప్పుకున్న దుప్పటి భోగిమంటకు కాలిపోయింది. వొళ్ళంతా బొబ్బలెక్కాయి. కానీ అక్కినేని తట్టుకున్నారు. మరొకసారి చెరువులో ఈత కొడుతూ మునిగిపోయారు. దారినవెళ్లే పెద్దమనిషి నీటిలోకి దూకి రక్షించాడు. అల్లాఊద్దీన్ అద్భుత దీపం సినిమా చిత్రీకరణకోసం కాశ్మీర్ వెళితే అక్కడ అక్కినేనికి మసూచి సోకి ఒంటినిండా, ముఖం మీద పుండ్లు లేచాయి. ఆ కురుపుల రసిక శరీరం మీద పడకుండా సల్ఫ్యూరిక్ ఆమ్లంతో వైద్యునిచేత మత్తుమందు తీసుకోకుండా కాల్పించుకున్నారు.

అక్కినేని కుటుంబానికి కాజా వెంకట్రామయ్య సన్నిహితులు కావడంతో నాటకాల్లో రాణిస్తున్న అక్కినేనిని దర్శకనిర్మాత పి.పుల్లయ్యకు పరిచయం చేశారు. అప్పుడు పుల్లయ్య కొల్హాపూరులో ‘ధర్మపత్ని’ సినిమా నిర్మిస్తూ వున్నారు. అందులో అక్కినేని చేత చిన్న పాత్రలో నటింపజేశారు. అదే అక్కినేని వెండితెరపై కనిపించిన తొలి చిత్రం. గుడివాడ ఎక్సెల్సియర్స్ నాటకబృందానికి దుక్కిపాటి మధుసూదనరావు కార్యదర్శిగా వుండేవారు. ఆ బృందంలో అక్కినేని ఆడవేషాలు వేసేవారు. ఒకసారి తెనాలిలో నాటక ప్రదర్శన అయ్యాక విజయవాడ రైల్వే స్టేషన్ లో రైలుబండికోసం నిరీక్షిస్తుండగా, ఘంటసాల బలరామయ్య కళ్ళు అక్కినేనిమీద పడ్డాయి. తను నిర్మించబోతున్న ‘సీతారామజననం’ లో శ్రీరాముడి పాత్రకు ఈ బాలుడు తగినవాడని నిర్ణయానికొచ్చేశారు. అలా చలనచిత్రసీమకు ఓ మణిరత్నం పరిచయమైంది.

అక్కినేనికి ‘దసరాబుల్లోడు’ 146 వ చిత్రం. ఆయన ఆహార్యం కూడా ఇందులో ప్రత్యేకంగా వుంటుంది. ఈ చిత్రంతోనే సినిమాల్లో స్టెప్పులు మొదలై పాటల చిత్రీకరణ స్వరూపమే మారిపోయింది. 1962 లో వచ్చిన ‘కలిమిలేములు’, తరవాత కాలంలో వచ్చిన ‘మూగమనసులు’, ‘గోవుల గోపన్న’, ‘భలే రంగడు’, ‘పవిత్ర బంధం’, ‘సుపుత్రుడు’, ‘రైతుకుటుంబం’, ‘మంచిరోజులు వచ్చాయి’, ‘దత్త పుత్రుడు’, ‘పల్లెటూరి బావ’, ‘ఊరంతా సంక్రాంతి’ వంటి చిత్రాల్లో అక్కినేని అడపాదడపా గ్రామీణ వాతావరణం ప్రతిబింబించే పాత్రలెన్నో చేశారు. మూగమనసులు చిత్రాన్ని గురించి చెప్పుకోవాలంటే సమయమూ చాలదు.. స్థలమూ చాలదు. జానపద చిత్రాల హీరో అక్కినేని అని ముద్రపడబోతున్న రోజుల్లో అక్కినేని జాగ్రత్తపడి, సాంఘికాలకు మారి, ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని ప్రేక్షకులకు చూపిస్తూ, తన సుదీర్ఘ సినీ ప్రస్థానాన్ని 70 ఏళ్ళకు పైగా నిలుపు కోగాలిగారు.

ఆచారం షణ్ముఖాచారి
(94929 54256)

2 thoughts on ““అభినయ శ్రీమంతుడు” అక్కినేని శతజయంతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap