నిజానికి ఇదొక సందేశమే లేని సినిమా. ఇందులోని హీరో ధీరోదాత్తుడు కాడు.. కనీసం ఉదాత్తుడు అంతకంటే కాదు. పైగా పలాయనవాది, బాధ్యత లేని వ్యక్తి, ప్రేమను గెలిపించుకోలేని భీరువు, కోపిష్టి. వీటన్నింటికీ మించి అదో పెద్ద తాగుబోతు పాత్ర! అయినా సరే, అతగాడిని ప్రేక్షకులు ‘హీరో’ అన్నారు.. ఆరాధించారు.. ఆకాశానికెత్తేసారు. ప్రేమదాసుగా, మందుదాసుగా జనాలను దాసోహం చేసుకున్నాడు. వసూళ్ల ప్రవాహాన్ని సృష్టించాడు. ఏడు దశాబ్దాలు దాటినా, ఆ సినిమా పాటలు, మాటలు తెలుగునాట అహరహం అలా దొర్లుతూనే ఉన్నాయి.
రెండు రూపాలు.. ఒకే మైకం
ఈ చిత్రంలో దేవదాసు పాత్ర ప్రయాణం రెండు భిన్నమైన పార్శ్వాలను ఆవిష్కరిస్తుంది:
జమీందారు దేవదాసు: ఉన్నతీరు మారి, ఊరు మారి, సూటూబూటూ తొడిగిన దొరబాబు.
భగ్న ప్రేమికుడు దేవదాసు: లూజు లాల్చీ, పంచె కట్టు, చింపిరి జుత్తు, చేతిలో మందు గ్లాసు, పక్కన కుక్క.. చావుకు సిద్ధంగా ఉన్న నిస్సహాయుడు.
ఈ ఇద్దరిలోనూ హీరోని కన్నది ప్రేక్షకలోకమే. మైకంలో ఉన్న దేవదాసును చూస్తేనే ప్రేక్షకులకు అదోలాంటి మైకం. అతగాడి వాలకం తెలుగు ప్రజలకు అంతగా నచ్చేసింది.
ప్రయాణాల్లో దాగిన జీవిత సత్యం
దేవదాసు జీవితం రెండు బండి ప్రయాణాల మధ్య సాగిన ఒక భావోద్వేగ భరిత యాత్ర.
“పల్లెకు పోదాం.. పారును చూద్దాం..” అంటూ ఎంతో చలాకీగా గుర్రం బండిపై సొంత ఊరికి సాగిన ఉల్లాసభరితమైన ప్రేమయాత్ర ఒకవైపు.
“జగమే మాయ.. బ్రతుకే మాయ.. వేదాలలో సారమింతేనయా..” అనుకుంటూ జడివానలో జట్కా బండిపై సాగిన విషాదభరితమైన అంతిమయాత్ర మరోవైపు.
ఈ రెండు ప్రయాణాల నడుమ వినోదా వారి అఖండమైన విజయయాత్ర దాగుంది.
ఆక్రోశం.. వేదాంతం
పార్వతిని వదులుకున్నప్పుడు అతడికి ప్రేమతత్వం తెలియలేదు. కానీ, తను వేరొకరి (ముసలోడిని) పెళ్లి చేసుకుని వెళ్లిపోతుంటే మాత్రం.. “కల ఇదనీ.. నిజమిదనీ తెలియదులే.. బ్రతుకింతేనులే…” అంటూ ఆక్రోశించాడు. అనురాగం చేజారిపోగా “కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్.. ఓడిపోలేదోయ్..” అంటూ వేదాంతం ఒలకబోశాడు.
సక్సెస్ సూత్ర – మహామంత్ర
దేవదాసు అఖండ విజయానికి కారణం కేవలం ఒకరిద్దరు కాదు, అదొక అద్భుత కలయిక:
కళ్ళతో పలికిన అభినయం: ముసలోన్ని కట్టుకుని విలపిస్తూ మాటాడే సావిత్రి కన్నీటి వాకిళ్లు.. అక్కినేని నిషాకళ్లు. అక్కినేని నటన, సావిత్రి అభినయం చిత్రానికి ప్రాణం పోశాయి.
నటీనటుల దిగ్గజాలు: లలిత విరాగం, ఎస్వీఆర్, సీఎస్సార్, ఆర్. నాగేశ్వర రావు, జి.వి.జి, సీత, సేవకుడు ఆరణి, బండివాడు సీతారాం.
పాత్రల వాగ్ధాటి: “మనవాడు తలచుకుంటే ఏమైనా చేసేస్తాడోయ్..” అంటూ పేకేటి పలికిన వాగ్ధాటి.
సంగీత సాహిత్యం: ఘంటసాల గొంతు, బాలసరస్వతి, జమునారాణిల గాత్రం. సముద్రాల రచన, సుబ్బురామన్ సంగీతం.
సృష్టికర్తలు: శరత్ మూలకథ, వేదాంతం దర్శకత్వం.
వీటన్నింటి కలగలుపే ఈ అపూర్వ దృశ్యకావ్యం.
ఈ అద్భుతాన్ని సృష్టించిన మహానుభావులలో ఇప్పుడు ఎవరూ బ్రతికి లేరు. కానీ ఆధునిక చరిత్రలో తొలి భగ్న ప్రేమికుడైన ఆ దేవదాసు.. సినిమాలో మరణించినా, వెండితెర ఉన్నంతకాలం బ్రతికే ఉంటాడు. తాగినా తగ్గని వాడు.. చనిపోయినా చిరంజీవి ఈ దేవదాసు!
- ఎలిశెట్టి సురేష్ కుమార్
